హయాత్‌ పాప స్వప్నం! పి. శివలక్ష్మి

“A daughter is a woman that cares about where she came from and takes care of them that took care of her” – Tony Morrison.
‘‘జీవితం సత్యమైతే సుందరమైన స్వప్నాన్నే కందాం… ఈ దరిద్రంలోంచి,

భయంలోంచి మేలుకుందాం’’`చలం
ఇరాన్‌ దేశం నుంచి వచ్చిన అందమైన, ఆహ్లాదకరమైన సినిమా ‘‘హయాత్‌’’. ఈ చిత్ర దర్శకులు ‘‘ఘోలం రెజా రమేజాని’’ Gholam reza Ramezani. దీని స్క్రిప్ట్‌ సహ రచయితలు ‘ఘోలం రెజా రమేజాని’, ‘మోజ్తాబా ఖోష్కడామన్‌ Mojtaba Khoshkdaman’. ఈ చిత్ర నిడివి 80 నిమిషాలు.
ఇతివృత్తం: తన జీవిత లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పంతో వయస్సుకు మించిన ఆచరణజ్ఞానంతో ఒక బాలిక ఎదుర్కొన్న సవాళ్ళ పరంపరలను, ఆమె జీవితంలోని ఒక రోజులోని సగం సంఘటనలను చిత్రీకరించడం ద్వారా అనేక ఆసక్తికరమైన దృక్పథాలను ప్రస్తావించి, వాటి పరిష్కారాల గురించి ఆలోచించమని ప్రేక్షక లోకానికి విజ్ఞప్తి చేయడమే ఈ చిత్ర కథాంశం.
కథ గురించి చెప్పాలంటే, ఇరాన్‌ దేశంలోని ఒక మారుమూల కుగ్రామంలో ఐదవ తరగతి చదువుతున్న, కౌమార దశలోకి ప్రవేశించబోతున్న ఒక 12 సంవత్సరాల అమ్మాయి హయాత్‌. ఆమె తన తల్లిదండ్రులు, తమ్ముడు, సోదరితో నివసిస్తూ ఉంటుంది. ఇరాన్‌ గ్రామాల్లోని ఇతర ఆడపిల్లల్లాగే హయాత్‌ కూడా రోజువారీ ఇంటి పనులన్నింటినీ చక్కగా చెయ్యగల సమర్థత కలిగి ఉన్నప్పటికీ మిగిలిన బాలికల్లా కాకుండా ఆమె ఒక విలక్షణమైన అమ్మాయి. గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న ఆమె తరగతిలోకెల్లా అత్యుత్తమ విద్యార్థిని. మరింత పై చదువులు బాగా చదువుకోవాలని హయాత్‌ బలమైన కోరిక. కానీ, హయాత్‌ చదువు కోసం అయ్యే ఖర్చును ఆమె పేద కుటుంబం భరించలేదు. అందువల్ల ఆమె తన కలను నిజం చేసుకోవడానికి బోర్డింగ్‌ పాఠశాల స్కాలర్‌షిప్‌ కోసం అర్హత సాధించడానికి పోటీ పరీక్షలకు హాజరు కావాలనుకుంటుంది. హయాత్‌ కఠినమైన ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే తన లక్ష్యంగా దీక్షగా, పట్టుదలగా చదువుతూ కృషి చేస్తూ ఉంటుంది.
