కాత్యాయనీ విద్మహే
కొడవటిగంటి కుటుంబరావు 1941 నాటికే నవలలు వ్రాయటం ప్రారంభించాడు. మొదట్లోనే ఆత్మగౌరవ చైతన్యంతో ప్రవర్తించే కస్తూరి వంటి వారి జీవితాన్ని ‘నీకేం కావాలి’ అన్న నవలలో చూపించాడు. 1948లో ఆడజన్మ నవల వ్రాసి స్త్రీజాతికి పుట్టుక నుండి పెరుగుదల వరకు సాంఘిక ఆర్థిక రంగాలలో జరుగుతున్న అన్యాయాల పట్ల నిరసన వ్యక్తం చేశాడు. 1957లో పంచకళ్యాణి నవల వ్రాసి చదువుకొంటున్న మధ్యతరగతి మహిళ జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకొనటానికి చేస్తున్న ప్రారంభ ప్రయత్నాలను చూపించాడు. ఆ వరుసలో 1961లో ఆయన వ్రాసిన వారసత్వం నవల స్త్రీల సమస్యల సంక్లిష్టతను గురించిన అవగాహనను ఇయ్యటంలో మరొక సమర్ధవంతమైన ప్రయోగం.
పదకొండవ ఏట పెళ్ళయి, ఒక ఆడపిల్ల తల్లి అయి పాతికేళ్ళకే భర్తను కోల్పోయి – సుదర్శనంతో సంబంధంలోకి వచ్చి అతనికి రెండవ భార్య అయి తద్వారా అతని కుటుంబసభ్యులతో పైకి కనబడని సంఘర్షణలోకి ప్రవేశించిన భాను జీవిత పరిణామాలు, దానితోపాటు ఆమె తమ్ముడు శాస్త్రి జీవిత పరిణామాలు, కూతురు పద్మ జీవిత పరిణామాలు కలగలసి సుదర్శనం కొడుకు రామదాసు ఆర్థిక సాంస్కృతిక జీవన వ్యూహాల సాపేక్షతలో ఈ నవలకు ఇతివృత్తమైనాయి. నవల 1961లో వ్రాయబడినదే అయినా నవలలో కథాకాలం మాత్రం 1937, 1945 మధ్యకాలం. అంతర్గత సాక్ష్యాలను బట్టి దీనిని నిర్ధారించవచ్చు.
భానుకు పదకొండవ ఏట పెళ్ళయింది. కాపురానికి వెళ్ళిన అయిదేళ్ళ అనంతరం ఆమె తండ్రి ఆస్తి యావత్తూ భాను పెళ్ళికి చేసిన అప్పు కింద తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఆస్తికి న్యాయమైన వారసుడు భాను తమ్ముడు భానుకన్న ఎనిమిదేళ్ళు చిన్నవాడయిన శాస్త్రి – అంటాడు (పు1) ఈ నవలలో సంఘటనలకు సందర్భాలకు, పరిణామాలకు సాక్షి, వ్యాఖ్యాత అయిన కథకుడు. ఆ కథకుడు కుటుంబరావు కన్నా భిన్నం కాదు. భాను కాపురానికి వెళ్ళింది 15, 16 సంవత్సరాలకు అనుకొంటే ఆమె తండ్రి ఆస్తి పోయింది. అయిదేళ్ళ అనంతరం కనుక అప్పటికామెకు 21 లేదా 22 ఏళ్ళు వుండవచ్చు. అక్కకన్నా ఎనిమిదేళ్ళు చిన్నవాడు కనుక శాస్త్రికి అప్పుడు పదమూడు పధ్నాలుగేళ్ళ వయసుండటానికి వీలుంది. తండ్రి మరణానంతరం ఇల్లూవాకిలీ లేకుండా, తిండికీ చదువుకూ ఆధారం లేకుండా విధవ తల్లితో వీధిలో నిలబడ్డ తమ్ముడిని తన దగ్గర వుంచుకొని చదివించటానికి భాను భర్తను ఒప్పించింది. అక్క దగ్గరకు చేరిన శాస్త్రి థర్డు ఫారంలో చేరాడు. అప్పటికి భానుకు నాలుగేళ్ళ కూతురు వుంది. ఆ పిల్ల పేరు పద్మ. శాస్త్రి కంటే తొమ్మిదేళ్ళు చిన్నది అని చెప్పాడు రచయిత (1) అంటే శాస్త్రి వయసు అప్పటికి పదమూడు పధ్నాలుగేళ్ళు (4+9=13) కావటం సరిగానే వుంది. అక్క దగ్గర వుండి చదువుకొంటూనే శాస్త్రి స్కూలుఫైనలు పాసయ్యాడు. అతని కాలేజీ చదువుకు భర్త ఒప్పుకొంటాడో లేదోనని భాను వితర్కిస్తున్న రోజుల్లోనే ఆమె భర్త న్యుమోనియా వచ్చి చనిపోయాడు. అప్పటికి పద్మకు ఎనిమిదేళ్ళు. అంటే శాస్త్రి పదిహేడు ఏళ్ళవాడు. భానుకు పాతికేళ్ళు. భర్త మరణం వల్ల మగపిల్లవాడిని కనని కారణం చేత పాతికేళ్ళకే భాను జీవితం మొండిపడింది (2) అని రచయిత చెప్పిన మాటతో ఇది సరిపోతుంది.
