వెనక్కి పోతున్నామా?! -వి.శాంతి ప్రబోధ

‘‘అమ్మా… పెళ్ళయిన ఆడోళ్ళంతా పసుపు కుంకుమలతో దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే మంగళ గౌరీ వ్రతం, శ్రావణ శుక్రవారం నోములు నోయాలట కదమ్మా…’’ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ అడిగింది యాదమ్మ.

ఆ అడగడంలో నువ్వు చేయడం లేదేంటి అన్న ప్రశ్న ధ్వనించింది. నాలుగేళ్ళ నుంచి యాదమ్మ నా దగ్గర పని చేస్తోంది. ఎప్పుడూ నోములు వ్రతాలు చేయగా చూడలేదు మరి!
‘చేస్తున్నావా నువ్వు’ యాదమ్మను ప్రశ్నించా… ‘లేదమ్మా… పనిపాటలు చేసుకు బతికేవాళ్ళం. అయ్యన్నీ మాకెక్కడ కుదుర్తయ్యి?’ ‘మరి మీ మొగుళ్ళు బాగుండి మీ పసుపు కుంకుమలు నిలుపుకోవాలని మీకు లేదన్నమాట. అంతేగా…’
‘అదేంటమ్మా, గంత మాటన్నవ్‌. మొగుడు మంచిగుంటేనే ఆ సంసారం సక్కగా నడిచేది. మా మొగుడు మంచిగుండాలని, రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులకు ఏడ సాగుతది? మీ అసోంటోళ్ళకు గానీ…’ అంటూ అవతలి గదిలోకి పోయింది యాదమ్మ.
శ్రావణమాసం వచ్చిందంటే ఆడవాళ్ళు సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు పూజలు, నోములు, వ్రతాలతో ఎంతో హడావిడి పడిపోవడం తనకు తెలియనిది కాదు. ప్రతివారం ఇరుగు పొరుగుతో, అయిన వాళ్ళతో, కానివాళ్ళతో పోటీపడి తాము అలంకరించుకోవడం, అమ్మవారికి అలంకరిం చడం తమ హంగు, ఆర్భాటం చూపించు కోవడం చూస్తూనే ఉన్నా.
ఒకప్పుడు ఈ నోములు, వ్రతాలు చేయని కుటుంబాల వారు, కులాల వారికి కూడా ఈ జాఢ్యం పాకింది. రకరకాల వంటలతో సోషల్‌ మీడియాలో హోరెత్తిస్తున్నారు. వారి భక్తి అమ్మవారి మీదనో లేక సోషల్‌ మీడియా పోస్టుల మీదనో…!
‘‘అమ్మా… నాకు తెలియకడుగుతా. పై ఇంటి అమ్మగారు ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు చేత్తుంటారు గద. అయినా ఆయమ్మ మొగుడు ఒకనాడైనా ఆయమ్మను మడిసిగా చూశాడా. అయినా ఆయమ్మ మొగుడి కోసం నోములు నోసుకుంటూనే ఉంటది ఎందుకమ్మా’’ టీవీ తుడుస్తూ అడిగింది యాదమ్మ.
దీర్ఘ సుమంగళి యోగం కోసం, కుటుంబానికి సకల సంపదలు చేకూరడం కోసం పూజలు చేయాలని చెప్పింది అమ్మ. అత్తింట్లో నిండుకుండలా అణకువగా
ఉండాలని, అత్తమామలను బాగా చూసు కోవాలని పెళ్ళయిన ఆడపిల్లతో నోములు నోయిస్తారని చెప్పింది నానమ్మ.
‘‘అమ్మా… ఆ మూలింటి మేడం ఎన్ని పూజలు, నోములు నోసుకుంటదో… అయినా ఏం లాభం? దినాం… ఒళ్ళు పులిసేట్టు, కదుములు కట్టేట్టు కొట్టే దెబ్బలు… ఆ మొగుడి కోసం ఇంకా ఆ నోములు, వ్రతాలు కావాల్నా. ఆ అమ్మ జీతం మీద బతుకుతూ తన చెప్పుచేతల్లో, భయం భక్తిలో ఉంటదని బొక్కల్ని పొడుం పొడుం చేసే మొగుడ్ని మోసేడెందుకు? అసొంటి మొగుడు లేకుంటే ఏంది? ఆడి కాళ్ళ కింద చెప్పు లెక్క ఎందుకుంటదో ఆయమ్మ… నేనైతేనా.. ఎప్పుడో తన్ని తరిమేద్దును’’ సోఫాలపై దుమ్ము దులుపుతూ అంది యాదమ్మ.
