వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: చేరి మూర్ఖుల మనసు రంజింపవలెనన్న వివేకవతి (1909-1934) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

‘‘బాలికా విద్య విస్తారమునకు చదువు చెప్పించుటతో పాటు చదువుకొనిన కొందఱు ఉన్నత విద్య నభ్యసించిన దేశమునకు బలము కల్గును. ఉన్నత విద్యల నభ్యసించి ఇతర దేశపు స్త్రీలు పేరు ప్రతిష్ఠ నెట్లుగాంచుచున్నారో చూడుడి. గొప్పగొప్ప విద్యాపరీక్షలనిచ్చి, యాంగ్లేయ స్త్రీలు మన దేశమున ఇన్‌స్పెక్ట్రెసెస్‌ ఆఫ్‌ స్కూల్సు గాను, లేడీ సర్జనులుగాను, ఉపాధ్యాయనిలు

గాను, ఉపన్యాసకురాండ్రుగాను ఉన్నారు. ఘనతగాంచిన ఏనిబిసెంటు దొరసానిగారు మహోపన్యాసములు చేసిన మహనీయురాలని యీ దేశమందరెరిగియే యున్నారు. ఇట్టి యాధిక్యతను మన దేశపు స్త్రీలెవ్వరైనన ందినచో దేశమునకది గౌరవముకాని వేరుకాదు. మన దేశపు స్త్రీలలో కొందరిపుడు విద్యాధికులున్నారుగాని వారి సంఖ్య బహు స్వల్పమైనది’’ అని స్త్రీల ఉన్నత విద్య దేశానికి బలం చేకూర్చి గౌరవం కల ుగజేస్తుందన్నారు. ఆంగ్ల స్త్రీలను ఆదర్శంగా తీసుకోండని సలహా యిచ్చారు. హిందూ స్త్రీలు వైద్యవిద్య నేర్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ ‘‘వైద్యశాస్త్రమభ్యసించిన స్త్రీలు స్త్రీలకు వైద్యము చేయునెడల ఎట్టి సంకోచములును కలుగనేరవు. పురుషులు స్త్రీలకు వైద్యము చేయునెడల యిబ్బందికరముగనే యండునుగాన కొందరు స్త్రీలు యిక్కాలమున వైద్యశాస్త్రమభ్యసించుట దేశమ ునకెక్కువ యవసరమైయున్నది’’ అంటూ వైద్యవిద్య వైపు స్త్రీలను ప్రోత్సహించారు (ఆగస్టు 1912, పు. 343`345). స్త్రీలు కూడా పురుషుల్లాగే ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించడం ‘‘తప్పు కాకూడ’’దన్నారు. ‘‘భర్తయే గడిరచుట తక్కిన వారందరు కూర్చొని తినుటకన్న భర్త కభ్యంతరముండనిచో భార్యయు సద్వృత్తి వలన కొంత ద్రవ్యానార్జనమందు భర్తకు సహకారిjైు ఉభయుల యార్జనను కల్పి సుఖజీవన మొనర్చుట’’ మంచిదేననీ, కానీ ‘‘ఇట్టి కాలమింకను రాలే’’దనీ, ఇలాంటి ఆధునిక ఆలోచనలు ఈ కాలపు స్త్రీలకైనా, పురుషులకైనా రుచించవనేది తన అభిప్రాయమనీ తెలిపారు (సెప్టెంబరు 1912, పు. 355). ఒకవైపు వెంకాయమ్మారావు ‘భర్తకభ్యంతరం లేకపోతే’ భార్యలు ఉద్యోగం జేసి డబ్బులు సంపాదించడంలో తప్పులేదంటుంటే ఇంకోవైపు ` అదే సంవత్సరంలో ` వాడ్రేవు సుందరమ్మ లాంటివాళ్ళు ‘స్త్రీలకిష్టమైతే’ ఉద్యోగాలు కూడా చేయొచ్చన్నారు. విభిన్నమైన ఆలోచనలు!
‘స్త్రీల యున్నత కళాశాలాధికారిణియగు మిస్‌. మెక్టూకల్‌ యం.ఏ., దొరసానిగారి యుపన్యాసముననుసరించి వెలిదండ శ్రీనివాసరావుచే వ్రాయబడిన’ వ్యాసంలో ‘‘ఒకానొక జాతి యొక్క బలముగాని, నిస్సారతనుగాని, అందలి కుటుంబముల స్థితిని బట్టి మాత్రమే తెలిసికొనగల’’మన్నారు. భారతదేశంలో స్త్రీలూ, పిల్లలూ ఎక్కువగా చనిపోతుండడానికి కారణం స్త్రీల ‘‘అజ్ఞానం’’అని తేల్చారు. వాస్తవానికి హిందూ స్త్రీలు రోగగ్రస్తులైన తమ పిల్లల పట్లా, ఇతర కుటుంబ సభ్యుల పట్లా ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా అత్యంత దయ కలిగి వుంటారనీ, అయితే ‘‘అట్టి దయ యంతయు అజ్ఞానముతో కూడి’’ వుందనీ తెలిపారు. అందుకే, ‘‘స్త్రీకి జ్ఞానమావశ్యకముÑ వివేకము ఎక్కుడావశ్యకము’’. స్త్రీలకున్న దయకు విద్య ద్వారా కలిగే ‘‘జ్ఞానాన్ని’’ జోడిస్తే మంచి ఫలితాలొస్తాయి. ‘‘ఇంగ్లాండు దేశమందలి లండను పట్టణమున శిశువులును, తల్లులును ప్రస్తుతమున చాల తక్కువగా చనిపోవుటకు కారణము, అచ్చట ప్రతి తల్లియు విద్యావతిjైు యుండుటయే. లండను పట్టణముకన్న, చెన్నపట్టణమున ఎక్కువ మంది శిశువులేల మరణించవలెను? వారినట్టి మరణముల నుండి కాపాడుట అత్యుత్తమమైన సాంఘికసేవ దృఢ సంకల్పము కూడా విద్య వలన యలవడును’’ అని విద్యా ప్రయోజనాన్ని విశదీకరించారు.