భాను భర్త దినవారాలకు వచ్చిన సుదర్శనం పని ఇప్పిస్తానంటే శాస్త్రి అతని వెంట మద్రాసు వెళ్ళాడు. సుదర్శనం వెళ్ళి అక్కను, అక్క కూతురిని మద్రాసు తీసుకువచ్చి ఒక ఇల్లు ఏర్పరచి అందులో ప్రవేశపెట్టేంత వరకు అంటే దాదాపు ఒక ఏడాదిపాటు శాస్త్రి ఉద్యోగం చేశాడు. ‘జూన్‌లో శాస్త్రి కాలేజీలో చేరతానంటున్నాడు. వాడికొక ఏడాది చదువు చెడిపోయింది.’ అని భాను దుర్గాంబతో అన్నమాట (25) దీనిని సూచిస్తుంది. అన్నట్లుగానే శాస్త్రి కాలేజీలు తెరిచాక ఇంజనీరింగు డిప్లొమా కోర్సులో చేరాడు. యుద్ధం ప్రారంభమైన మూడేళ్ళకు శాస్త్రి డిప్లొమా ఇంజనీరైనాడు (33) యుద్ధం అంటే అది రెండవ ప్రపంచయుద్ధం. 1939లో వచ్చింది. 1945 వరకు జరిగింది. యుద్ధకాలంలోనే శాస్త్రికి బొంబాయిలో ఒక ఫాక్టరీలో ఉద్యోగం ఇప్పించాడు సుదర్శనం. శాస్త్రి ప్రపాంచిక దృక్పథం సామ్యవాదం ఆశయంగా రూపొందటం అక్కడే ప్రారంభమైంది. బొంబాయి ఉద్యోగంలో వుండగానే యుద్ధమూ అయిపోయింది. యుద్ధం అయిపోవటంతో అతని ఉద్యోగమూ ఊడే దశకు వచ్చింది. సుదర్శనం కొడుకు రామదాసుతో కలిసి ఖద్దరు వ్యాపారం చేస్తూ ఏడెనిమిది నెలలు బొంబాయిలోనే గడిపాడు. (47) అది దొంగ ఖద్దరని తెలిసి ఇక ఆ వ్యాపారం చేయలేక నెలరోజుల పాటు వేరే ఉద్యోగానికి ప్రయత్నించాడు. (48) ఆ నెలరోజుల్లో చేతిలో వున్నది ఖర్చవుతూ, సహాయానికి అక్కకు ఉత్తరం వ్రాస్తే జవాబుగా తిరిగివచ్చెయ్యమని అక్కడ రామదాసు పెడుతున్న కొత్త కంపెనీలో ఉద్యోగం చేయవచ్చునని ఆమె జవాబు వ్రాస్తుంది. దానితో అతని బొంబాయి జీవితం ముగిసింది. మద్రాసుకు తిరుగు ప్రయాణమయ్యాడు.
యుద్ధం ప్రారంభమైన మూడేళ్ళకు శాస్త్రి డిప్లమా ఇంజనీర్ అయినాడు కనుక అది 1939+3=1942 అయి వుంటుంది. యుద్ధం అయ్యాక దాదాపు ఒక ఏడాది పాటు బొంబాయిలో గడిపాడు. అంటే 1946లో అతను మద్రాసుకు తిరిగి వెళ్ళినట్లు. అక్కడే నవలేతివృత్తం ముగింపుకు వచ్చింది. 1947లోగానే కావాలి. బెంగాల్ క్షామం, నావికుల తిరుగుబాటు వంటి ఎన్నో సమకాలీన చారిత్రక సంఘటనలను ప్రస్తావించిన కొ.కు. భారత స్వాతంత్య్ర ప్రస్తావన చేయకపోవటాన్ని బట్టి ఈ నవల ఇతివృత్తం 1947కు లోపలే కావాలి.
శాస్త్రి 1939లో ఇంజనీరింగు డిప్లమా కోర్సులో చేరాడు. అప్పటికతనికి 18 లేక 19 ఏళ్ళు. దానిని బట్టి అతను పుట్టింది 1920 అవుతుంది. అతని అక్క భాను అతనికంటే ఎనిమిదేళ్ళు పెద్దది కనుక 1912లో పుట్టి వుంటుంది. భాను పుట్టుక నుండి కథనం మొదలైనా ఆమె పెళ్ళి నుండి అసలు కథకు బీజం పడింది. పెళ్ళి పదకొండో ఏడున అయింది కనుక అది 1912+11=1923 అయి వుంటుంది. కూతురు పుట్టటం అది ఎనిమిదేళ్ళ పిల్ల కావటం, భర్త మరణించటం అని వరుసగా చెప్పబడ్డాయి. ఆమెకు పాతికేళ్ళు వచ్చేవరకు జరిగిన ఈ ఘటనలు నవవేతివృత్తానికి చోదకశక్తులు. భానుకు పాతికేళ్ళు వచ్చాకనే అసలు గమనం మొదలైంది. 1912+25=1937 దాటాక నవలేతివృత్తగమనం ప్రారంభమైనట్లు. 1937లో కాంగ్రెస్ శాసనసభల ఎన్నికలకు సుదర్శనం నిలబడిన విషయం కథనంలో భాగం (24) కావటం దీనినే సూచిస్తుంది. 1938 నుండి 1946 వరకు ఎనిమిదేళ్ళ కాలం మీద భారతీయ ఆర్థికవ్యవస్థలో పెట్టుబడిదారీ విధానం దాని అధమరూపంలో ప్రవేశించి మానవ సంబంధాలలో, సంస్కృతిలో తెచ్చిన హీన పరిణామాలను చిత్రించటంగా వారసత్వం నవలేతివృత్తం రూపుదిద్దుకొంది. సంపదల వారసత్వం, సంతాన వారసత్వం అన్న రెండంశాలను కలుపుకొని ఈ వలయంలో ఆస్తిలేని పురుషులు, హక్కులు లేని స్త్రీలు పడుతున్న వ్యధను చూపించింది.