పరీక్ష రాయవలసిన రోజు ఉదయమే హయాత్‌ తండ్రికి ప్రమాదకరమైన జబ్బు ముంచుకు వచ్చి, తీవ్రమైన అస్వస్థత బారిన పడతాడు. ఇంటి పనుల్లో మునిగిపోయిన వాళ్ళమ్మను పిలిచి హయాత్‌, వాళ్ళ నాన్న ఉలుకూ పలుకూ లేకుండా కట్టెలా పడి ఉన్నాడని ఏడుస్తూ చెప్తుంది. వాళ్ళమ్మ వెంటనే వెళ్ళి డాక్టర్‌ని పిలుచుకు రమ్మంటుంది. పరుగు పరుగున డాక్టర్‌ను వెంటబెట్టుకొస్తుంది. డాక్టర్‌ వచ్చి రోగి పరిస్థితి చాలా విషమంగా ఉందని, గ్రామంలో ఏ వసతులూ లేనందువల్ల వెంటనే పట్నం తీసుకెళ్ళమని సలహా ఇస్తాడు. హయాత్‌ వాళ్ళమ్మ వాళ్ళ నాన్నను తీసుకుని ఆఘమేఘాల మీద ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తుంది. హడావిడిగా వెళ్తూ వెళ్తూ ఇల్లూ, పాలిచ్చే పశువులూ, తమ్ముడూ, చెల్లినీ జాగ్రత్తగా చూసుకోమని హయాత్‌కి చెప్పి బండెక్కి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ. ఇంట్లో హయాత్‌ ఒక్కతే పెద్ద పిల్ల. ఒక తమ్ముడు, పాలు తాగే చిట్టి పాపాయి ఉంటారు. హయాత్‌ తన తమ్ముడు అక్బర్‌కి ఆహార పానీయాలిచ్చి పాఠశాలకు పంపాలి. నబత్‌ పాపాయికి పాలు తాగించి ఆలనా పాలనా చూసుకోవాలి. ఇవేకాక, పాలు పిండడం, పక్కబట్టలు సర్దడం లాంటి అనేకమైన పెద్దవాళ్ళు చేసే ఇంటి పనులన్నీ అనివార్యంగా చెయ్యవలసిన బాధ్యతలు హయాత్‌ మీద పడతాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇంకోవైపు నుంచి తాను రాయవలసిన పరీక్ష గురించిన ఆందోళన మరింత ఆరాట పెడుతుంది. వేగంగా తరుముకొస్తున్న టైమ్‌, నెత్తిమీదొచ్చి పడ్డ అలవికాని పనులు, స్కూలు కెళ్ళాల్సిన తమ్ముడు, ఏడ్చే చిట్టి పాపాయి, తను రాయాల్సిన ఫైనల్‌ పరీక్షలు… వీటన్నింటి మధ్య తండ్రి అనారోగ్యం గురించి హయాత్‌కి ఆలోచించే తీరికే ఉండదు. ఎవరో మీ నాన్నకెలా ఉందని అడిగితే తనకు తెలియదంటుంది. ఇల్లంతా ఉరుకుతూ రాకెట్‌ స్పీడ్‌తో పనులన్నీ చక్కబెడుతూ ఉంటుంది. పక్క బట్టలు సర్దేస్తుంది. తమ్ముడికి రొట్టె ఇచ్చి స్కూలుకి పంపిస్తుంది. పశువు నుంచి పాలు పిండి, సీసాలో నింపి పెద్ద ఆరిందాలా పాపాయిని కాళ్ళమీద పడుకోబెట్టుకుని తాగిస్తుంది!
అంతేనా? రాత్రి చదివిన పాఠాలన్నీ వీథిబడిలో చదివినట్లు పైకి బిగ్గరగా అరుస్తూ నెమరు వేసుకుంటూ
ఉంటుంది. అప్పటికి చెయ్యాల్సిన అర్జెంట్‌ పనులన్నీ త్వరత్వరగా పూర్తిచేసి ఇంటికి తాళం వేసి పాపాయిని చంకనేసుకుని ఇంటింటికీ వెళ్ళి ‘‘ఒక్క గంటలో నేను పరీక్ష రాసి వస్తా, మా చిన్నారి చెల్లిని కాస్త కనిపెట్టి చూడమని’’ అందరినీ బతిమలాడుతుంది. ఒక ఇంట్లో ఉన్న వృద్ధురాలు నాకు దగ్గు వస్తోంది, లోపలికి వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తెచ్చి ఇమ్మని అడుగుతుంది. పాపాయినీ, పాల సీసానీ వదిలి మంచినీళ్ళు తెచ్చేలోపు, ఆమె పాపాయి పాల సీసాని నోటికందించుకుని పాలలో సగం పైగా తాగేస్తుంది.
