స్త్రీవాదం అందరిదీ! ఉద్వేగ భరిత రాజకీయాలు -బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత
చైతన్యం పెంపు: హృదయాల్లో రావాల్సిన మార్పు:
ఎవరూ స్త్రీ వాదులుగా పుట్టరు, తయారవుతారు. స్త్రీలుగా పుట్టినంత మాత్రాన ఎవరూ స్త్రీ వాద రాజకీయాల పక్షపాతి కారు, కాలేరు. ఇతర రాజకీయాల లాగా ఇష్టంగా చేపట్టే కార్యాచరణ ద్వారానే ఎవరయినా స్త్రీ వాద రాజకీయాల్లో నమ్మటం మొదలుపెడతారు. అమెరికాలో

స్త్రీలు మొదటిసారి తమంతట తాము ఒకచోట గుమిగూడి సెక్సిజం, పురుషాధిక్యతల గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టినపుడు వాళ్ళకి ఒక విషయం స్పష్టంగా అర్థమయింది: స్త్రీలు కూడా మగవాళ్ళలాగే సెక్సిస్టు ఆలోచన, విలువలతో పెరుగుతారుÑ అయితే మగవాళ్ళకి ఆ సెక్సిజం వల్ల కలిగే ప్రయోజనం ఎక్కువ కాబట్టి తమకుండే విశేషాధికారాన్ని వదులుకోవటానికి సిద్ధపడరు.
పితృస్వామ్యాన్ని మార్చే ముందు స్త్రీలుగా మనల్ని మనం మార్చుకోవాలి.
విప్లవాత్మక స్త్రీవాద చైతన్యం పితృస్వామ్యాన్ని ఒక ఆధిపత్య వ్యవస్థగా చూసి, అది ఎలా మొదలయిందో, వ్యవస్థీకృతమైందో, స్థిరపడి కొనసాగించబడుతోందో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యమని చెబుతుంది. రోజువారీ జీవితంలో పురుషాధిక్యత, సెక్సిజం వ్యక్తమయ్యే రీతులను అర్థం చేసుకోవటం, స్త్రీలకి తాము ఎలా బాధించబడతామో, దోపిడీకి గురవుతామో, కొన్ని పరిస్థితుల్లో అణచివేతకు గురవుతామోనన్న విషయాల పట్ల అవగాహన ఏర్పరుస్తుంది. సమకాలీన స్త్రీ వాద ఉద్యమం మొదలయిన కొత్తల్లో స్త్రీ వాద చైతన్యం పెంచటం కోసం ఏర్పడిన బృందాల్లో (కాన్షన్‌నెస్‌ రైసింగ్‌ గ్రూప్స్‌) స్త్రీలు తాము పడిన బాధల గురించి ఎప్పటినుండో పేరుకుపోయిన కోపాన్ని, విరోధాన్ని వ్యక్తం చేసే
వాళ్ళు. జరుగుతున్న వాటిలో కలగచేసుకోవటం కోసం, పరిస్థితిని సమూలంగా మార్చటం కోసం అవసరమయిన వ్యూహాలపైన దృష్టి మొదట్లో తక్కువగా ఉండేది. ఈ బృందాలు ప్రధానంగా బాధలు పడి, దోపిడీకి గురయిన స్త్రీలకి మానసిక చికిత్స ఆలయాలుగా పనిచేశాయి. అప్పటివరకూ ఎవరికీ చెప్పుకోలేని బాధల పైనుండి ముసుగు తీసి, మనసుకు తగిలిన గాయాల లోతుల్ని ఒకరికొకరు చూపించుకున్నారు. ఈ రకంగా మనసు విప్పి చెప్పుకోగలగటం, ఇతరులు వారి అనుభవాలను వినటం ఆ గాయాలు మాన్పే మంత్రంగా పనిచేశాయి. ఈ చైతన్యాన్ని పెంచే బృందాల వల్ల ఇంటా, బయటా పురుషాధిక్యతని ఎదుర్కొనే శక్తి స్త్రీలకి లభించింది.