వ్యక్తిగత ఆస్తి, కుటుంబం, రాజ్యం ఒకదాని సంబంధంలో ఒకటి పుట్టి పరిణామం చెందుతూ అధికార వ్యవస్థలుగా స్థిరపడిన తీరును సామాజిక రాజకీయార్థిక తత్వవేత్తలు నిరూపించారు. ఈ మూడు వ్యవస్థల్లోనూ పౌరసత్వం కీలకాంశం. ఆస్తి వారసత్వం, వంశ వారసత్వం, రాజ్య వారసత్వం అన్నీ తండ్రి నుండి కొడుకుకు బదలాయింపబడేవే. ఈ పితృస్వామ్య అధికార వారసత్వం అమలుకు సంతానాన్ని కని పెంచటమే స్త్రీల పని. ఈ క్రమాన్ని ఇందులోని హింసను భాను జీవితం ఒక కోణం నుండి ప్రదర్శిస్తే బాలజీవితం మరొక కోణం నుండి ప్రదర్శించింది.
భానుకు భర్త చనిపోయేనాటికి వున్నది ఎనిమిదేళ్ళ కూతురు మాత్రమే. ఆస్తుల వారసత్వం పురుషుడి నుండి పురుషుడికి బదలాయించబడుతుంటుంది కనుక, ఆమెకు కొడుకు వుంటే అత్యంత సహజంగా తాతగారి ఆస్తికి తండ్రి తరువాత తాను హక్కుదారు అయి వుండేవాడు. కొడుకు లేడు. వున్నది కూతురు. కూతురికి ఆడపిల్లలకు ఆస్తి వారసత్వపు హక్కు లేదు. ఆస్తికి వారసుడు కాగలిగిన కొడుకును కని వుంటే భర్త చనిపోయినా భాను జీవితం మరీ అంత హీనమయ్యేది కాదు. ‘మగపిల్లవాణ్ణి కనని కారణం చేత పాతికేళ్ళకే భాను జీవితం మొండిపడింది’ అని చెప్పి కొ.కు. ఆస్తికి వారసులను కనలేని స్త్రీల జీవిత దౌర్భాగ్యాన్ని సూచించాడు.
స్త్రీల జీవితం ప్రాథమికంగా పరాధీనమైంది. ఆ పరాధీనత రకరకాల రూపాలలో వ్యక్తమవుతుంటుంది. తన పుట్టింటి స్వంతతనాన్ని వదులుకొని అత్తింటిని తన ఇంటిగా తన స్వంతంగా స్వీకరించటం ఆడవాళ్ళ పరాధీనతలో భాగమే. తమకు తెలియకుండానే ఈ రకమైన పరాధీనతకు తమను తాము ఒదిగించుకొనే శిక్షణ స్త్రీకి ఇయ్యబడుతుంది. శాస్త్రిని తన ఇంట చదువుకు పెట్టుకొన్న భానుకు తన అత్తింటి వాళ్ళందరూ వాడిని హీనంగా చూడటం ఆమెను బాధించకపోవటం గమనించదగింది. నిజానికి భాను కూడా ఈ విషయంలో అత్తవారివైపు మనిషిలాగే ప్రవర్తించేదిగానీ తమ్ముడువైపు మనిషల్లే ప్రవర్తించేది కాదంటాడు రచయిత (2) ‘తమ దయాధర్మాల మీద ఆధారపడి బ్రతికేవాణ్ణి హీనంగా చూడటానికి వాళ్ళకు ఎంత హక్కున్నదో ఆమెకూ అంత హక్కున్నది’ అని కొ.కు. అన్న మాటలు పెళ్ళయిన స్త్రీ పుట్టింటికి చెందనిదానిలాగే మారిపోయే పరిస్థితిని సూచిస్తాయి.