అక్కడ వద్దనుకుని ఆమె ఇంకో ఇంటికి, మరో ఇంటికి పరిగెత్తుతూనే ఉంటుంది! చివరికి ఎవరూ హయాత్‌ గోడు వినిపించుకోరు. మళ్ళీ ఇంటికొచ్చి పాలు కలిపి సీసాలో నింపి ఉయ్యాల తాడూ, కంబళ్ళూ తీసుకుని స్కూలు వైపు వేగంగా దౌడు తీస్తుంది.
పరీక్ష హాలులో ఇద్దరు ఫ్రెండ్స్‌, ఒక టీచర్‌ హయాత్‌ తప్పకుండా వస్తుందని ఆమె కోసం ఎదురు చూస్తుంటారు. టైమ్‌ దాటిపోయి పరీక్ష మొదలవుతుంది. కిటికీ పక్కన కూర్చున్న ఒక ఫ్రెండ్‌ ముందుకు బైటినుంచి ఒక తాడు లోపలికొస్తుంది. ఇంకో ఫ్రెండ్‌ ఆ తాడుని అందుకుని ఊపమని సైగలతో చెప్తుంది. హయాత్‌ లోపలికొచ్చి పరీక్ష పేపర్‌ అందుకుని రాయబోతుంది. కానీ దృష్టంతా ఏడుపు లంకించుకున్న చెల్లెలి మీదే ఉంటుంది. ఒకసారి పాప ఏడుపువల్ల తట్టుకోలేని ఉద్వేగంతో దుఃఖాన్నాపుకునే ప్రయత్నం చేయడానికి హయాత్‌ పరీక్ష టేబిల్‌ మీద తల వాల్చేస్తుంది కూడా.
అంతలోనే ఒక అద్భుతం జరుగుతుంది. అంతవరకూ స్ట్రిక్ట్‌గా పిల్లల్ని అదిలిస్తున్న టీచర్‌ నెమ్మదిగా ఉయ్యాల తాడందుకుని చక్కని చిరునవ్వుతో ఊపడం మొదలెడుతుంది. మన హీరోయిన్‌ హయాత్‌ నిశ్చింతగా పరీక్ష రాయడానికి ఉపక్రమిస్తుంది.
ప్రేక్షకులు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. పాపాయిని సంరక్షించడమనే కర్తవ్యం, పరీక్షకి హాజరు కావడం అనే ఈ సవాళ్ళను సమతుల్యం చేయడానికి హయాత్‌ చేసే ప్రయత్నాలు అమోఘంగా ఉండి ప్రేక్షకులకి గొప్ప స్ఫూర్తినిస్తూ చిత్రం ముగుస్తుంది. కథ ఇంతేనా అనిపిస్తుంది కానీ కథనాన్ని మలిచిన తీరు మాత్రమే భలే దివ్యంగా, అత్యుత్తమంగా ఉంటుంది.
అందరూ చూడవలసిన ఆణిముత్యం ఈ సినిమా.
బాలికలతో మొదలై మహిళలకి ఊపిరి సలపని ఇంటిపని సరే, కొన్ని కీలక సమయాల్లో కూడా ఏ రకంగానైనా సహకారం లేకపోవడం బాధ కలిగిస్తుంది. మన ఇళ్ళల్లోలాగే ఎక్కడ చూస్తే అక్కడ పేరుకుపోయి ఎంత చేసినా తరగని భూతం లాంటి ఇంటి చాకిరీతో సతమతమయ్యే 12 ఏళ్ళ హయాత్‌ని చూస్తున్న మహిళలకు సహానుభూతితో ఊపిరి సలపదు.
హయాత్‌ దీక్ష, పట్టుదల, జీవితం పట్ల అలుపనేది లేకపోవడం ముచ్చట కలిగిస్తాయి. స్ఫూర్తి కలిగించే చక్కటి ఇతివృత్తాలను జీవితం నుంచే ఎన్నుకోవడంలో ఇరాన్‌ దర్శకులకి ఎవరూ సాటి రారు. బాలల దినోత్సవాన్ని, చలన చిత్రోత్సవాన్ని పెద్దలు జరిపిస్తున్న తీరు పట్ల మనకెన్ని అసంతృప్తులున్నప్పటికీ, మన పాపల్ని ఈ అంతం లేని పని నుంచి ఎలా తప్పించాలా అనే ఆలోచనలతో మహిళలందరూ తపిస్తారు. తప్పకుండా చూడవలసిన సినిమా హయాత్‌.
