ఆధ్యాత్మిక ఫాసిజానికి ప్రతినిధులే ప్రవచనకారులు -అశోక్‌ కుంబము

మొన్నటి వరకు ‘‘చాదస్తపు మాటలు’’ అని ఈసడిరచుకున్న వాటినే జనాలు ఇప్పుడు చాటంత చెవులేసుకుని వింటున్నారు. జీవిత చరమాంకంలో కాలక్షేపం కోసం వినే ప్రవచనాలు ఇప్పుడు ‘‘జీవిత సారం’’ తెలుసుకోవడం కోసం వింటున్నామని యూట్యూబ్‌,

ఇతర సోషల్‌ మీడియా మీదికి ఎగబడుతున్నారు. ‘‘మాకు భలే గిరాకీ పెరిగిందని’’ స్వయంగా ప్రవచనకారులే కాసింత గర్వంగా చెబుతున్నారు. వాళ్ళ వెలుగుబాటు రాజకీయ శూన్యంలో జరగటం లేదని, గత ఎనిమిదేండ్లుగా హిందూ రాష్ట్ర స్థాపనకు పునాదులు వేసుకుంటున్న సంఫ్‌ు పరివార్‌ రాజకీయ నీడలో జరుగుతోందని ప్రవచనకారులు చెప్పకనే చెబుతున్నారు.
కొత్త కాషాయ గాలి తెలుగు నేల మీద వీస్తుంటే ప్రవచనకారుల స్వరం పెరుగుతుంది. వాళ్ళను ఫాలో అయ్యే మంద ఎక్కువవుతూ ఉంటే వారి మాట మదమెక్కుతుంది. వేల ఏండ్లుగా సమాజాన్ని అణిచివేయడానికి వాడుకున్న భావజాలాన్ని ‘‘కొత్త సీసాలో పాత మత్తు’’గా ఆధ్యాత్మికత పేరిట సామాజిక వేదికల మీది నుండి ప్రవచిస్తున్నారు. ఆశ్చర్యంగా ఈ కొత్త వాతావరణంలో అణిచివేత, దోపిడీ, పీడనకు గురైన వర్గాలు, కులాలు, లింగాలు ఈ ప్రవచనకారులకు భజనపరులుగా మారుతున్నారు. అయితే కనీసం కొందరైనా ఆలోచనాపరులు, సామాజిక కార్యకర్తలు ప్రవచనకారుల ముసుగు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రవచనాల పేరుతో కొనసాగిస్తున్న హింసను ఎండగడుతున్నారు.
అయితే ఈ ప్రవచనకారుల గురించి చర్చ వచ్చినప్పుడల్లా ఒక పెద్ద ‘మనోభావాల బ్యాచ్‌’ ట్రోలింగ్‌కు సిద్ధమైపోతుంది. ఈ బ్యాచ్‌కు విషయం అర్థం కావాల్సిన పని లేదు, ఎందుకంటే ఆ పని వేరే వాళ్ళకు అప్పగిస్తారు. వీళ్ళు ప్రతి చిన్న దానికి మనస్సును గాయపరచుకొని గాయి గాయి చేస్తుంటారు. మరో ‘అమాయకపు/అయోమయపు బ్యాచ్‌’ ‘‘వాళ్ళకు చేతనైన పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ మాటలు మనకు నచ్చకపోతే వినకుండా ఉంటే సరిపోతుంది. వాళ్ళు వినడం దేనికి? విమర్శించడం దేనికి?’’ అని సుద్దులు చెబుతుంటారు.