మనలో ఉండే సెక్సిస్టు ఆలోచనని లోతుగా పరీక్షించి, మన వైఖరుల్ని, నమ్మకాలని స్త్రీ వాద దృక్పథం, రాజకీయాల ద్వారా మార్చుకుని దానిని ఎదుర్కోవటానికి అవసరమయిన వ్యూహాలను తయారు చేసుకోవడం దీనికి పునాదిని వేసింది. మౌలికంగా ఈ చైతన్యం పెంచే బృందాలు అటువంటి పరివర్తన స్థలాలుగా పనిచేశాయి. ఒక పెద్ద స్త్రీ వాద ఉద్యమం నిర్మించటానికి స్త్రీలకి తమని తాము ఆర్గనైజ్‌ చేసుకోవటం అవసరమైంది. సాధారణంగా ఈ చైతన్యం పెంచే సమావేశాలు, అద్దెకి తీసుకున్న, లేదా విరాళాలతో నిర్మించిన పబ్లిక్‌ ప్రదేశంలో కాకుండా ఎవరో ఒకరి ఇంట్లో జరిగేది. అనుభవమున్న స్త్రీవాద ఆలోచననాపరులు, కార్యకర్తలు కొత్తవాళ్ళని ఇక్కడే ఉద్యమంలోకి చేర్చుకునేవాళ్ళు.
ఈ చైతన్యం పెంచే సమావేశాల్లో ప్రధాన ఎజెండా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, విషయాలని చర్చించుకోవటం. చాలా బృందాలు ప్రతి మహిళ చెప్పిందీ గౌరవించాలనే విధానాన్ని పాటించేవి.
ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి, అందరూ అందరు చెప్పిందీ వినేటట్లు చూసుకునేవి. హెచ్చు తగ్గులు లేని ఈ చర్చా వేదికలు అందరికీ మాట్లాడే అవకాశం కల్పించేవి గానీ లోతయిన చర్చకి అవకాశముండేది కాదు. అయినా గానీ చాలాసార్లు చర్చ, సంవాదం రెండూ జరిగేవి. ప్రతి ఒక్కరికీ కనీసం ఒక్కసారైనా మాట్లాడటానికి అవకాశం వచ్చేది. సాధారణంగా ఈ చైతన్యం పెంచే బృందాలలో వాదోపవాదాలతో కూడిన చర్చ జరిగేది. పురుషాధిపత్యం గురించి మా సామూహిక జ్ఞానాన్ని ఈ రకంగా మాకు మేము స్పష్టం చేసుకునేవాళ్లం. చర్చలు, విభేదించటం ద్వారానే లింగపరమైన దోపిడీ, అణచివేతల గురించి ఒక వాస్తవిక దృక్పథాన్ని ఏర్పరచుకోవటం సాధ్యమయింది.
ఒకరికి ఒకరు, తెలిసిన స్త్రీలతో ఏర్పడిన ఈ చిన్న చిన్న చైతన్యం పెంచే బృందాలలో ఏర్పడిన స్త్రీ వాద ఆలోచనను అచ్చు ద్వారా ఎక్కువమందికి చేరెయ్యటానికి, దాని కోసం సిద్ధాంతీకరించటం మొదలుపెట్టిన తర్వాత ఈ గుంపులు విచ్ఛిన్నమైపోయాయి. స్త్రీవాద అధ్యయనాలు విశ్వవిద్యాలయాల్లో వ్యవస్థీకృతమవటం వల్ల స్త్రీవాద ఆలోచనని, సిద్ధాంతాలని స్త్రీలకి చేరెయ్యటానికి మరొక ప్రదేశం తయారయింది. ఈ రకంగా స్త్రీ వాద అధ్యయనాలని కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చేర్చటానికి పనిచేసిన వాళ్ళలో అనేకమంది పౌరహక్కులు, గే హక్కులు, మొదటి తరం స్త్రీ వాద ఉద్యమాల్లో పనిచేసిన రాడికల్‌ కార్యకర్తలు ఉన్నారు. వారిలో చాలామందికి డాక్టరేట్‌లు లేవు. వీళ్ళు యూనివర్శిటీల్లో తమ సహోద్యోగుల కంటే తక్కువ వేతనాలు, ఎక్కువ పనిగంటలు ఉండే తక్కువ స్థాయి ఉద్యోగాల్లో చేరి అహర్నిశలూ పనిచేశారు. మా తర్వాత కొత్తవాళ్ళు విశ్వవిద్యాలయాల్లో చేరి ఈ స్త్రీ వాద విద్వత్తుకి సాధికారత కల్పించటం మొదలుపెట్టేసరికి ఉన్నత చదువుల్లో డిగ్రీలు పొందటం ఎంత అవసరమో మాకు అర్థమయింది. స్త్రీ వాద అధ్యయనాల పట్ల మా నిబద్ధతని మేము మా రాజకీయ కార్యాచరణలో భాగంగా అనుకునేవాళ్ళం. స్త్రీ వాద ఉద్యమానికి ఒక అకడమిక్‌ భూమికని తయారుచేయటం కోసం మేము త్యాగం చేయడానికి సిద్ధపడ్డాం.
