భార్యమీద ప్రేమ లేదు విడాకులివ్వండి అంటే ఎవరికీ అర్థం కాదు. నా భార్య రోగిష్టిది, సంసార జీవితానికి పనికిరాదు అంటే విడాకులు ఇవ్వమని అడగొచ్చని, పొందవచ్చని రావు కమిటీ చెబుతోంది. జబ్బు పడిన భార్యలను ప్రేమగా చూసుకునే భర్తలుంటారు, రోజూ భార్యల నుండి సంసార సుఖం పొందుతూనే వాళ్ళను ద్వేషించే భర్తలుంటారు. ఈ ప్రేమ, ద్వేషాలు
భార్యాభర్తల సంబంధాలలో ఎట్లా ఉంటాయో, ఎట్లా పని చేస్తాయో ఆలోచించే చట్టాలు రావటం అసాధ్యం.
ప్రేమ పేరుతో మగవాళ్ళు మోసం చేసే స్థితిలో ఉండటం, నిస్సహాయ స్థితిలో ఆడవాళ్ళుండటం వాళ్ళకి హక్కుల్ని లేకుండా చేస్తోంది. వాళ్ళకు మనుషులుగా, స్వతంత్ర వ్యక్తులుగా పనికొచ్చే హక్కులు కాకుండా పరాధీనులుగా, బానిసలుగా, బాధితులుగా చూసి హక్కులు అడగవలసిన పరిస్థితులే ఉన్నాయి. ముందు ఆడవాళ్ళ స్థాయి మారి సమానత్వం వస్తే తప్ప ‘ప్రేమ’ను అర్థం చేసుకోలేం. అప్పుడు పెళ్ళి ఉండదు, ప్రేమే ఉంటుంది. ఎంగిల్స్ కుటుంబం వ్యక్తిగత ఆస్తిలో శారదకు చాలా ఇష్టమయిన వాక్యాలు మనసులో మెదలాయి.
‘‘ఒక తరం మగవాళ్ళు తమ జీవిత కాలంలో ధనంతో కానీ, సామాజికాధికారంతో కానీ స్త్రీని లోబర్చుకునే సందర్భం ఎదురుకానప్పుడు, అదే విధంగా నిజమైన ప్రేమతో తప్ప మరే కారణంతోనైనా ఒక స్త్రీ మగవాని చెంత చేరవలసిన అవసరం లేనప్పుడు, ఆర్థికపరమైన భయం చేత ప్రేమికులు కలవలేని పరిస్థితులు తొలగినపుడు, దానికి సమాధానం దొరుకుతుంది. ఆ మాదిరి జనం పుట్టాక, వారి ప్రవర్తన గురించి ఈనాడు మనం చెప్పే సలహాలకు వారు చిల్లిగవ్వ విలువ కూడా ఇవ్వరు. తమ పద్ధతులను తామే నిర్ణయించుకుంటారు. వ్యక్తుల ఆచరణకు అనుకూలంగా జనాభిప్రాయాన్ని సృష్టించుకుంటారు?
ఇది ఎప్పుడు జరుగుతుంది? బహుశా తన జీవితకాలంలోనే జరుగుతుందేమో… వ్యక్తుల ఆచరణకు అనుకూలంగా జనాభిప్రాయం సృష్టించుకోవటం మానేసి పాతబడిన జనాభిప్రాయాల ప్రకారం వ్యక్తులను నడవమనే ధోరణే ఇంకా కమ్యూనిస్టు
పార్టీలోనూ నడుస్తోంది. ఇది మారేదెప్పుడు, మార్చాలి. ఎన్నికల కంటే అది ముఖ్యం.
ఎన్నికలు ముగిసేనాటికి శారదకు ఫలితం ఏంటో అర్థమైంది. తను ఓడిపోతుంది. కాంగ్రెస్ ఎన్నికల నిబంధనలన్నీ ఉల్లంఘించేసింది. తన ఓటు వేసి బెజవాడ వచ్చి ఆ ఎన్నికల గురించి మర్చిపోదామనీ, కూతురితో ఆడుకుంటూ ఒక రోజన్నా గడుపుదామనీ అనుకుంది. నటాషాకు నాలుగేళ్ళు నిండలేదింకా. మంది చేతుల మీద పెరుగుతోంది. అయినా అమ్మను చూస్తే అతుక్కుపోతుంది. చిన్నతనం నుంచీ శారద నవ్వు అందరినీ సమ్మోహితుల్ని చేసేది. చిన్న నటాషాకి కూడా అమ్మ నవ్వంటే ఎంతో ఇష్టం. హాయిగా, మనసారా, నిష్కల్మషంగా నవ్వే తల్లిని కళ్ళార్పకుండా, ఆ బొమ్మను కళ్ళనిండా, మెదడులో గట్టిగా ముద్రించుకున్నట్టు చూసేది. నటాషాను గుండెలకు హత్తుకుని ‘‘తొలి నే చేసిన పూజా ఫలమా’’ అంటూ త్యాగరాజ కీర్తనను అందుకునేది శారద. తల్లి పాట వింటూ నటాషా నిద్రపోతుంటే శారద ఆ పాపను, తన ప్రేమ ఫలాన్ని తనివితీరా చూసుకునేది. అట్లాంటి రోజులు ఆ తల్లీ కూతుళ్ళకు అరుదే గానీ వాటిని శారద ఎంత అపురూపంగా చూసుకునేదో, ఎంత పరవశంతో అనుభూతి చెందేదో, ఎలా పులకించి పోయేదో శారదకే తెలుసు. నటాషాకి కూడా తెలియదు.