ఇది కేవలం వ్యక్తులుగా వినడం, వినకపోవడం గురించి కాదు. ఎందుకంటే ప్రవచనకారులు తమ ఇంట్లో కూర్చుని గునుక్కోవడం లేదు. పబ్లిక్‌ స్పేస్‌లో కూర్చొని ‘‘మొత్తం సమాజాన్ని ‘ఉద్ధరించడం’ కోసమే ఆధ్యాత్మిక బోధన చేస్తున్నామని’’ చెబుతున్నారు. చెప్పేవాళ్ళు తమకు తాముగా ఏదైనా బాధ్యతను ఆపాదించుకోవచ్చు. కానీ, వినేవాళ్ళకు కూడా హక్కులుంటాయి. తమకు ఇష్టమొచ్చింది చెప్పి ‘ఇదే పరమ సత్యం’ అని చెప్పుకుంటూ పోవడం ఈ ఆధునిక కాలంలో ఒప్పుకునే విషయం కాదు. పైన చెప్పిన రెండు బ్యాచ్‌లతో పాటుగా ‘‘గురువు గారి బ్యాచ్‌’’ అనే మూడో బ్యాచ్‌ కూడా ఒకటి ఉంది. ‘‘ప్రవచనకారులు భాషా, సాహిత్య రంగాలలో ఉద్ధండ పండితులు. అలాంటి గురువులు చెప్పేది విని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలే తప్ప వాళ్ళను అపార్ధం చేసుకోవద్దు, తప్పు పట్టొద్దు. ఎందుకంటే వాళ్ళను విమర్శించే స్థాయి మనకు లేదు’’. ఇలాంటి వాళ్ళు తమ మెదడును ఆ గురువుల పాదాల దగ్గర పెట్టి మాట్లాడుతుంటారు.
అయితే వీళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆ పండితుల జ్ఞానం దేనికి సంబంధించింది? ఆ జ్ఞానాన్ని ప్రసరించి వాళ్ళు సమాజాన్ని ఎటువైపునకు తీసుకుపోవాలని అనుకుంటున్నారు? అసలు ఈ పండితులు ఎవరు? కట్టకట్టుకొని ప్రవచనకర్తలు అందరూ బ్రాహ్మణులే ఎందుకయ్యారు? వాళ్ళకే ఈ సమాజాన్ని ‘ఉద్ధరించాలని’ ఎందుకు అనిపిస్తోంది? వాళ్ళు చెప్పే ప్రవచనాలలో ఏ సాహిత్యమైనా ఉండనీ, అది ఎవరి ఆధిపత్యం కోసం పనిచేస్తుందో చూడాలి. ప్రవచనకారులు మొత్తంగా ఏ విధంగా బ్రాహ్మణీయ హిందూత్వ భావజాలాన్ని పునరుద్ధరించే పనిచేస్తున్నారో చూడాలి. మన సమాజంలోని అన్ని రకాల అణచివేతలకు, హింసలకు కావాల్సిన భావజాల, సాంస్కృతిక పునాదిని ఎలా ఏర్పాటు చేస్తున్నారో చూడాలి.
ప్రవచనకారులు చేస్తున్న పని మొత్తం పెను ప్రమాదమై ముంచుకొస్తోన్న హిందుత్వ ఫాసిజానికి భావజాల రంగాన్ని సిద్ధం చేయడం. మతం మత్తును సుతిమెత్తగా నరనరానికి ఎక్కించడం. సాంప్రదాయం పేరిట కట్టుబాట్లతో మనిషి స్వేచ్ఛను, సమాజ పురోగతిని అడ్డుకోవడం. అయితే ఆధునికత పేరిట, అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్న హేతుబద్ధమై, శాస్త్రీయమైనదై ఉండాలి. ఆ ప్రశ్న సమన్యాయం, సమతా భావనలకు దారులు వేసేదిగా ఉండాలి. అంతేకానీ ఆధునిక భావనలను, నవ జీవన వ్యవహారాలను ఎద్దేవా చేస్తూ కట్టుబాట్ల కంచె వెయ్యొద్దు. ‘వేదాల్లోనే అన్నీ ఉన్నాయి’ అని, అదే సత్యమని దబాయిస్తే సరిపోదు.
