తల్లిదండ్రులు కొరగాని వాళ్ళు కాదు -పి. ప్రశాంతి

పోలీస్‌స్టేషన్‌ నుంచి కాల్‌ వస్తే మాల, గోపీ ఇద్దరూ ఆతృతగా వచ్చారు. వాళ్ళని చూసి రిసెప్షన్‌లో కానిస్టేబుల్‌ ఎస్‌హెచ్‌ఓ గదివైపు చూపించింది. ఇన్‌స్పెక్టర్‌ గదిలోకెళ్ళారు. ‘రండి మీ కోసమే చూస్తున్నా’ అంటూ కుర్చీలు చూపించాడు ఇన్‌స్పెక్టర్‌. అప్పటికే అక్కడ కూర్చొనున్న

ఆమెని చూపిస్తూ ‘ఈమె గౌతమి, కీసరలో ఉంటారు. ఒక నెల క్రితం తన తండ్రి తప్పిపోయారని అక్కడ కంప్లైంట్‌ ఇచ్చారు. మీరిచ్చిన కంప్లైంట్‌తో ఆ వివరాలు మ్యాచ్‌ అవ్వడంతో అక్కడ్నుంచి మా వాళ్ళు గౌతమి గారిని ఇక్కడికి పంపించారు. అందుకే మిమ్మల్ని పిలిపించాను’ అన్నాడు.
గౌతమి తన చేతిలో ఉన్న ఫోటోని మాలకి చూపిస్తూ ‘మా నాన్న రమేష్‌. నెల క్రితం ఉదయం వాకింగ్‌కి వెళ్ళి తిరిగిరాలేదు. ఈయనేనా మీ దగ్గరున్నది’ ఆత్రంగా అడిగింది. తన దగ్గరున్న ఫోటోని చూపించింది మాల. ఒక్కుదుటున లేచి మాల చేతిని పట్టుకుని ‘నెల్లాళ్ళుగా వెతకని చోటు లేదు. ఇంత దూరం ఎలా వచ్చారో అర్థం కావట్లేదు. అసలు నమ్మలేక పోతున్నాను. నన్ను త్వరగా మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి’ అంటూ ఏడ్చేసింది గౌతమి. కానిస్టేబుల్‌ని కూడా వెంట పంపించాడు ఇన్‌స్పెక్టర్‌.
ఇంటికొచ్చేసరికి డ్రాయింగ్‌ రూంలో చెస్‌ ఆడుతూ కనబడ్డారు ముగ్గురు వ్యక్తులు. వచ్చినవాళ్ళని చూస్తూనే ఒక్క క్షణం స్టన్‌ అయినట్టు ఆగి ‘గౌతమీ’ అని సంభ్రమంగా పిలిచాడు రమేష్‌. ఆయనతో చెస్‌ ఆడుతున్న ప్రభాకర్‌ హేయ్‌ అంటూ చప్పట్లు కొట్టాడు. పక్కనే కూర్చున్న శ్రీను కూడా హేయ్‌ అంటూ బల్ల చరిచాడు. ‘ఈ మతిమరుపు మారాజుకి బిడ్డని చూడగానే మాత్రం గుర్తొచ్చేసిందే’ అంటూ నవ్వాడు. ‘ఏయ్‌ శ్రీను, అలా అనొద్దన్నానా’ అంటూ కోప్పడ్డాడు ప్రభాకర్‌. ‘పోనీలే దోస్త్‌.
ఉన్నదే అన్నాడుగా’ అంటూ తేలిగ్గా నవ్వేసి గౌతమిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు రమేష్‌.
ఆ రోజు అసలేం జరిగిందో ఒకరితో ఒకరు పంచుకోవడం మొదలుపెట్టారు.