ఆమె దులిపింది దుమ్ము కాదు. ఆడవాళ్ళ మనసులో నిండిపోయిన బూజు దులపాలని చెప్పినట్లుగా ఉంది. ఆడవాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? ఏమీ చదువుకోని యాదమ్మకున్న ధైర్యం, వివేచన చదువుకున్న
ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళలో లేదేంటి? ఎందుకిలా బానిస బతుకు బతుకుతున్నారు?
బహుశా… నాన్నమ్మ చెప్పినట్టు నిండుకుండలా అణకువగా ఉండాలని నూరి పోయడం వల్లనా? ఆలోచించడం మానేసి, హేతువును మరచిపోయి ఎవరో చెప్పినట్లు నోములు, వ్రతాలు చేసే ఆడవాళ్ళు ఎంత సమయం, ఉత్పాదక శక్తి ఎంత కోల్పో తున్నారో… ఒకనాడు ఏమి ఆశించి పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాల చుట్టూ ఆడవాళ్ళను తిప్పారో కానీ ఇప్పటికీ అవే ఆచరించడంలో అర్థముందా? ఈ రోజుల్లో అన్నింటితో పాటు భక్తి కూడా మార్కెట్‌ వస్తువుగా మారిపోయింది.
మన దేశంలో ప్రతి వ్యక్తి మనసులోని భక్తిని, లేని నమ్మకాన్ని చొప్పించి పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయిÑ మూర్ఖులుగా తయారు చేస్తున్నాయి కొన్ని ప్రత్యేక ఛానళ్ళు, సీరియళ్ళు, సినిమాలు. మొన్నీ మధ్య సునీత ఇంటికి వెళ్ళినపుడు జరిగిన రాద్ధాంతం గుర్తొచ్చింది. సునీత కొడుకు పెళ్ళి పనులు ప్రారంభిస్తూ అక్కని, చెల్లిని పిలుచుకుంది.
భర్త చనిపోయిన చెల్లిని పిలిచినందుకు వాళ్ళాయన చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అసలే అర్థాంతరంగా వదిలిపోయిన భర్తను తలచుకుని కుమిలిపోతున్న ఆ పిల్ల ఎంత బాధపడుతుందో అన్న ఇంగితం లేకుండా మాట్లాడిన అతనికి వత్తాసు పలికే అమ్మలక్కలు.
సంస్కారం లేని వీళ్ళ పూజలు ఎందుకు? తోటి వ్యక్తిపై కనీసం సానుభూతి లేకపోగా ఘోరంగా అవమానించే సంస్కార హీనులుగా చేస్తున్నదా భక్తి, నమ్మకాలు, వాటి వెనుక ఉన్న మతం? మనిషిని కొత్త కొత్త చట్రాల్లో బిగించి వెనక్కి నడిపించేస్తున్నారు. మనిషి తెలివితేటలతో అభివృద్ధి చేసుకున్న జ్ఞానం, సంస్కారం వెనక్కి పోతోందా?
విజ్ఞానం పెరిగేకొద్దీ వాస్తవిక దృష్టి పెరగాలి. అజ్ఞానపు చీకట్లు పోయి శాస్త్రీయ ఆలోచన పెరగాలి. కానీ ఇప్పుడేంటీ… చదువులు పెరిగాయి. చదువుకున్న వాళ్ళు కూడా పెరిగారు. కానీ వాళ్ళ మెదళ్ళలో మూఢ త్వం నిండిపోతున్నదేంటి? మత విశ్వాసాలతో మానసిక దౌర్భల్యానికి గురవుతున్నామా?
ఎవరి మత విశ్వాసం వారికి ఉండొచ్చు, దైవభక్తి ఉండొచ్చు. కానీ మూఢంగా మారితే… మూర్ఖంగా ప్రవర్తిస్తే… సమాజాన్ని ప్రభావితం చేస్తే… జరిగిన నష్టం పూరించడం సాధ్యమా? ఆలోచించవలసిన సమయం ఇది.

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.