ప్రవచనకారుల రూపంలో ఒక్కో విధంగా కనిపిస్తున్నప్పటికీ, సారంలో అంతా ఆధ్యాత్మిక ఫాసిస్టులే! ఇప్పుడు సాధారణ భాషలో ‘‘ఫాసిజం’’ అనేది ఒక తిట్టు పదంగా మారింది. కానీ అది ఒక రాజకీయ సిద్ధాంతం, ఆచరణ. ప్రపంచాన్ని ఏకదృష్టితో చూసే రాజకీయం. ఫాసిస్టులు తాము ఇతరుల కంటే (అంటే తమలో భాగం కాని, తమ భావాలను అంగీకరించని, తాము శత్రువు అనుకునే వారితో పోలి ఉండే ఎవ్వరైనా) గొప్పవాళ్ళమని నమ్మేవాళ్ళు. అంతేకాదు, ఆ భావనతో హింసను కొనసాగించేవాళ్ళు. ఇతర భావాలను ధ్వంసం చేసేవాళ్ళు. ఆధిపత్యాన్ని నిర్మాణం చేసి దాన్ని నిత్య జీవితంలో భాగం చేసేవాళ్ళు. అటువంటి రాజకీయాలతో జాతీయవాదం పేరిట ఇటలీలో అన్ని ఉదారవాద, ప్రజాస్వామిక సంస్థలను బుల్డోజ్‌ చేసి నెత్తుటి ఏరులు పారించిన ‘నేషనల్‌ ఫాసిస్ట్‌ పార్టీ’ నాయకత్వాన్ని కలిసి వాళ్ళ సలహా, ప్రోత్సాహంతో భారతదేశంలో అతి`జాతీయవాదాన్ని (ultra nationalism) కలగన్నది సంఫ్‌ు పరివార్‌ శక్తులు. ఇటాలియన్‌ ఫాసిస్టులు గర్వంగా తమ సిద్ధాంతాన్ని, అస్తిత్వాన్ని ప్రకటించుకున్నారు. కానీ చివరికి ఆ ఫాసిస్టులను ప్రజలు నడిరోడ్డు మీద ఉరికించారు. మిలాన్‌ చౌరస్తాలో ఫాసిస్టుల శవాలను తలకిందులుగా వేలాడదీసి చెప్పు దెబ్బలు కొట్టారు. చరిత్రలో ఫాసిజం ఓడిపోయింది కాబట్టే హిందుత్వ శక్తులకు ఫాసిస్టు పోలిక రుచించడం లేదు. కానీ తాము నడుస్తున్నది ఫాసిస్టు దారిలోనే! ఆ దారికి ఆధ్యాత్మిక ఫాసిజం ఒక కాగడాలా పనిచేస్తోంది. ‘‘ఆధ్యాత్మిక ఫాసిజం (Spiritual fascism)’’ నేటి భావన కాదు. దాన్ని ఫాసిస్టు సిద్ధాంత కర్త జూలియస్‌ ఎవోలా ప్రతిపాదించాడు. అతను ఆధారాలతో కూడిన చరిత్రకు వ్యతిరేకి. దాని స్థానంలో పురాణాల మీద ఆధారపడే ఆదిభౌతిక చరిత్రను (metaphysics of history) ప్రపోజ్‌ చేశాడు. అది హిందూ పురాణాలలో ఉండే యుగ చరిత్రతో పోలి ఉంటుంది. పురాణాలనే చరిత్ర చేయడం, దాని ద్వారానే మంచి, చెడులను నిర్మాణం చేయడం దాని ముఖ్యోద్దేశం. అంతేకాదు, ఎవరు యుగపురుషుడో, (ఎవోలా పితృస్వామ్యవాది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!) ఎవరు ‘‘ప్రజా కంఠకులో’’ ఆ పురాణకర్తలే నిర్ణయిస్తారు. వారి కట్టుకథల ఆధారంగానే నీతి, నిజాయితీ, సత్యం, ధర్మం నిర్ణయమవుతాయి. ఎవోలా ప్రకారం ప్రపంచంలో ఎన్నో రహస్య సత్యాలు (mysterious truths) దాగి ఉన్నాయి. అయితే వాటిని సృష్టించిన వాడు మాత్రమే, అర్థం చేసుకోగలుగుతాడు. అంటే ప్రపంచం అనేది ఒక రహస్య జ్ఞాన నిధి, అది కొందరికే అర్థమవుతుంది (ప్రవచనకారులకు అర్థమయినట్లుగా అని!).