రాత్రి నటాషా పెందలాడే నిద్రపోయింది. మూర్తి ఇంకా ఎన్నికల గొడవల్లోంచి బైటపడలేదు. బహుశా ఫలితాలొచ్చే వరకూ ఏదో ఒక పని ఉంటుంది. శారద చాలా రోజుల తర్వాత సుబ్బమ్మతో కలిసి భోజనం చేసింది. సుబ్బమ్మ చాలా తక్కువ తింటోందనో, చిక్కిపోయిందనో అనిపించింది.
‘‘అమ్మా… నీ గురించి పట్టించుకోవటం లేదు. ఇంత చిక్కిపోయావేమిటి? ఈ ఎన్నికల ప్రచారంలో పద్మ కూడా ఇంట్లో లేదు, సూర్యమూ లేడు. ఒక్కదానివే అయ్యావు. అంత తక్కువ తింటున్నావేంటి? కొంచెం వడ్డిస్తానుండు’’ అంటూ హడావుడి చేసింది.
‘‘నువ్వు నన్ను పట్టించుకునేదేమిటి? ఆ పని నాది, నువ్వేమో నా చేతికి చిక్కకుండా తిరుగుతున్నావు. నాకు వయసు మీద పడటం లేదా? తిండీ, నిద్రా తగ్గుతాయి. ఒళ్ళు తగ్గితే మంచిదే’’ సుబ్బమ్మ నవ్వుతూ తీసిపారేసింది శారద మాటల్ని.
‘‘మాట్లాడకుండా రేపు నాతో ఆస్పత్రికి రా, అన్ని పరీక్షలూ చేస్తాను’’ గట్టిగా అంది శారద.
‘‘అలాగే, రానంటే ఊరుకుంటావా? కాళ్ళూ చేతులూ కట్టి పడేసైనా లాక్కుపోతావు. అలాగే చెయ్యి నీ పరీక్షలు’’.
భోజనాలు ముగించి ముంగిట్లో కాసేపు చల్లగాలికి కూచుందామని వచ్చేసరికి గేటు తీసుకుని ఎవరో వస్తున్నారు.
చీకట్లోంచి నడిచొచ్చిన అన్నపూర్ణను చూసి ఆనందంతో కేకేసింది శారద.
‘‘ఇదేంటి… ఇంత పొద్దుపోయి. అందరూ బాగున్నారు గదా’’
‘‘అందరం బాగున్నాం. మా బంధువుల పెళ్ళికని పొద్దునే వచ్చా. ఇవాళ రాత్రి నీతో కాసేపు మాట్లాడి రేపు పొద్దున వెళ్దామని…’’
ఇద్దరూ ఒకరినొకరు పరిశీలనగా, సంతోషంగా చూసుకున్నారు.
‘‘ఎలా జరిగాయి ఎన్నికలు?’’
‘‘ఓడిపోతాననిపిస్తోంది. మీ కాంగ్రెస్ వాళ్ళూ…’’
‘‘మా కాంగ్రెస్ అనకు. వాళ్ళు ఏలూర్లో చేసిన పిచ్చి పనులన్నీ నాకు తెలుసు’’.
‘‘నువ్వూ వచ్చి కాంగ్రెస్‌కు ఓటేయమని ప్రచారం చేస్తావనుకున్నాను’’.
‘‘మా పార్టీ వాళ్ళు చాలా ఒత్తిడి చేశారు ఏలూరు వెళ్ళమని. వెళ్ళి శారదకు ఓటెయ్యమని ప్రచారం చేస్తానన్నాను. దాంతో వెనక్కు తగ్గారు’’.
‘‘నిజంగా అలా అన్నావా?’’
‘‘మరి… అసలు నీకు ఎదురుగా ఎవర్నీ నిలబెట్టొద్దన్నా. వజ్రంలాంటి మనిషిని ఏకగ్రీవంగా గెలిపించాలని అంటే అక్కడ వినేవాళ్ళెవరు. నీ విలువ తెలిసినవాళ్ళెవరు?’’
‘‘నా స్నేహితురాలివని తెలుసుగా. నీ మాటలేం పట్టించుకుంటారు గానీ, పోనీ… మీ పార్టీ సంగతి తెలిసొచ్చింది గదా. మా పార్టీలో చేరిపోరాదూ?’’
‘‘కాంగ్రెస్ అంటే ఈ మురికి మనుషులే అనుకుంటున్నావా? గాంధీ, నెహ్రు, సరోజినీ, దుర్గాబాయి… ఎలాంటి వాళ్ళు నడిపిస్తున్నారు. ఆ కాంగ్రెస్‌ని వదలటమే. ఒడ్డున నీళ్ళు మురిగ్గా ఉన్నాయని నదీ ప్రవాహాన్నే కాదంటామా? నేనూ ఆ మహా ప్రవాహంలో ఓ నీటిబొట్టుననుకుంటే కలిగే తృప్తి వేరు. పార్టీల గొడవ ఒదిలెయ్. బాగా నలిగిపోయినట్లున్నావు.. నట్టూ నిద్రపోయిందా? దానిని కాస్త పట్టించుకో. మా పిల్లల్ని నేను చిన్నతనంలో పట్టించుకోలేదని ఇప్పుడు సతాయిస్తారు’’.