ఆ మాటకొస్తే అమ్మాయిల తండ్రులందరూ కూడా చూడాలి. అంతేకాదు, అసలు అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించే వారందరూ తప్పకుండా చూడవలసిన చిత్రమిది.
ఈ సినిమా అనేక స్థాయిలలో ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తుంది. స్పష్టమైన స్థాయిలో కథానాయకురాలు హయాత్‌ దృఢదీక్షతో పోరాటం చేసి చివరకు విజయం సాధిస్తుంది. ఈ అసమ సమాజంలో ఏ బాలిక (మహిళ) జీవితమైనా ఎడతెగని నిరంతర పోరాటంగా ఉందనే సందేశాన్ని స్ఫురింపజేస్తుంది.
హయాత్‌ అంటే జీవితం అని అర్థం. ఈ చిత్రం మానవులందరి జీవితాలనూ ప్రతిబింబిస్తుంది. ఇది మంచి నుంచి ఏ కోణంలోనైనా చెడువైపుగా పరిణమించగల జీవితాల గురించి మాట్లాడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే, పిల్లలు కూడా తమ మార్గంలో వచ్చే సవాళ్ళను ఎలా ఎదుర్కోగలుగుతారు, బహుశా పెద్దలకన్నా దీటుగా ఎదుర్కొంటారని హయాత్‌ నిరూపిస్తుంది.
గ్రామీణ ఇరాన్‌ జీవితాన్ని స్నాప్‌ షాట్‌ తీసినట్లుగా షో కేస్‌లో పెట్టి చూపిస్తుంది ఈ సినిమా. పితృస్వామ్య సమాజంలో లోతుగా పాతుకుపోయిన సంప్రదాయవాద ఆలోచనల ఫలితంగా ప్రతికూల సంకట స్థితుల్లో ఇరుక్కుపోతున్న మహిళల కష్టాలపై దృష్టి సారిస్తుంది. చూస్తున్న వాళ్ళకి ఇదేముందిలే అనిపించే విషయాలే మహిళా లోకాన్ని తప్పించుకోలేని దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయని దృశ్యమాథ్యమంలో బలంగా చెప్పాడు డైరెక్టర్‌ రమేజానీ.
హయాత్‌ తన సవాళ్ళను ఎదుర్కోవడంలోనూ, అలాగే లేడీ ఇన్విజిలేటర్‌ సమస్యల్లో ఉన్న ఒక బాలిక గురించి తక్షణ అవగాహనతో ఆచరణాత్మక జ్ఞానాన్ని సమయస్ఫూర్తితో ప్రదర్శించడాన్ని చూస్తారు ప్రేక్షకులు. టీనేజర్ల దృఢ నిశ్చయాలు, గందరగోళాలు, పోరాటం, నిరాశ, అత్యుత్సాహం అన్నీ 75 నిమిషాల నిడివి గల సినిమాలో అద్భుతంగా చిత్రీకరించి, ప్రేక్షకుల హృదయాల్ని అయస్కాంతంగా ఆకట్టుకునేలాగా తెరకి కట్టిపడేసి వారిని ఈ దిశగా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తాడు డైరెక్టర్‌ రమేజానీ. సమస్యకి సరైన పరిష్కారాన్ని అందించే దిశలో ఇరాన్‌ మహిళల జీవితాల్ని మెరుగు పర్చడానికి విద్య నిర్వహించబోయే పాత్రను కూడా ఈ సినిమా ప్రస్తావిస్తుంది.
చిత్ర రచయితలుగా ‘ఘోలం రెజా రమేజాని’, ‘మోజ్తాబా ఖోష్కడామన్‌’ నైపుణ్యాలు మళ్ళీ మళ్ళీ స్మరించుకోదగినవి.