ఇటువంటి పుక్కిటి పురాణాలకు ఇటలీలో ఫాసిజం 1922లో అధికారం చేపట్టగానే మంచి ఆదరణ పెరిగింది (ఇప్పుడు ప్రవచనకర్తలకు మాదిరిగానే). అదే అదనుగా ఎవోలా ఫాసిస్టు ప్రభుత్వ ముఖ్య పత్రిక Defense of the Race లో తన జాతి ఎంత గొప్పదో, ఎందుకు గొప్పదో విపరీతంగా, రాయడం మొదలుపెట్టాడు. ఆ ‘‘ఆధ్యాత్మిక జాతివివక్ష’’ (spiritual racism) రాతల ద్వారా తాను నమ్మిన పాగనిజాన్ని (Paganism) పునరుద్ధరించాలని అనుకున్నాడు. రోమన్‌ పాగన్‌ అనేది నాలుగో శతాబ్దానికి చెందిన మతం. ఈ మతంలో హిందూ మతం మాదిరిగానే ప్రకృతి ఆరాధన, బహుదేవతారాధన ఉంటుంది. పూజలు, మంత్రాలు, ఇంద్రజాల క్రీడలు ఉంటాయి. దాదాపుగా హిందూ మతానికి పోల్చదగినది. అందుకే ఎవోలా తన రచనలలో హిందూ మతానికి సంబంధించిన అనేక రిఫరెన్స్‌ ఇచ్చాడు. ‘‘యూదులు, క్రైస్తవులు బయటివారని, వారి మతాలే పాగనిజం అభివృద్ధికి అడ్డంకి’’ అని బహిరంగంగానే ప్రకటించాడు. ఫాసిస్టు నాయకుడు ముస్సోలిని క్రైస్తవ మతానికి దగ్గరవడాన్ని ఎవోలా సహించలేదు. ఎలాగైనా దూరం చేయడానికి ప్రత్యేక పూజలు చేశాడు. తనకు ఉన్నాయని అనుకున్న ఇంద్రజాల ‘‘శక్తులను’’ ప్రయోగించాడు. వీటి మూలంగానే ఎవోలాను ఫాసిస్టు నాయకత్వం కొంత దూరంగా ఉంచింది. కానీ అతని మత్తు, మాయ సిద్ధ్ధాంతాలను విమర్శించలేదు. ఎవోలా క్రిస్టియానిటీని ముందు శత్రువుగా భావించినప్పటికీ తర్వాత కాలంలో కథాలిసిజం మీద తన విమర్శ తగ్గించి, ప్రొటెస్టన్ల మీద దాడి మొదలు పెట్టాడు. చివరికి కాథలిక్స్‌ కూడా ఎవోలాను ఎత్తిపట్టారు. ఎందుకంటే తాము నమ్మే సాంప్రదాయ వాదాన్నే అతనూ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి.