‘‘ఎలా కుదురుతుంది చెప్పు అన్నపూర్ణా. ఆస్పత్రి, మహిళా సంఘం, పార్టీ పనులు, మనలాంటి వాళ్ళు పిల్లల్ని కనకూడదేమో. రాజకీయాల్లోకి వచ్చి పని చేయటమంటే ఆడవాళ్ళకెంత కష్టం. మనలా అన్నిటికీ తెగించి రావటం కాదు. ప్రతివాళ్ళు తేలికగా రాజకీయాల్లోకి వచ్చే వీలుండాలి. మా ప్రభుత్వం వస్తే మేం అలాగే చేస్తాం’’.
‘‘ఏం చేస్తారు?’’
‘‘అబ్బో… చాలా చేస్తాం. తల్లుల కోసం, పిల్లల కోసం నా బుర్రలో ఎన్ని పథకాలు ఉన్నాయో నీకు తెలియదు. నీకే కాదు… మా వాళ్ళకూ తెలియదు. నేనన్నీ రాసి పెడుతున్నా. ఆడవాళ్ళు ఆనందంగా తల్లులు కావాలి. రాజకీయాలు నడపాలి. ప్రతి గ్రామంలో ఆడవాళ్ళు రాజకీయాధికారం పొందుతారు. అప్పుడు అక్కడ తల్లులందరూ కలిసి తమ పిల్లల పెంపకం గురించి, ఆరోగ్యం గురించి, చదువు సంధ్యల గురించి కలిసి మాట్లాడుకుని అందరికీ బాగుండే సామాజిక నిర్ణయాలు తీసుకుంటారు. సోవియట్లలో అలాగే జరుగుతోంది.’’
‘‘ఔనట, నేనూ విన్నాను. ఈ మధ్య అబ్బయ్య సోవియట్ పుస్తకలు తెచ్చి చదువుతున్నాడు. ఆయన చదివాక నేనూ, అమ్మాయి కూడా చదువుతాం’’.
‘‘అమ్మాయేమిటి, స్వరాజ్యమని పేరు పెట్టి. మీ అబ్బాయి పేరు మాత్రం గుర్తుండదోయ్ నాకు. అసలు వాడిని చూసిందే తక్కువ. అన్నపూర్ణా, ఈసారి నువ్వొక్కదానివీ వస్తే ఊరుకోను. పిల్లల్ని తీసుకుని, అబ్బయ్యని కూడా తీసుకుని రావాలోయ్. నటాషాకు మీ పిల్లల స్నేహం కావాలిగా. అసలు అబ్బయ్యకి బెజవాడ కాలేజీలో ఉద్యోగమైతే ఎంత బాగుండేది…’’
‘‘మేమొచ్చి మీ ఇంట్లో కాపురం పెట్టేవాళ్ళం’’.
‘‘తప్పేముంది. ఆ పని చెయ్యకుండా వేరే ఉంటే నేనొప్పుకుంటానా?’’
ఆ రాత్రి స్నేహితుల కబుర్లతో తెల్లవారింది.
ఎన్నికలలో ఓడిపోవడం శారదనంతగా బాధించలేదు గానీ ఎన్నికల గురించి సమీక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశం శారదను కుదిపి వేసింది. మహిళా సంఘం సభ్యులు కుంగిపోయారు, కొందరు ఏడ్చారు. వాళ్ళందరినీ శారద ఓదార్చగలిగింది. ఎన్నికలలో పోటీ చేయటం కేవలం గెలవటం కోసం కాదనీ, మన సిద్ధాంతాలు ప్రజల్లో ప్రచారం చేసుకునే అవకాశంగా చూడాలని, ప్రతిపక్షాల తప్పులను ఎత్తిచూపగలగటం కూడా చిన్న విషయం కాదనీ చెబితే చాలామంది సమాధానపడ్డారు.
‘‘అంతమంది ప్రజలను మనం ఎలా కలుస్తాం? మన సానుభూతి పరులతో మనం మాట్లాడటం వేరు. మనల్ని వ్యతిరేకించే వారిని కూడా ఆలోచింప చేయగలగటం ఎన్నికలలోనే సాధ్యం. నేను గెలిచినా, గెలవకపోయినా పార్టీకి, ప్రజలకు దగ్గరగానే ఉంటాను. అందులో తేడా రానపుడు మనకెందుకు బాధ’’ అంటూ మళ్ళీ సభ్యులలో ఉత్సాహం నింపింది.
కానీ పార్టీ ముఖ్యులు చేసిన సమీక్షలో శారద ఓడిపోయినందుకు కారణం మహిళా సంఘం సభ్యులు, శారద చూపిన అత్యుత్సాహం, తెగువ, తెంపరితనం అని చెబుతుంటే నిర్ఘాంత పోయింది.
‘‘నువ్వు కాంగ్రెస్ సభలో వాళ్ళ వేదిక మీదికి ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది?’’
‘‘వాళ్ళు అసలు విషయాలు కాకుండా అవాకులు చెవాకులు పేలుతుంటే విని ఆనందించాలా?’’
