వారంలో రోజూలానే
నెలలో వారాల్లానే
సంవత్సరమంతా నెలల్లానే
ఎప్పట్లానే
మళ్ళీ తాగి ఆలస్యంగా ఇల్లు చేరతావు
తాగిన తర్వాత నువ్వు కక్కే కరుకు మాటలు
నేను మింగే విశాల విషాలు ఎవరికీ తెలియనివి కావు
తాగినవాడు ఇల్లు ముట్టే వరకు
నన్ను చుట్టుముట్టిన నానా భయాలు ఊరికే పోవు
బయట నుంచి ఏ బండి శబ్దమైనా
నా చూపులు నిరాశ వరకు పరుగులు పెడతాయి
ఇప్పుడే వస్తానని చెప్పి నువ్వు ఇప్పుడైనా తాగకుండా వస్తావని ఎప్పుడూ అనుకునే నేను ఇద్దరం మోసపోతున్నాం
మోసపోటం కొత్తేమీ కాదనుకో…
ఉండబట్టలేక ఫోన్ చేస్తానా..
ఐదవసారికి గానీ ఫోన్ ఎత్తవు!
మొదటి కాల్, సిగ్నల్ అందదు… లోపల దడ దడ
రెండవ కాల్, బిజీ వస్తుంది… ఏమీ తోచదు
మూడవ కాల్, ఫోన్ ఎత్తవు… ఏం జరిగి ఉంటుంది
నాలుగో కాల్, ఫోన్ కట్ చేస్తావ్… గుండె వేగం పెరుగుతుంది.
ఐదో కాల్, ఎక్కడున్నావు చెప్పడం పూర్తికాకముందే ఫోన్ కట్ చేస్తావ్
ఈ భయానక బావి నుంచి బయటపడి ఎటుకైనా ఎగిరిపోదామా…?
బావ పోయిన పెద్దక్క, వాళ్ళ పిల్లలు చిన్న చెల్లి… నాన్న భుజం మీద ఖాళీ లేదు
ఇంకొంత బరువును మోపాలంటే మనసు ఒప్పదు
అయినా ఈ సంఘం తన చూపుల్ని నా మీద దిగజార్చుకుంటుందేమో…!
ఆడదాన్ని అయినందుకు అదుముకొని కదుము కట్టిన గాయాల్ని కప్పుకొని
ఈ రోజుల్ని ఈడ్చుకుంటూ తూడ్చుకుంటూ ఎప్పట్లానే దినచర్యలో దిగాలుగా దిగిపోతూ…
మోసపోతూ…
`