సచ్చినా బతికినా మన జాగల
కలో గంజో తాగినా మన దేశం
మన మట్టి మన తల్లి మన గాలి
అని డెబ్బయ్ ఐదేండ్ల సంబురాలు జరుపుకున్నం…
ఇప్పటికీ కడగండ్లు తీరనే లేదు
రెక్కలే పెట్టుబడిగా జానెడు
పొట్ట నింపుకునే దైన్యం…
చేతిల పనిలేక తెరువు కోసం
ఇంటినుంచి వాడనుంచి ఊరు
నుంచి తరుముతున్న ఆకలి
పుట్టిన ఊరును, బందుగులను
సుట్టాలను విడిచి ఎరుగని ఊరికి
పిడికెడు మెతుకుల కోసం…
దినాము యేటమటమే
బుక్కెడు బువ్వకు కట కటనే
కట్టుకున్న ఆలికి కన్నబిడ్డలకు
కడుపు నింపేటందుకు పుట్టిన్నుంచి
సచ్చేదాక రోజూ చేసే రికామి లేని యుద్ధం…
పులిమీద పుట్రోలే పిల్లగాండ్లకు
జరాలు కడుపునొప్పులు
డాక్టర్ కాడికి బోతే పాలు పండ్లు
తినాల్నని కడుపునిండా తిండికె
దిక్కులేదంటే పండ్లు పాలు దొరుకుడు…
కావాల్నంటే మొగులు ముట్టినట్టే…
జరమచ్చిన బిడ్డను
దక్కిచ్చుకోవాలన్న తపన…
గడియకో తీరు మారుతూ ఎగిరెగిరి
పడుతున్న డొక్కలు… అగ్గిఅగ్గోలే…కాలుతున్న ఒళ్ళు
దయనీయంగా మూడేండ్ల బిడ్డ
కంటిమీద కునుకులేక తిండి మీద ధ్యాసలేక తల్లడిల్లుతున్న
తల్లితండ్రి కండ్లనుండి కన్నీళ్ళుగా
దుంకుతున్న అశక్తత జారుతున్న
ధైర్యాన్ని కూడగట్టుకొని కొడిగడుతున్న దీపాన్ని చూస్తూ
దావుకాన్లకు బయిలెల్లిండ్రు…
కడుపుల భయంజొచ్చి అగులు
బుగులుగాంగ సర్కారు దావుకాన్లకు
ఎప్పటిమాటే పెద్దావు కాన్లకు తీసుకపొమ్మని
చిన్న దావుకాన… పాణాలు చేతిలో
బెట్టుకొని… రెండువందల రూపాయలుంటే
చేతుల బట్టుకొని కంటివెలుగు నిలబెట్టు కొనే
యత్నం… పెద్దావుకాండ్ల
అప్పుడే తీసుకత్తె బాగుండు
ఆలిస్సంమయిందని బిడ్డ చని
పోయిందని తీసుకపొమ్మన్న
ముచ్చట… దుఃఖం ఆవిరై గాజు
కండ్ల కదలిక మాత్రమే రుజువుగా కన్నవాళ్ళు
చనిపోయిన బిడ్డ దేహాన్ని మోసుకుంటూ బతుక
వచ్చిన ఊరుచేరే తండ్లాట ఎప్పటిలాగే
అంబులెన్స్ అందుబాటులో ఉండదు… ఇతరంగా
బతిమాలినా బామాలినా మూడు వేలకు తగ్గని కిరాయి
వాహనం… నెనరు కరువైన మానవత్వానికి మాటపడి
పోయింది డబ్బులేక చనిపోయిన
బిడ్డను మోసుకుంటూ గుండెల్లో
దుఃఖం ఏతం పోస్తుంటే చేరాల్సిన 90 కిలోమీటర్ల
గమ్యం కోసం నడుస్తూనో సైకిలుపైనో
బస్సులోనో… మూటగట్టుకొని
తావుచేరే ఆరాటం…
అట్టడుగుకు బల్మీటికి నెట్టేయబడ్డ…
బడుగుల బతుకువెత
చితికిన గరీబు జీవన వ్యథ
కంటికి మింటికి యేకధారగా
అరణ్య రోదన…