‘‘వాళ్ళ మీటింగుల్లో వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. మనం వెళ్ళి జోక్యం చేసుకోవటం వల్ల శారద తెగించిన మనిషని, అహంభావి అని ఇంకా ఇక్కడ నేను చెప్పలేని నానా మాటలూ మాట్లాడుకున్నారు. ఆ అవకాశం వాళ్ళకెందుకివ్వాలి?’’
‘‘కానీ ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం మానేశారు’’.
‘‘నీ పెళ్ళి గురించి మానేశారేమో. కానీ టోటల్‌గా నీ క్యారెక్టర్ గురించి చాలా చెడ్డ ప్రచారం చేశారు. పైగా మహిళా సంఘం వాళ్ళు రౌడీలను కర్రలతో కొట్టారు. ఆ రాత్రిపూట ఇళ్ళమీద రాళ్ళేస్తే బైటికి రాకుండా ఉంటే సరిపోయేది. వచ్చి వాళ్ళను కొట్టడంతో కమ్యూనిస్టు ఆడాళ్ళకీ, రౌడీలకూ తేడా లేకుండా పోయింది.’’
‘‘ఆత్మ రక్షణకు, రౌడీయిజానికీ తేడా తెలియకపోతే తెలియజెప్పాల్సిన బాధ్యత మనమీద ఉంటుంది గానీ, ఆత్మ రక్షణ చేసుకోకపోతే ఎలా?’’
‘‘కమ్యూనిస్టులు ఆడవాళ్ళని మగరాయుళ్ళుగా మారుస్తున్నారనే పేరు వచ్చింది. అది మంచిది గాదు’’.
‘‘మగరాయుళ్ళేమిటి? వాళ్ళ గొప్పేమిటి? ఆడవాళ్ళు తమ మీదికి ఎవరైనా వస్తే ఆత్మరక్షణ చేసుకోగలరని నమ్మి, వాళ్ళకలాంటి శిక్షణనిచ్చాం మనం. అది తప్పెలా అవుతుంది?’’
‘‘ఎన్నికల సమయంలో తప్పే అవుతుంది. మామూలు ప్రజలు ఆడవాళ్ళు వినయంగా, ఓర్పుగా ఉండాలనుకుంటారు. ఆ నమూనాను మనం ఇవ్వలేదు కమ్యూనిస్టు ఆడవాళ్ళు…’’
‘‘ఫాసిస్టు వ్యతిరేక దళాలుగా స్త్రీలు కూడా బెజవాడ వీథుల్లో కవాతు చేశారు. పార్టీ మెచ్చుకుంది. రేపు అవసరమైతే తుపాకులు కూడా పట్టుకుంటారు.’’
‘‘ప్రత్యేక సమయాలు వేరు. ఎన్నికలు వేరు’’.
‘‘మనం ఏమిటో, ఎలా ఉంటామో ప్రజలకు ఎప్పుడైనా ఒకటే మెసేజ్ వెళ్ళాలి. ఎన్నికలప్పుడొకటి, ఇంట్లో ఒకటి, బైట ఒకటి… ఇదేంటి?’’
‘‘ఇంట్లో భర్త కొడితే కమ్యూనిస్టు భార్య తిరిగి కొడుతుందా?’’
‘‘వై నాట్. ఎందుకు కొట్టకూడదు… కాదు… ఆ ప్రశ్నే తప్పు. భర్త భార్యను కొట్టటమేంటి? అందులోనూ కమ్యూనిస్టు భర్త. ఒకవేళ ఆ భర్త కొడితే తిరిగి కొట్టాలి. అప్పుడే అతను భార్యను కొట్టటానికి భయపడతాడు. మీరేమంటారు? భర్త కొడుతుంటే పడాలా?’’
‘‘మరి ఇద్దరూ కొట్టుకుంటే ఆ సంసారం ఎలా సాగుతుంది?’’
‘‘ఆ సంసారం సాగకపోతే ఏం? లోకానికి ఏం జరుగుతుంది, ఆ సంసారం సాగితే…’’
‘‘శారదా… నువ్వు మాట్లాడే మాటలు మహిళా సంఘంలో మటుకు మాట్లాడకు. వాళ్ళు భయపడతారు. భర్తలు ఒక మాటంటారు, ఒక దెబ్బ వేస్తారు. కాస్త సర్దుకు పోవాలి.’’
శారదకు ఈ చర్చ అనవసరమనిపించింది. కమ్యూనిస్టులను బోలెడు మార్చాలి. ఆమెకు జర్మన్ ఐడియాలజీలో మార్క్స్ రాసిన వాక్యాలు గుర్తొచ్చాయి. మగవాడు ఆడదానితో ఎలా వ్యవహరిస్తాడో అనేదాన్ని బట్టి అతను మనిషిగా ఏ స్థాయిలో ఉన్నాడో తెలుస్తుందని చాలా లోతైన తాత్విక విషయంగా చెప్పాడు.
శారద అది చాలా వివరంగా చెప్పింది. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. ఇరవై నిమిషాలు శారద ఉత్సాహంగా మాట్లాడి ఆపేసిన తర్వాత ‘‘ఆ… ఎజెండాలో తర్వాతి విషయం ఏంటి? చూడండి’’ అన్నాడు ఆనందరావు.
అందరూ ఆ సంగతి మాట్లాడుతున్నారు. శారద ముఖం అవమానంతో ఎర్రబడిరది.
