తులశమ్మ గారు – ఒక విశ్లేషణ

వారణాసి నాగలక్ష్మి
చూపరులను ఆకట్టుకుని, మంత్రముగ్ధులను చేసి నిలబెట్టేసే చిత్తరువులు (పోర్‌ట్రెయిట్స్‌) చిత్రకళా ప్రదర్శనల్లో అక్కడక్కడ కనిపిస్తాయి. ఈ ప్రదర్శనల్లో చిత్రాలను హైలేట్‌ చేసే ప్రత్యేకమైన విద్యుద్దీపాలు (స్పాట్‌లైట్స్‌) ఉంటాయి. వాటినుండి వెలువడి, చిత్రంలోని ప్రత్యేకతలను ఎత్తిచూపే కాంతి మాత్రమే మనకు కనిపిస్తుంది గాని ఆ దీపం మనకు అంతగా కనిపించదు.
అలాంటి ఒక అందమైన చిత్తరువు మన కళ్ళముందు నిలుస్తుంది కొడవటిగంటి కుటుంబరావు గారి ‘తులశమ్మ గారు’ కథ చదవగానే! మన మధ్యన జీవించే కొందరు వ్యక్తులు ఎంత ఉన్నతులైనా వారి ఔన్నత్యం, వారి సహచరుల పడగ నీడలో భాసించకపోవడం మనకి తెలియనిది కాదు. ఇందులో ఆ అందమైన చిత్తరువు తులశమ్మ గారైతే, ఆమె ప్రత్యేకతని ఎత్తిచూపగల స్పాట్‌లైట్‌, ఆమెని భార్యగా గౌరవించి ప్రేమించే చక్కని వ్యక్తిత్వం గల రామదాసు గారే.
ఈ కథలో దంపతులైన ఇద్దరు వ్యక్తులు తమ ఆంతరంగిక సౌందర్యాన్ని పరస్పరం ఆస్వాదిస్తూ ఉన్నతమైన, ఆదర్శప్రాయమైన, సంతృప్తి నిండిన కుటుంబ జీవితాన్ని గడపడాన్ని రేఖామాత్రంగా వర్ణిస్తూ, ఆదర్శాలు వల్లిస్తూ తిరిగే శివానందం వ్యక్తిత్వంలోని డొల్లతనపు నల్లదనాన్ని నేపథ్యమంతటా పులమడం ద్వారా తులశమ్మ గారి వ్యక్తిత్వ సౌందర్యాన్ని ప్రస్ఫుటం చేస్తారు రచయిత.
ఇందులో తులశమ్మ గారి భౌతిక వర్ణన అంతా ఒకే ఒక్క వాక్యానికి పరిమితం చేస్తూ ఆమెని ‘ఇరవై సంవత్సరాల వయసుగల చామనచాయ మనిషి’గా మనకి పరిచయం చేస్తాడు కథలోని కథకుడు. రెండే రెండు గీతల్లో గాంధీజీనో, మదర్‌థెరెసానో కళ్లముందు ఆశిష్కరింపజేసే రేఖాచిత్రపు క్లుప్తత, అనేక వర్ణాల అనేక పొరల నైరూప్య తైల వర్ణచిత్రపు గాఢత మన మనోపథంలో రూపుదిద్దుకునే తులశమ్మ గారి చిత్తరువులో ఒకేసారి దర్శనమిస్తుంది! ఛాయాచిత్రానికీ, చిత్రకారుడు గీసిన చిత్తరువుకీ ఒక తేడా ఉంటుంది. ప్రతిభాశాలి అయిన చిత్రకారుడు తను రచించే రూపచిత్రంలో మనిషి వ్యక్తిత్వాన్ని కూడా స్పృశించి వీక్షకుడికి లీలామాత్రంగా ఆ ఛాయలను చూపించగలుగుతాడు. అందుకే తులశమ్మ గారు కథ చదవగానే ఒక అద్భుత సౌందర్యవతి మనకు కనిపిస్తుంది. ఆ సౌందర్యం భౌతికమైనది కాదు. ఆమె అందగత్తో కాదో ఆయనెక్కడా ప్రస్తావించరు. ఆ విషయానికసలు ప్రాధాన్యత లేదు కథలో. ఆమె భర్త రామదాసుని కూడా ఒక ‘నల్లని పొట్టి మనిషి’గా కథకుడు మనకి పరిచయం చేస్తారు. ఆ తరువాత కథలో ఎక్కడా ఆ దంపతుల కనుముక్కుతీరు గానీ కట్టుకున్న బట్టలుగానీ వేటిగురించీ ఏ విధమైన వర్ణనా ఉండదు. ఆ నల్లని పొట్టి మనిషి కాస్తా కథ చదువుతుంటే పాఠకుల మనసులో ఒక ఉన్నత స్థానానికి అవలీలగా చేరిపోతాడు.