నాలుగు నెలల క్రితం వరకు రమేష్‌ వాళ్ళ ఊర్లోనే ఉండేవాడు. ఎప్పట్లాగే ఒకరోజు కొడుకుతో కలిసి చేనుకాడికెళ్ళిన మనిషి కనబడకుండా పోయాడు. మామిడి తోటంతా తిరిగొచ్చి, కూరగాయల మొక్కలకి నీళ్ళు పారించి, పని పూర్తిచేసుకునొచ్చి తండ్రి కోసం చూస్తే ఆయన కనపడలా. అరుచుకుంటూ చేను, తోట అంతా వెతికినా కనపడలా. చుట్టుపక్కల అందరూ కలిసి వెతికినా దొరకలా. చీకటి పడుతుండగా కంగారుగా ఇంటికొస్తే తండ్రి, బావ వరసయ్యే బంధువు కూర్చున్నారు. ‘ఇక్కడున్నావా? ఇంటికి పోతున్నా అని ఒక్క మాట చెప్పొచ్చుగా. నువ్వు కనపడక చెట్లెమ్మట, పుట్లెమ్మట, డొంకలో, ఎంత వెతికామో తెల్సా. ఎక్కడ పడిపోయావో, ఏ పురుగు కుట్టిందో అని ఎంత టెన్షన్‌ పడ్డామో. ఇక్కడికొచ్చి కులాసాగా కబుర్లు చెప్తున్నావా…’ అంటూ కోపంగా తండ్రిమీద అరిచాడు.
‘ఏమైందో తెలుసుకోకుండా అరవకు బావా. రమేష్‌ మామ మా ఊరి చివరున్న చెరువు గట్టుమీద ఒంటరిగా కూర్చొనుంటే అటుగా వస్తూ చూసి పలకరించా, పలకలా. దగ్గరకెళ్ళి పక్కన కూర్చుని మామా అన్నా నన్ను గుర్తుపట్టలా. అయోమయంగా చూట్టం తప్ప మాటలేదు. చెయ్యిపట్టి లేపి పోదాం రా అంటే లేచొచ్చాడు. బండిమీద ఎక్కించుకొని ఇక్కడికొచ్చా అంటూ చెప్పుకొచ్చాడు ఆ బంధువు. అలిసిపోయాడని పడుకోబెడ్తే ఒక గంట తర్వాత లేచాక మామూలుగా ఉన్నాడట. అప్పట్నుంచి జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటున్నా, కోడలు పన్లో ఉన్నప్పుడు ఇంకో రెండు, మూడుసార్లు ఎటో ఎల్లిపోతే తెలిసినాళ్ళు తీసుకొ చ్చారట. ‘ఈ ముసలాడికి కాపలా కాయడం నావల్ల కాదు. నీ మరదలికి ఆరోగ్యం బాగోదు. పిల్లల చదువులకే కష్టమవుతోంది. ఈయన్ని ఏదన్నా ఆశ్రమంలో చేర్పించేస్తా. సగం ఖర్చు నువ్వు పెట్టుకో అక్కా’ అంటూ ఫోన్‌ చేస్తే గౌతమికి కోపమొచ్చి చీవాట్లేసింది. ‘నాన్నని నేనే చూసుకుంటా. ఇక్కడే హాస్పి టల్లో చూపిస్తా. పిల్లలు ముఖ్యమే కాని, కన్నతండ్రిని కాదంటావా. నా పిల్లల్తో పాటే చూసుకుంటా’ అని నాలుగు నెల్ల క్రితం తన దగ్గరికి తెచ్చేసుకుంది.
అప్పట్నుండి ఇంట్లో గొడవలే. పెద్దకొడుకు సివిల్స్‌కి ప్రిపేరవుతున్నాడు. చిన్నకొడుకు బిటెక్‌ ఫైనల్‌. ప్రిపరేషన్‌కీ, ప్రాజెక్ట్‌ వర్క్‌లు చేసుకోడానికి డిస్టర్బెన్స్‌ ఉండకూడదంటూ చెరొక బెడ్రూంలో ఉంటున్నారు. గెస్ట్‌రూం తాతకిద్దాం లేదా ఇద్దర్లో ఎవరో ఒకరి రూంలో ఉండనివ్వాలి అన్న గౌతమి మాట చెల్లలేదు. తన భర్త కూడా రాసుకోడానికి నాకు ఫ్రీగా ఉండాలంటూ మాస్టర్‌ బెడ్రూం వదలడు. ఇక చేసేది లేక హాల్లో దివాన్‌ తండ్రికి పడకగా సెట్‌ చేసింది.
ఒకరోజు గౌతమికి కడుపునొప్పితో రాత్రంతా నిద్రపట్టక తెల్లారి నిద్రపట్టి రోజూ లేచే టైంకి లేవలేదు. రమేష్‌ ఒక్కడే పాల ప్యాకెట్‌ కొనుక్కొద్దామని వెళ్ళి ఇంటికి రాలేదు. నెల్లాళ్ళ తర్వాత ఇదిగో ఇలా దొరికాడు. ‘ఇక్కడికే కదా అని ఫోన్‌ పట్టుకెళ్ళలేదు. నంబరు నోటికి రాదు. చాలా బాధపెట్టాను కదమ్మా’ అంటూ నొచ్చు కున్నాడు రమేష్‌.