తర్వాతి సమావేశంలో శారద నోరు తెరవలేదు. తాను ఇట్లా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని స్థానిక సమస్యలకు అన్వయించి, మార్క్స్, ఏంగెల్స్ రచనలు ఉదహరిస్తూ మాట్లాడినప్పుడల్లా ఇలాంటి మౌనమే ఎదురయిందనే విషయం ఆ రోజు అర్థమైంది.
తనను క్రమంగా ఆరోగ్య విషయాలకే పరిమితం చేస్తున్నారనీ, మహిళా సంఘానికే పరిమితమవుతున్నాననీ కూడా అనిపించింది.
మహిళా సంఘానికే పరిమితం అవ్వటంలో చిన్నతనమేమీ లేదు. కానీ అక్కడ కూడా ఆడవాళ్ళకు ఓర్పు, వినయం నేర్పలేకపోవటాన్ని తను చేసే పొరపాట్లుగా ఊహిస్తున్నారు.
తనను ఒక మేధావిగా, కమ్యూనిస్టు పార్టీ నిర్మాతలలో ఒకదానిగా గుర్తించటానికి నిరాకరిస్తున్నారు.
ఛా… తను మరీ ఎక్కువ ఆలోచిస్తోంది’’ అనుకుని అప్పటికి ఆ ఆలోచనలు పక్కకునెట్టి సమావేశంలో ఇతర అంశా మీద మాట్లాడుతున్న వారి మాటలు శ్రద్ధగా వినసాగింది.
… … …
దేశానికి స్వతంత్రం రాబోతోందనే వాతావరణం పూర్తిగా వస్తుండగా కమ్యూనిస్టుల మీద నిర్బంధం ఎక్కువైంది. బ్రిటిష్ వాళ్ళ ప్రయోజనాలు తీరిపోగానే వాళ్ళకు కమ్యూనిస్టులే అసలు శత్రువులని, వారు తమ వారసులుగా ఎవరికి అధికారం అప్పగించి పోవాలనుకున్నారో వాళ్ళకు కూడా కమ్యూనిస్టులే శత్రువులనీ అర్థమైంది. నిర్బంధం పెరగడంతో మళ్ళీ పార్టీ యంత్రాంగమంతా చెల్లాచెదురైంది. రహస్యంగా పత్రికలు నడపటం, నాయకుల అజ్ఞాతవాసం, ప్రజా సంఘాల పని పెరగటం ఎన్నో ప్రతికూలతల మధ్య పని చేయాల్సి వచ్చింది. తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టులు పేద ప్రజలకు అండగా నిలిచారు. సంగాలుగా ప్రజల్లో కలిశారు. సంగపోళ్ళంటే పేద రైతు కూలీలు, చిన్న కులాల
వాళ్ళు ప్రాణాలిచ్చే స్థితికి వచ్చారు. శారదాంబ తెలంగాణ నాయకులకు ఆశ్రయం కల్పించటం వంటి పనులు అదనంగా మీద వేసుకుంది. రజాకార్ల ఆగడాలకు తట్టుకోలేని వాళ్ళు తాత్కాలికంగా బెజవాడ వైపు వచ్చి కొన్ని రోజులు శక్తి పుంజుకున్నారు. వారికి వైద్యం అవసరమైతే శారద ఉండనే ఉంది.
దేశానికి స్వతంత్రం`అర్థ శతాబ్దం దాటిపోయిన స్వతంత్ర సంగ్రామంలో విజయం. భారతదేశం ఒకవైపు విజయోత్సవాలలో మరోవైపు దేశ విభజన సృష్టించిన విలయాలలో మునిగింది. ఉత్తర భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య పగ ప్రతీకారాలు పెరిగిపోయి చరిత్రలోనే అత్యంత విధ్వంసకాండ ఆరంభమైంది. దక్షిణ భారతదేశంలో అది లేదు గానీ హైదరాబాద్ నిజాం గురించిన ఆలోచన, చర్చ మొదలైంది. స్వతంత్ర భారతదేశంలో చేరకుండా తన స్వయం ప్రతిపత్తి నిలబెట్టుకుంటానన్న నిజాం నవాబుపై కాంగ్రెస్, కమ్యూనిస్టు ఆర్య సమాజం వంటి అన్ని పార్టీలలో, సాంఘిక గ్రూపులలో వ్యతిరేకత ఎక్కువయింది. కాంగ్రెస్ కంటే కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగసాగింది. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టులు జమిందారీ వ్యతిరేక పోరాటాలు ముమ్మరం చేయాలనుకున్నారు. దానితో జమిందార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు. కాంగ్రెస్‌లో అంతకు ముందున్న పెద్ద భూస్వాముల సంఖ్య, వారి ప్రాబల్యం కూడా తక్కువ కాదు. దాంతో గ్రామాల్లో వర్గ పోరాటం మొదలైందా అన్నంతగా తీవ్ర వైరుధ్యాలు కనిపిస్తున్నాయి.