తులశమ్మగారు సహజ. ఆవిడ మనుషుల్ని ఆడవాళ్లుగా మగవాళ్ళుగా విభజించదు. మూడేళ్ల పిల్లను కూడా తమ సమానస్తురాలికి మల్లే పరిగణించి ఆ కుటుంబాన్ని వర్ణిస్తూ ‘పెద్ద చదువులెందుకు, నాగరికతలెందుకు? ఏ ఇంట భయమూ, క్రోధమూ, అసూయా అడుగుపెట్టవో ఆ ఇల్లు స్వర్గంతో సమానం కాదా?’ అనుకుంటాడు కథకుడు. 1945లో వెలువడ్డ ఈ కథాంశమూ, కథనమూ ఈనాటికీ నిత్యనూతనంగా విశిష్టంగా కనిపిస్తాయి.
‘తులశమ్మ గారు’ కథ ఉత్తమ పురుషలో సాగుతుంది. కథని చెపుతున్న కథకుడు తన బావమరిది కుహనా సంఘ సంస్కరణాభిలాషి గురించీ, అతని ప్రలాపాల గురించీ వ్యంగ్య ధోరణిలో వివరిస్తూ కథని మొదలుపెట్టి, అలాంటి పైపై మెరుగుల సంఘ సంస్కర్తలకి అర్థం కానంత అభ్యుదయాన్ని వ్యక్తిగతంగా తులశమ్మ గారు అప్పటికే సాధించిందన్న విశేషమైన విషయాన్ని పాఠకులతో పంచుకుంటూ కథని ముగిస్తాడు.
శివానందం అనే వ్యక్తి తన బావగారింటికి రావడం, అప్పుడు అతని అక్క పురిటికి పుట్టింటికి వెళ్లి ఉండడం, పక్కింటిలో తులశమ్మ గారూ, భర్తా తమ మూడేళ్ళ కూతురితో కాపురముండడం, తులశమ్మ గారు స్వభావరీత్యా స్నేహశీలి, కలుపుగోరు స్వభావం గల వ్యక్తి కావడంతో కొత్తవాళ్ళని కూడా పలకరించి ఆదరించడం, సంఘ సంస్కర్తగా తనను తాను (”కాస్త సోషల్‌ రిఫార్మరని కూడా నా గురించి ఆవిడకు తెలియజేస్తే అరిగిపోతావా?”) చెప్పుకునే శివానందం ఆవిడలోని సహజసిద్ధమైన అభ్యుదయ స్వభావాన్ని అర్థం చేసుకోలేక చవకబారుగా ప్రవర్తించడం ఈ కథలోని ముఖ్యాంశాలు.
శివానందం బావగారి స్వగతంగా ఈ కథ సాగుతుంది. అతని భార్య పుట్టింటికి వెళ్లి ఉండగా కొత్తగా పక్కింట్లోకి ఓ కుటుంబం అద్దెకి వస్తుంది. ఆ దంపతుల సంస్కారానికి అతను ముగ్ధుడై ఆ స్త్రీ అరమరికలు లేకుండా కనబరచే ఆత్మీయతకు అలవాటుపడుతుండగా ‘ఆ పరిస్థితుల్లో శివానందం వచ్చి’ వాళ్ళింట్లో ‘తిష్ట వేస్తాడు’. తన బావమరిది ‘…తులశమ్మ గార్ని చూశాడంటే ఏదో ఒక వెధవ పని చెయ్యకుండా పోడు’ అనుకుంటాడు. అలా జరిగితే చివరికి ఆవిడ తప్పంతా నీదే అంటుందనే అస్పష్టమైన భయం కలుగుతుందతనికి. తులశమ్మగారు స్త్రీ పురుష విచక్షణ చేయకపోవడం ‘అకస్మాత్తుగా’ అతనికి ‘అరుచికరంగా’ తోస్తుంది. అందరాడవాళ్ళకి మలే్లస తులశమ్మ గారు కూడా ‘మగ ముండాకొడుకులను తప్పించుకు తిరగరాదా’ అనిపిస్తుంది.
