21వ శతాబ్దపు అగ్నిపరీక్షలు -పూర్ణిమ తమ్మిరెడ్డి

‘‘అగ్నిపరీక్షా రామ్‌ కో దీ జాతీ హై, రావణ్‌ కో నహీ!’’ (అగ్ని పరీక్ష రాముడికి ఇవ్వచ్చు గానీ, రావణుడికి కాదు.)
గత రెండేళ్ళుగా హిందీ డైలీ సీరియల్‌ జగత్తులో టీఆర్పీల రాజ్యాన్ని దున్నేస్తున్న ‘అనుపమ’ అనే హిందీ డైలీ సీరియల్‌ ‘ఫెమినిస్ట్‌ సీరియల్‌ అనడానికి ఐదు కారణాలు’ అనే ఆర్టికల్‌ను ఒక ఇంగ్లీష్‌ ఫెమినిస్ట్‌ పత్రికలో చదివి, చూడడం మొదలెట్టిన నాకు ఈ డైలాగ్‌

వినగానే ఎలా అర్థం చేసుకోవాలో తెలీలేదు. పాతికేళ్ళకు పైగా భర్త చేత మానసిక హింసకు గురై, ఎదిగిన పిల్లల చేత మాటలనిపించుకుంటూ, ఇంటి కోసం గొడ్డు చాకిరీ చేస్తూ, పల్లెత్తు మాట అనకుండా కుక్కిన పేనులా ఉండే ఒక మధ్యతరగతి గుజరాతీ గృహిణి, ఏడేళ్ళ నుంచీ సాగుతున్న భర్త అక్రమ సంబంధం బయటపడ్డాక ఎట్టకేలకు కళ్ళు తెరిచి చట్టపరంగా విడాకులు తీసుకుంటుంది. అయినా కూడా ‘‘నువ్వీ ఇంటి కూతురివి ఇప్పుడు’’ అన్న మామగారి తేనె పూసిన కత్తిలాంటి మాటల్లో చిక్కుకుపోయి అత్తారింట్లోనే, భర్త ఉన్న ఇంట్లోనే వేరే గదిలో ఉంటుంది. ఆర్థిక స్వావలంబన కోసం కాలేజీనాటి స్నేహితునితో కలిసి బిజినెస్‌ చేపట్టి, ఆ పనుల మీద ఒక పూట అతనితో వేరే ఊరుకి వెళ్ళినప్పుడు, తుఫానులో చిక్కుకుపోయి ఆ రాత్రికి ఇంటికి రాలేకపోతుంది. మర్నాడు ఇంటికి చేరుకోగానే మాజీ`భర్త, మాజీ`అత్తగారు కలిపి పిల్లల ముందే ఆమె శీలాన్ని శంకిస్తుంటే ‘‘నన్ను నిలదీయడానికి నువ్వెవరివి?’’ అన్న ఉద్దేశ్యంతో పై డైలాగు కొడుతుంది.
పై డైలాగును ఏ విధంగా చూసినా సమస్యాత్మకమైన డైలాగే.
రావణుడే కాదు, మంచివాడు, మర్యాదస్తుడైన రాముడికీ నిలదీసే హక్కు లేదు. అనుపమ తన స్నేహితునితో వ్యాపారం మొదలెట్టిన దగ్గరనుంచీ, ‘‘నీ పిల్లలు తలెత్తుకుని తిరగలేరు’’ అన్న మాటతో మాటిమాటికీ బ్లాక్‌మెయిల్‌ చేయడానికి చూస్తుంటుంది మాజీ అత్తగారు. అనుపమ ఎంతసేపూ ‘‘నాతోపాటు నాకు సాయం చేస్తున్న స్నేహితుని క్యారెక్టర్‌నూ అంటున్నారు’’ అని వెక్కివెక్కి ఏడుస్తుంది. మాటల రంపపు కోత అనుభవిస్తుంది కానీ ఎదురు తిరగదు.