1970ల చివరికి స్త్రీవాద అధ్యయనాలకి ఒక అకడమిక్‌ డిసిప్లిన్‌గా ఒప్పుకోలు లభించింది. దానికోసం పనిచేసిన వాళ్ళందరినీ డాక్టరేట్‌లు లేవనే కారణంతో ఉద్యోగాల నుండి తీసెయ్యటం ఈ గెలుపు వెలుగులో మరుగున పడిపోయింది. తర్వాత మాలో కొంతమంది డాక్టరేట్ల కోసం విశ్వవిద్యాలయాల్లో చేరాం కానీ, అందరికన్నా తెలివైనవాళ్ళు, మంచి ఆలోచనా పరులు చేరలేదు. వాళ్ళు అప్పటికే విపరీతమైన పనితో అలసిపోయి, విశ్వవిద్యాలయాలంటేనే ఒక రకమైన నిస్పృహలోకి జారుకున్నారు. ముఖ్యంగా తాము తెచ్చిన రాడికల్‌ రాజకీయాలు కాకుండా ఒక రకమైన ఉదార సంస్కరణ వాదం స్త్రీ వాద అధ్యయనాలని కమ్ముకోవటం పట్ల కోపం తెచ్చుకుని, నిరాశకు గురయ్యారు.
చూస్తుండగానే స్త్రీ వాద అధ్యయనా కేంద్రాలు చైతన్యం పెంచే బృందాల స్థానాన్ని ఆక్రమించాయి. ఆయా బృందాలలో అన్ని స్థాయిల్లో పనిచేసే స్త్రీలు, గృహిణులుగా ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు, సేవా రంగంలో చేసేవాళ్ళు, పెద్ద స్థాయిలో ఉండే నిపుణులు ఉండే
వాళ్ళు. కానీ స్త్రీ వాద అధ్యయన కేంద్రాలు వర్గపరమైన ఆధిపత్యం గల స్త్రీలకి కేంద్రాలుగా మారిపోయి, అలాగే కొనసాగుతున్నాయి. మీడియా స్త్రీ వాద ఉద్యమంలో రాడికల్‌ నాయకత్వ స్థాయిలో పెద్దగా లేని, అధిక సంఖ్యాకులయిన తెల్లజాతి మధ్య తరగతి స్త్రీలను ఉద్యమానికి ప్రతినిధులుగా చూడటంతో వారికి ప్రాముఖ్యత పెరిగింది. ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాల్లో స్త్రీ వాద ఉద్యమానికి గుర్తింపు వచ్చిన క్రమంలో శ్రామిక వర్గం, లెస్బియన్‌ నేపథ్యం నుండి వచ్చి విప్లవాత్మక స్త్రీ వాద చైతన్యంతో పనిచేసిన స్త్రీలని పక్కన పెట్టేశారు. కార్పొరేట్‌ నిర్మాణాలైన విశ్వవిద్యాలయాల్లో స్త్రీ వాద అధ్యయనాలు సురక్షిత స్థానం పొందేటప్పటికి ఇటువంటి రాడికల్‌ వ్యక్తుల తొలగింపు పూర్తయింది. ఎప్పుడయితే స్త్రీ వాద అధ్యయన కేంద్రాల తరగతి గదులు చైతన్యం తెంచే బృందాలను పక్కకి తోసి స్త్రీ వాద ఆలోచనలు, మార్పుని తెచ్చే వ్యూహాలను ప్రసారం చేసే కీలక స్థానాన్ని ఆక్రమించాయో అప్పుడు స్త్రీ వాద ఉద్యమం తన సామూహిక చలన శక్తిని కోల్పోయింది.