‘నువ్వింకా నయమయ్యా. నాతో నా కొడుకు, కోడలు పడ్డ యాతన అంతా ఇంతా కాదు. అల్జీమర్స్‌ అని తెలిశాక నన్కొక్కడ్నే ఎప్పుడూ వదల్లా. ఓ రోజు సరదాగా ట్యాంక్‌బండ్‌కి వెళ్ళాం. మాల మొక్కజొన్న పొత్తులు తేడానికెళ్ళింది. గోపి కొలీగ్స్‌ కనిపిస్తే మాట్లాడుతూ నాలుగడుగులు అలా వెళ్ళాడు. నేను ఎప్పుడు లేచి వెళ్ళిపోయానో, ఎందుకు రోడ్డు దాటాలనుకున్నానో తెలీదు. అంతలోనే నేనక్కడ లేనని వాళ్ళిద్దరూ వెతుక్కుంటున్నారు. రెండు నిమిషాలకే అంత దూరం వెళ్ళిపోయానట. అసలే రద్దీగా ఉండే రోడ్డు. స్పీడ్‌గా వచ్చిన బైక్‌ నన్ను గుద్దేసింది. అందరూ పోగయ్యేసరికి పిల్లలు కూడా పరిగెత్తుకొచ్చారు. ఆ యాక్సిడెంట్‌ వల్ల నేను దొరికాను, కాని తుంటి ఎముక విరిగి ఇదిగో ఇప్పటికీ సమస్యగానే
ఉంది. నా భార్య నిద్రలోనే గుండాగిపోయి హాయిగా వెళ్ళిపోయింది. నేను మాత్రం పిల్లలకి భారంగా మిగిలాను’ నిర్వేదంగా అన్నాడు ప్రభాకర్‌.
ఆయన మాట పూర్తవ్వకుండానే గయ్యి మన్నారు మాల, గోపి. మమ్మల్ని కన్నవాళ్ళు మాకు భారం ఎప్పటికీ కారు… అంటుండగానే శ్రీను కల్పించుకుని ‘నా ఒక్కగానొక్క కొడుకుని గారంగా పెంచుకున్నాం. పోలియో అని నాకు సరైన పని దొరక్కపోయినా నా భార్య ఇళ్ళల్లో పనిచేసి వాడ్ని చదివించింది. శ్రమ, మనోవేదనతో తిండి సరిగ్గా తినక అనారోగ్యంగా ఉన్నా దాచిపెట్టుకుని ఒకరోజు సుఖ నిద్రలోకి జారుకుంది నా భార్య. ఆ యంత్రమే లేనప్పుడు ఇక నేనెందుకు. నా కొడుకు తరమక ముందే తప్పుకోడం నాకు గౌరవమని బస్సెక్కి హైదరాబాద్‌ వచ్చేశా. బస్టాండు లోనే మాలమ్మ కలిసింది. ఇంటికి తీసుకొచ్చింది. ప్రభాకర్‌ సార్‌కి తోడుంటానని నన్ను కూడా పెంచుకుంటోంది’ ఆప్యాయంగా అన్నాడు శ్రీను.
మమ్మల్ని కన్న మీరు మాకు భారమైతే మేము కన్న మా పిల్లలకి ఒకనాడు మేము భారమే అనిపిస్తుం దిగా! ఇప్పుడు మేమలా ఫీలైతే మా పిల్లలూ అదే నేర్చుకుంటారు. వాళ్ళకి పిల్లలు పుట్టాక మేము కొరగాని వాళ్ళం అయిపోతాం. మీ తరం మాకు నేర్పించిన విలువల్ని మా తరం తిరిగి తర్వాతి తరానికి నేర్పడంలో వెనుకబడి పోయాం. దీనిని ప్రపంచీకరణ, ఒకర్ని మించి ఒకరు ఎదగాలన్న అనారోగ్యపు పోటీతత్వం, అభివృద్ధి పేరిట సృష్టించబడుతున్న అంతరాలు… ఇవన్నీ కారణాలే కదా! మానవతా విలువలు, సమాన అవకాశాలు జోడు గుర్రాల్లా కలిసొచ్చి నప్పుడే కదా నిజమైన మానవీయ సమాజం ఆవిష్క్రతమవుతుంది! ఆ రోజు ఇంకెంత దూరమో?!!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.