చదువు మధ్యలో ఆగిపోయి, చిన్న వయసులోనే పిల్లలు, సంసారం అనే చట్రంలో ఇరుక్కుపోయి, బయటకు కాలుపెట్టే తీరిక కూడా లేకుండా, ఇల్లే లోకంగా బతికే ఆడవాళ్ళకు ఒకలాంటి కండిషనింగ్‌ ఉంటుంది. దాంట్లోంచి బయటపడడం, చిన్న చిన్న హక్కులను, అధికారాలను చేజిక్కించుకోవడానికి కూడా తనతో తాను ఎన్నో యుద్ధాలు చేయాల్సి ఉంటుందని ‘అనుపమ’ చూస్తే తెలిసింది. మహానగరాల్లో పెద్ద కార్పొరేట్‌ ఉద్యోగం చేస్తూ స్వతంత్రంగా ఉంటూ, ఒకలాంటి privileged view of feminism ఉన్న నేను, నా లెన్స్‌ నుంచి ఆమెను జడ్జ్‌ చేయడం తగని పనని నిర్ణయించుకున్నాను.
ఒక రాత్రి ఇంటికి చేరలేని కారణాన, ఆమెను మాజీ భర్త, అతని తల్లి నిర్దాక్షిణ్యంగా దూషించిన తర్వాత మాత్రం అనుపమ ఆ ఇంటినుంచి బయటకు వచ్చేస్తుంది. మొదట అదే ఊర్లో ఉన్న పుట్టింటికి వెళ్తుంది. కానీ రెండు రోజుల్లోనే తనకంటూ అద్దె ఇల్లు కోసం వెతుకులాట మొదలెడుతుంది. అన్ని చోట్లా ‘విడాకులు తీసుకుని సింగిల్‌గా ఉండే మహిళలకు ఇల్లు ఇవ్వం, వాళ్ళ నడవడికను నమ్మలేం’ అనే స్పందనే వస్తుంది. ‘‘నలభై ఐదేళ్ళ వయసుగల మనిషిని, ముగ్గురు ఎదిగిన పిల్లలకు తల్లిని, పాతికేళ్ళు గృహిణిగా ఉన్నదాన్ని, ఇంకో మగాణ్ణి కన్నెత్తి చూడనిదాన్ని, ఒకరిని ఒక మాట అని ఎరుగనిదాన్ని… ఇవేమీ నన్ను సర్టిఫై చేయలేవా?’’ అని వాపోతుంది.
ఆమెకో, ఆమెలాంటి వారికో మాత్రమే ప్రత్యేకించినవి కావు శీలపరీక్షలు. పెద్దలకు నచ్చని పెళ్ళి చేసుకున్నా, లేదా పెళ్ళయ్యాక విడాకులు తీసుకున్నా, లేదా అసలు పెళ్ళే చేసుకోకపోయినా (అవ్వకపోయినా), ఆడదాన్ని హింసించడానికి మొట్టమొదట చేసే దాడి ఆమె శీలం, వ్యక్తిత్వాలపైనే. 90ల దశకాల్లో కడుపు ఎండగట్టుకుని, వస్తున్న చాలీచాలని జీతాలని పోగేసి, అవసరమైతే అప్పులు చేసి, లక్షలు పోసి ఆడపిల్లలను ఐఐటీ`జెఈఈ, ఎమ్‌సెట్లకు కూర్చోబెట్టి ఇంజనీరింగ్‌ సీట్లు తెప్పించింది వాళ్ళు ప్రయోజకులు అవుతారని, తమ కాళ్ళపై తాము నిలబడతారని, ఇంకా ముందుకెళ్ళి టెక్నాలజీ, మెడిసన్‌ రంగాల్లో విశేషంగా కృషి చేస్తారని కాదు. మార్క్‌షీట్లను, రెస్యూమ్‌లను కూడా పెళ్ళి మార్కెట్లో ఎరగా వేసి, మంచి అమెరికా సంబంధాలు వేటాడడానికే. అందుకని ఈ విషయంలో చదువు మధ్యలో ఆపేసి, ఇంటికే అంకితమైపోయిన అనుపమ లాంటి వాళ్ళయినా, చదువుకుని ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ లక్షలకు లక్షలు సంపాదిస్తున్న ఆడవాళ్ళయినా ఒక్కటే.