‘మా సంఘ సంస్కర్త ఏవైనా తప్పుడు వేషాలకు దిగితే ఏం చెయ్యాలో ఆమె చూసుకోగలదని, అటువంటివాటికి నన్ను బాధ్యుణ్ణి చెయ్యదనీ నాకు తట్టలేదు’ అంటూ తరువాత ఏమయిందో ఇలా వర్ణిస్తాడు –
‘తులశమ్మగారు ‘ఏమండీ అన్నగారూ’ అంటూ మా భాగంలోకి వచ్చి మావాణ్ణి చూడగానే ‘ఈ అన్నగారెవరు?’ అంది. మా శివానందం ఆమె వంక వర్ణనాతీతమైన వెధవమొహం ఒకటి వేసి చూడటం మొదలుపెట్టాడు.’
పరిచయాలు, పలకరింపులూ అయ్యాక రాత్రి భోజనానికి తమ ఇంటికి ఆహ్వానిస్తుంది ఆవిడ. ఆమె వెళ్ళగానే శివానందం మెరుస్తున్న కళ్ళతో ”రకంవారీగానే ఉందే!… మంచి ఏర్పాటే చేసుకున్నావు! అంతేలే, ఏమిటి లేకపోతే?… వెధవ బ్రహ్మచర్యం!” అంటాడు.
రెండోనాడు ‘ఏదో మర్మవాక్యాలు మాట్లాడుతున్నానని భ్రమపడుతూ’ వెర్రి వాగుడు వాగుతాడు. దాంతో ఆవిడ ఇతన్ని ఒంటరిగా పిలిచి ‘మీ బావమరిదికి చిత్త చాంచల్యం ఉందా?’ అని అడుగుతుంది.
‘ఆరోజు రాత్రి మావాడితో ఆవిడ అన్న ముక్క చెప్పాను. అది విని మావాడు పొందిన పరమానందానికి మేరలేదు’ అంటాడు కథకుడు. ఆమె ఆ మాట అనడం తన మీద మనసు పడ్డదని తెలియజెయ్యడంగా శివానందం భావిస్తాడు. ఆ శుభవార్త తన బావగారి చేత చెప్పించడంలో ఆవిడ అమితమైన నేర్పరితనం ప్రకటించిందని తీర్మానించుకుంటాడు. మర్నాడు మధ్యాన్నం వేళ ‘తులశమ్మ గారు సావిట్లో బియ్యం బాగుచేసుకుంటుంటే చల్లగా వెళ్ళి తన వాంఛని ఎరిగించు’కుంటాడు. అతని తలవాచేట్టు చివాట్లు పెడుతున్న తులశమ్మ గారి గొంతు విని, నిద్రపోతున్న కథకుడు లేచి వెళ్తాడు. ‘మంచి ఆడది సమర్ధురాలు కూడా కావడం నేను ఊహించలేకపోయినాను సహజంగా!’ అనుకుంటాడు. బావమరిదికి ఆవిడ వడ్డించినవి వడ్డించగా తన వంతు కూడా వడ్డించి, ”నువ్వేం సంఘ సంస్కర్తవురా? నీ ఆదర్శాలకు సరిపోయే ఆడమనిషి నీ వెధవజన్మకు ఒకతె కనిపిస్తే ఆ ఒకతెతో భోగం దాన్ని అడగవలసిన మాట అడిగినవాడివి” అని చీవాట్లు పెట్టి వేగిరం ఇంటిదారి పట్టిస్తాడు.
అడవిలో పారే స్వచ్ఛమైన సెలయేరులా ఈ కథ ప్రవహిస్తుంది. నలభయ్యవ దశకంలోనే స్త్రీ స్వేచ్ఛకు, ప్రగతిశీలతకు ఒక చక్కని నిర్వచనాన్ని కుటుంబరావు గారిచ్చారని ఆయన రాసిన అనేకమైన కథలు చెపుతాయి. సౌందర్యం ఎక్కువగా ఆత్మగతమైనదన్న విషయం ఆయన కథలన్నిటా నిర్వివాదంగా కనిపిస్తుంది. ఆయన సృష్టించిన పాత్రలన్నీ ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు కలిగి ఉండడమే కాక వాటి నడక కథ అంతటా ఆయా స్వభావాలకు సరిగ్గా సరిపోయేలా సాగుతుంది. ఆయన కథల్లోని మానసిక విశ్లేషణను పరిశీలిస్తే ఆయన ఎంత సునిశిత పరిశీలకులో అర్థమౌతుంది. అవి చదివినపుడు, సమాజంలోని మురికినీ, కుళ్లుని శుభ్రంగా కడిగి ఎండబెట్టిన దృశ్యాన్ని చూస్తుంటే కలిగే ఒక ఆహ్లాదం మనసంతా ఆవరిస్తుంది!

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.