మారిన ఈ పరిస్థితులలో శారదకు ఒక్క క్షణం కూడా తీరిక దొరకడం లేదు. కూతురికి ఒక్క గంట సమయం కూడా ఇవ్వలేకపోతోంది. అమ్మమ్మ, అత్తల పెంపకంలో నటాషాకు వచ్చిన లోటేమీ లేదు గానీ తల్లి కోసం పసి మనసు లోపల ఎక్కడో ఒక ఆరాటం, ఆ ఆరాటం సంతృప్తి చెందకపోవడంతో చిన్న కోపం కూడా చోటు చేసుకుంటున్నాయి. మూర్తి దాదాపు ఇంటి పట్టున ఉండడం లేదు. శారద ఆస్పత్రిని వదలలేదు కాబట్టి ప్రయాణాలు తగ్గి స్థానిక బాధ్యతలు పెరిగాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రామాలలో చిన్న రైతులకు, భూస్వాములకు, చల్లపల్లి జమీందారు వంటి జమీందార్లకు మధ్య పోరు పెరగడంతో కమ్యూనిస్టులు తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోయారు.
అన్నపూర్ణ, అబ్బయ్యలు శారదతో మాట్లాడుదామని చాలా రోజుల నుంచీ ప్రయత్నిస్తున్నా శారద వారికి దొరకటం లేదు. కబుర్లు చేసీ, ఉత్తరాలు రాసీ, టెలిఫోన్లు చేసీ విసిగిపోయిన అన్నపూర్ణ చిన్న పెట్టెలో వారానికి సరిపడా బట్టలు సర్దుకుని బెజవాడ వచ్చేసింది. సుబ్బమ్మ ఆనందం చెప్పనలవికాదు.
‘‘వారం రోజులు ఉంటావుటే. మా తల్లే, మా శారద నాకే నల్లపూసయిపోయింది. అంతా గందరగోళంగా ఉంది. పసిపిల్ల తల్లి కోసం మారాం చేస్తోంది. కానీ ఈ పిల్ల కోసం నా బంగారు తల్లి ఆగితే ఎట్లా చెప్పు. ఆస్పత్రి సంగతి సరేసరి… పార్టీవాళ్ళు ఎంతెంత పనులు, ఎంతెంత త్యాగాలు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించేశారనుకో. శారద కూడా అంతేగా… ఏ క్షణంలో జైలుకెళ్ళాల్సి వస్తుందోనని నాకు కంగారుగా ఉంది…’’
సుబ్బమ్మ మొదలుపెడితే ఇంకా ఆ కబుర్లకు అంతుండదు. అన్నపూర్ణ ఆమెను ఆపి ‘‘దేశానికి స్వతంత్రం వచ్చింది గదమ్మా ` ఇంకా జైలుకెందుకెళ్ళాలి?’’ అంది.
‘‘అయ్యో పిచ్చిదానా… స్వతంత్రం అందరికీ ఎక్కడొచ్చింది? ఆ జమీందార్లంతా కాంగ్రెస్‌లో చేరితే వాళ్ళకొచ్చింది స్వతంత్రం. రైతులు, పేదవాళ్ళు, మాల మాదిగలు వీళ్ళందరికీ స్వతంత్రం రావొద్దూ? పార్టీ వాళ్ళ కోసం పోరాడకుండా వాళ్ళకెలా స్వతంత్రం వస్తుంది?’’
అన్నపూర్ణ సుబ్బమ్మ గారికున్న స్పష్టతకు ఆశ్చర్యపోయింది.
‘‘ఐతే అమ్మాయ్`నువ్వింకా ఆ కాంగ్రెస్‌లోనే ఉన్నావా? పాపం ఈ పేద రైతుల పొట్టకొడుతున్నారుగా మీరు…’’
అన్నపూర్ణ నోట మాట రాలేదు. తానెందుకిక్కడికి వచ్చిందో ఆ పని జరగదని అనిపించింది.
‘‘నేను పేద రైతుల పొట్ట కొట్టేదాన్లా కనిపిస్తున్నానా అమ్మా’’ అంది పేలవంగా నవ్వుతూ.
‘‘నువ్వంటే నువ్వు కాదులే… మీ పార్టీ.’’
‘‘మా పార్టీలో నువ్వన్నట్లు జమిందార్లు, వాళ్ళూ వీళ్ళూ పనికిమాలిన వాళ్ళంతా ఉన్నారమ్మా. కానీ ప్రభుత్వం స్వతంత్రంగా ఏర్పడిరది. ఈ గడ్డీ గాదం ఏరెయ్యటానికి సమయం కావొద్దూ? గాంధీ గారూ, నెహ్రు గారూ ఊరుకుంటారా చెప్పు జమీందార్లు రైతుల్ని చంపేస్తుంటే. రెండొందలేళ్ళు పరాయి వాళ్ళు భ్రష్టు పట్టించిన దేశాన్ని బాగుచేసుకోవటానికి కనీసం రెండు మూడేళ్ళ సమయం కావాలా ఒద్దా… ఆ సమయంలో మనం మనం కొట్టుకుంటే ఎలా? జమీందార్లను నేనూ వ్యతిరేకిస్తాను. నాలాంటి వాళ్ళింకా ఉన్నారు. మాతో కలిసి ఒక పద్ధతిగా అన్నిటినీ మన చేతిలోకి తెచ్చుకోవాలి గానీ ఇప్పటికిప్పుడు జమీందార్లను వెళ్ళగొట్టాలంటే కుదిరే పనేనా? చట్టాలు చెయ్యాలి. దానికోసం సంప్రదింపులు చెయ్యాలి గానీ తుపాకీలతో మనలో మనం పోట్లాడుకుంటే నష్టం ఎవరికమ్మా?’’
సుబ్బమ్మ ఏం సమాధానం చెప్పాలోనని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.
