చీకటిని వెలుగుగా మార్చుకున్న ఒక దీపం కథ – చైతన్య పింగళి

సారూప్య అంతరంగాలు: ఆగస్టు 27 నంబూరి పరిపూర్ణగారి 92వ పుట్టినరోజు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ మట్టిలో ఉండి, నీటిని పీల్చి, సూర్యకాంతిని అందుకునే విత్తనం… మట్టిగా మారిపోతుందా? పోనీ నీటిగా? మరి కాంతిగా మారిపోతుందా? దేనిగానూ మారదు. ఈ మూడిరటి సారాన్ని గ్రహించి, ‘తనదైన’ మొక్క పదార్ధంగా మార్చుకుని మొలకెత్తుతుంది.

అచ్చం విత్తనంలాగే… ఎటువంటి పరిస్థితులు చుట్టూ ఉన్నా సరే, వాటినుండి ఎదుగుదలకి సానుకూలంగా ఉండే సారాన్నే గ్రహించి… మొలకెత్తి, మహావృక్షం అయింది.
మట్టి: పడమట దిక్కున తొలి చుక్క పొడుస్తున్న వేళ… బండారి గూడెం నుండి రెండు ఒంటెద్దు బళ్ళు బయలుదేరాయి. చీకటిపడేలోపు అవి కృష్ణవరం చేరుకోవాలి. వాటినిండా తెరలు, వాయిద్యాలు. వాటి వెనక నటులు, వంత పాఠకులు నడుస్తున్నారు. వారి వెనక రహస్యంగా ఒక తుంటరిపిల్ల. ఆ పిల్ల తమని వెంబడిస్తోన్న విషయాన్ని కృష్ణవరం పొలిమేర దాకా కనిపెట్టలేకపోయింది ఆ నాటక బృందం. చిన్నపిల్ల… అదీ ఆడపిల్ల… ఒంటరిగా, అలా చెప్పాపెట్టకుండా చీకటివేళ… ఊరు వదిలి రావటం చూసి కోపమొచ్చింది వారికి. కానీ పాపం కని పెంచిన ప్రేమాయే. కోపం రెండు నిమిషాలు కూడా నిలవలేదు. ఏళ్ళ తరబడి వాళ్ళు సాధన చేసి నేర్చుకున్న పదాలు, పాటలన్నింటినీ నిండా ఏడేళ్ళు లేని ఆ బుజ్జితల్లి పాడేయగలదు. ఆ వయసుకే అంత నేర్పు, అంతటి ధైర్యం. మరింకేం చేస్తారు? ఆ రాత్రి వేయబోతున్న ‘హరిశ్చంద్ర’ నాటకంలో లోహితుడిని చేశారు.
నక్షత్రాల పందిరి కింద నిలబడి ఆ రాత్రి… ‘అయ్యలారా, నేను ఆకులు కోయంగా పుట్టలోని పాము పట్టి కరిచె, విషము తలకెక్కే. నేను జీవించనయ్యా, కడకిదే మీకు నా నమస్కారమయ్యా!’ అని లోహితుడిగా నటించి, పాడిన ఆ చిట్టితల్లి మన తెలుగు సినిమా ఇండస్త్రీ తొలితరం స్టార్‌.
నీరు: కొత్త చివుర్లు వేసే మార్చి నెల. పన్నెండేళ్ళ పిల్ల ఒక్కతే విజయవాడ నుండి మద్రాసు రైలెక్కింది. శతాబ్దాల క్రితం కాల్చిన శంఖు చక్రాలని భుజాల మీద ముద్రలుగా వేయించుకుని, వైష్ణవంలోకి మారిన సాంఘిక, చారిత్రక మూలాలు ఉన్న కుటుంబం ఆ చిన్నారిది. అలాంటి పిల్ల ఆ రోజు భుజాల మీద సుత్తి, కొడవలి గుర్తులుండే కమ్యూనిస్టు జెండా ధరించి ఒంటరిగా ప్రయాణం చేస్తోంది, చదువు కోసం. జంకూ గొంకూ లేదు, భవిష్యత్తు మీద ఆశ తప్ప. ఆ జెండాను చూసే ఆమె మార్గదర్శి చెంచయ్యగారు గుర్తుపట్టి, స్కూల్లో చేర్చాలి మరి. చదువు కోసం ఊరు కాని ఊరిలో, వేరే భాష మాట్లాడే చోట హాస్టల్‌లో చేరింది. మూడోరోజే అక్కడున్న అసమానతలని, కులభేదాలని ప్రశ్నించింది, పన్నెండేళ్ళకే ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసిన ఆ చిన్నారి. టీనేజ్‌లోనే కమ్యూనిస్టు పార్టీలో చేరి, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం… ఎన్నో పోరాటాలు చేసి, అరెస్టులని ఎదుర్కొన్న తొలితరాల దళిత బాలిక.
సూర్యకాంతి: ‘అసలీ యుద్ధానికి కారకులెవరు? సోవియట్‌ రష్యాను దెబ్బతీయడానికి హిట్లర్‌ను గొప్ప హీరోగా రూపుదిద్ది, రెచ్చగొట్టి యుద్ధోన్మాదిగా మార్చిందెవరు? అమెరికా, బ్రిటన్‌లు కాదా? ఈ యుద్ధం వల్ల హిట్లర్‌ చేతిలో లక్షలాది యూదులు, కోట్లాది ప్రజలు మరణించడానికి కారణం వీళ్ళు కాదా? మనబోటి దేశాల కోసం, ప్రజల కోసం ప్రారంభించారా ఈ యుద్ధాన్ని? ఇలాంటి దేశాల యుద్ధనిధికి మనమెందుకు సహాయం చేయాలి సార్‌?’ అని మహాకవి జాషువాతో వాదనకి దిగింది. అప్పటికి ఆమె వయసు పదమూడేళ్ళు. ఆ మహాకవి ముచ్చటపడి ‘ఈ వయసులో ఇవన్నీ ఎలా తెలుసుకున్నావమ్మా?’ అని ఆశ్చర్యపోయారు. అమ్మ దగ్గర నుండి భారత, భాగవతం లాంటి పురాణాలుÑ చెంచయ్య గారింట్లో, మహీధర గారింట్లో ఉన్నప్పుడు కమ్యూనిస్టు సాహిత్యం, మార్క్స్‌, లెనిన్‌ల రచనలు, గురజాడ, చలం, జాషువా, విశ్వనాథ, బాలాంత్రపు రజనీ, కృష్ణశాస్త్రి లాంటి వారి లలితగీతాల సాహిత్యం, న్యూస్‌పేపర్‌తో సహా ఏదీ వదలకుండా చదవటం అలవాటు చేసుకున్న ఆమె… ఆత్మకథ రాయగల చరిత్ర ఉన్న, రాసిన గుప్పెడు మంది తెలుగు మహిళల్లో ఒకరు.