ఉన్నట్టుండి అనేకమంది స్త్రీలు తమ ఆర్థిక స్థాయిని మార్చుకోవటానికి స్త్రీల పట్ల వివక్ష ఉందనే వాదనని వాడుకోవటం, తమని తాము స్త్రీవాదులమని చెప్పుకోవటం మొదలుపెట్టారు. స్త్రీవాద అధ్యయనాల వ్యవస్థీకరణ అకాడమీలో, ప్రచురణ రంగంలో చాలా
ఉద్యోగాలను సృష్టించింది. ఇటువంటి కెరీర్‌ల సృష్టి రకరకాల అవకాశవాదులను కూడా సృష్టించింది. స్త్రీ వాద ప్రజా ఉద్యమంతో ఏ రకమైన రాజకీయ నిబద్ధత లేకపోయినా తమ వర్గపరమయిన చలనం కోసం ఆ పదాలు, అటువంటి అభిప్రాయాలు వెలిబుచ్చే వాళ్ళు తయారయ్యారు. చైతన్యం పెంచే బృందాలు విచ్ఛిన్నమవటంతో స్త్రీవాదులుగా మారే ముందు స్త్రీ వాదం గురించి తెలుసుకోవాలని, స్త్రీ వాద రాజకీయాలను ఎరుకతో మాత్రమే ఎంచుకోవాలనే భావనకి తెరపడిపోయింది.
స్త్రీలు ఒకరిపట్ల ఒకరు కనపరిచే సెక్సిజం ఎదుర్కొనటానికి అవకాశం కల్పించిన చైతన్యం పెంచే బృందాలు లేకపోవటంతో స్త్రీ వాద ఉద్యమ కేంద్రం పని స్థలాల్లో పురుషాధిక్యత, అసమానతల్ని ఎదుర్కోవటం వైపు మళ్ళింది. స్త్రీలని జెండర్‌ అసమానతల బాధితులుగా చూసి దానిక్కావలసిన పరిహారాలు (వివక్షాపూరిత చట్టాలని మార్చటమో లేక రిజర్వేషన్‌ విధానాలు తేవటమో) పొందే దిశగా దృష్టి మళ్ళటంతో స్త్రీలు స్త్రీ వాదులుగా మారే ముందు తమలో ఉండే సెక్సిజంని ఎదుర్కోవాలనే ఆలోచన సోదిలోకి కూడా లేకుండా పోయింది. స్త్రీ, పురుష సమానత్వం, పురుషాధిక్యతల గురించి క్రోధం, బాధ వ్యక్తం చేస్తే చాలు, ఏ వయసు వారయినా స్త్రీ వాదులుగా మారిపోవచ్చని అనుకోవటం పరిపాటయిపోయింది. అంతర్లీనమైపోయిన సెక్సిజంని ఎదుర్కోకుండా స్త్రీ వాద జెండాని ఎత్తుకున్నవాళ్ళు ఇతర స్త్రీలతో వ్యవహరించేటప్పుడు స్త్రీ వాద విలువలకు ద్రోహం చెయ్యటం మొదలుపెట్టారు.
1980లకి వచ్చేటప్పటికి స్త్రీ వాద ఉద్యమం ప్రారంభమైనప్పుడు కీలకంగా ఉన్న రాజకీయ సహోదరిత్వం పూర్తిగా అర్థం కోల్పోయింది. రాడికల్‌ స్త్రీవాద రాజకీయాలు పక్కకెళ్ళిపోయి ఏ రాజకీయాలు లేని స్త్రీలు కూడా స్త్రీ వాదులవ్వచ్చనే ఒక లైఫ్‌ స్టైల్‌ స్త్రీ వాదం ఆచరణని, రాజకీయాలని బలహీనపరిచిందని వేరే చెప్పక్కర్లేదు. స్త్రీవాద ఉద్యమం అందరూ అనుభవించే సెక్సిజం, సెక్సిస్టు దోపిడీ, అణచివేతలని ఎదుర్కోవటానికి అవసరమయ్యే ప్రజా ఉద్యమాన్ని నిర్మించుకోవటానికి, దానిక్కావలసిన వ్యూహ రచనని చెయ్యటానికి మళ్ళీ సిద్ధమయినప్పుడు, చైతన్యం పెంచే బృందాలకు మళ్ళీ పెద్ద పీట వెయ్యాలి. ఆల్కహాలిక్‌ అనానిమస్‌ తరహాలో ఈ స్త్రీ వాద చైతన్య బృందాలు కమ్యూనిటీల మధ్యలో కలిసి వర్గం, రేస్‌, జెండర్‌తో సంబంధం లేకుండా స్త్రీ వాద ఆలోచనా విధానాన్ని అందరి దగ్గరికీ తీసుకెళ్ళాలి. తమ ఉమ్మడి అస్తిత్వాల భూమికగా ఎవరయినా ప్రత్యేక బృందాలుగా ఏర్పడవచ్చు గానీ ప్రతి నెల చివర ఆయా వ్యక్తులందరూ కలిసి బృందంలో కలుసుకోవాలి.
మగవాళ్ళలో స్త్రీ వాద చైతన్యాన్ని పెంచటం స్త్రీల బృందాలు తీసుకు రావలసిన విప్లవ
ఉద్యమానికి అత్యంత అవసరం. అబ్బాయిలు, పురుషుల బృందాలకు సెక్సిజం ఏంటో, దాన్ని ఎలా మార్చవచ్చో నేర్పి ఉంటే ప్రసార మాధ్యమాలకు స్త్రీ వాద ఉద్యమాన్ని పురుష వ్యతిరేకి అని వర్ణించడం సాధ్యపడేది కాదు. అలాగే స్త్రీ వాద వ్యతిరేక ఉద్యమాలు రాకుండా ఆపగలిగేవాళ్ళం.
సమకాలీన స్త్రీ వాదం సెక్సిజం, పురుషాధిక్యతలని ఎదుర్కోవటం మానేసినందువల్లే ఈ పురుష బృందాలు ఏర్పడ్డాయి. లైఫ్‌స్టైల్‌ స్త్రీవాదులు స్త్రీలని ఉద్దేశించినట్లు ఈ బృందాలు కూడా పురుషులకు తమ గాయాల గురించి చెప్పుకుని, వాటిని మాన్పుకోవటానికి ఉపయోగపడుతున్నాయి తప్ప పితృస్వామ్యాన్ని, పురుషాధిక్యతని విమర్శించటానికి కాదు. భవిష్యత్తులో వచ్చే స్త్రీ వాద ఉద్యమం ఇటువంటి తప్పులు చెయ్యదు. అన్ని వయసుల మగవాళ్ళకి వారు సెక్సిజంని ప్రతిఘటిస్తున్నామని చెప్పుకోవటానికి, వారి సెక్సిస్టు వ్యతిరేకతని గుర్తించటానికి వివిధ స్థాయిల్లో వేదికలు ఏర్పడాలి. ఇప్పటికే మన సంస్కృతిలో ఫెమినిజం అంటే మగ వ్యతిరేకత అనే భావన బలంగా పాతుకుపోవటం వల్ల దాన్ని తీసెయ్యటానికి మనం చాలా పని చెయ్యాల్సి ఉంది. స్త్రీ వాదం సెక్సిజానికి వ్యతిరేకి. తన విశేషాధికారాలను గుర్తించి, వదులుకుని స్త్రీ వాద రాజకీయాలను దగ్గరికి తీసుకున్న పురుషుడు మన పోరాటాల్లో అర్హుడయిన కామ్రేడ్‌గా పనికొస్తాడు, మన ఉద్యమానికి ఏ ప్రమాదం తెచ్చిపెట్టడు. కానీ సెక్సిస్టు ఆలోచన, ప్రవర్తన అలాగే పెట్టుకుని స్త్రీ వాద ఉద్యమాల్లో చొచ్చుకుపోయే స్త్రీలు మన పోరాటాలకు చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడతారు. ఇంతకుముందే చెప్పుకున్నట్లు అంతర్గత సెక్సిజాన్ని, పితృస్వామ్య ఆలోచన, కార్యాచరణ పట్ల మనలో అంతర్లీనంగా ఉండే నిబద్ధతని ఎదుర్కొని, స్త్రీ వాద పరివర్తనకు సిద్ధమవ్వాలన్నది చైతన్యాన్ని పెంచే బృందాలు మనకందించిన శక్తివంతమయిన ఆలోచన. స్త్రీ వాద రాజకీయాలను ఎంచుకునే వారందరూ ఈ అడుగు వేయాల్సిందే. మనలోని శత్రువుని మార్చుకోకుండా బయటి శత్రువుని ఎదుర్కోలేము. ఆ శత్రువు సెక్సిజంని ఎదుర్కోకుండా, మార్చుకోకుండా స్త్రీ వాద జెండాని ఎత్తుకోవటం కొనసాగిస్తున్నంత వరకూ మన ఉద్యమం బలహీనపడటాన్ని ఆపలేము.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.