నేనో స్వేచ్ఛా విహంగాన్ని
దేశాల్ని దాటి
డాలర్ల దాహంతో వచ్చిన
నవనాగరిక విజ్ఞానపక్షిని
కాలాన్ని కట్‌చేసి
కంప్యూటర్లో ఇమిడ్చే అత్యాధునికురాల్ని
మునివేళ్ళతో కీబోర్డు దేహంలో రాగాలు పలికిస్తూ
సృష్టిలో నూతన సృష్టి చేసే అపర బ్రహ్మణిని
నేను విశ్వమంతా విస్తరిస్తుంటే
ప్రపంచమంతా నా కంప్యూటర్‌లో కుంచించుకుపోతుంటే
రెప్పవాల్చటం మరచి యుగాలు క్షణాలైపోతుంటే
వాగులూ వంకలూ కొండలూ కోనలూ
నా డెస్క్‌టాప్‌మీద నుంచి నడచి వెళ్ళిపోతుంటాయ్
గది తలుపులన్నీ మూసివుంచి
మనసు ‘కిటికీ’ తెరచి మరో ప్రపంచాన్ని వెదుకుతున్నాను
బాధల్ని బంధాల్ని తరంగాలుగా చేసి రింగుటోన్లతో పలకరిస్తున్నాను
నేను ఎవర్నైనా పలకరించాలంటే వారికో ఎకౌంట్ ఉండాలి
ఎక్కడో చోట లైన్ కలిసి లాగిన్ అవ్వాలి
సంపాదనకీ, సంతృప్తికీ మధ్య మైనస్
అంతరంగంలో తుపాన్
నెట్‌వాకిట్లో నేలకూలాను
ఏ బొమ్మ చూసినా అమ్మ రూపే
వెబ్‌సైట్లలో వెతుకుతున్నప్పుడు
ఊహల్లో ఊరు ఊరిస్తోంది
డౌన్‌లోడ్ చేసిన ఫైల్లో
పెరట్లో జామచెట్టు కాయలు నోరూరిస్తున్నాయి
ప్రేమ ఫైల్ ఓపెన్ చేద్దామంటే
పాస్‌వర్డ్ దొరకటం లేదు
అభిమానం ఆచూకీ రీసైకిల్‌బిన్‌లోనైనా
రీసోర్ట్ చేసేందుకు ఉందో లేదో?
మౌస్ కదుపుతున్నప్పుడల్లా
ఏదో ఒక హృదయం పగిలిన శబ్దం
చరమాంకంలో ఉన్న వృద్ధ కపోతాలు
చేతులు చాచి నన్ను పిలుస్తున్నట్లు
కంప్యూటర్ తెరమీద రంగులు చకచకా మారాయి
నాకళ్ళకు పొరలు తొలగిపోయాయి
డాలర్ల కలని శాశ్వతంగా డిలీట్ చేశాను
ఇక్కడున్న విండోలన్నీ పూర్తిగా మూసేశాను
మా పల్లెలో మరో ప్రపంచాన్ని వీక్షించాను
పల్లే ప్రపంచం అయ్యాక పొలిమేర దాటాల్సిన అవసరమేముందిక!