‘‘లేదులేమ్మా… శారదకూ, పార్టీ వాళ్ళకూ ఈ సంగతి తెలియదంటావా? నువ్వు చెప్పినట్టు జరగదు. ప్రజలు పోరాడాల్సిందే…’’
సుబ్బమ్మ గారే ఇలా ఉంటే ఇక శారద, మూర్తీ తన మాటలు వింటారా? ఒప్పుకోవటం సంగతలా ఉంచి ఇంత సింపుల్‌గా తన నోరు మూయించి పంపించేస్తారేమో. అయినా సరే శారదతో మాట్లాడాల్సిందే. వచ్చిందేమో వచ్చింది. పిల్లల్ని అబ్బయ్యకు వదిలి వచ్చింది. నటాషాతోనన్నా స్నేహం చేసుకు వెళ్తుంది అనుకుని స్థిమిత పడిరది.
రెండు రోజుల పాటు పద్మకు వంటలో సాయం చేస్తూ సూర్యంతో, నటాషాతో వాదిస్తూ, లావణ్యతో ఆటల పాటలతో కాలక్షేపం చేశాక గానీ శారద దర్శనం కాలేదు.
అన్నపూర్ణ కనిపించేసరికి అలసటంతా ఎటుపోయిందో శారద హాయిగా నవ్వుతూ ఆమెను కావలించుకుంది.
అన్నపూర్ణ చంకలో ఉన్న నటాషాకూ తల్లి స్పర్శ దొరికింది ఆరు రోజుల తర్వాత.
‘‘నట్టూ… అత్తతో బాగా ఆడుకున్నావా?’’
‘‘అమ్మా, అత్త చాలా పాటలు నేర్పింది’’ అంది నటాషా ముద్దుగా.
‘‘ఏదీ ఒకటి పాడూ’’ కూతుర్ని ముద్దు పెట్టుకుని ఒళ్ళో కూచోబెట్టుకుంది శారద.
‘‘నేనొచ్చి రెండు రోజులయింది. వారం రోజులుందామనే వచ్చాను గానీ ఈ వారమూ నువ్వు ఇంటికి రావేమోనని భయం వేసింది. నా అదృష్టం బాగుంది’’.
‘‘చాల్లే, ఊరుకోవోయ్. పనులలా ఉన్నాయి. నేను స్నానం చేసి వస్తాను. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం’’ శారద లోపలికి వెళ్ళింది.
‘‘స్నానం చేశాక అమ్మ వెళ్ళిపోతుంది. నువ్వూ వెళ్తావా?’’
నటాషా అడిగిన తీరుకి అన్నపూర్ణ హృదయం ద్రవించి ఆ పసిదాన్ని గుండెలకు హత్తుకుంది.
‘‘నువ్వు పెరిగి పెద్దయ్యి మీ అమ్మకంటే గొప్ప పనులు చేస్తున్నప్పుడు అర్థమవుతుంది నీకు మీ అమ్మ’’ చిన్నపిల్లకు ఆ మాటలు అర్థం కావని తెలిసీ అనకుండా ఉండలేకపోయింది. అన్నపూర్ణ, శారద మునిగినన్ని పనుల్లో మునగకపోయినా పిల్లలకు తనమీద నిరసన ఉందనే సంగతి తెలుసు.
ఇప్పుడంటే పెద్దవాళ్ళయ్యారు గానీ చిన్నతనంలో వాళ్ళకూ తల్లి తమను పట్టించుకోకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందనే బాధ, కోపం ఉండేవి. అప్పుడు పెరిగిన దూరం పదిహేడేళ్ళ వయసులో కూడా అన్నపూర్ణ కూతురు స్వరాజ్యానికి తగ్గలేదు. పధ్నాలుగేళ్ళ కొడుకు మాత్రం వీలైనంత ఎక్కువగా అమ్మను అతుక్కుపోవాలని చూస్తాడు. రాత్రి భోజనాలయ్యాక స్నేహితులిద్దరూ కబుర్లతో మొదలుపెట్టి రాజకీయాలలోకి దిగారు. అన్నపూర్ణ వచ్చిన పనే అది.
‘‘ఏంటి శారదా, మీ పార్టీ వాళ్ళు దేశానికి స్వతంత్రమే రాలేదంటున్నారు’’ అని తేలిక ప్రశ్నలతోనే మొదలెట్టింది.
‘‘మరి ఏం మారిందోయ్. అధికారం చేతులు మారింది. అంతే గదా… జమీందారీలు పోయాయా? భూస్వాముల దోపిడీ పోయిందా? పెట్టుబడిదారులు దోచుకోవటం ఆగిందా?’’
‘‘స్వతంత్రం రాగానే అవన్నీ జరిగిపోతాయా? సమయం కావొద్దా. ఎన్ని శాసనాలు చేసుకోవాలి. ఎన్ని చట్టాలు రావాలి. అవతల రాజ్యాంగం ఒకటి తయారవుతోంది. అది అందరికీ న్యాయం చెయ్యటానికి వీల్లేకుండా అడ్డుపడే వాళ్ళున్నారు. అంతెందుకు హిందూ కోడ్ బిల్లు తయారవటానికి ఎన్ని చర్చలు… ఇవన్నీ ఒక్క రోజులో తయారవుతాయా? ఒకరిద్దరి వల్ల అవుతాయా?
