ఈ పుస్తకం నేను అందుకుని చాలాకాలమైంది. వెంటనే చదవడమూ అయింది. కానీ పంచుకోవడం వీలుపడలేదనడం బద్ధకాన్ని కప్పిపుచ్చుకోడానికి మాత్రం కాదు. నేను
అనుకున్నవన్నీ చెప్పడానికి కాస్త ఆలస్యమయింది, అంతే. మొదటి పుస్తకం అయినా, ముఖ చిత్రం దగ్గర్నుంచి లోపలి పేజీలన్నీ శ్రద్ధగా తీర్చిదిద్దిన యువ ప్రచురణ సంస్థ ఎలమికి అభినందనలు అంటే తక్కువ, ఒక ప్రేమాలింగనం అనాలి.
ఇప్పుడీ పుస్తకం ప్రాసంగికత ఏమిటి అని నేను చర్చించను. ఇప్పుడు మరింత ప్రాసంగికత ఉన్నదని నమ్ముతాను కనుక.
మానవ ప్రకృతి అంత సులభంగా మారదు. సామాజిక, సాంస్కృతిక మార్పులూ, వివేచనా సహోదరత్వం కూడా సులభ సాధ్యం కావని కాలం నిరూపిస్తున్నది కనుక కొన్నిటి ప్రాసంగికత ఎప్పటికీ చెరిగిపోదు. మంటో రచనలు ఏకపక్షం కావు. ఒక మానవీయ దృక్పథం నుంచీ మానవత్వం కోసం ఆరాటపడుతూ వ్రాసినవి. తను ప్రత్యక్షంగా చూసినవి, కలత చెందినవి. విభజనానంతర అల్లకల్లోలమే కాక దానికి ముందునుంచీ ముసురుకుంటున్న చీకట్లను కూడా చిత్రించాడు. మతాతీతంగా కేవలం మనుషులుగా స్పందించిన వారిని గుర్తించాడు. క్షణికావేశంలో కత్తులు దూసిన వారిని చూశాడు. క్షణికావేశంలో తమవారు అనుకున్న వారినే కడతేర్చి విచారపడ్డ వారిని చూశాడు. (మిస్టేక్) అందుకే ఆయన సహాయ్, శ్యామ్ వంటి వారిని గమనించాడు. రామ్ ఖిలావన్‌ను గురించి వ్రాశాడు.
విభజన సాహిత్యం చాలా వచ్చింది. కానీ మంటో రచనలు భిన్నమైనవి. ‘‘జెల్లీ’’ వంటి కడుపును మెలిపెట్టే ఉదంతాన్ని ఆయనే చెప్పగలడు. ‘‘మూత్రీ’’ వంటిది చిత్రించగలడు. మంటో వ్రాసిన ప్రసిద్ధ కథలు ఈ పుస్తకంలో ఎందుకు లేవా అనుకున్నాను కానీ రచయిత్రి అందుకు కారణం చెప్పింది కదా! ఇది కేవలం సియాహాషియే కనుక ఇవి మతం విభజన, ఆనాటి సందర్భం గురించిన కథనాలే అని అర్థమయింది. ఆ సందర్భాన్ని కేవలం ఒకే కోణం నుంచి కాక సర్వసాక్షి దృష్టితో, మానవీయ స్పర్శతో వ్రాసిన కథనాలు ఇవి. ఒళ్ళు జలదరించే సందర్భాలు, మనుషుల మీద, దయాగుణం మీద నమ్మకం పోయే సందర్భాలు, అట్లాగే మంచి ఇంకా కాస్త మిణుకు మంటోందనే సందర్భాలు… అన్నీ కలిసి ఆ కల్లోల కాలాన్ని కళ్ళముందుకు తెస్తున్నాయి. ఇదొక మంచి ఎంపిక. మంటో కథల్ని వేరొక సంపుటిలో మనం చదువుకోవచ్చు. ఇది చరిత్ర పాఠం.
చరిత్రలో ఈ జ్ఞాపకం చుట్టూ దాన్ని గురించి వ్రాసే ఆ రాత చుట్టూ గడ్డకట్టిన రక్తం చిక్కగా, నల్లగా మారిన రంగులో ఉండే బార్డర్ గీయాల్సిందే. ఎందుకంటే ఇది ఆ బార్డర్ కథే. మనుషులను మతాలుగా విభజించి వికృతానంద తాండవం చేయించిన పాడుకాలపు వ్యథ. ఎన్నటికీ మర్చిపోలేని, వదుల్చుకోలేని పీడ. ఈ వ్యథను అనుభవించి, ఆ పీడనకు ప్రత్యక్ష సాక్షి అయి, మానవ దృక్కోణంతో సహానుభూతితో కాగితంపై పెట్టిన మంటో రచనల గురించి చేసిన సమగ్ర విశ్లేషణలు కూడా ఆయన్ని అర్థం చేసుకోడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా పూర్ణిమ వ్రాసిన ముందుమాట, అనుబంధం, మంటో వ్యాసాలు, ‘కబుర్లు’, ‘విభజన వార్షికోత్సవం కన్నీటి అప్పీల్ ఒకటి’, మహమ్మద్ ఆస్కరీ వ్యాసాలూ చదివితే విభజన నాటికి ముందూ, వెనకాల వాతావరణం, విభజనలో రక్తపాతం, మంటో జీవితం, ఆయన ఆర్తి అర్థమవుతాయి. ఈ వ్యాసాలూ, కథనాలూ మంచి ఎంపికలు. పైగా రచయిత్రి తన అనువాద విధానాల గురించీ, రిఫరెన్స్‌ల గురించీ వివరంగా శ్రద్ధగా చెప్పడాన్ని మెచ్చుకోవాలి. పూర్ణిమ నుంచీ మంటో ప్రసిద్ధ కథల అనువాదం కోసం ఎదురు చూపులు.
అనువాదం బాగుంది. అందులో చేర్చిన కొన్ని ఉర్దూ మాటలు సహజంగా అమరిపోయాయి. ఒకటి రెండు చోట్ల మాత్రమే ‘బడు’ ప్రయోగం జూaంంఱఙవ ఙశీఱషవ కొంచెం ఇబ్బంది పెట్టింది. 58వ పేజీలో ఫుట్ నోట్లో ‘‘విక్టోరియా తీసుకుని మహాలక్ష్మికి బయలుదేరాను’’ అనే మాటకి విక్టోరియా అంటే విక్టోరియా టెర్మినస్ అయి ఉండవచ్చు అని వ్రాశారు. ఆ రోజుల్లో గుర్రపు బండిని విక్టోరియా అనేవారు. మలి ముద్రణలో సవరించుకోవచ్చు. అనుకున్నది ఆలస్యంగానైనా బయటకు చెప్పకపోతే గుండె గొంతులో ఇరుక్కుపోతుంది. ఎలమి బృందానికి ముందంతా వెలుగే కావాలని కోరుకుంటున్నాను.
సియా హాషియే : విభజన నాటి నెత్తుటి గాయాలు
రచయిత : సాదత్ హసన్ మంటో
మూల భాష : ఉర్దూ
పరిచయం`కూర్పు`అనువాదం : పూర్ణిమ తమ్మిరెడ్డి