కుటుంబం నుండి నాటకం, పద్యం నేర్చుకున్నా ఆర్టిస్టుగా మిగిలిపోలేదు. పార్టీ నుండి, చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి పోరాటస్ఫూర్తిని అలవాటు చేసుకున్నా… కేవలం ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా మిగిలిపోలేదు. సాహిత్యం పట్ల అభిరుచి ఉన్నా… రచయిత్రిగా మాత్రమే మిగిలిపోలేదు. వీటన్నిటి నుండి సారాన్ని గ్రహించి, నేర్చుకుని, వాటిని తనదైన ‘పరిపూర్ణత’గా మలచుకుంది… నంబూరి పరిపూర్ణ. ముందే ఊహించి పేరు పెట్టారేమో అనిపిస్తుంది ఆమెని చూస్తే.
వ్యక్తిగతమంతా రాజకీయమే అని ఫెమినిస్టు స్టడీస్‌లో ఒక మాట ఉంటుంది. ఈ రాజకీయ అభిప్రాయాన్ని పక్కన పెట్టి చూసినా పరిపూర్ణగారి వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం, సామాజిక జీవితం… అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆమె పుట్టిన తర్వాతే మన దేశం పుట్టింది. ఈ దేశంలో జరిగిన ప్రతి మార్పుకీ, ప్రతి మంచికీ, ప్రతి చెడుకీ ఆమె ఒక సజీవ సాక్షి. ఆమె స్వీయ చరిత్ర వెలుగుదారులలో… ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాలు నడిచిన దారులే. సంగీతం, సాహిత్యం, సినిమా, ఉద్యోగం, అన్ని రకాల అసమానతల మీద పోరాటాలు, ఉద్యోగాలు… అన్ని రంగాలలో వచ్చిన మార్పులకి ఆమె జీవిత కథ ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌. ఆమె తర్వాత రెండు తరాలు వచ్చాయి.
ఈ దేశం పుట్టుక చూసిన మొదటి తరం పరిపూర్ణ గారు, మూడో తరం అపర్ణ. ఇద్దరితో మాట్లాడి పోల్చి చూసుకోవటం… ఇప్పుడు ఒక నెసిసిటీ. ఎన్ని అంశాల్లో ముందుకెళ్ళాం? ఎన్నింటిలో వెనక్కెళ్ళాం? ఎన్ని అంశాల్లో ‘రింగా రింగా రోజెస్‌’ ఆడుతున్నట్లు అక్కడక్కడే తిరుగుతున్నాం? అనేది కొలుచుకోటానికి, చెక్‌ చేసుకోటానికి పనికొచ్చే స్కేల్‌. అందుకే పరిపూర్ణ, అపర్ణలని కలిపి ఇంటర్వ్యూ చేసింది. బయోగ్రఫీ రాయాల్సిన విషయాన్ని ఇంటర్వ్యూ చేయటం పిచ్చి పని, కానీ తప్పని పని. కుదిరినంత తక్కువలో, పరిపూర్ణ గారిలా ‘సారాన్ని’ గ్రహించి, వాక్యాల్లో పెట్టిన ఆ ఇద్దరు నడిచొచ్చిన దారులు, వాటి గుర్తులు, అనుభవాలు ఇవి.
హక్కులు, అవకాశాలు ఉన్నాయన్న ఎరుక కూడా లేని స్త్రీల జీవితాలు పరిపూర్ణ గారి కథలని బాగా ఇన్‌ఫ్లుయన్స్‌ చేశాయి. ఇష్యూస్‌ దాదాపుగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఉన్న కాలం అది. బహుశా అందుకే కావచ్చు ఆమె రచనల్లో ఎక్కువ external conflict కనిపిస్తుంది. బయటి నుండి ఎదుర్కొంటున్న సమస్యకి ఆ పర్టిక్యులర్‌ కేరెక్టర్‌ ఎలా రియాక్టవుతుంది? ఎలా అవ్వాలి? అనే దిశగా నడిచే కథలు ఎక్కువ శాతం. మార్పుని, సానుకూల వైఖరినే సూచిస్తాయి ఆమె కథలు, కథల సంపుటల పేర్లు కూడా. ఉంటాయి మాకు ఉషస్సులు, శిఖరారోహణ ఆమె కథాసంపుటాల పేర్లు. ఈ దేశం గ్లోబలైజేషన్‌కు తలుపులు తెరిచిన కాలాన్ని చూసిన వ్యక్తి శిరీష. ఆర్థిక, సామాజిక, మానవ సంబంధాలన్నీ hair pin turn తీసుకుంటున్న కాలం అది. ఆ కాలాన్ని, ఆ మార్పులని, ఆ సందిగ్ధాలని, మనిషి ఎకోసిస్టవ్‌లోని గ్రే షేడ్స్‌ని పట్టుకునే ప్రయత్నం ఉంటుంది శిరీష గారి కథల్లో. ఆమె క్యారెక్టర్‌లకి external conflict ఉంటుంది, internal conflict కూడా ఉంటుంది. ఈ రెండిటి మధ్య చిక్కుకున్న ఆ క్యారెక్టర్‌ పడే సంఘర్షణ ఆమె నెరేషన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె కథలు ‘మనోవీథి, కొత్త స్వరాలు’ అనే రెండు సంపుటాల్లో వచ్చాయి.