ఇక స్పష్టమైన కథన చక్రాన్ని, వాస్తవికంగా అల్లినట్లే అమర్చడంలో దర్శకులు ‘ఘోలం రెజా రమేజాని’ ప్రసిద్ధ ఇరానియన్‌ దర్శకుల సంప్రదాయానికి నిజాయితీగా కట్టుబడి ఉంటాడు. సాధారణమైన సంఘటనల నుండి చాలా సరళంగా విశ్వజనీనమైన మూలం ఉన్న కథాంశంతో ఆకర్షణీయమైన చిత్రాన్ని రూపొందించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. కథాంశం యొక్క సామాన్యత చిత్రానికి సార్వత్రిక ఆకర్షణను అందిస్తుంది. రమేజాని దృశ్యీకరణలో అస్వాభావికంగా ఉండే అంశాలు గానీ, అద్భుతమైన నమ్మశక్యం గాని సన్నివేశాలు గానీ, ఏ రకమైన జిమ్మిక్కులు గానీ ఉండవు. ఒక సాధారణ రోజువారీ కథను, ఒక బాలికను, ఒక చంటి పాపాయిని ముఖ్య తారాగణంగా ఎంచుకుని, ప్రతి ఫ్రేమ్‌నూ నియంత్రణలో ఉంచి ఒక అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దాడు ఘోలం రెజా రమేజాని. ‘‘మనం నమ్మగలిగేది మంచి సినిమా, నమ్మలేనిది ఎందుకూ పనికిరాని చెడు సినిమా’’ అన్నారు అబ్బాస్‌ కియరోస్తమీ. ‘అరె, ఇది మనింట్లో ఆడపిల్లల కథలాగే ఉందే’ అని ప్రేక్షకులకు అనిపించేటట్లు అందరికీ వర్తించే కథాంశాన్ని ఎంచుకోవడంలోనూ, కథనాన్ని బిగిసడలకుండా నడిపించడంలోనూ అతని ప్రతిభ అసామాన్యంగా వ్యక్తమవుతాయి. ఒక చిన్న జీవిత శకలం ` గడియారం ముళ్ళు ఈ రెండిరటి మధ్య ఒక పరుగు పందాన్ని అసాధారణమైన రీతిలో నడిపించి క్షణ క్షణానికీ ప్రేక్షకుల్లో అత్యుత్సాహాన్ని నింపుతాడు. ఇరాన్‌ సమాజపు కపటత్వాన్ని, హాస్యాన్ని సూక్ష్మమైన అల్లికతో అద్భుతంగా సూచిస్తారు. ఈ క్రమంలో ఇరాన్‌ ప్రఖ్యాత దర్శకులు మాజిద్‌ మజిదీ, అబ్బాస్‌ కియరోస్తమి మొదలైన వారి సరసన నిలుస్తాడు రమేజానీ!
సహజమైన లైటింగ్‌, ధ్వనులను సినిమాటోగ్రఫీ సౌండ్‌ విభాగాల ద్వారా అత్యుత్తమమంగా ఉపయోగించుకుని వాస్తవిక వాతావరణాన్ని సృష్టించారు. సినిమాటోగ్రాఫర్‌ సయీద్‌ నిక్జాట్‌ నేర్పరితనం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చిత్రంలో పదాలు జీవిస్తాయి. విజువల్స్‌ మాట్లాడతాయి. చిత్రాలు కథలు చెబుతాయి.
డాక్టర్‌ ఇంటికి వెళ్ళడం కోసం మొదలెట్టిన పరుగు ఆపకుండా సినిమా మొత్తం ఊపిరి తీసుకునే సమయం కూడా లేకుండా పరుగులు పెడుతూనే ఉంటుంది హయాత్‌. ఆమె చేస్తున్న జీవన పోరాటం సినిమా చూస్తున్న వారందరికీ కళ్ళవెంట పరుగులు పెట్టిస్తూ మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. మధ్యలో ఎన్నెన్నో ట్విస్ట్‌లుంటాయి. హయాత్‌ పరుగులతో ప్రేక్షకుల కళ్ళు కూడా ఇష్టంగా పరీక్ష రాయగలుగుతుందా లేదా అని ఆత్రంగా చూస్తుంటాయి.
