నల్లగా నిగనిగలాడే
పట్టు కుచ్చులాంటి కురులను
సిగగా చుట్టి లేక జడ వేసి
సన్నజాజులు పెట్టుకుంటే
అందచందాలు హాయిగొల్పేను!
చక్కటి నగుమోమును
ముంగురులు ముద్దులాడుతుంటే
గాలి కెగిరే రేగిన జుట్టుతో
అతివ అందాలు మధురమయ్యేను!
ఆధునిక యువతులు
బాబ్డ్‌హెయిర్‌తో, విరబోసుకున్న కేశాలతో
విలాసంగా నడుస్తూ
అందరికీ ఆకర్షణీయ మయ్యేరు!
అందుకే కాబోలు…
మతపరమైన ఆంక్షలతో
హిజాబ్ తలకు చుట్టుకోమన్నారు
జుట్టన్నది కనబడకుండా
ముసుగు బిగించమన్నారు!
మూఢాచారాలకు గొడుగు పట్టి
మొగుడు పోయిన మహిళకు
గుండు చెయ్యాలన్నారు
కురులు లేని కురూపిగా
రంగు వెలిసిన బొమ్మలా మార్చారు!
ఉమ్మడి కుటుంబ పరంపరగా
నెత్తిమీద కొంగేసుకోమన్నారు
ఉత్తర భారత స్త్రీలకు
‘గుంగట్’ ముఖ్యమని శాసించారు!
కళ్ళన్నీ ఆడవాళ్ళ జుట్టు మీదే!
ఆచారాలు నియమాలు కట్టుబాట్లు
మగువల శిరోజాలకే ఎందుకు పరిమితం?!