ప్రపంచాన్ని అరచేతుల్లో చూసే అవకాశం వచ్చిన కాలం అపర్ణది. ఎక్స్‌పోజర్‌తో పాటుగా సంక్లిష్టత కూడా పెరిగిన కాలం ఇది. సమస్యలు కొత్తవి. సవాళ్ళు కొత్తవి. కొన్ని విషయాలు సింపుల్‌గా కనిపిస్తాయి. ఆలోచిస్తే, కాంప్లెక్స్‌ అనిపిస్తుంది. కొన్ని విషయాలు కాంప్లెక్స్‌గా కనిపిస్తాయి, కానీ సింపుల్‌గా అయి ఉండవచ్చు కూడా. ఈ రెండిటి మధ్య గ్రెడియంట్‌ని, ఒక క్యారెక్టర్‌ తనకుండే internal conflict తో external conflict ని ‘డీల్‌’ చేసే విధానాన్ని అపర్ణ తన కథల్లో చిత్రిస్తుంది. వ్యక్తిగత విషయాలకీ, సామాజిక విషయాలకీ మధ్య ఉన్న పనికిమాలిన లంకె ఎంత బరువో చెప్పే కథలే ఎక్కువ రాసింది అపర్ణ. ఆ కథల సంపుటి ‘బోల్డ్‌ డ బ్యూటిఫుల్‌’. అదేకాక, అతి చిన్న వయసులో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్‌ని అధిరోహించిన ‘పూర్ణ’ సాహస ప్రయాణాన్ని పుస్తకంగా రాసింది అపర్ణ.
ఒకరి రచనలపై ఇంకొకరి అభిప్రాయాలు, ఎదుర్కొన్న సవాళ్ళు, ఒకరిని ఇంకొకరు అర్థం చేసుకున్న తీరులో డైనమిక్స్‌ చాలా ఉత్సుకత కలిగిస్తాయి.
కథల వైపు ప్రయాణం… కథా వస్తువు…
పరిపూర్ణ: నేను మొదట్లో వ్యాసాలు, రేడియో ప్రసంగాలు రాసేదాన్ని. దాదాపుగా రిటైరయ్యే దశ వరకూ అంతే. అప్పటికే శిరీష కథలు రాస్తోంది. ఆ కథలకి వస్తున్న స్పందన, వాటి మీద జరుగుతున్న చర్చ చూశాక… ఏ సమస్య కానీ, ఏ అంశం కానీ వ్యాసాల కంటే కథల రూపంలో ఉంటేనే ఆసక్తిగా చదువుతారు, సారాంశం సులువుగా మనసులకెక్కుతుంది అనిపించింది. గ్రామాల్లో లైజాన్‌ ఆఫీసరుగా పనిచేయడం వల్ల నేను చూసిన స్త్రీల జీవితాలని, యథార్థ సంఘటనలు, సమస్యలనే కథలుగా రాయాలని నిర్ణయించుకున్నాను, రాశాను.
అపర్ణ: నా చిన్నప్పటి నుంచే ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది. అమ్మ, అమ్మమ్మ, మామయ్య అందరూ రచయితలే. నేను రాయాలని అనుకోవటం వెనుక వాళ్ళ ఇన్‌ఫ్లుయన్స్‌ డెఫినెట్‌గా ఉంది. నేను అర్బన్‌ ప్రాంతాల్లోని సోషల్‌ వర్క్‌ ప్రాజెక్టులలో పనిచేశాను. సోషల్‌ వర్క్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంలలో ‘కీప్‌ యువర్‌ ఐస్‌ అండ్‌ ఇయర్స్‌’ అని బాగా వాడేవారు. ఆ ఇన్‌ఫ్లుయన్స్‌ కూడా ఉంది నా మీద. నేను చాలావరకు నాన్‌ జడ్జిమెంటల్‌గా ఉంటాను. అందుకే నాతో కొందరు లోపలి విషయాలు షేర్‌ చేసుకుంటారు. దానివల్ల నాకు భిన్నమైన పర్‌స్పెక్టివ్‌ ఏర్పడిరది. నా కథల్లో అదే రిఫ్లెక్ట్‌ అవుతుంది.
కుటుంబంలోని రచయితల రచనలు…
పరిపూర్ణ: మా అమ్మాయి శిరీష, అబ్బాయి అమరేంద్ర ఇద్దరూ రచయితలే. ఇద్దరికీ కీర్తికాంక్ష లేదు. అదే ప్లస్‌ పాయింట్‌. అమరేంద్ర కథలు రాసినా, ఎక్కువగా పర్యాటక రచనలే చేశాడు. ఒక ప్రత్యేకమైన లక్షణముంటేనే తిరగగలరు, రాయగలరు. మనకి ఈ తరహా రచనలు తక్కువనే చెప్పాలి. తనకుండే సహజమైన జిజ్ఞాస, ఆసక్తి వల్ల, పురుషుడు అవటంతో ప్రయాణించే వెసులుబాటు కూడా కొంత ఉండటం వల్ల ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాడు. శిరీష నవలలు, ఎక్కువగా కథలు రాసింది. ఆమెను చూసే కథలు రాయటం మొదలుపెట్టాను. బాధితులు, పేదవారు, స్త్రీలు ఎదుర్కొనే సమస్యల పట్ల ఆమెకి చక్కటి అవగాహన ఉండేది. విషయాన్ని సున్నితంగా, అర్థమయ్యేలా, మనసుకి హత్తుకునేలా రాయగలుగుతుంది. ఇక అపర్ణ కథలు ఈ తరం స్త్రీలవి. ఆ స్త్రీలు చేసే ఉద్యోగాలు… వారి సమస్యలు అవీ. నాకు అంతగా అర్థం కాలేదు. పూర్ణ జీవిత చరిత్రను ఇంగ్లీషులో రాసింది చదివాను. అది నాకు చాలా నచ్చింది. అసలు ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కడానికి ఎన్ని బాధలు పడిరది అనే దాంతో పాటు ఎటువంటి శిక్షణ పొందింది, ఎటువంటి పరికరాలు వాడిరది లాంటి సూక్ష్మమైన విషయాలను కూడా చాలా చక్కగా రాసింది. అంత ఓపికతోటి, పరిశీలనతోటి రాయటం నాకెంతగానో నచ్చింది.
అపర్ణ: నా ప్రొటాగనిస్టులు ఎప్పుడూ ఐడియల్‌గా ఉండరు. వాళ్ళ బలహీనతలే వాళ్ళని డ్రైవ్‌ చేస్తాయి. ‘వాళ్ళు ఎస్టాబ్లిష్డ్‌ వాల్యూస్‌ని ఎందుకు పాటించలేకపోయారు’, అనేదాన్ని స్మార్ట్‌గా రాసేదాన్ని మొదట్లో. అమ్మ తన ప్రొటాగనిస్టులు ఆ వాల్యూస్‌తో కాంప్రమైజ్‌ అవ్వడానికి వాళ్ళకున్న కారణాలేంటో ఎంపథైజ్‌ చేస్తూ, కన్విన్స్‌ చేస్తూ రాస్తుంది. అమ్మమ్మ దగ్గరికి వచ్చేసరికి అలా కాదు. ఆమె టైంలో ఉన్నట్టుండి రాడికల్‌గా మార్పులు జరిగాయి. మనుషులు మంచి, చెడు, పీడితులు, పీడకులు అని బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంటుంది. అసలు… ముగ్గురం ఒకరికొకరం పర్‌పెండిక్యులర్‌గా రాశామనుకుంటాను నేను.