విద్యుత్‌ లేని, ఆసుపత్రులు లేని ఒక పేద గ్రామంలో కథను దృశ్యీకరించి పేద ప్రజలకు, ధనిక ప్రజలకు మధ్యనున్న అసమానమైన వ్యత్యాసాన్ని చూడమంటాడు దర్శకుడు రమేజానీ.
నేటి ప్రపంచంలో బాలికలను విద్యావంతులను చేసే విషయం ఇప్పటికీ దాదాపు అన్ని దేశాలలో చర్చనీయాంశంగా ఉంది. బాలికలు ఇంట్లోనే ఉండి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనే సంప్రదాయ దృక్పథాన్ని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమనుకునే మన దేశంతో సహా చాలా దేశాల్లో ఇప్పటికీ నమ్ముతున్నారు. హయాత్‌ నిరంతర శ్రమ, కార్యదక్షత, పట్టుదలతో అంత చిన్న వయసులో అన్ని అసమానతలకు వ్యతిరేకంగా విద్యను పొందాలనే స్థిరసంకల్పంతో ఉండడం ఎంతైనా ప్రశంసనీయం.
ఏ సినిమా అయినా అద్భుతమైన నటీనటుల వల్లనే రాణిస్తుంది. ఇక మన కథానాయకురాలు హయాత్‌ పాత్రను పోషించిన గజలేప్‌ా పర్సాఫర్‌ Mojtaba Khoshkdaman) తన సహజమైన నటనతో భావాలను సమయానుకూలంగా వ్యక్తీకరించి పాత్రలో జీవించింది. ఆమె ప్రేక్షకులతో తక్షణ సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఆమె ఇంటి నుండి పరీక్షా హాలుకు చేసే ప్రయాణంలో వివిధ రకాల భావోద్వేగాలను చాలా నేర్పుగా, చక్కగా వ్యక్తీకరించింది. నిరాశ, కోపం, అస్పష్టత, చికాకు, భయాలను ఉపశీర్షికల అవసరం లేకుండా అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా సినిమా నడుస్తున్న కొద్దీ హయాత్‌తో పాటు ప్రేక్షకులు కూడా దృఢ నిశ్చయం, ఉద్రిక్తత, తక్షణావసరాలు, ఉపశమనాలను అనుభవిస్తారు. ఈ చిత్రం బోధించకుండా సూక్ష్మ సందేశాలను పంపుతుంది. హయాత్‌ గురించిన అద్భుతమైన విషయం ఏమిటంటే తన రోజువారీ పనులను చక్కబెడుతూనే తన లెక్కలు, ఇతర పాఠాలను పునర్విమర్శ చేసుకునే సన్నివేశాల్లో ఆమె తనపై, తన తెలివితేటలపై హయాత్‌ ప్రకటించే విశ్వాసం ప్రేక్షకులను మురిపిస్తుంది.
ఈ చిత్రంలో హయాత్‌ తమ్ముడు అక్బర్‌ సున్నితమైన హాస్యాన్ని అందిస్తాడు. పొరుగు కుక్కలంటే అతని భయం, హయాత్‌ స్నేహితుడు ఫతేమెప్‌ాతో పోట్లాడే సందర్భంలో అతని లేత స్వరంలో నమ్మకాన్ని అద్భుతంగా ధ్వనింప జేయడం ప్రేక్షకులకు సమ్మోహనంగా తోస్తుంది. హయాత్‌ను ప్రేమించే తమ్ముడిగా ఆమెకు సహాయపడడం కోసం క్లాస్‌ వదిలి బయటకు రావడానికి తన ప్యాంటును తడుపుకోవడం వినోదభరితంగా ఉండి అక్బర్‌ నటనకు ప్రతి కోణంలోనూ ఆహ్లాదం కలిగిస్తుంది. అక్బర్‌ పట్ల ప్రేక్షకులకు ఇష్టం, అభిమానం పెరుగుతాయి. అక్బర్‌ పాత్రలో మెహర్దాద్‌ హసాని (Mehrdad Hassani) ప్రేక్షకులను మెప్పించాడు.