పరాధీనత యొక్క మరొక రూపం స్వేచ్ఛ లేకపోవటం. భౌతిక స్వేచ్ఛ మాత్రమే కాదు. మానసిక స్వేచ్ఛ కూడా లేకపోవటం. స్త్రీల మనస్సులను, మెదళ్ళను నియంత్రించగలిగిన పితృస్వామిక సంస్కృతిలో స్త్రీకి ప్రేమించటానికైనా స్వేచ్ఛ లేదు. ద్వేషించటానికైనా స్వేచ్ఛ లేదు. భాను భర్త మరణించినప్పుడు భాను ఏడ్చిన ఏడుపు గురించి చెప్తూ రచయిత ‘భాను భర్త మీద ప్రేమకొద్దీ ఏడిచిందనటానికి లేదు’ అంటాడు. ప్రేమించడానికీ ద్వేషించడానికీ కూడా మనిషికి కొంత మానసికమైన స్వేచ్ఛ వుండాలి అనే కొ.కు. అలాంటి మానసిక స్వేచ్ఛ లేని స్థితిలోనే భానులాంటి వాళ్ళు అనేకమంది స్త్రీలు కాపురాలు చేస్తున్నారని అందువల్ల వాళ్ళ జీవితంలో ప్రేమకు అవకాశమే లేదని అభిప్రాయపడతాడు. ప్రేమ లేకపోవటం వల్లనే ఆ స్త్రీలు వైవాహిక జీవితంలో పొందవలసిన శరీరానందాన్ని పొందలేకపోతున్నారని మరొక సందర్భంలో అంటాడు. ఆ విధంగా స్త్రీల ‘లైంగికానుభూతి’ అన్న అంశాన్ని సామాజిక సమస్యగా చర్చకు తెచ్చాడు.
స్త్రీ జీవితాన్ని బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు రక్షిస్తారనే మనుసూత్రం ఆర్థికమైనదే. జన్మనిచ్చి పోషించిన తండ్రి అధీనం నుండి పెళ్ళి ద్వారా స్త్రీ భర్త అధీనంలోకి వస్తుంది. ఆ భర్తే మరణిస్తే అత్తగారింట ఆమె జీవితం నరకమే. ఆస్తికి వారసుడు కాగలిగిన కొడుకు వుంటే పరిస్థితి అంత హీనంగా వుండదు. భర్త అధీనం నుండి కొడుకు అధీనంలోకి ఆమె జీవితం బదలాయించబడుతుంది. అయితే మగపిల్లవాడు లేని భానుకు ఆ అవకాశం లేకపోయింది. తమ్ముడు చనిపోవటం వలన అతనికి మగబిడ్డలు లేరు. కనుక అతని ఆస్తికి హక్కుదారుడైన బావగారి అధీనమైంది ఆమె జీవితం. భానుకు తిండి బట్టా చూడటం, పద్మకు తగిన సంబంధం చూచి పెళ్ళి చేసి పంపటం ఇవి ఆయన బాధ్యతలు. ఈలోగా యవ్వనంతో తన ఇంట్లో తన అధికార పరిధిలో మసిలే భానుపై ఆశపడటం, వేటాడటం, వేటకు దొరకలేదన్న కారణంగా ఆయన వేసే నిందలకు గురిఅవుతూ బ్రతకటమే తప్ప భానుకు గత్యంతరం లేకపోయింది.
ఈ రకమైన పరాధీనత స్త్రీలను న్యూనతకు లోనుచేసి ఏ హక్కులూ అడగకుండా, అసలు మనుషులుగా తమకు కొన్ని సాంఘిక హక్కులుంటాయన్న స్పృహే లేకుండా బ్రతకటానికి సంసిద్ధులను చేస్తుంది. అందువల్లనే తనను పెళ్ళి చేసుకొంటావా అని సుదర్శనం అడిగినప్పుడు భాను ‘నాకు పెళ్ళేమిటి? మొగుడు పోయినదాన్ని, పిల్లతల్లిని’ అని నిర్ఘాంతపోతుంది. పూర్వాచారం గీసిన గిరి స్త్రీని అత్తింట్లోనో పుట్టింట్లోనో బ్రతకమని ఆదేశిస్తుంది. భాను తమ్ముడి దగ్గరకు వెళ్తున్నట్లు చెప్పినా సరే ఒకసారి అత్తగారింటితో ఆర్థిక లావాదేవీలు తెగతెంపులు చేసుకొని గడపదాటి సుదర్శనంతో వచ్చేసి ఆ గిరిని దాటింది. అట్లా గీత దాటిన స్త్రీకి రక్షణ లేదనీ, ఉండనవసరంలేదనీ విశ్వసించేటట్లు వ్యవస్థ ఆమెను తయారుచేసింది. అందుకనే పెళ్ళిలేకుండా తనను తాకవద్దని సుదర్శనంతో అనవచ్చన్న ఆలోచన కూడా ఆమెకు రాలేదు. ఈ ఆలోచన లేకుండా ఈనాటికీ ఎంతోమంది ఆడపిల్లలు ప్రేమించామని శరీరాన్ని అప్పగించేసి గర్భాలు తెచ్చుకొని పెళ్ళికయి వాళ్ళను దేబరించవలసిన స్థితిలో వుండటం – నిత్యం పత్రికలలో చూస్తున్న వాస్తవ ఘటనలే. తీరా భాను గర్భవతి అని తెలిశాక సుదర్శనం బొంబాయి తీసుకువెళ్ళి ఆమెను రిజిస్టరు పెళ్ళి చేసుకొని తమ సంబంధానికి చట్టబద్ధతనయితే కల్పించాడు కానీ, ఆమెకు ఎనిమిదో నెల గర్భస్రావమయింది. భానుకు మగపిల్లవాడు పుడితే సుదర్శనం ఆస్తిలో వంతుకొస్తాడన్న ప్రమాదాన్ని నివారించటానికే దుర్గాంబ, ఆమె కొడుకు రామదాసు ఏదో మందు పెట్టించటం వల్ల ఇలా అయిందని సుదర్శనం అనుమానించాడు. భానుతో తన అనుమానం గురించి చెప్పాడు. మొదటి వివాహంలో కొడుకు లేకపోవటం వల్ల మొండికిపడ్డ భాను జీవితం రెండవ వివాహం దగ్గరకు వచ్చేసరికి కొడుకును కంటుందేమోనన్న కారణంగా కనిపించని కుట్రకు గురికావటం ఒక వైరుధ్యం. సంపదల వారసత్వం, సంతాన వారసత్వం ఈ రెండు భావనలు, ఆచరణలు స్త్రీ జీవితాన్ని అటు ఆస్తిహక్కు గానీ, ఇటు పునరుత్పత్తి హక్కుగానీ లేని హింసాస్థితికి ఎలా నెడుతున్నవో ఈ సందర్భం నుండి గ్రహించవచ్చు.