రాయడానికి ఎదురైన సవాళ్ళు:
పరిపూర్ణ: నేను మొదట్లో రేడియో వ్యాసాలే రాసేదాన్ని. స్త్రీ సంక్షేమ శాఖలో పనిచేయటం వల్ల వారి సాధక బాధకాలు, సమస్యలు, పరిష్కారాలు… రోజంతా నేను వినేది, ఆలోచించేది ఇవే. అందుకే స్త్రీల అంశాలని వ్యాస రూపంలో రాయడానికి పెద్దగా సమయం పట్టేది కాదు. తర్వాతర్వాత కథలు రాసేటపుడు చాలా సమయం వెచ్చించాల్సి వచ్చేది. అప్పటికే
ఉద్యోగ బాధ్యతలు పూర్తవటం, మా పిల్లలు అప్పటికే రచయితలు కావటం వల్ల నాకు ఆ వెసులుబాటు దొరికింది. స్వీయ చరిత్ర రాశానంటే రాసే వీలు, వాతావరణం కలిగించటానికి మా పిల్లలు, కుటుంబం బాగా సహకరిస్తారు. మా అబ్బాయి అమరేంద్ర ‘ఇది రాయి… ఇది బాగుంది…’ అని ఎంకరేజ్‌ చేస్తాడు. ప్రూఫ్‌ రీడిరగ్‌ చేసి పెడతాడు. ఇప్పుడు నవల రాసే పనిలో ఉన్నాను.
అపర్ణ: స్త్రీ భావకురాలిగా, ఆర్టిస్టుగా ఉండటమనేది ‘లగ్జరీ’. క్రియేటివిటీ ఈజ్‌ ప్రొడ్యూస్డ్‌ ఓన్లీ ఎట్‌ సబ్‌కాన్షియస్‌ లెవల్‌. ఆడవాళ్ళు ఆ సబ్‌కాన్షియస్‌ లెవల్‌ జోన్‌లో ఎంతసేపు ఉండగలరు? మగవాళ్ళకంటే ‘భార్య’ ఉంటుంది. ఆడవాళ్ళకి భార్య ఉండదుగా అన్నీ చేసి పెట్టడానికి. ఇంటి పని, వంట పని, పిల్లల పనీ… అన్నీ చేసుకోవాలి. వీటన్నిటి మధ్యా రాయటానికి ‘స్పేస్‌’ ఉండటం కష్టం. అందుకే మా ముగ్గురిలో అమ్మే రాయడానికి టైం కోసం ఎక్కువ కష్టపడిరదని అనిపిస్తుంది. అమ్మమ్మకి వాళ్ళ అమ్మ సపోర్టు ఉంది. అమ్మకి అలా లేదు. మళ్ళీ నా దగ్గరికి వచ్చేసరికి హెల్పర్‌ని పెట్టుకునే వెసులుబాటు, ఉద్యోగానికి వెళ్ళడానికి ట్రాన్స్‌పోర్ట్‌ కొంత ఈజీ అయింది. మళ్ళీ… ఇలాంటి వెసులుబాటు సిటీలో ఉండి, ఉద్యోగం చేసుకుంటూ ఉండే ఆడవాళ్ళకే. ఆడవాళ్ళు రాయడానికి సమయాన్ని పెట్టగలగటం అనేది మల్టిపుల్‌ ఫ్యాక్టర్స్‌ మీద ఆధారపడి ఉంటుంది.
రాతలకు ఎదురైన సవాళ్ళు:
పరిపూర్ణ: నన్ను రాయమని ఎంతోమంది ఎంకరేజ్‌ చేసేవారు. రేడియోవారు, వివిధ పత్రికల ఎడిటర్లు, ‘రాయండి, ఈ అనుభవాలు రాయాలి…’ అని చెప్పేవాళ్ళు. తర్వాతర్వాత కథలు రాసే టైంకి మా పిల్లల వల్ల, కొత్త తరం రచయితలు, రచయిత్రులు కూడా పరిచయమయ్యారు. వాళ్ళు కూడా సపోర్టు చేసేవారు. నా టైంలో స్త్రీ రచయితలు ఎక్కువగా లేరు. వాసిరెడ్డి సీతాదేవి గారు, రంగనాయకమ్మ గారు మాత్రం ఏదన్నా బాగా రాస్తే బాగుంది, ఇలాంటివి రాస్తూ ఉండు, ఎక్కువగా రాయాలి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరూ నా కథలని పెద్దగా విమర్శించలేదు. స్వీయచరిత్ర మీద విమర్శ అనను కానీ… బాగా చర్చ జరిగింది. ఇంకా రాస్తే బాగుంటుంది అన్నవాళ్ళే ఎక్కువ.
అపర్ణ: అమ్మ రాయటానికి ఎక్కువ ఛాలెంజెస్‌ ఎదుర్కోవాల్సి వస్తే ‘రాస్తున్న వాటికి’ మా ముగ్గురిలో నేను ఛాలెంజెస్‌ ఎక్కువ ఎదుర్కోవాల్సి వచ్చింది. అమ్మకి పాఠకుల స్పందన తెలిసేసరికి వారం పట్టేది. కథ ప్రింటయి, దాన్ని చదివి, దానిమీద పాఠకులు తమ స్పందన రాసి, పోస్టు చేసి, పత్రికల వాళ్ళు సెలక్టెడ్‌ ఉత్తరాలని ప్రింట్‌ చేసి… అమ్మ చదివే టైంకి చాలా విషయాలు ఎమోషనల్‌ లెవల్లో ఫిల్టర్‌ అయిపోయేవి. మనకి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఉండేసరికి నా కథలకి వచ్చే రెస్పాన్స్‌ వెరీ ఇన్‌స్టెంట్‌. చదివిన వెంటనే స్పందించేస్తారు. కొన్నిసార్లు చదువుతూ చదువుతూ మధ్యలో ఆపి పోస్టో, కామెంటో పెట్టేస్తారు. నచ్చినా, నచ్చకపోయినా తీవ్రస్థాయిలో రియాక్షన్‌ వచ్చినవి కూడా ఉన్నాయి. రెండు రకాల రియాక్షన్స్‌ని నేను బెటర్‌గా హ్యాండిల్‌ చేశానని అనుకుంటున్నా. రైటర్స్‌ మాటకి వస్తే నేను కథలు ప్రింట్‌కి పంపే ముందు అవినేని భాస్కర్‌, రిషి శ్రీనివాస్‌ లాంటి కొందరు స్నేహితులకి పంపుతా. కొంత చర్చ జరుగుతుంది. రాయమని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువమందే ఉన్నారు.