పెళ్ళై విడిపోతే అత్తారింటి వాళ్ళు ఈ పనికి పూనుకుంటారు. కానీ పెళ్ళవ్వకుండానే ఒంటరిగా ఉండే అగత్యమో/ అవసరమో/ అభిమతమో కలిగితే మాత్రం ఈ శీలం`పై`నిందలు అనే మహత్‌ కార్యాన్ని తల్లిదండ్రులే నెత్తినేసుకుంటారు. ‘‘మా మాట ఎక్కడ వింటుంది? బరి తెగించింది, తిరుగుళ్ళకు అలవాటు పడిరది’’ లాంటివి ఇంకా సభ్యసమాజం మళ్ళీ రిపీట్‌ చేయవచ్చు. ‘‘దిగడమంటూ మొదలెడితే ఇదే నా తొలి మెట్టు, దీన్ని బట్టి నా ఆఖరిమెట్టు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకో’’ అన్న ప్రకాశ్‌ రాజ్‌ డైలాగులూ, నోళ్ళు ఎంతకన్నా దిగజారుతాయి. కన్నకూతుళ్ళని అలా నానా మాటలని, బురద జల్లి తమ పెంపకంపైనే, తమ ఆచార వ్యవహారాలపైనే బురద జల్లుకుంటున్నారని వారికి అర్థం చేయించలేం.
ఎందుకంటే, వాళ్ళది ఒక స్ట్రాటజీతో కూడిన ఎస్కేప్‌ మెకానిజం. ‘‘మేం చేయగలిగిందంతా చేశాం. అయినా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు’’, ‘‘కాపురం చేయడం లేదు’’ అనడంతో పాటు కసిగా, గొంతు చించుకుంటూ కూతురి గురించి నాలుగు బూతు మాటలు మాట్లాడితే చాలు, మధ్యతరగతి సమాజం జరిగిన నేరంలో తమని నిర్దోషులుగా గుర్తించి, అక్కున చేర్చుకుని ఊరడిస్తుందని వాళ్ళ ఊహ. నిజానికి సమాజంలోని ది`సో కాల్డ్‌ ఆ నలుగురు, తమాషా జరుగుతున్నంత సేపూ చూసి అపై పక్కకు వెళ్ళిపోతారు. కోపాలు, కసి తగ్గి నిజావస్థను (పెళ్ళిలో ఇరుక్కోడానికి నిరాకరించిన అమ్మాయిని) ఒప్పుకోక తప్పని పరిస్థితులు ఏర్పడితే, ‘‘ఆ, పెద్దవాళ్ళం… కోపంలో అంటాం. అన్నీ మనసులో పెట్టుకుంటారా?’’ అని కొట్టిపారేస్తుంటారు. మురికి పట్టిన గోడలకు తెల్ల సున్నం వేసినట్టు వెర్బల్‌ అబ్యూజ్‌ని ప్రేమ, బెంగలంటూ వైట్‌ వాష్‌ చేస్తారు.
కానీ, ఇలా మాటలు పడిన అమ్మాయిల పరిస్థితి ఏంటి?
మర్యాద`శీలం`క్యారెక్టర్‌ అంటూ ఇంకా ఊహ తెలియని వయసు నుంచి మెదడులో పచ్చబొట్లు గుచ్చి గుచ్చి, స్కూల్‌ కాలేజీల నుంచి ఇరుగుపొరుగులో అబ్బాయిలతో ఆచితూచి మాట్లాడుతూ, ఎప్పుడన్నా ఎవడన్నా రోడ్డు మీద వెంటబడితే దించిన తల ఎత్తకుండా పరిగెత్తుకుని పోయి ఇంట్లో దాక్కుంటూ, కిక్కిరిసిన బస్సుల్లో మగాళ్ళు రాసుకుంటూ పూసుకుంటూ ఉంటే చదువెక్కడ మాన్పిస్తారోన్న భయంతో, ఎవరికీ చెప్పకుండా మౌనంగా భరిస్తూ, పొరపాటున కూడా బ్రా స్ట్రాప్‌ కనిపిస్తే ఎవరికేం ఊహలు కలిగిస్తున్నానో అని భయపడి చస్తూ, క్షణక్షణం ‘‘నేను ఆడదాన్ని, నా క్యారెక్టరే నాకు శ్రీరామరక్ష!’’ అన్న కండిషనింగ్‌లో పెరిగిన అమ్మాయిలకు, అప్పటివరకూ తమ నడవడికతో సంబంధం లేకుండా, అయినవారు`కానివారు అని తెలీకుండా అడ్డమైన కూతలు కూస్తే, ఆ ట్రామా ఎంతటి ట్రామా? ఆ నరకం ఎలాంటి నరకం?
‘‘నువ్వు నాకు క్యారెక్టర్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేదేంటి? నువ్వు ఇంతకాలం నాకు ఏమన్నా చేసుండనీ, జన్మనే ఇచ్చుండనీ… నా గురించి ఇలా అన్నాక, నీకు విలువ లేదు, నా జీవితంలో స్థానం లేదు’’ అని తిరిగి ఎదిరించి పోరాడడానికి, దులుపుకుని పోవడానికి ఎన్నెన్ని మానసిక సంఘర్షణలు పడాలి? ఎన్నెన్ని సున్నితత్వాలను కోల్పోవాలి? ఎంత మొద్దుబారిపోవాలి? ఎందరిపై నమ్మకం పోగొట్టుకోవాలి?
ఇక్కడ ఐరనీ అర్థమవుతోందా? ‘‘నువ్వు ఫలానా ఫలానా చేసి ఫలానాలా ఉంటేనే నిన్ను గుడ్‌ గర్ల్‌ అంటాం. లేకపోతే నీకు నరకం చూపిస్తాం’’ అని చిన్నప్పటి నుంచి అదిలించి, బెదిరించబడిన ఒక అమ్మాయి ‘‘గుడ్‌ గర్ల్‌’’గా మెలిగినా కూడా కారణాంతరాల వల్ల ఆమె వివాహ వ్యవస్థను కాదనుకుంటే దాంట్లో ఇమడలేకపోతే, ‘‘సింగిల్‌ ఉమెన్‌’’ అన్న ఒక్క నెపంతో ఆమె అన్నేళ్ళ జీవితం, నడవడికతో సంబంధం లేని క్యారెక్టర్‌ సర్టిఫికెట్‌ చేతిలో బలవంతాన పెడతారు. ‘‘ఛ! అట్లాంటి అమ్మాయి కానే కాదు’’ అన్న స్పృహే ఎవ్వరికీ ఉండదు.This is how systematically the system fools you into doing the things it wants you to do, and then penalizes you according to its whims.
ఈ మెంటల్‌ టార్చర్‌ అంతా కూడా ఆడవాళ్ళని ‘‘అమ్మో ఒంటరిగా నే బతకలేను, ఎట్లయినా నాకు పెళ్ళి కావాలి/ మిగలాలి’’ అన్న గత్యంతరం లేని అవస్థకు తీసుకురావడానికే! సింగిల్‌ మెన్‌ జీవితాలు కూడా ఏమీ వెలిగిపోవడం లేదు కానీ, వాళ్ళ అవస్థ కనీసం గుడ్డిలో మెల్ల. ‘‘అనుపమ’’ సీరియల్‌లో ఆమె ఒకప్పటి కాలేజీ స్నేహితుడు, తర్వాత బిజినెస్‌ పార్ట్‌నర్‌ కూడా పెళ్ళిచేసుకోనివాడే. ‘‘శారీరక అవసరాలను బట్టి అమ్మాయిలను కలిశాను కానీ, ఎవరినీ ప్రేమించలేదు’’ అని నిస్సంకోచంగానే చెప్తాడు. అందరి స్పందన ‘‘ఓప్‌ా… అలాగా!’’ అన్నట్టే ఉంటుంది. అదే అతను అతను కాక, ఆమె అయ్యుంటే guilty until women అన్నదే వర్తించేది.
అమ్మాయిలపై అత్యాచారాలు, కట్నం వేధింపులు, గృహ హింస, మారిటల్‌ రేప్స్‌ వగైరాలతో పోల్చితే ఒక చిన్న విషయంగా కనిపించవచ్చు. ముఖ్యంగా ఈ ప్రహసనంలో బయటకు కనిపించే గాయాలు, చావులు ఉండవు. కానీ, ఇది కూడా చాలా అవసరమైన టాపిక్కే మాట్లాడుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి. నిజం చెప్పాలంటే, ఇష్టంలేని పెళ్ళిళ్ళు, ఇష్టం లేకపోయినా కాపురాలు చేస్తున్న అమ్మాయిలు, వాటిలో ఉన్న హింసను గుర్తించలేక కాదు. దానికి ఎదురు తిరిగితే పెళ్ళి నుంచి బయటకు రావాలి. అట్లా వస్తే రంపపుకోతల్లాంటి మాటలు వింటూ సహించాలి. అందుకే ప్రాణంమీద కొస్తుందని తెలుస్తున్నా అమ్మాయిలు అలానే కొనసాగుతున్నారు. ఎవరన్నా పోతే మాత్రం, మనం వెంటనే, ‘‘అర్రె, చచ్చేదాకా తెచ్చుకోవాలా? ముందే జాగ్రత్తపడద్దా’’ అనే ఒక ఖాళీడబ్బాలో గులకరాయి టైపు మాటొకటి విసిరేస్తాం. ఎలా అయితే అమ్మాయిలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌ విద్యలు, చట్టాలపై అవగాహన పెంపు లాంటి కార్యక్రమాలు చేపడుతున్నామో, ఇలాంటి మాటల/మానసిక దాడులకు లొంగకుండా ఎలా నెగ్గుకురావాలన్నది కూడా చర్చించుకోవాలి. అప్పటివరకూ ఉన్న సోషల్‌ సర్కిల్‌కు దూరమైనా, సంఫీుభావంగా నిలిచే మరికొన్ని సర్కిల్స్‌ ఉన్నాయన్న ధైర్యం కావాలి.
అగ్నిపరీక్ష రాముళ్ళకు, రావణులకే కాదు, ఎవరికీ ఇవ్వకూడదు… జన్మనిచ్చిన వారైనా సరే, ఎందుకూ అక్కరకు రాని సమాజమైనా సరే. ‘‘గుడ్‌గర్ల్‌’’ అని జనాలిచ్చేది ఒక అర్థం లేని, నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాని సర్టిఫికెట్‌. పొరపాటున బ్రా స్ట్రాప్‌ కనిపిస్తే పది మార్కులు తగ్గిస్తే అసలు పరీక్షలకు కూర్చోవాల్సిన అవసరమే లేదు. ‘‘నువ్వు ఎదగడానికి రెక్కలు తొడుగుతాం, అయినా నువ్వు మా కనుసన్నలలో ఉండకపోతే బూతులు ఎత్తుకుంటాం’’ అన్న టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌తో వచ్చే మమతలను పోగొట్టుకోవడమే మేలు. ‘‘ఆడదానిపై దాడి చేయాలంటే శీలంపై దాడి చేయాలి’’ అనే దరిద్రమైన కుట్రకు అడ్డుకట్ట వేయాలంటే, మనం మనకిచ్చుకునే సర్టిఫికెట్‌ తప్పించి ఇంకెవ్వరి నుంచీ వచ్చేదీ ఒప్పుకోని మానసికావస్థకు మన అమ్మాయిలను తీసుకురాగలిగాను. అది వ్యాసంతో, ఒక రోజులో వచ్చే మార్పు కాదు. కానీ, మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.