మనం వాటికోసం పనిచెయ్యాలి. మన అభిప్రాయాలు గట్టిగా వినిపించాలి. అంతేకాదు శారదా… ప్రజల్ని తయారు చెయ్యాలి కదా. ప్రజలు సిద్దంగా ఉన్నారా మనం కలగంటున్న సమాజానికి? భార్యాభర్తలిద్దరూ సమానులని చదువుకున్న మగవాళ్ళే ఒప్పుకోరు. మా ఆయనకెన్ని పరిమితులున్నాయో నాకు తెలుసు. మూర్తి సంగతి నీకు తెలుసు. స్త్రీల విషయంలో వీళ్ళే సరిగ్గా లేరే, సమాజం సంగతి చెప్పేదేముంది. చట్టాలు చేసి వాటిని జనం అర్థం చేసుకుని అంగీకరింపచేసే పని మన మీదుంది. అదంతా మానేసి జమీందార్లతో, తొత్తులతో, కిరాయి రౌడీల చేతుల్లో అమూల్యమైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మీ కార్యకర్తలు. జమీందార్ల పని అయిపోయింది.’’
‘‘ఎక్కడయిపోయిందోయ్! వేషాలు మార్చుకుని అంతా మీ కాంగ్రెస్‌లో దూకుతున్నారు కదా…’’
‘‘మీరూ దూకండి… లేదా కాంగ్రెస్ గురించి ప్రజలకు తెలియజెప్పండి’’.
‘‘మీ కాంగ్రెస్ గురించి మీరు చెప్పుకోండోయ్, నమ్ముతారు.’’
‘‘నిజం. కాంగ్రెస్ ఎప్పుడూ బాగోలేదు. ఇప్పుడూ బాగాలేదు. మా పార్టీ మీద నాకున్నంత కోపం నీక్కూడా ఉండదు. అంత పాడయింది. కానీ మనం పార్టీలకతీతంగా జనాన్ని చైతన్యవంతం చెయ్యాలి. జనం మారాల్సింది లేదా… బానిస బుద్ధులు వదిలించేలా మనం చెయ్యాలా వద్దా…’’
‘‘మేం అదే చేస్తున్నామోయ్. అది భరించలేకే మమ్మల్ని వెంటాడుతున్నారు. రేపో మాపో నిషేధిస్తారని వార్తలొస్తున్నాయి. నువ్వు మళ్ళీ సంస్కరణోద్యమం ప్రారంభించమంటావా? మా ధ్యేయం విప్లవం. విప్లవమే సమూలంగా మార్చగలుగుతుంది.’’
‘‘విప్లవం గురించి నేను నీకు చెప్పేంతదాన్ని కాను. కానీ విప్లవానికి దారులు వేయాల్సిన సమయంలో సాయుధ పోరాటం అని సమాజంలో మార్పు తెచ్చేవాళ్ళనీ, సమాజానికి ఎంతో మంచి చేసేవాళ్ళనీ పోగొట్టుకుంటున్నారు మీరు. ఎలాంటి మనుషులు చనిపోతున్నారో నాకంటే నీకే ఎక్కువ తెలుసు. ఆలోచించు శారదా. కనీసం పార్టీలో చర్చన్నా పెట్టు…’’ ఆవేదనగా అంది అన్నపూర్ణ.
చనిపోతున్న కార్యకర్తలను, సహచరులను తల్చుకుంటే శారదకూ దుఃఖం వచ్చింది.
‘‘ఇదంతా తప్పదు. నువ్వింతగా చెబుతున్నావుగా, ఆలోచిస్తా. పార్టీలో కూడా మా అన్నపూర్ణ ఇలా అడిగిందని చర్చ లేవదీస్తా, సరేనా. ఇక పడుకో, పొద్దుపోయింది. నేను ఉదయాన్నే ఆస్పత్రి పని చూసుకుని నా పనిలో పడాలి. తొందరలో మహిళా సంఘం మహాసభలు జరపాలని ప్రయత్నిస్తున్నాం.’’
ఇద్దరూ నిద్రకు ప్రయత్నించారు గానీ నిద్ర రాలేదు. ఎవరి మంచాల మీద వాళ్ళు మసులుతూనే ఉన్నారు. అన్నపూర్ణ ఆ రోజు ఉండి మర్నాడు వెళ్తూ నటాషా బడికి వెళ్ళనని పేచీ పెడుతుంటే సుబ్బమ్మగారు, పద్మ బతిమాలలేక సతమతమవటం చూసింది.
సుబ్బమ్మ లాంటి తల్లి ఉండటం శారద అదృష్టం అనుకుంది. శారద ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు అంతు లేదు. ఒక రకంగా ఇది రెండో పార్టీ ఆఫీసు. సాంస్కృతిక కేంద్రం. ఒకవైపు పెద్ద హాలుంటుంది. శారద ప్రత్యేకంగా రిహార్సల్స్ కోసం అది కట్టించింది. అక్కడ నాటకాలు, రకరకాల కళారూపాల రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. ఒకటి, రెండు ముఖ్యమైన చిన్న సమావేశాలు జరుగుతుంటాయి. మద్రాసు నుంచో, మరో చోట నుంచో వచ్చిన ప్రముఖులకు అక్కడే బస. ఆ ఇంట్లో పొయ్యి వెలుగుతూనే ఉంటుంది.