మొత్తంగా ఎవోలా తన ఆధ్యాత్మిక ఫాసిజం ద్వారా చరిత్రను, స్వేచ్ఛను, మానవవాదాన్ని, హేతువాదాన్ని, మార్క్సిజాన్ని వ్యతిరేకించాడు. వర్గ సమాజం సుస్థిరం కావాలని కోరుకున్నాడు. పీడిత ప్రజలు వర్గ దోపిడీ గురించి ఆలోచించకుండా ఒక మంద మనస్తత్వాన్ని (mob mentality) నిర్మాణం చెయ్యాలని ప్రవచనాలు చెప్పాడు. సామాజిక పురాణాల (social myths) ద్వరానే ఆ మంద మనస్తత్వాన్ని సునాయాసంగా ప్రజల్లో అభివృద్ధి చేయవచ్చని నమ్మాడు. ఆ పనే చేశాడు. వాస్తవానికి ముస్సోలిని ఇంకా కావాల్సినంత దూకుడుగా ఫాసిజాన్ని అమలు పరచడం లేదని దిగులు పడేవాడు. బ్రాహ్మణీయ ప్రవచనకారులు సరిగ్గా ఎవోలా చేసిన ఆధ్యాత్మిక ఫాసిస్టు పనే చేస్తున్నారు. నిచ్చెనమెట్ల సమాజాన్ని జన్మ జన్మల కర్మఫలితాలతో ముడిపెడుతున్నారు. ‘అది నీ కర్మ ఫలం. కాబట్టి అనుభవించాల్సిందే’ అని దోపిడీ, పీడనలకు ఆధ్యాత్మిక మద్దతును కూడగడుతున్నారు. ‘‘అంతా అమ్మవారి ఆటలోని పావులం మాత్రమే. కాబట్టి ఆ ఆటను ప్రశ్నించకు, ఆట ఫలితాలను ఆశించకు’’ అని నిద్రబుచ్చుతున్నారు. సమాజ చలనాన్ని కోరుకునే అన్ని రాజకీయాలను కించపరుస్తూ తమ ఆధిపత్యం కొనసాగే హిందూ రాష్ట్రాన్ని కలగంటున్నారు. దానికి మద్దతుగా సమాజం మీదికి మత్తు జల్లుతున్నారు. తెలుగు నేల మీద అందులో అగ్రగణ్యుడు గరికపాటి. సీనియర్‌ జర్నలిస్టు వనజ తన వీడియోలో చూపించినట్లు గరికపాటి ఒక సెక్సిస్ట్‌. స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎలా వేసుకోవాలి? జుట్టు ఎంత పెంచుకోవాలి? ఎలా ముడి వేసుకోవాలి? సామాజిక, ఆర్థిక వ్యవహారాలలో ఎలా ప్రవర్తించాలో తానే నిర్దేశిస్తాడు. ఈ వ్యాఖ్యానాలకు మద్దతుగా పురాణాలను వల్లిస్తాడు. ఒకవైపు స్త్రీని శక్తి రూపమంటాడు. మరోవైపు స్త్రీ ‘‘సృష్టి ధర్మానికి’’ అనుగుణంగా (పురుషుడికి లొంగి!) బతకాలంటాడు. ‘‘సృష్టిలో ఏ లోపం లేదు, మన దృష్టిలోనే లోపమంతా’’ అంటాడు. ఆ లోప దృష్టితోనే స్త్రీని చూస్తాడు. ‘‘పవిత్ర’’ పురాణాలు చెప్పే నోటితోనే పైటకొంగుల ముచ్చట్లు చెబుతాడు. తన ముందుండే మంద చప్పట్లు కొడుతుంటే మురిసిపోతాడు.
గరికపాటి లాంటి వాళ్ళను బహిరంగంగా ఎండగట్టడం అవసరం. అందుకు వనజకు అభినందనలు. గరికపాటి మాటలు వింటుంటే చీము, నెత్తురు ఉన్న ఎవ్వరికైనా రక్తం మరుగుతుంది. కానీ వనజ నిలకడగా, నిబ్బరంగా చెప్పిన తీరు ఎందరినో ఆలోచింపచేస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఇలాంటి ప్రవచనకారులను నిర్ధిష్టంగా ఎండగడుతూనే వీళ్ళందరికీ మూలుగయిన బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజాన్ని అన్ని రూపాలలో ఎదుర్కోవాలి. లేకపోతే ఆధ్యాత్మిక ఫాసిజం మన నడివీథుల్లో, నట్టింట్లో మన అనుమతి లేకుండానే ఊరేగుతుంది. ‘‘ఉద్ధరిస్తానని’’ అంటూ ఉద్దెర మాటలు చెబుతూనే ఉంటుంది. ఆధ్యాత్మిక ఫాసిజం పీడిత కులాల, వర్గాల, లింగాల, మత మైనారిటీల మీద కొనసాగుతున్న దాడి. దాన్ని భావజాల రంగంలో ఎదురించడం ప్రజాసామ్య, సమతా సమాజాన్ని ఆకాంక్షించే అందరి కర్తవ్యం.
(కొలిమి వెబ్‌ మ్యాగజైన్‌ నుండి…)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.