… … …
కాంగ్రెస్‌లో గాంధీ, కమ్యూనిస్టు పార్టీ, వీళ్ళకంటే భిన్నమైన స్టాండ్‌ తీసుకుని, సానుభూతి బేసిస్‌ మీద కాకుండా, హక్కుల బేసిస్‌ మీద ఒంటరి పోరాటం చేస్తున్న అంబేద్కర్‌… వీళ్ళందరి ఇన్‌ఫ్లుయన్స్‌ ఆనాటి అభ్యుదయవాదులందరి మీద ఉంది. పరిపూర్ణగారి పరిచయస్తులు, చదువుకోటానికి సపోర్టు చేసినవాళ్ళు, ఉద్యోగం, రచనల విషయంలో సహాయం చేసిన వాళ్ళంతా అభ్యుదయ వాదులే. దాదాపుగా అగ్రవర్ణాలవారే. ఆ కాలానికి సపోర్టు చేయగల స్థితిలో వారే ఉంటారు కదా. పరిపూర్ణగారు 1949లో వర్ణాంతర వివాహం చేసుకున్నారు, పైగా ‘డెన్‌’లో. దండల మార్పిడి పెళ్ళి అది. కట్నం ప్రసక్తి లేకుండా, కులం పట్టింపు లేకుండా, ఆడంబరం అన్న ఊసే రానీయకుండా కొంతమంది కామ్రేడ్స్‌ మధ్య పెళ్ళి చేసుకునే సాహసం అప్పట్లోనే చేశారు. పరిపూర్ణ గారి పిల్లలు ముగ్గురివీ మళ్ళీ కులాంతర, ఆదర్శ వివాహాలే. వారి పిల్లలవి కూడా… అంటే మూడో తరానివి కూడా అలాంటి పెళ్ళిళ్ళే. పరిపూర్ణ గారి మాటల్లోనే చెప్పాలంటే ‘కులాల కలగూరగంప’ ఆ కుటుంబం. కులనిర్మూలనకి కులాంతర వివాహాల ఆవశ్యకతను అంబేద్కర్‌ ‘కుల నిర్మూలన’ పుస్తకంలో చెప్పారు. మరి మూడు తరాల పాటు కులాంతర వివాహాలు చేసుకున్న ఈ కుటుంబం కుల వివక్షను ఎంత ఎదుర్కొంది? కులం కంపల్ని ఎంతవరకూ దాటగలిగిందనేది అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం.
చదువుకునే చోట…
పరిపూర్ణ: 1943లో దర్శి చెంచయ్యగారు నన్ను చదువు కోసం సేవాసదనం హాస్టల్‌లో చేర్పించారు. అక్కడ ధనిక, అగ్రవర్ణ విద్యార్థినులకు వేరే గదులుండేవి. మేము తరగతి గదుల్ని, ఆ పెయిడ్‌ విద్యార్థినుల గదుల్ని శుభ్రం చేయటం, మెస్‌ దగ్గర ఉన్న ఖాళీ జాగాలో తిని, ఆ విద్యార్థినుల గదులకి క్యారియర్లు తీసుకువెళ్ళటం లాంటి పనులు చేయాల్సి వచ్చేది. మూడురోజుల పాటు ఈ వివక్షను సహించాను. తర్వాత ఇక ఇక్కడ ఉండేది లేదని చెంచయ్యగారికి చెప్పగానే, ఆయన సేవాసదనం యాజమాన్యాన్ని తిట్టి, నన్ను రామకృష్ణ మిషన్‌ వారు నడిపే శారదా నికేతన్‌లో చేర్చారు. ఉండటమేమో చెంచయ్యగారింట్లోనే. అక్కడ వారికి నేను సొంత బిడ్డనే. శారదా నికేతన్‌లో అప్పటికి చదువుకుంటున్న దళిత బాలికలు చాలా చాలా తక్కువ. వారి పట్ల కుల వివక్ష ఉండేది. సినిమాలో ప్రహ్లాదుడిగా చేశాననీ, బాగా పాడగలననీ, బాగా చదువుతాననీ, చెంచయ్య గారింట్లో ఉంటున్నాననీ, ఆయన్ని నాన్నగారు అని పిలుస్తానని… ఇవన్నీ టీచర్లకి తెలిసి ఉండటం వల్ల, అవి కొంత ప్లస్‌ అవటం వల్ల… కులం వల్ల నేను మిగిలిన బాలికలు పడినంతటి ఇబ్బంది పడలేదనుకోవచ్చు.
అపర్ణ: నేను కులవివక్ష ఎదుర్కోలేదనే చెప్పాలి. మా గ్రాడ్యుయేషన్‌ కాలేజీలో హెచ్‌.ఓ.డి. నాతో చాలా ప్రేమగా ఉండేవారు. ఫైనల్‌ ఎగ్జామ్స్‌ అయ్యాక, పీజీకి అప్లై చేయటానికి సర్టిఫికెట్స్‌ ఎటెస్టేషన్‌ కోసం వెళ్ళాను ఆయన దగ్గరికి, ఆయన సంతకం పెట్టాలి. నా దగ్గర అప్పటికి కాస్ట్‌ సర్టిఫికెట్‌ లేదు. టెంపరరీ కాస్ట్‌ సర్టిఫికెట్‌ కూడా ఆ డాక్యుమెంట్స్‌లో ఉంది. ఒక్కోటి సంతకం చేస్తూ కరెక్టుగా కాస్ట్‌ సర్టిఫికెట్‌ దగ్గరికి వచ్చేసరికి ఆయన తలెత్తి నన్ను చాలా కోపంగా చూశారు. స్టిల్‌ ఐ రిమెంబర్‌ దట్‌. అసలెందుకలా చూశారో కూడా నాకర్థం కాలేదు. తర్వాతెప్పుడో రెండు, మూడేళ్ళ తర్వాత అర్థమయింది. నేను చదువుకుంది సోషియాలజీ, వర్క్‌ చేసింది ఎన్జీఓల్లో కాబట్టి… నా చుట్టూ ఉండేవాళ్ళకి కులం విషయంలో చాలా అవగాహన ఉండేది. సెన్సిటివ్‌గా ఉండేవారు.
విజయవాడలో నా ఇంటర్‌ టైంలో ఘంటసాల మ్యూజిక్‌ కాలేజీలో సంగీతం కోర్సు చేశాను. జాయిన్‌ అవటానికి నేను, మా నాన్న వెళ్ళాం. అక్కడ ప్రిన్సిపాల్‌ మా నాన్న స్నేహితుడు. ఆయన బ్రాహ్మిన్‌, తెలిసిన మనిషే. అయినా ఫారం పూర్తి చేస్తున్నపుడు నా కాస్ట్‌ అడిగారు. మా నాన్న ఠక్కున చౌదరి అని చెప్పారు. ఆ ప్రిన్సిపాల్‌కి మా నాన్న ఎన్నో ఏళ్ళ నుంచే తెలుసు. నిజమా! అని అడిగారాయన. అవును అని మా నాన్న అబద్ధం చెప్పారు. ఆయనకు నిజం తెలుసని నాకు, మా నాన్నకి, ఆయనకి… ముగ్గురికీ తెలుసు. నేను చాలా అవమానంగా ఫీలయ్యాను. కోపం వచ్చింది. బైటకు రాగానే ‘‘ఎందుకలా అబద్ధం చెప్పారు?’’ అని అడిగా. ‘నీకు తెలీదు, ఇక్కడంతా ఇలానే ఉంటుంది. అలా చెప్తే ఏం కాదు’ అన్నారు. అంత కంపల్సివ్‌గా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందో నాకు అప్పుడు అర్థం కాలేదు. రెండో రోజే మా మ్యూజిక్‌ టీచర్‌కి చెప్పేశా, మేము ఎస్‌.సి. అని. ఆ టీచర్‌ ఏమీ డిఫరెన్స్‌ చూపించలేదు. నేను చదువుకునే చోట ఎదుర్కొన్నది అంటే… ఇవే అని చెప్పొచ్చు.
కుటుంబాల్లో… స్నేహాల్లో…
పరిపూర్ణ: చిన్నతనంలో తెలీని ఊరు, తెలీని భాష మాట్లాడే మద్రాసు వెళ్ళినపుడు నన్ను ఇంట్లో ఉంచుకుని చూసిన నటి వరలక్ష్మి అక్క, హాస్య నటులు రేలంగి గారు, రేడియోలో పాడటానికి అవకాశమిచ్చిన బాలాంత్రపు గారు, ఉద్యోగం పొందటానికి సూచనలు చేసిన బాలకృష్ణ అన్నయ్య, నన్ను ఆదరించి, చదివించి, నేను ఇలా ఎదగడానికి తోడ్పడిన మహీధర గారి కుటుంబం… అగ్రవర్ణాల వారే. కానీ, వారి ప్రేమాభిమానాలకు నా కులం అడ్డు కాలేదు. కమ్యూనిస్టు అయిన దాసరి నాగభూషణం గారిని వర్ణాంతర వివాహం చేసుకున్నాను. ఇద్దరివైపు నుండి కూడా ఆ రోజుల్లో అది పెద్ద సాహసం. కానీ వివాహ జీవితంలో మాత్రం కులం నీడ నా మీద పడిరది. దాసరిగారితో నా వివాహం ఏ పరిస్థితుల్లో జరిగిందీ, తర్వాత కాలంలో నేను పడ్డ బాధ గురించి రాశాను స్వీయ చరిత్రలో. ఆయన నన్ను ఉద్యోగం చేయవద్దని చెప్పినప్పుడు, మా అమ్మ చేయనిమ్మంటే ఆమెని కొట్టడానికి వెళ్ళాడు, నేను అడ్డుపడ్డాను. తన కులపు అత్తగారే అయితే అంత పని చేసేవాడా అనిపించింది. పిల్లలతో ఆయన వ్యవహరించే తీరు చూస్తే తన కులానికి చెందిన అమ్మాయిని చేసుకుని ఉంటే, ఆమెకి పుట్టిన పిల్లలతో ఇలాగే ఉండేవాడా అనిపించింది.
అపర్ణ: ఇంట్లో అందరం ఇంటర్‌కాస్ట్‌ కాబట్టి, కులం అనేది అసలు నాకు చాలాకాలం వరకు తెలియదు. తర్వాత ఇప్పుడు మాత్రం ఎవరన్నా నీ కాస్ట్‌ ఏమిటి అని అడిగితే ఎస్‌.సి. అనే చెబుతాను. నా దళిత స్నేహితులు ఆ విషయాన్ని యాక్సెప్ట్‌ చేయరు. వాళ్ళు అలా అనుకోవటం కరక్టే అనిపిస్తుంది. మొదటి జనరేషన్‌ దళితులకు ఉండే ఛాలెంజెస్‌ నాకు లేవు. నా దళిత ఫెమినిస్టు స్నేహితులను చూసినప్పుడు వాళ్ళు ఊపిరి కోసం ఇంకా కొట్టుకుంటున్నారనే అనిపిస్తుంది. నాతోపాటుగా, నా అంతగా చదువుకున్న మొదటి జనరేషన్‌ దళిత అమ్మాయి అవకాశాల పరంగా, యాక్సెప్టెన్స్‌ పరంగా అమ్మమ్మ చేసిన పోరాటం చేయాలి. క్వాలిఫికేషన్స్‌లో నాతో సమానమైన మొదటి జనరేషన్‌ అమ్మాయి, అవకాశాల్లో అమ్మమ్మ జనరేషన్‌తో సమానం. నేను ఆ రకంగా ప్రివిలైజ్డ్‌. నా పోరాటం దాదాపుగా ఒక సవర్ణ స్త్రీ పోరాటం లాంటిదే. నాకా అవగాహన ఉంది. ‘కులం’ ఉన్నంతవరకు వివక్ష ఉంటుంది. ‘కులం’ అడిగినంత కాలం నేను ఎస్‌.సి. అనే చెప్పుకుంటాను.