సుదర్శనంతో సంబంధంలోకి వచ్చాక భాను జీవితమంతా ఉత్థానపతనాలతో సాగింది. స్వంత ఇల్లు, బ్యాంకులో డబ్బు, నవరసులు కొని దాచుకొనటం – ఇదొక దశ. సుదర్శనాన్ని రిజిస్టర్ పెళ్ళి చేసుకొని ఆయన భార్యాపిల్లలతో వారింట్లోనే వుంటూ రామదాసు పెళ్ళిలో కొంత పెత్తనం కూడా చలాయించిన దశ. గర్భం పోగొట్టుకొని తన బిడ్డతో మళ్ళీ ఇంటికి చేరిన దశ. రామదాసు ఆర్థిక వ్యూహంలో తనదైన మొత్తం సొమ్ము హరించుకుపోయి అవమానాలకు, దుఃఖానికి గురి అవుతూ బతికిన దశ. అక్కడినుండి ఒక అద్దె ఇంటికి మారిన దశ. ఈ అన్ని దశలలోనూ ఆర్థిక వ్యవహారాలలో ఆమె స్వతంత్రురాలేమీ కాదు. సుదర్శనమో, సుదర్శనానికి తెలిసి కానీ తెలియక కానీ రామదాసో వాటిని నిర్దేశించారు. మొత్తం మీద భానుకు ఆస్తి ఏర్పడటం కానీ, పోవటం కానీ సుదర్శనం సంకల్పం వల్ల, చాతకానితనం వల్ల జరిగినవే. స్త్రీజీవితం ఎంత పరాధీనమో ఈ సందర్భం నుండి మరొకసారి గుర్తించవచ్చు. భాను జీవితంలోని పతనాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ కొ.కు. ”ఇలాంటి పతనం మగవాడికన్నా ఆడదాన్ని ఎక్కువ బాధిస్తుంది. మగవాడు మళ్ళీ ఎక్కగలడు. కనీసం ఎక్కడానికి ప్రయత్నించగలడు. ఆడదానికి ఆ అవకాశం లేదు. ముఖ్యంగా భానువంటి ఆడదానికి.” (82) అంటాడు. తన ఉత్థానపతనాలకు తాను కారణం కాక, వాటి గురించి తాను ఆలోచించాల్సిందీ చేయవలసిందీ ఏమీలేక ఒక నిస్సహాయ, నిర్వ్యాపార స్థితిలో వుండే స్త్రీకి ఏర్పడే మానసిక అవస్థ అసూయ. భాను సరస్వతిని చూచి అసూయపడటాన్ని ఈ కోణం నుండి చూడాలి. తన జీవితమే తన చేతుల్లో లేని భాను తన కూతురు పద్మ జీవితాన్ని ఒక మార్గంలో పెట్టగల స్థితిలో అసలే లేదు. పద్మ జీవితాన్ని నిర్దేశించే, ప్రలోభపెట్టే ఇతరేతర శక్తుల విశ్వరూపం చూచిన భానుకు తన తమ్ముడు శాస్త్రి పెళ్ళాడితే తప్ప కూతురు జీవితానికి ఒక ఆలంబన, స్థిరత్వం సమకూడదనిపించింది. ఆ స్థితిలో శాస్త్రితో సన్నిహితంగా వున్న సరస్వతి పట్ల ఒక శత్రుభావం అసూయగా వ్యక్తమైంది. అసూయ స్త్రీల లక్షణం కావటానికి వాళ్ళ జీవిత పరాధీనతకు వున్న సంబంధాన్ని కొ.కు. ఈ సందర్భం నుండి పాఠకుల దృష్టికి తీసుకొని వస్తాడు.