స్త్రీలు ఎలాంటి విద్య నేర్చుకోవాలనేది ‘‘వారి వారి స్థితిగతులను బట్టి’’ వుంటుందనీ, ‘‘కానీ ప్రతి స్త్రీయును తన యొక్క క్షేమమునకును, సౌకర్యమునకుగాను, చదువను వ్రాయను కొంత శక్తిగలిగి యుండవలయును. గృహ సంబంధమైన పనులను నెరవేర్చుటకై గృహనిర్వహణ శాస్త్రము, ఆరోగ్య శాస్త్రము, బజారు లెక్కలను గూర్చిన గణిత శాస్త్రమును కూడా నేర్చుకొనవలెను. ఎక్కువ సావకావశముగల స్త్రీలు, భూగోళ శాస్త్రము, దేశ చరిత్రలు, తర్క శాస్త్రము, ప్రకృతి శాస్త్రము మున్నగు వాటిని గూడ నేర్చుకొనుట మేలు’’ అనేది మిస్‌. మెక్టూకల్‌ అభిప్రాయం.
మిస్సమ్మగారైన మెక్టూకల్‌ వ్యాసంలో బ్రహ్మచారిణి దృక్పథం స్పష్టం. అందుకే ‘‘కొందరు స్త్రీలు జీవితమును గడుపుటకుగాను ఏదైనా కొన్ని వృత్తులనవలంబించదలచినచో తమ యావజ్జీవితము బ్రహ్మచారిణులుగా నుండవలయునని నాకు తోచుచున్నది. ఏలననగా, కొన్ని వృత్తులననుసరించుటకుగాను పూర్తికాలమును, సంపూర్ణ శ్రద్ధయును అవసరము’’ అని ఒకవైపు అంటూ, ఇంకోవైపు ఈ విషయాన్ని ఇంకా పరిశీలించాల్సి వుందనీ, అందుకే ఖచ్చితంగా ‘‘ప్రస్తుతమున నిర్ధారణచేయలేమ’’నీ దాటవేశారు. స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రం గూర్చి తను చెప్పదల్చుకోలేదన్న మిస్‌ మెక్టూకల్‌ ‘‘స్త్రీలలో ఎక్కువ మంది చేయవలసిన ముఖ్యమైన పని తమ గృహములయందేనని … దృఢముగా’’ నమ్మడం వల్ల ‘‘వారిలో చాలమంది ఏవైనా జీవనోపాధి వృత్తుల నవలంబించుటకై తరబీదు కాబడనక్కరలేదు’’ అన్నారు. ‘‘స్త్రీ లాయర్ల వల్లను, స్త్రీ యింజనీయర్ల వల్లను ఏమైనా విశేషోపయోగముండునేమో’’ చెప్పజాలనన్న మెక్టూకల్‌, ‘‘కాని అట్టి వృత్తుల నవలంబింపగూడదను నియమములు లేకుండుట న్యాయము’’ అని ప్రకటించారు. స్త్రీలకు ఉపాధ్యాయ వృత్తి, నర్సింగ్‌ (‘‘రోగోపచార వృత్తి’’), వైద్య వృత్తి ‘‘బాగుగా తగిన’’ రంగాలన్నారు. ఈ మూడు వృత్తుల్లోని ఏదో ఒక దాంట్లో ‘‘ఆరితేరిన స్త్రీలు’’ తమ కుటుంబ జీవితాన్ని కూడా ఒడిదుడుకులు లేకుండా చక్కగా నడుపుకోగలరని చెప్పారు (‘స్త్రీలు` సాంఘికసేవ’, జనవరి 1920, పు. 73`80).
‘‘చెడ్డ’’ పుస్తకాలకు దూరంగా వుండమని స్త్రీలకు సలహా యిచ్చింది ‘వివేకవతి’. కె. అగ్నిస్‌ దానియేలు సంభాషణ రూపంలో చేసిన రచనలో రామలక్ష్మమ్మ ‘‘చిలుక చెప్పిన 29 కథలున్న పుస్తకము’’ తాను చదువుతుంటే ‘‘చుట్టుపట్ల అమ్మలక్కలందరు సుమారు 30 మంది … విని సంతోషి’’స్తున్నారనీ, ‘‘దుష్ట స్త్రీలు తమ పెనిమిట్లకు తెలియకుండా చేయు దుష్టపనులు, మోసములు, మోహ సంబంధమైన చెడు కార్యములు’’ అందులో వున్నాయనీ, ఆ పుస్తకాన్ని చదవడం మొదలెట్టాక ‘‘నాకు మరే పని మీద గాని మనసు ఉండడం లేదు. అంత రుచిగానుండును’’ అంటుంది. అది విన్న రాజమన్నారమ్మ అలాంటి పుస్తకాలు ‘‘పోకిరి’’ వాళ్ళు చదువుతారుగాని, ‘‘యోగ్యులు’’కాదని చెప్పి అలాంటి ‘‘చెడ్డ’’ వాటికి దూరంగా వుండమని సలహా యిస్తుంది (‘చెడ్డ గ్రంథములు చదువుట వలని కీడులు’, ఫిబ్రవరి 1913, పు. 141`144).
‘ఆంధ్రపత్రిక’లో ప్రచురితమైన ‘దుష్టగ్రంథ పఠనము’ అనే వ్యాసాన్ని1913 ఫిబ్రవరి సంచికలో పునర్ముదించింది ‘వివేకవతి’. అందులో మనుషులకు శారీరకారోగ్యం కన్నా మానసికారోగ్యం మరీ ముఖ్యమనీ, మానసికారోగ్యం బాగా లేకపోవడం వల్ల వాళ్లకూ, యితరులకూ చాలా కష్టం కలుగుందనీ చెప్పారు. ‘‘నీతిమాలిన మనుష్యుడు’’ లోకకంటకుడనీ, పులికన్నా, పాముకన్నా ప్రమాదకారనీ, ‘‘ఈ లోకమున జారత్వము, చోరత్వము, త్రాగుడు, హత్య’’ మొదలైన ‘‘ఘోర కృత్యములు’’ నీతిబాహ్యులవల్లే జరుగుతాయనీ వివరించారు. సాంగత్యం వల్లే మనిషి నీతిమంతుడుగానీ, నీతిబాహ్యుడుగానీ అవతాడన్నారు. అందుకే ‘‘దుర్నీతులను బోధించి, హృదయమును జాడ్యగ్రస్తము జేయు గ్రంథమును దస్సంగమని దృఢముగా నమ్మి’’ తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ పిల్లల్ని అలాంటి ‘‘దుష్టగ్రంథాల’’కు దూరంగా వుంచాలని హితవు చెప్పారు. ఇంతకీ ఆ ‘‘దుష్టగ్రంథా’’లేవి? ‘‘సంస్కృతమున భాణములును, తెనుఁగున తారా శశాంకము, రాధికా సాంత్వనము మొదలగు కావ్యములు దుష్ట గ్రంథములలోఁజేరి మనుష్యులను నీతి బాహ్యులను జేయునట్టివిగానున్నవి. జాతీయోక్తులతోను, పద లాలిత్యముతోను, వివిధాలంకారములతోను గూడి చదువుట కిచ్చను బుట్టించు నీ గ్రంథములోఁ బచ్చిపచ్చిగ వర్ణించియున్న స్త్రీ వర్ణనాదులె మన బాలురను దుర్నీతిపరులను జేసి నాశనముఁ జేయుటకుఁ జాలియున్నవి . . . దేశాభిమానిjైున ప్రతియొక్కఁడును విషతుల్యములగు నా గ్రంథములు బాలుర చేతులలోఁ బడకుండునట్లు చేయుటకయి మనఃపూర్వకముగఁ బ్రయత్న పడవలయునని మాత్రము మేము చెప్పక తప్పదు. ఆంధ్ర భాషలో నితర గ్రంథములనేకములు గలవు. విద్యార్థులు వానిని బఠించుట యుక్తము’’ (పు. 133`134).
బాల్యవివాహ దురాచారాన్ని తీవ్రంగా ఖండిరచిన ‘వివేకవతి’, రజస్వలానంతర వివాహాల్ని ప్రోత్సహించింది. ‘‘మూడేళ్లగుంట’’ ఐన మహాలక్ష్మి పెళ్లి గురించి నీలాంబకూ, కమలాంబకూ మధ్య జరిగిన ‘బాల్య వివాహము’ అనే సంభాషణలో ‘‘మాడకోసం’’ పసిపిల్లల్ని ముసలివాళ్లకంటగట్టే తల్లిదండ్రుల్ని ఘాటుగా విమర్శించారు. వారికి పట్టేది ‘‘అధోగతియే’’ అని ఈసడిరచారు. ఆ ‘‘గుంట’’ మెళ్ళో కట్టిన తాళిబొట్టును ‘‘ఉరిత్రాడు’’ అన్నారు. పసిపిల్లల్ని పెళ్లి చేసుకొనే వయసుడిగిన మగాళ్ళను ‘‘తాత’’లని వెక్కిరిస్తూ ‘‘(అతని) చక్కదనము చెప్పనక్కరలేదు. పొడుగుగా తాటిచెట్టులాగున్నాడు. కాని గూని వాడగుట చేతనో ముసలి వాడగుట చేతనో కొంచెము వంగి యున్నాడు. బట్టతల, పండు గడ్డము, కండ్లు కానవస్తవో లేదో తెలియదు. పండ్లు మాత్రము లేవు, మాట్లాడితే మన వొళ్ళంతా తడిసిపోతుం’’దని తీవ్ర హేళన చేశారు (జులై 1915, పు. 302). ఒక కథలో దురాశాపరుడైన తండ్రి, చదువుకున్న 13 సంవత్సరాల కూతుర్ని 1,400 రూపాయలకాశపడి 70 సంవత్సరాల ‘‘తాత’’కిచ్చి పెండ్లి చేయాలనుకుంటాడు. ఆ అమ్మాయి ‘‘నాకీ పెండ్లి కొడుకు వద్దు, ఈ నగలును వద్దు. ఇంగ్లీషు చదువుకొన్న కుర్రవానికిచ్చి పెండ్లిచేయండి. ఈ ముసలి తాతగారికి పెండ్లేమిటని’’ ప్రతిఘటిస్తుంది. అయినా బలవంతంగా పెండ్లి చేసేస్తారు. కానీ చదువుకున్న ఆ అమ్మాయి పట్టుదల గలదిÑ నా ఖర్మ అని ఏడవకుండా ‘‘బుద్ధి’’
ఉపయోగించి, ‘‘తాతగారూ, మీరు నన్ను వివాహము చేసికొనుటకు తగిన వయసు గలవారు కారు. మీ కుమారునికి నన్నిచ్చి వివాహము చేయండి … మీరు డబ్బుకాశపడియే కదా మీ కుమార్తెను ముసలాయన కిచ్చినారు. పెండ్లిjైున నెల రోజులలోనే మీయల్లుడు కాలము చేసినాడు. గనుక మీ కుమార్తెకు పట్టిన గతియే నాకును పట్టుతుంది …’’. ఇలా మాట్లాడి ‘‘తాత’’గారి మనసు మార్చి అతని కుమారున్ని పెండ్లి చేసుకుంటుంది. ‘‘విద్య వల్లనే గదా ఆమెకు తగిన వరుడు దొరుకుట’’అని కథకురాలు వ్యాఖ్యానించారు (వాడ్రేవు సుందరమ్మ, ‘వృద్ధభర్త, బాలభార్య’, డిసెంబర్‌ 1912, పు. 85`89). పైకి చూస్తే సాధారణంగా కనిపించే ఈ కథలో చాలా రాడికల్‌నెస్‌ వుంది. సంబంధాల్ని తలక్రిందులు చేసి, ‘‘అనాచారమూÑ అప్రాచ్యమూ’’ అన్పించే ఈ కథను అప్పట్లో పాఠకులెలా రిసీవ్‌ చేసుకొన్నారో తెలియదు.
ఒక సంపాదకీయ వ్యాసంలో బాల్యవివాహాల వల్ల స్త్రీలకు కలిగే వివిధ రకాలైన నష్టాల్ని వివరించింది ‘వివేకవతి’. రజస్వల కాకముందే పెళ్లి చేస్తే బాలికలకు శరీర సంబంధమైన జబ్బులెన్నో వచ్చి వారు బలహీనపడతారంది. 12, 13 సంవత్సరాల బాలిక, తల్లి అవడం ‘‘ఎంత విచారకరమైన సంగతి!’’ అని బాధ పడిరది. ఇలాంటి ‘‘బాల భార్యలు’’ ప్రసవ కాలంలో యాతన పడి, ఎంతోమంది చనిపోతున్నట్లు వైద్యురాండ్రు చెబుతున్నారంది. ఒక్క శారీరకారోగ్యం ధ్వంసమవడమే కాదు, ‘‘బాల భార్యల’’కూ, వయసురీత్యా పెద్దవాళ్ళైన భర్తలకూ, మానసికంగా పొత్తు కలవడం కష్టమని చెబుతూ ‘‘మన బి.యే.,లు, ఎం.యే.,లగు వారిలో కొందరి గృహ స్థితిగతులెట్లున్నవి?’’ అని ప్రశ్నించింది. (అసమ వివాహాల వల్ల వలసాంధ్రలోని దాదాపు అన్ని యిండ్లల్లోనూ ప్రతిరోజూ గొడవలే! రాయసం వెంకటశివుడి స్వీయచరిత్రలో ఆ ఘోరమైన సంసారాల్ని గూర్చి ‘‘సంసార సాగరం దుఃఖం’’ అని దీర్ఘంగానే మొత్తుకున్నారు). తెలుగునాడులోని విద్యాధికులైన స్త్రీ పురుషులు ‘‘తమ శక్తి సామర్థ్యము నుపయోగించి’’ బాలికలను ఈ ఘోర పరిస్థితి నుండి కాపాడాలని కోరింది. బాల్యవివాహాల వల్ల కలుగుతున్న ఘోరకలిని స్పష్టపరచడానికి ‘‘భయమును బుట్టించు బాలవిధవల సంఖ్య’’ అనే శీర్షికతో ఒకటి నుండి 15 సంవత్సరాల మధ్య వున్న వితంతువుల పట్టికను పొందుపరిచింది. అందులో: ఒక సంవత్సర ప్రాయపు విధవలు: 859; 2-3 సంవత్సరాలు: 1,039; 2-3 మధ్య: 1,886; 3-4 మధ్య: 3,732; 4-5 మధ్య: 8,180;5-10 మధ్య: 78,407; 10-15 మధ్య: 2,27,367. మొత్తం: 3,21,470. (మద్రాసు ప్రెసిడెన్సీ గణాంకాలు). వితంతు పునర్వివాహాలను వ్యతిరేకిస్తున్నారు కదా, అలా అయితే ‘‘వీరి గతి యేమి? మరణ పర్యంతము దుఃఖముల పాలబడవలసినదేనా? అని నిష్ఠూరంగా ప్రశ్నించి, ‘‘ఎంత అన్యాయము!’’ అని తన తీవ్ర నిరసన తెలియజేసింది (‘పత్రికా సంపాదకురాలి వ్యాసము’, మార్చి 1915, పు. 161-163).
బాల్యవివాహాల్ని ఖండిరచి, రజస్వలానంతర వివాహాల్ని ప్రోత్సహించిన ‘వివేకవతి’ రజస్వలలైనంత వరకు ఆగి, చదువుకొని, ఆ తర్వాత పెళ్ళి చేసుకొన్న స్త్రీలనూ, ఛాందస బ్రాహ్మణ / హిందూ సమాజపు ఒత్తిళ్ళను తట్టుకొని తమ కూతుళ్ళకు రజస్వలానంతర వివాహాలు చేసిన తల్లిదండ్రుల్నీ, మనసారా ప్రశంసించింది. వలసాంధ్ర మహిళోద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆచంట రుక్మిణమ్మది రజస్వలానంతర వివాహం. ఆమె డాక్టర్‌ ఆచంట లక్ష్మీపతిని పెళ్ళాడారు. సమాజ ఒత్తిళ్ళకు తలొగ్గక తన కూతురికి ‘‘యుక్త వయస్సు’’ వచ్చేవరకు ఆపి, చదివించిన రుక్మిణమ్మ తండ్రి అయిన హుగ్గెళ్ళ శ్రీనివాసరావుగారిని అభినందించడానికి ‘‘ఒక ధైర్యశాలి’’ అనే శీర్షికతో సంపాదకీయ వ్యాసాన్నే ప్రచురించింది ‘వివేకవతి’ (ఆగస్టు 1912, పు. 321). అందులో: ‘‘ఈ మాసము, ముఖపత్రములోనున్న రుక్మిణమ్మ (ఆమె నిలువెత్తు ఫొటో ప్రచురించారు) గారి చరిత్ర ప్రచురించుటకు సంతోషించుచున్నాము. ఎందుకంటె, ఆమె తండ్రిగారి గౌరవార్థము. ఆయన యెంత ధైర్య సాహస స్థైర్యము గలవారు! ఈమెకు యుక్తవయస్సు రాకముందు వివాహము చేయుమని తండ్రిగారిని బంధువులందరు బలవంతము చేసినను, వారి మాటలు సరకుచేయక విద్య పూర్తిjైుననేగాని వివాహము చేయనని స్పష్టముగా చెప్పుచుండిరి. మన దేశములో నెంతమంది పురుషులు శ్రీయుత హుగ్గెళ్ళ శ్రీనివాసరావుగారివంటి వారున్నారు? మన పట్ణణములలో నున్నతవిద్య గలవారును తమ పిల్లలకు వివాహము చేయుటకు విద్య మాన్పించుచున్నారు కారా? అది సరికాదని వారెరిగిననూ, అట్లు చేయుచున్నారు. ఎందుచేత? పితురాచారముల నవలంబించని యెడల (మూర్ఖురాండ్రైన) యింటి స్త్రీలు అల్లరి చేయుదురు. పురుషులు స్త్రీల చీవాట్లను అల్లరిని సహించలేరు గనుక వారి మాట ప్రకారము చేయుదురు’’ అన్నారు. అదే సంచికలోని యింకో పేజీలో ‘హిందూసుందరి’ నుండి గ్రహించిన రుక్మిణమ్మ సంగ్రహ జీవిత చరిత్రను ప్రచురించారు. అందులో కూడా ఆమె తండ్రిని ప్రశంసించారు. ఆమె తల్లి (పేరివ్వలేదు) యిచ్చిన తోడ్పాటును గురించి ‘‘ఈమె తల్లియును మిక్కిలి గుణవంతురాలు, విద్యావతియు నగుటచే, ఆయనకన్ని విధములను తోడ్పడుచుండె’’నని ప్రశంసించారు. రుక్మిణమ్మ 1911 డిసెంబర్‌లో డాక్టర్‌ ఆచంటి లక్ష్మీపతిని పెళ్ళాడారు. ఆమె తండ్రి అక్టోబర్‌ 1910లోనే చనిపోవడం వల్ల ‘‘కుటుంబమునందనేక కష్టములు వచ్చినను ధైర్యమును విడువక అవివాహితగానే యుండి మెట్రిక్యులేషన్‌ పరీక్షలో తేరి ఇప్పుడు ప్రెసిడెన్సీ కాలేజీలో ఎఫ్‌.ఎ. పరీక్షకు చదువుచున్నారు’’ అని రుక్మిణమ్మను కొనియాడారు (పు. 324). ఆ సంచికలోనే మద్రాసులోని ‘సరస్వతీ సమాజం’లో ‘సమాజముల వలని లాభములు’ అనే అంశంపై రుక్మిణమ్మ చేసిన ప్రసంగ పాఠాన్ని ప్రచురించారు (పు. 325`327). ఈ విధంగా బాల్యవివాహ దురాచారాన్ని ఎండగట్టి రజస్వలాంనంతర వివాహాలకు జైకొట్టింది ‘వివేకవతి’.
వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి బలంగా ప్రచారం చేసింది ‘వివేకవతి’. వితంతువుల సమస్యల్ని పలు కోణాల్లో చర్చించి పునర్వివాహాలను ప్రోత్సహించిన రచనలనేకం పత్రికలో ప్రచురితమయ్యాయి. తన సంక్షిప్త వ్యాసంలో ‘ఒక ఆంధ్ర స్త్రీ’, ‘‘హిందూ వితంతువుగా నుండుటకన్న ప్రపంచములో వేరే గొప్ప కష్టముండదు’’ అని కుండ బద్దలు కొట్టినట్టు ప్రకటించి, సమాజం హిందూ వితంతువులపై విధించే అనేక భయానకమైన ఆంక్షల్ని వివరించారు. ‘‘విధవరాండ్రను పెట్టు కష్టములను గురించి వ్రాయబూనిన యెడల ఎన్ని కాగితములైనను నిండు’’ తాయనీ, ‘‘వారి కష్టములు వినిన యెడల ఎంత కఠిన హృదయమైన వెన్నవలె కరిగి దుఃఖము రాకమానద’’నీ, ‘‘హిందూ వితంతువుగా నుండుట కన్న భర్తగారితో చనిపోవుట (సహగమనము) చాల మంచిదని గట్టిగా జెప్పవచ్చు’’ నని ధైర్యంకల ఆవేదనతో ప్రకటించారు. హిందువుల్లోని ‘‘అధమజాతి’’వారిలో పునర్వివాహ సౌలభ్యం వుందనీ, ‘‘అగ్రజాతి వారిలో’’ లేదనీ గుర్తు చేశారు. హిందువుల్లో పెళ్ళిళ్ళు పిల్లల ఇష్టప్రకారం కాకుండా తల్లిదండ్రుల ఇష్టప్రకారం జరుగుతున్నాయనీ, ‘‘అగ్రజాతి’’వారు పిల్లల ఇష్టాఇష్టాలు తెలుసుకోకుండా బాల్యవివాహాలు చేసేస్తున్నారనీ, ఈ మూర్ఖాచారము పోయి ‘‘యుక్త వయస్సు వచ్చి (పిల్లలు) స్వంత యిష్ట ప్రకారము’’ పెళ్ళి చేసుకొనే పద్ధతి త్వరలోనే వస్తే ‘‘దేశము బాగుపడు’’నని ఆశించారు (‘హిందూ వితంతువు’, జనవరి 1914, పు. 108`109).
వితంతు వివాహాలను ప్రోత్సహించే ‘హేమలత’ అనే నవల ‘వివేకవతి’లో ధారావాహికగా వెలువడిరది. రచయిత అసలు పేరేంటో తెలియదు: ‘నవవిధాని ప్రణీతము’ అని యిచ్చేవాళ్లు. ముసలతనికిచ్చి పెళ్ళి చేయడం వల్ల హేమలత బాలవితంతువౌతుంది. చదువుకుంటుంది. క్రైస్తవ మిషనరీ స్త్రీల సాంగత్యంతో మరింత జ్ఞానవంతురాలౌతుంది. సంస్కరణ దృక్పథం కల ప్రభాకరరావు బాలవితంతువైన హేమలతను పెండ్లాడతాడు. నవల ఉద్దేశం: వితంతు పునర్వివాహోద్యమం విజయవంతమవ్వాలంటే హేమలత లాంటి జ్ఞానవంతులైన స్త్రీలు అత్యంతావశ్యకం. మూర్ఖాచారాల అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న హిందూ స్త్రీలకు విజ్ఞానపు వెలుగెలా వస్తుంది? నవల యిచ్చిన జవాబు: క్రైస్తవ స్త్రీల సాహచర్యం వల్ల! నవలలో అనేక అనుషంగిక విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి. స్త్రీ విద్య, కన్యాశుల్కం`బాల్యవివాహ దురాచారం, క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు, సమాజంలో వారి పట్ల వున్న తీవ్ర వ్యతిరేకత, వారు దాన్నధిగమించి హిందూ స్త్రీలకు సేవ చేయడం మొదలైనవి. మొత్తానికి నవల క్రైస్తవ మిషనరీలది ‘సివిలైజింగ్‌ మిషన్‌’ అని చాలా బలంగా, స్పష్టంగా చెప్పింది.