సమర్థవంతమైన సహాయక తారాగణాన్ని కూడా ఎంచుకున్నాడు దర్శకుడు ఘోలం రెజా రమేజానీ. పరీక్ష రాసి తీరాలనే హయాత్‌ ఆరాటాన్ని గమనించిన గ్రామ పాఠశాల హెడ్‌ మాస్టర్‌, పరీక్ష హాలులోని స్నేహితురాళ్ళిద్దరూ, మహిళా ఇన్విజిలేటర్‌, సినిమాలో భాగస్వాములైన వృద్ధురాలు, హయాత్‌ తల్లి… వీళ్ళందరి నటనా ఒక ఎత్తైతే ఆశ్చర్యకరంగా, హయాత్‌ చిన్నారి చిట్టి చెల్లెలు నబత్‌ కూడా తన బుజ్జిపాత్రను ప్రభావవంతంగా పోషించింది. బేబీ నబత్‌ ఏమీ మాట్లాడలేకపోయినప్పటికీ రెప్పలల్లార్చుతూ, చిరునవ్వులు చిందిస్తూ కెమెరా పట్ల ఖచ్చితమైన అనుబంధాన్ని చూపిస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ చిన్నారి ప్రపంచ సినీ పెద్దలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, వారి ప్రశంసలందుకుంది.
బాలికలు తమను తాము విద్యావంతులను చేసుకునే దిశగా పనిచేయాలని దర్శకుడు ఘోలం రెజా రమేజానీ తన చిత్రం ద్వారా బలమైన సందేశమిస్తారు.
జీవితంలోని అనేక పొరలను దృశ్యమాధ్యమంలో చూపిస్తుందీ చిత్రం. వయస్సుతో సంబంధం లేకుండా వీక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. మానవీయమైన, వాస్తవమైన జీవిత భాగాన్ని చూడాలనుకునే వారందరూ హయాత్‌ చిత్రాన్ని చూడాలి. ఆ వయసు పిల్లలకు అసాధ్యమైన క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో హయాత్‌ ఎలా విజయం సాధిస్తుందో తెలుసుకోవడానికి సినిమా తప్పకుండా చూడాలి. అంతేకాదు, ఎదుగుతున్న పిల్లలున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా చూపించవలసిన చిత్రమిది. ఆ మాటకొస్తే అందరూ ఇంటిల్లిపాదితో చూడదగిన సినిమా ఇది.
పనులన్నీ చక్కబెట్టడంతో పాటు తన పరీక్షను ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొన్న బాలికలాగే స్త్రీలందరూ తమ మీద తాము శ్రద్ధ వహించేలా భూమిక నిరంతరం అలర్ట్‌ చేస్తూ
ఉంటుంది.
హయాత్‌ చిత్రాన్ని చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా CFSI) ప్రమోట్‌ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక బాలల చలన చిత్రోత్సవాలలో అనేక అవార్డులను గెలుచుకుంది.
నేనీ చిత్రాన్ని అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం (2011)లో చూశాను. ఇప్పుడు కొంచెం తక్కువ క్వాలిటీతో యూ ట్యూబ్‌లో అందుబాటులో ఉంది. మిత్రులందరూ ఈ సినిమాను చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
సకల కళల సమాహారం సినిమా. సాహిత్యంలో ప్రముఖులైన వారు కూడా సినిమా కూడా సాహిత్యంలో ఒక భాగమని ఒప్పుకోవడానికి సందేహిస్తారు. అదే పాశ్చాత్య దేశాలలో అయితే ప్రసిద్ధ రచనలన్నీ సినిమాలుగా వస్తాయి. దృశ్యమాధ్యమం చాలా శక్తివంతమైనదని వారు గుర్తించారు. ఇక ఇప్పుడు ఆహార, పానీయాల లాగే సినిమా కూడా నిత్య జీవితావసరమైపోయింది. ఇక సినిమాని ఎంత మాత్రమూ నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. కానీ ప్రవహించే మురుగులో నుంచి ఇలాంటి మనకి పనికొచ్చే మచ్చుతునకల్ని శ్రద్ధగా ఏరుకోవాలి.
నా ఈ సినిమా సమీక్షని 2011లోనే గుర్తించి, ప్రచురించిన భూమికకు ధన్యవాదాలు.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.