వారసత్వం నవలేతివృత్తంలో ‘బాల’ది వారసత్వం సమస్యకు మరొక కోణం. రెండో ప్రపంచయుద్ధం అయిపోగానే రామదాసు శకం ఆరంభమయిందంటాడు కొ.కు. నూతన ధనికస్వామ్యవర్గపు శకం అది. సుదర్శనం ఊహించినట్లు డబ్బు సాధ్యమైనంత పెద్ద మొత్తంలో ఒకచోట కేంద్రీకరించటానికి రకరకాల ఎత్తులు ఎత్తిన వారి శకం. స్వంతంగానూ, జాయింట్‌గానూ దగా కంపెనీలు పెట్టటం భారతదేశ భవిష్యత్తు గురించి కలలను అమ్ముతూ స్వంతానికి డబ్బు చేసుకొని కంపెనీలకు మూసెయ్యటం, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టటం – ఇవన్నీ రామదాసు సంపాదనామార్గాలు. ఈ పద్ధతులల్లో పెంచుతూ పోతున్న ఆస్తికి వారసులను కనగలిగిన శారీరకధర్మం అతనిలో లేదు. పెళ్ళవుతూనే ఆ విషయం అర్థమైంది ఆయన భార్య బాలకు. ఆమె శాస్త్రితో సంబంధం ఏర్పరచుకొనటం వెనక రామదాసు వ్యూహం వుండే వుంటుంది. తమ ఆస్తిలో వాటా పొందగలిగిన భార్య హోదాలో భాను తండ్రి జీవితంలోకి ప్రవేశించినప్పుడే భానుతో పాటు, ఆమె తమ్ముడు శాస్త్రి కూడా అతనికి శత్రువే అయ్యాడు. శాస్త్రి నెత్తిమీదిగా నడిచిపోతూ తాను ఎదగటానికి ఖద్దరు వ్యాపారంతో ప్రారంభం చేశాడు. జీతాన్ని షేర్ల కింద జమకట్టుకొనే జీతం లేని నౌకరీ ఇచ్చాడు. ఆ క్రమంలోనే తన వంశానికి వారసులను కనిచ్చే పనిలోకి శాస్త్రిని చాకచక్యంగా లాగగలిగాడు. బాలకు శాస్త్రి తోటి సంబంధంలో పుట్టిన పిల్లలు శాస్త్రికి ఏమీ కారు. రామదాసు వంశ వారసులుగా అతని ఆస్తికి కూడా వారసులవుతారు. పురుషుల శ్రమను, స్త్రీల లైంగికతను దోచుకొనటం ద్వారానే ధనస్వామ్య శక్తుల ఎదుగుదల వుంటుందనే సూత్రానికి మరికొంత విస్తృతినిచ్చాడు కొ.కు. పేదవర్గాల, మధ్యతరగతివర్గాల పురుషుల శారీరక మేధోశ్రమలు ధనికవర్గాల సంపదలకు కారణమైనట్లే, ఆ వర్గపు స్త్రీల అసంతృప్త వాంఛలను తీర్చే సాధనాలు కూడా అవుతుంటాయి. బాల విషయంలో జరిగిందదే. ఆమెకు శాస్త్రితో సంబంధం ఇంట్లో అందరికీ తెలిసిందే అయినా ఎవరూ దానిగురించి ఏ ఆందోళనా పడరు. బాల శారీరక వాంఛాలను తీర్చలేకపోవచ్చుగానీ రామదాసు ఆమె పేరున ఆస్తులు సమీకరించటంలో ఎప్పుడూ చురుకుగానే వున్నాడు. భాను ఇంటిని తన భార్య పేరు మీద మార్చటం, భాను ఆ ఇంట్లో వున్న కాలానికి నెలనెలా ఇంటి అద్దె భాను అకౌంట్ నుండి బాల అకౌంట్లో పడేట్లు ఏర్పాటు చేయటం – ఇవన్నీ అందులో భాగమే. ఇవన్నీ బాలకు కావలసినవే, బాల అహాన్ని తృప్తి పరిచేవే. తన శారీరక వాంఛల పరితృప్తికి శాస్త్రి ఎప్పటికీ సిద్ధంగా వుండటం మాత్రం ఆమెకు కావాలి కానీ ఆమె భర్త వంశ వారసత్వానికే బాధ్యత వహిస్తుంది తప్ప శాస్త్రితో జీవితకాలపు సంబంధం ఆమెకు అవసరం లేదు. సంతానం శాస్త్రిదే అయినా సంపద వారసత్వం మాత్రం రామదాసుదే కావటంలోని సామాజిక వైరుధ్యాన్ని విమర్శకు పెట్టటం ఇక్కడ కొ.కు. చేసిన పని.
పశుపోషణ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కాలంలో వ్యక్తిగత ఆస్తి పోగవుతూ జంట పెళ్ళి ఒప్పందం నుండి విడిపోయినప్పుడు పిల్లల పితృత్వం తెలుస్తున్నప్పటికి పిల్లల మీద హక్కు స్త్రీలది కనక పిల్లలతో వాళ్ళు తమ తల్లి గుంపులోకి వెళ్ళిపోతే పురుషులు తమ పశుసంపదతో తాము తల్లి గుంపులోకే వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళ సంపద అనుభవం మరొకసారి బిడ్డలదవుతుంది. ఈ అసంతృప్తి నుండే పురుషుల ప్రయోజనార్థం తల్లి హక్కును త్రోసిరాజన్న దాంపత్య సంబంధ వ్యవస్థ ఏర్పడి తండ్రి హక్కు స్థిరీకరించబడింది. ఈ చారిత్రక క్రమాన్ని గురించిన అవగాహన శాస్త్రికి వుంది కనుకనే ఎవరి వల్లనో మోసపోయి కడుపుతో వున్న పద్మను పెళ్ళాడటానికి అతనికి ఏమీ అభ్యంతరం లేకపోయింది. ఏ దిక్కుమాలినవాడికో నేను బిడ్డను కంటే నా బిడ్డ అని లోకానికి చెప్పుకొంటావా అని పద్మ అడిగిన ప్రశ్నకు అందులో అవమానం ఏముంది అంటాడు శాస్త్రి. ”నా సొత్తంతా మరొకడి బిడ్డకు పోతుందని విచారమా?” (90) అని కూడా అంటాడు. స్వంతబిడ్డల గురించిన ఆలోచన స్వంత సంపద వున్నవాళ్ళదే కానీ సామాన్యులదీ, లేనివారిదీ కాదని సూచన. నివారించటానికే దుర్గాంబ, ఆమె కొడుకు రామదాసు ఏదో మందు పెట్టించటం వల్ల ఇలా అయిందన్న ఒక అనుమానం సుదర్శనం ముఖంగా భాను తలలోకి ప్రవేశపెట్టబడిందంటాడు కొ.కు. ఆ రకంగా మొదటి వివాహంలో కొడుకు లేకపోవటం వల్ల మొండికి పడ్డ భాను జీవితం రెండవ వివాహం దగ్గరకు వచ్చేసరికి కొడుకును కంటుందేమోనన్న అనుమానం కారణంగా ఒక కనిపించని కుట్రకు గురికావటం సంపదల వారసత్వం సంతాన వారసత్వం కలిసి స్త్రీ జీవితాన్ని కానీ, ఇటు పునరుత్పత్తి హక్కు కానీ లేని హింసాస్థితికి ఎలా నెడుతున్నదో సూచిస్తుంది. కొడుకును కనటం, కనకపోవటం ఇవేవీ వాటంతట అవిగా స్త్రీ జీవిత స్వతంత్రతనో, విలువనో సూచించేవి కావు. పురుషుడితో వుండే సాపేక్షసంబంధంలో మాత్రమే అవి రుజువవుతుంటాయి.