వితంతువుల గణాంకాలను పొందుపరచి, ఎంత ఎక్కువ సంఖ్యలో వితంతువులున్నారో చూడండని చెప్పి, వితంతు సమస్య పట్ల ప్రజలను సెన్సిటైజ్‌ చేయడానికి గట్టిగా ప్రయత్నించింది. 1915 మార్చి సంచికలో ‘‘భయమును బుట్టించు బాలవిధవల సంఖ్య’’ శీర్షికతో 1`15 సంవత్సరాల మధ్య ఎంత పెద్ద సంఖ్యలో వితంతువులున్నారో తెలిపిందన్న విషయాన్ని యింతకు ముందే చూశాం కదా! 1913 జులై సంచికలో ‘హిందూదేశమందలి విధవలు’ శీర్షికన ‘‘హిందూదేశమందు 2 కోట్ల 70 లక్షల మంది విధవలున్నారు. వీరిలో 2 లక్షల 50వేల మంది 14 సం॥లకు తక్కువ ప్రాయము గలవారును, 14వేల మంది 4 సం॥లకు తక్కువ వయస్కులునై యున్నారు. బెంగళూరు పట్ణణమునందు మాత్రమే సంవత్సరమైనను ఈడు లేని బాలవిధవలు 433గురు గలరు’’ అని వితంతు సమస్య విశ్వరూపాన్ని చూపించింది. ‘‘హిందూ స్త్రీలమైన మనము మన కుమార్తెల వివాహ వయస్సును ఎక్కువయగునట్లు చేయుటకు మన శక్తి కొలది పాటుపడుట మన పనికదా?’’ అని ప్రశ్నించి, ‘‘ఈ భయంకర వైధవ్య బానిసత్వము నుండి మన ముద్దుబిడ్డల విడిపింపనైన మన వ్రాతకోతల నుపయోగింపకూడదా?’’ అని బాధాతప్త హృదయంతో నిష్ఠూరంగా ప్రబోధించింది (పు. 319).
అక్కడక్కడా జరిగిన వితంతు పునర్వివాహాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడం ద్వారా వితంతు పునర్వివాహోద్యమానికి ప్రచారం కల్గించింది ‘వివేకవతి’. ఉదాహరణకు, 1909 నవంబర్‌ సంచికలో ‘‘మొన్ననే’’ కర్నూలులో జరిగిన ఒక వితంతు వివాహాన్ని గురించి తెలియజేసి ‘‘ఈ కుశల వార్తను’’ విన్న గుత్తి (అనంతపురం జిల్లా) లోని కొందరు ప్రముఖులు ఒక సమావేశాన్నేర్పాటు చేసి, తన కుమార్తెకు వితంతు వివాహం జరిపించిన తండ్రిని ప్రశంసించి, అతన్ని అభినందిస్తూ టెలిగ్రామ్‌ పంపారనీ, దంపతులకు ఆయురారోగ్యాలు కలగాలని దేవుని ప్రార్థించారనీ తెలిపింది. ‘‘క్రీస్తు జ్ఞానము’’ వల్ల(నే) ప్రజల్లో మార్పు వస్తున్నందుకు సంతోషించింది! (‘విధవా వివాహము’, పు. 34). అదే సంచికలో మైసూరు బాల్యవివాహ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి బాల్య వివాహం చేసిన యిద్దరికి ఒక్కొక్కరికీ 30 రూపాయలూ, పెళ్ళి జరిపించిన పురోహితుడికి 50 రూపాయలూ, మైసూరు ప్రభుత్వం జరిమానా విధించిందనే వార్తను ప్రచురించారు (పు. 33). పై సంచికలోనే ఒక బాల వితంతువుకు సంబంధించిన ఘోరమైన వార్తను ప్రచురించారు. ‘‘తెక్కలి’’ (టెక్కలి)లో వేరునాటి బ్రాహ్మణుడైన మంత్రాల చిన్న సూర్యనారాయణ చనిపోతూ తన భార్యను పిలిచి (ఆమె పేరివ్వలేదు) ఎవరినైనా దత్తత తీసుకోమని చెప్పాడట. ఆమె తల్లిదండ్రులు కూడా దత్తతే తీసుకొమ్మని బలవంతపరచారు. కానీ ఆమె పునర్వివాహం చేసుకోవాలని వీరేశలింగంగారి దగ్గరికి పారిపోయింది. దాంతో తల్లిదండ్రులు ఆమెపై దొంగతనం నేరం మోపి వెనక్కి లాక్కొచ్చారు. కొంత కాలానికి ఆమెపై పెట్టిన కేసు కొట్టివేయబడిరది. (దొంగకేసు కదా! కొట్టేశారు!). ఆమె పునర్వివాహాభిలాషనూ, ఆ దిశగా ఆమె ప్రయత్నాల్నీ ధ్వంసం చేయాలనుకున్న తల్లిదండ్రులు ‘‘బలవంతంగా’’ ఆమె తల గొరిగించేసి బోడిని చేసేశారు. ఆమె తిరగబడి తండ్రిపై కోర్టుకెక్కగా నాన్న ‘‘పట్టుబడియున్నాడు. వ్యాజ్యము ఇంక జరుగుచునేయున్నది’’ (‘విధవరాలి కష్టములు’, పు. 34`35). ఎంత ఘోరమో కదా! ఇలాంటి అనేక ఘోరాతి ఘోరమైన విషయాల్ని ‘వివేకవతి’ బయట ప్రపంచానికి తెలియజేసి కళ్ళు తెరిపించేది.
ఇలాంటి ఘోరాల్నించి కాపాడి, కొంతవరకైనా వితంతువులకు ఊరటనిచ్చే వితంతు శరణాలయాలకు సంబంధించిన సమాచారానిచ్చేది ‘వివేకవతి’. 1913 సెప్టెంబర్‌ సంచికలో మద్రాసులో శ్రీమతి ఆర్‌.యస్‌. సుబ్బలక్ష్మి అమ్మాళ్‌ బి.ఏ., ఎల్‌.టి., నిర్వహిస్తున్న వితంతు శరణాలయం గూర్చి రాసింది. అక్కడ నివసిస్తున్న ‘‘హిందూ విధవలు, ముఖ్యముగా బ్రాహ్మణ విధవలు’’ ఉపాధ్యాయనులుగా, నర్సులుగా, టైలర్లుగా శిక్షణ పొందుతున్నారని తెలిపింది. అలాంటి శరణాలయాలను నిర్వహించడానికి ‘‘విశేష ద్రవ్య సహాయము’’ అవసరమనీ, ‘‘ఇండియాలోని విధవల స్థితిని పైకి లేవనెత్తవలెననిన(!) (బజూశ్రీఱట్‌ కు అనువాదం) ద్రవ్య సహాయము చేయుట కింతకంటె యోగ్యమైన పని వేరొకటి లేద’’నీ చెప్పింది (‘విధవల శరణాలయము,’ పు. 384). 1915 మే సంచికలో కూడా యిదే శరణాలయానికి సంబంధించిన సమాచారాన్నిచ్చింది. అది ‘‘పరిపూర్ణముగా స్త్రీల యజమాన్యము’’లో పని చేస్తోందనీ, ‘‘నౌకరులు కూడ స్త్రీలే’’ననీ తెలిపింది. నిర్వాహకురాలైన సుబ్బలక్ష్మమ్మ గారు కూడా బాల వితంతువేననీ (9 సం॥లకు వితంతువయ్యారామె), శరణాలయంలో ఉన్న 26 మంది వితంతువులు మద్రాసులోని ‘‘సెకండరీ ట్రైనింగు బడిలో’’ చదువుకొంటున్నారనీ వివరించింది (‘విధవాశ్రయ గృహము,’ పు. 227). 1918 ఏప్రిల్‌ సంచికలో కూడా ఈ శరణాలయాన్ని గూర్చే రాస్తూ, అది 1912లో స్థాపించబడిరదనీ, ప్రస్తుతం అందులో వుండి 70 మంది వితంతువులు చదువుకుంటున్నారనీ, వాళ్ళలో కొందరు స్కూల్‌ ఫైనల్‌ అయ్యాక ఢల్లీి వైద్య కళాశాలలో చదివి ‘‘బాధలోనుండు తమ హిందూ సోదరీమణుల కుపకారిణులుగనుందురు’’ అని ఆశించింది (‘శరణాలయము’, పు. 146). ఈవిధంగా హిందూ వితంతువుల సమస్యల పట్ల తీవ్ర సంవేదన చూపిన ‘వివేకవతి’, వాళ్ళకు వైధవ్యపు ‘‘ఖైదు’’ నుండి విడిపించి హుందాతో కూడిన జీవితం యిప్పించడానికి తన శాయశక్తులా కృషి చేసింది.
వలసాంధ్రలో క్రమక్రమంగా వృద్ధి చెందుతున్న మహిళోద్యమం పట్ల ఆసక్తి చూపిన ‘వివేకవతి’ దాన్ని నిండారా ప్రోత్సహించింది. వివిధ ప్రదేశాల్లో ఏర్పాటైన మహిళా సంఘాల గూర్చీ, మహిళల సమావేశాల గూర్చీ, వివిధ మహిళా సంఘాల కార్యక్రమాల విశేషాలనూ, మహిళా సంఘాల సమావేశాల్లో స్త్రీలు చేసిన ప్రసంగ పాఠాలనూ అత్యంత శ్రద్ధతో ప్రచురించేది. మద్రాసు ప్రెసిడెన్సీలోని మహిళోద్యమం గూర్చే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా మహిళోద్యమంలో చోటుచేసుకుంటున్న విశేషాల్ని చక్కగా తెలియజేసేది. ఉదాహరణకు, 1912 మే సంచికలో కర్నూలులోని ‘స్త్రీ విద్యాభివర్ధనీ సమాజం’ గూర్చి రాసింది. ‘‘నాగరికతయందు లోపము కలిగిన కడప, కర్నూలు జిల్లాలయందిట్టి’’ స్త్రీ సమాజాన్ని స్థాపించిన శ్రీమతి బుఱ్ఱా బుచ్చి బంగారమ్మ గారికి ‘‘అనేక వందనములు’’ అని ప్రశంసించింది (పు. 254). 1912 సెప్టెంబరు సంచికలో పై స్త్రీ సమాజాన్ని గూర్చి సంపాదకీయ వ్యాసమే రాసింది. ఆ సమాజం అభివృద్ధి చెందాలని కాంక్షించిన ‘వివేకవతి’, విద్యావంతులూ, ధనికులూ అయిన మగవాళ్లు తమ భార్యల్ని ఇలాంటి స్త్రీ సమాజాలకు పంపకపోవడం ‘‘విచారకరమైనది’’ అని వాపోయింది (‘పత్రికా సంపాదకురాలి వ్యాసము’ పు. 353 ` 354). 1912 జూలై సంచికలో, 1904లో విశాఖపట్నంలో స్థాపించబడ్డ ‘భారతీ సమాజ’పు విశేషాలను తెలిపింది (‘భారతీ సమాజము, విశాఖపట్టణము’, పు. 301` 302). ఇదే సంచికలో 1912 మే నెలలో కృష్ణా జిల్లా నిడదవోలులో జరిగిన మూడవ ఆంధ్ర మహిళా మహాసభకు సంబంధించిన సమాచారాన్నిచ్చింది. ఆ మహిళా సభ కాకినాడలోని శ్రీ విద్యార్థినీ సమాజం ఆధ్వర్యంలో జరిగిందనీ, బుఱ్ఱా బుచ్చి బంగారమ్మ అధ్యక్షత వహించారనీ, సుమారు 150 మంది స్త్రీలు సమావేశమై అనేక విషయాలను చర్చించడం ‘‘శ్లాఘనీయము’’ అనీ మెచ్చుకుంది. అంతేకాకుండా, మద్రాసు నుండి ఆచంట రుక్మిణమ్మ గారు వచ్చారని కూడా తెలిపింది. సభాధ్యత వహించిన బుఱ్ఱా బుచ్చి బంగారమ్మగారు తన తల్లికి సభకు కేవలం ఒక్క రోజు ముందే ‘‘వ్రణమునకు శస్త్ర చికిత్స’’ జరిగినా ‘‘ఆమెను వదలి వచ్చి తన వాగ్దానమును నిలుపుకున్న’’ందుకు ఆమెను ‘‘మిక్కిలి కొనియా’’డిరది (‘ఆయాచోట్ల జరిగిన సంగతులు: ఆంధ్ర మహిళా సభ’, జూలై 1912, పు. 318).
వివిధ మహిళా సంఘాల వివరాలే కాకుండా, వాటి సమావేశాల్లో మహిళా మేధావులు చేసిన ప్రసంగ పాఠాల్ని విశేష ప్రాధాన్యతనిచ్చి ప్రచురించేది ‘వివేకవతి’. ఉదాహరణకు, 1911 జూలై సంచికలో కాకినాడలోని ‘శ్రీ విద్యార్థినీ సమాజ’ వార్షికోత్సవంలో ఉప్పులూరి నాగరత్నమ్మ ‘‘చదివిన’’ వ్యాసాన్ని ప్రచురించింది. అందులో ఆమె హిందూ సమాజం ఐకమత్యంతో వుండాల్సిన అవసరాన్ని తెలియజేశారు (‘ఐకమత్యము’, పు. 299`300). ఉప్పులూరి నాగరత్నమ్మే ‘‘చక్రవర్తి గారి పట్టాభిషేక దినమున’’ కాకినాడలో ‘‘చదివిన’’ ప్రసంగ పాఠం 1912 మే సంచికలో ప్రచురితమైంది. అందులో ఆమె బ్రిటిష్‌ పాలన వల్ల భారతీయులకు కలిగిన అనేక రకాలైన ప్రయోజనాల్ని వివరించారు (‘ఆంగ్లేయ పరిపాలనము వలని లాభములు’, పు. 234`237). ‘‘చక్రవర్తిగారి పట్టాభిషేక దినమున’’ శ్రీకాకుళంలోని స్త్రీల సభలో మిసెస్‌ సామినేని ఆదినారాయణరావు గారు చదివిన వ్యాసం 1912 మార్చి సంచికలో ప్రచురించబడిరది. ఇందులో ఆమె బ్రిటిష్‌ పాలన వల్ల కలిగిన లాభాల్నీ, భారతీయులు ఆంగ్ల ప్రభుత్వం పట్ల భక్తితో వుండాల్సిన అవసరాన్నీ నొక్కి చెప్పారు (‘రాజభక్తి’, పు. 168 ` 169). 1912 మే 16, 17 తేదీల్లో విశాఖపట్నంలోని ‘భారతీ సమాజ’ వార్షికోత్సవానికి అధ్యక్షత వహించిన సౌభాగ్యవతి కందుకూరి వెంకాయమ్మరావు ‘‘చదివిన’’ ప్రసంగాన్ని ఆగష్టు నుండి నవంబరు 1912 దాకా నాలుగు విడతల్లో ప్రచురించింది ‘వివేకవతి’. ఇందులో ఆమె ‘స్త్రీల స్థితి’, ‘స్త్రీ విద్య’, ‘స్త్రీ స్వాతంత్య్రము’, ‘పాతివ్రత్యము లేక సత్‌ ప్రవర్తనము’, ‘పిల్లల పెంపకము’, ‘చెడ్డ గ్రంథములను విసర్జించుట’, ‘పిల్లల వివాహము’, ‘కన్యాశుల్క ` వర శుల్కములు’, ‘సంఘ సంస్కరణము’, ‘సంఘము యొక్క ఉపయోగములు’ అనే అంశాలపై ప్రసంగించారు (ఆగష్టు 1912, పు. 343 ` 345Ñ సెప్టెంబరు 1912, పు. 355 ` 357Ñ అక్టోబరు 1912, పు. 19 ` 21Ñ నవంబరు 1912, పు.55 ` 56).
మహిళా సంఘాలూ, సమావేశాలూ స్త్రీల జీవితాల్లో మెరుగైన మార్పులు తెస్తాయని బలంగా విశ్వసించిన ‘వివేకవతి’ అలాంటి సభలూ, సమావేశాలకు వెళ్లమని స్త్రీలను ప్రోత్సహించేది. స్త్రీల సభలూ సమావేశాలకెళ్లి ‘‘పది మంది స్త్రీలు కలియుట గొప్ప కార్యమేగానీ వేరు కాదు’’ అని మహిళా సంఘాలూ, సమావేశాల పట్ల స్త్రీలకున్న సంకోచాల్ని దూరం చేసేందుకు ప్రయత్నించింది (‘పత్రికా సంపాదకురాలి వ్యాసము’, సెప్టెంబరు 1912, పు. 354). తమ స్త్రీలని మహిళా సంఘాల సమావేశాలకు పంపమని అడిగినప్పుడు పురుషులు ‘మా స్త్రీలెందుకు రావాలి? వాళ్లకేం లాభం?’ అనేవారట. దానికి సమాధానమిస్తూ ‘‘ఏమాశ్చర్యము! అట్టి కూటములకు వెళ్లుట వలన స్త్రీలు సంస్కారములయందభివృద్ధి పొందుదురు. అప్పుడు బాల్య వివాహములు మొదలగు దురాచారముల నవలంబించక, తమ బిడ్డలకు దేశమునకును మేలైనవని తెలిసికొన్న వాటిని ఆచరణలోకి తెత్తురు’’ అని మహిళా సంఘాల వల్ల కలిగే వాస్తవిక లాభాల్ని తెలిపింది (‘స్త్రీ సమాజములు’, ఆగస్టు 1912, పు. 322). తమ ఆడవారిని మహిళా సంఘాల సమావేశాలకు పంపని మగవాళ్లను విమర్శించింది (‘ఒక చిన్న దృష్టాంతము’, ఆగష్టు 1912, పు.322 ` 323Ñ ‘పత్రికా సంపాదకురాలి వ్యాసము’, సెప్టెంబరు 1912, పు. 354). వలస పాలనా కాలంనాటి మహిళోద్యమ సమాచార గనులు స్త్రీల పత్రికలు. ‘ఆడవాళ్ళ వ్యవహారాలు మనకెందుకులే’ అనుకున్నాయేమో మగ పత్రికలు మహిళోద్యమాన్ని పెద్దగా పట్టించుకునేవి కావు. అలాంటి మగ చారిత్రక సందర్భంలో స్త్రీల సంఘాలూ, సమావేశాలూ, ఉపన్యాసాలూ, పాల్గొన్నవారూ యిలా అనేక విషయాల్ని స్త్రీల పత్రికలే పట్టించుకున్నాయి – ‘‘మనకు’’ సంబంధించిన విషయం కాబట్టిÑ స్త్రీ పర్వాన్ని ప్రారంభించాయి. స్త్రీల పత్రికలే లేకపోయుంటే యింత గొప్ప సమాచారం చాలా వరకు శాశ్వతంగా కోల్పోయేవాళ్ళం. నిరుడు వెలిగిన దీపశిఖల్ని చూడలేకపోయేవాళ్ళం. కాబట్టి తనలో కూడా కొన్ని దారి దీపాల్ని నిక్షిప్తం చేసిన ‘వివేకవతి’ సదా సంస్మరణీయమైనది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.