‘కులం’ ఎప్పుడు పోవచ్చంటే…
పరిపూర్ణ: కులం పోవటమనేది చాలా కష్టం. అసాధ్యమని నేను అనుకోను. కానీ చాలా కష్టం. వర్ణాంతర, కులాంతర వివాహాల సంఖ్య చాలా పెరగాలి. ఈ తరహా వివాహాలు జరిగినకొద్దీ కులం బలహీన పడుతుంది. అయితే, ఈ వివాహాల్లో సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొనేందుకు సాహసించాలి. వీటితో పాటు అంబేద్కర్‌ గారు ఇచ్చిన రిజర్వేషన్లను చక్కగా ఉపయోగించుకుని చదువులో, ఉద్యోగాల్లో ఉన్నతంగా ఎదగాలి. ముఖ్యంగా అంబేద్కర్‌ గారి సాహిత్యాన్ని చదవాలి, అవగాహన పెంచుకోవాలి. వాటితో పోల్చుకుని సమాజంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి, పట్టించుకోవాలి, వివక్ష పోయే విధానాల కోసం పనిచేయాలి.
అపర్ణ: అన్ని రంగాల్లో అణగారిన వర్గాలకు యాక్సెస్‌ ఉండాలి. సినిమా పరిశ్రమలో ఎంతమంది దళితులున్నారు? ఎంతమంది దళితులు లార్జ్‌ స్కేల్‌, మీడియం స్కేల్‌ ఇండస్ట్రీలకు యజమానులు? అన్ని రంగాల్లో పవర్‌ పొజిషన్లలోకి అణగారిన వర్గాలు రాకుండా ఇలాగే ఉంచి, కులాంతర వివాహాలు చేసుకున్నంత మాత్రాన కులం పోదు, మరింత కన్సాలిడేట్‌ అవుతుంది. ఇప్పుడు నిజానికి… అదే జరుగుతోంది. పవర్‌ పొజిషన్స్‌లోకి అణగారిన వర్గాలు రావటానికి నాకు తెలిసి ఇంకో రెండు తరాలు పడుతుంది. ఆ తర్వాత తరానికి కులం అనేది కొంత తగ్గుతుందనుకుంటా.
… … …
పరిపూర్ణగారి అన్నయ్యలు శ్రీనివాసరావు గారు కమ్యూనిస్టులు. చిన్నన్నయ్య దుర్వాస మహర్షిగారు కాంగ్రెస్‌ వాది. ఇద్దరూ అభ్యుదయ భావాలు ఉన్నవారు, సమాజం కోసం పోరాడిన వారు, జైళ్ళ పాలయినవారే. అయితే, ఆమె మీద శ్రీనివాసరావు గారి ప్రభావమే ఎక్కువ. మార్గదర్శకులు దర్శి చెంచయ్యగారు, మహీధర గారు. వీళ్ళందరి సాన్నిహిత్యం, చదివిన సాహిత్యం ఆమెని కమ్యూనిస్టు పార్టీ వైపు నడిపించాయి. హైస్కూలు దశ నుంచే ఆమె విద్యార్థి సంఘాల్లో యాక్టివ్‌ మెంబర్‌. మహాసభలు నిర్వహించటం, సమ్మెలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వటం, చందాలు వసూలు చేయటం… ఆమె కమిటెడ్‌, యాక్టివ్‌ మెంబర్‌. తెలంగాణా సాయుధ పోరాటానికి మద్దతుగా ఆంధ్రా ప్రాంతపు కమ్యూనిస్టు నాయకులు, సభ్యులు పోరాటం చేస్తున్న కాలంలో కరపత్రాలు అందచేయడం, సాయుధ పోరాటానికి కావాల్సిన నిధులు సేకరించి పార్టీకి అందించటం లాంటి సాహసాలు చేసింది. పళనియప్పన్‌ అనే థర్డ్‌ డిగ్రీ స్పెషలిస్టుకి దొరికి, లాకప్‌లో పడేలోపు కరపత్రాలని, మినిట్స్‌ని అందకుండా చేయగలిగిన చాకచక్యం ఆమెది. దాసరిగారు సాయుధ పోరాటం కాలంలో డెన్‌లో రహస్యంగా ఉన్నప్పుడు వారి పెళ్ళి జరిగింది. పార్టీ మీద నిషేధం ఎత్తివేశాక, సినిమా అవకాశాలు వదులుకొని, నెలల బిడ్డను చంకనేసుకుని, ప్రజానాట్య మండలి తరపున ఎన్నికల ప్రచారానికి తిరిగారు పరిపూర్ణ. 1972లో జరిగిన ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని మొదట్లో వ్యక్తిగతంగా వ్యతిరేకించినప్పటికీ, తర్వాత కాలంలో ఆ ఉద్యమాన్ని సమర్ధించానని, దానికి కారణాన్ని స్వీయ చరిత్రలో రాశారు పరిపూర్ణ. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. పిల్లల తల్లి అయిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆమె ఉద్యమ జీవితాన్ని వదల్లేదు. దాసరిగారితో విడిపోయినా కూడా, వైవాహిక జీవితం గురించి కాకుండా, పార్టీ పనుల గురించి మాట్లాడుతున్నప్పుడు కమ్యూనిస్టుగా ‘దాసరి’గారి పట్ల ఏ మాత్రం అగౌరవం చూపించరు ఆమె. ఈ బ్యాలెన్స్‌ని ఆమె ఇప్పటిదాకా మెయింటెయిన్‌ చేస్తూనే ఉన్నారు. పార్టీ పట్ల, దానికోసం పనిచేసిన వారి పట్ల ఆమెకున్న అభిమానం అలాంటిది.
పరిపూర్ణ: పార్టీ గురించి నేనేమని చెప్పాలి? నా జీవితమంతా దానిమీదే ఆధారపడి ఉంది. చదువుకునే అవకాశాలు పార్టీ సభ్యుల వల్లే వచ్చాయి. నా ఆలోచనా దృక్పథాన్ని విస్తృతం చేసి, నన్ను ఆత్మగౌరవం ఉన్న మనిషిగా తీర్చిదిద్దింది కమ్యూనిస్టు పార్టీనే. నా జీవిత భాగస్వామి కూడా పార్టీ సభ్యుడు కాబట్టే, వర్ణాంతరమైనా, అభ్యుదయ భావాలు ఉన్న నాయకుడని ధైర్యంగా ఆమోదించాను. పార్టీ కార్యకర్తగా పనిచేసిన అనుభవమే స్త్రీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నప్పుడు, వారి పరిస్థితులను అర్థం చేసుకుని, వారికి దగ్గరై, ధైర్యాన్ని నింపటానికి సహాయం చేసింది. నా పిల్లల్ని ఆదర్శంగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే కాంక్షని కలిగించింది. సమాజంలో ఉన్న వర్గబేధాలను, స్త్రీ పురుష భేదాలను అర్థం చేసుకోవటానికి, రాయటానికి కమ్యూనిస్టు సిద్ధాంతమే నడిపిస్తోంది.
అపర్ణ: నాకు కమ్యూనిస్టు పార్టీతో అనుబంధమేం లేదు. మాది కమ్యూనిస్టులున్న కుటుంబమని తెలుసు. అమ్మ, మామయ్యల స్నేహితులు, అత్తయ్య వాళ్ళు, ఇంకా చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ కమ్యూనిస్టు పార్టీలో పనిచేసినవారే. మా ఇంట్లో ఆ సాహిత్యం ఉండేది. నా మీద ఆ పార్టీ ఇన్‌ఫ్లుయన్స్‌ లేదు. నా స్నేహితుల కుటుంబాలను పోల్చి చూసుకుంటే మాత్రం మా కుటుంబాల్లో పూజలు లేకపోవటం, జెండర్‌ వివక్ష లేకపోవటం, డెమోక్రటిక్‌గా ఉండటంలో కమ్యూనిస్టు పార్టీ ఇన్‌ఫ్లుయన్స్‌ ఉందనే అనుకుంటాను.
పరిపూర్ణ: స్త్రీల పట్ల ఉండే వివక్ష గతంకంటే తగ్గిందనే అనుకుంటున్నా. వరకట్న హత్యలు విపరీతంగా ఉండేవి. వరకట్నం ఒక దురాచారం అనేది, అది నేరం అనేది అర్థం చేసుకుంటున్నారు. కానీ వరకట్న హత్యలు, వరుల గొంతెమ్మ కోర్కెల్లో రావాల్సినంతటి స్థాయిలో మార్పు రాలేదు. స్త్రీలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సొంత కాళ్ళమీద నిలబడుతున్నారు. నా టైంలో నేను ముగ్గురు పిల్లలతో ఒంటరిగా విజయవాడలో ఉండాల్సి వచ్చినపుడు కులం కారణంగా, ఒంటరి స్త్రీ మీద సహజంగా ఉండే చిన్నచూపు కారణంగా ఇల్లు అద్దెకు దొరకలేదు. నేను దాసరిగారి పేరు, కులం చెప్పవలసి వచ్చింది. అదొక్కసారే నేను ఆయన పేరును ఉపయోగించుకుంది. కానీ ఇప్పుడు స్త్రీలు ఒంటరిగా ఉండాలన్నా అంతటి దుస్థితిలో లేరు. విద్య, ఉద్యోగాల్లో బాగా రాణిస్తున్నారు. ఆస్తి హక్కు వచ్చింది. చట్టపరంగా అనేక హక్కులు వచ్చాయి. అవకాశాలు వచ్చాయి.
అపర్ణ: చాలా మార్పులు జరిగాయి, నిజమే. హక్కుల్లోనూ, అవకాశాల్లోనూ చాలా ఇంప్రూవ్‌మెంట్‌ ఉంది. సింగిల్‌ ఉమన్‌ సంగతే తీసుకుందాం… అప్పటికంటే ఇప్పుడు నయమే కానీ, ఇళ్ళు దొరకటం ఇప్పటికీ కష్టమే. పెళ్ళయి భర్త చనిపోయో, విడిపోయో ఉన్న ఆడవాళ్ళకి ఇల్లు దొరకవచ్చేమో కానీ సింగిల్‌గా ఉండే స్త్రీలకి అద్దెకి ఇల్లు దొరకటం ఇప్పటికీ సిటీలో కూడా కష్టమే. ఆస్తి హక్కు వచ్చింది. అయితే, దాన్ని పొందడానికి ఎంతమంది స్త్రీలు కోర్టుల చుట్టూ తిరగ్గలరు? మన లీగల్‌ వ్యవస్థలు పూర్తిగా ఉమెన్‌ ఫ్రెండ్లీ అయినప్పుడే అది సాధ్యం. చదువు, ఉద్యోగంతో పాటు సొంత ఆస్తి అనేది కూడా భద్రత ఇచ్చేది… ఇవన్నీ లాంగ్‌ బ్యాటిల్స్‌. చాలా మారాయి, ఇంకా మారతాయి.
… … …
కొలుచుకుంటూ పోతే గజం కాస్తా బెత్తెడవ్వచ్చు, బారెడవ్వచ్చు. కొలత ఎక్కడో తప్పుతాం. కొలవటం వదిలేసి, ఈ ఇద్దరూ అనుకుంటున్న దాన్ని చూస్తే, కృష్ణశాస్త్రి అన్నట్టు ‘ముందున్నది ముందున్నది ముందున్నది మనదే…’ అనే ఆశ మాత్రం కలుగుతుంది. మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్చ, సమానత్వాల వెనుక ఎంతమంది పోరాటం ఉందో కదా అనిపిస్తుంది. ముందు తరాల భుజాల మీద నిలబడే కదా మనం ఇంత దూరం చూడగలుగుతున్నాం. థేరీగాథలు రాసిన బౌద్ధ భిక్షుణిల దగ్గర నుండి నంబూరి పరిపూర్ణ, దాసరి శిరీషల వరకూ… విభిన్న ప్రాంతాలు, ఆచారాలు, భాషలు, అణచివేతలు, కులాలు, మతాలు, జాతులకు చెందిన ఎంతోమంది స్త్రీలు చేసిన పోరాట ఫలితాలనే కదా మనం అన్ని రంగాల్లోనూ ఈరోజు అనుభవిస్తోంది. ఇటువంటి ఒక నేషనల్‌ అసెట్‌ని కొవిడ్‌ కాలంలో కూడా జాగ్రత్తగా కాపాడిన ఆ కుటుంబానికి, we should be thankful.
పరిపూర్ణ గారికి long term plans ఉన్నాయి. ఇప్పుడు రాస్తున్న నవలని పూర్తి చేయాలి, ఎక్కువగా రాస్తే చేతులు నొప్పులు పెడుతున్నాయి కనుక ఇది ముగించాక కథలూ, వ్యాసాలు రాయాలి అని. పరిపూర్ణగారిలోని ఈ సానుకూల దృక్పథాన్ని, జీవితమిచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకునే వైఖరినే మనం నేర్చుకోవాల్సిందిÑ తర్వాత తరానికి అందించాల్సింది.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.