ఈ సందర్భంలో సుదర్శనం భార్య దుర్గాంబ విషయం కూడా గమనించాలి. భర్త ఏ స్త్రీతో సంబంధం పెట్టుకొన్నా ఆమెకు అభ్యంతరం లేదు. ‘పెళ్ళి’ చేసుకొంటానంటేనే అది ఆమెకు అభ్యంతరం. సుదర్శనానికి భానుతో సంబంధాలున్నాయని తెలిసి పెళ్ళీగిళ్ళీ అంటే సహించేదాన్ని కాను అని హెచ్చరించటం అందులో భాగంగానే జరిగింది. తీరా భర్త ఆమెను పెళ్ళాడి వచ్చాక దుర్గాంబ భానును ఆదరించి ఇంట్లో పెట్టుకొంది. ఆమెకు గర్భస్రావం అయ్యేవరకు ఈ ఆదరణ నడిచింది. ఆస్తికి తనకు పుట్టిన పిల్లలే వారసులు కావాలి కానీ భానుకు పుట్టినవాళ్ళు కాకూడదు – దుర్గాంబ ఆలోచనకు బలం అప్పుడు ఆస్తి పెత్తనాన్ని కైవసం చేసుకొంటున్న అసలు వారసుడు రామదాసు ఎత్తుగడలు. ఈ రకంగా చూచినప్పుడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్నది స్పష్టమవుతుంది.
సంపదల సమీకరణకు దగా కంపెనీల ఏర్పాట్లు, శాస్త్రి వంటివారిని కనబడకుండా నలుచుకు తినటం, రామదాసుకు ఎంత సులభసూత్రమో అందుకోసం అవసరమైతే స్వపరభేదం లేకుండా స్త్రీలను ఉపయోగించుకొనటం కూడా అంత సహజ సూత్రమే. కనుకనే చెల్లెలి స్వేచ్ఛాయుత ప్రవర్తన అతనికి అభ్యంతరం కాలేదు. కాని కడుపు వస్తే డబ్బు పారేసి మెడికల్ హెల్ప్ పొందవచ్చన్నది అతని నీతి. స్వంతచెల్లెలు కోమల విషయంలోనూ అదే నీతి భాను కూతురు పద్మ విషయంలోనూ అదే నీతి. రామదాసుకు కార్యదర్శిగా పనిచేస్తున్న రంజనంతో ప్రేమ వ్యవహారంలోకి దిగిన పద్మ చివరికి ఆ రంజనం వల్లనే ఒక మిలటరీ వ్యక్తికి తార్చబడింది. ఆ సంఘటన గురించి రచయిత ”పద్మకు జరిగిన ఈ అనుభవం ఒళ్ళు పై తెలియని పట్టణపు పిల్లలకు, అండాదండా లేని అనాథ బాలికలకు జరుగుతుంది” అంటాడు. పద్మ అనాథల కోవలోదే. ఆమెను ఎలాగయినా వాడుకోవచ్చని రామదాసు ఊహ. అందువల్లనే ఆమె దగాకు గురి అవుతున్న విషయాన్ని దాచి లైఫ్‌ను ఎన్జాయ్ చేయటంగా దానిని పైకి చూపించాడు. రామదాసు తాను ఆమెకు వున్నానని చెప్పింది కాని కడుపువస్తే తీయించుకొనటానికి డబ్బు సాయం చేయటానికి. ఈలోగా ఆమెవల్ల ఎంత డబ్బయినా సంపాదించే అవకాశాన్ని అతను వదులుకోడు. తాను తీయబోయే సినిమాలో పద్మకు సరిపోయే పాత్ర ఒకటుందని మోహపెట్టటంలోనూ ఆ ప్రయోజనాపేక్షే వున్నది. ఈ సినిమా ప్రలోభంలో పడే పద్మ డైరక్టరు వెంట తిరిగి తనకిక వేషాలు దొరకటం దుర్లభమని తెలిసి ఇల్లు చేరేసరికి పద్మ గర్భవతి.
ఈ పరిస్థితిలోనే ఆ గర్భం తీయించేసుకొనాల్సివచ్చిన తన పరిస్థితి గురించి మేనమామకు చెప్తూ బావురుమన్న పద్మను చూస్తే శాస్త్రి మనసును ఎవరో ముళ్ళకంపతో కెలికినట్లయింది. ”ప్రపంచంలో కొంపలు తీసేవాళ్ళూ, ఇతరులకు వర్ణనాతీతమైన మనఃక్లేశం కలిగించేవాళ్ళూ సుఖంగా ఉన్నారు. అజ్ఞానం తప్ప ఇంకే మహాపాతకమూ చెయ్యని పద్మ – తాను పసిపిల్లగా ఎత్తి ఆడించిన పద్మ – కడుపు చెరువయేట్టుగా ఎందుకు ఏడవాలి? ఇందుకు ఏదైనా సామాజిక నియమం ఉంటే దాన్ని తక్షణం భగ్నం చెయ్యవలసిందే” ననుకొంటాడు కూడా (88) స్త్రీలను అవసరాలకు వాడుకొని అనాథలుగా వదిలేసే పితృస్వామిక, ధనిక స్వామిక సామాజిక న్యాయం మీద శాస్త్రి తిరుగుబాటుకు తొలి వ్యక్తీకరణ ఇది. బాలతో వైవాహికేతర సంబంధాలున్న తను పద్మకంటే నీతిమంతుడు అనుకొనటానికి ఒప్పుకోని వివేకం అతనిది. బాలతోటి సంబంధంవల్ల ఎప్పుడూ తాను ఏడవనప్పుడు మరొకడెవరితోనో సంబంధం వల్ల పద్మ ఎందుకు ఏడవాలి అన్నది అతని ప్రశ్న. ”నీకేం? మగవాడివి! నేను ఆడపక్షిని గద” అంటుంది పద్మ. అస్తిత్వంలో వున్న ద్వంద్వవిలువలను ఆమె సహజధర్మంగా స్వీకరించి వుంది కనుక అలా అన్నది. అది సహజధర్మం కాదని బొంబాయి పారిశ్రామిక వాతావరణం ఇచ్చిన వివేకం వల్ల శాస్త్రి ”మగవాళ్ళకు ఒక రూలూ ఆడవాళ్ళకు ఇంకొక రూలూ ఉన్నదని నేను ఒప్పుకోను” అని (39) ఖచ్చితంగా చెప్తాడు. మనిషి మనిషిని ఆదుకోవలసిన అవసరం ఉంటుండగా ప్రేమను గురించి కలవరించడం అవాస్తవికమైన పని అనుకొని శాస్త్రి సరస్వతి పట్ల తనకున్న ప్రేమను, ఆమెను జీవిత సహచరిగా పొందాలన్న తపనను వదిలేసి పద్మను పెళ్ళాడటానికి సిద్ధపడతాడు.
ప్రభాకరరావు అనే స్ట్రక్చరల్ ఇంజనీరు దగ్గర అసిస్టెంటుగా పనిచేస్తున్న శాస్త్రి అనుభవాలను చెబుతూ కొ.కు. అతను శాస్త్రి మీద చేసే అధికారాన్ని, చూపించే చిరాకును శాస్త్రి తెలివితేటల పట్ల చూపించే చులకన భావాన్ని శాస్త్రి అర్థం చేసుకొని సహించవలసి వచ్చింది అంటాడు. అలా సహించాల్సి రావటం పరిస్థితులలో వుండే పొరపాటు అంటాడు. అటువంటి పొరపాటు వల్లనే ఎందరో భార్యలు తమ భర్తలను ‘అర్థం చేసుకొని’ వాళ్ళ దురలవాట్లను తప్పనిసరి అయి సహిస్తున్నారు అని పనిలోపనిగా వ్యాఖ్యానించాడు. దాంపత్య సంబంధాలలో భర్తల అధికార స్వభావాన్ని, భార్యల పట్ల చులకనభావాన్ని ఈ రకంగా నిరసించిన కొ.కు. దాంపత్య సంబంధాలు సమసంబంధాలుగా వుండటానికి స్త్రీలు చదువుకొని స్వతంత్రగా ఆలోచించగలవాళ్ళు, తమకాళ్ళమీద తాము నిలబడగలవాళ్ళు కావాలనుకొంటాడు. ఆయన ఆకాంక్షకు ప్రతిరూపం సరస్వతి. భర్తను స్నేహం ద్వారా సంపాదించుకోవటం సరియైన పద్ధతి అన్న తండ్రి పెంపకంలో పెరిగిన సరస్వతి శాస్త్రిని అతని బలహీనతలతో సహా అర్థం చేసుకొన్నది కనుకనే జీవితసహచరుడిగా ఎన్నుకొన్నది. అయితే సరస్వతి శాస్త్రి వంటి జంటలు ఏర్పడటానికి సమాజంలో ఇంకా చాలా సమస్యలు పరిష్కరించబడవలసిన అవసరం వున్నదని సూచించటం వారసత్వం నవల ద్వారా కొ.కు. చేసిన పని.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags