భూమికతో నా పరిచయం
భూమిక పత్రిక 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముందుగా సత్యవతి గారికి, భూమిక టీమ్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భూమిక పాఠకులను కూడా మీ సంబరాలలో భాగస్వామ్యం కల్పిస్తున్నందుకు చాలా సంతోషం.
రేడియోలో విన్న ఒక ఇంటర్వ్యూతో సత్యవతి గారితో నా పరిచయం మొదలైంది. ఆ ఇంటర్వ్యూ నాకు ఎంతో ప్రేరణ ఇచ్చింది. బహుశా 2017`18లో అనుకుంటా, నేను అప్పుడే ఫేస్బుక్లో అడుగుపెట్టాను. మా చిన్నమ్మాయి నాకు ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇచ్చింది. అలా భూమిక కవర్ పేజీ మీద కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారి ఫోటో ప్రచురణ అయిన సంచిక చూశాను. ఎలాగైనా ఆ పత్రిక చదవాలి అనిపించింది. అలా భూమిక పత్రికతో నా పరిచయం మొదలైంది.
అలా భూమిక పాఠకురాలిగా అయిన నాకు, నేను కూడా ఒక వ్యాసం రాయాలి అనిపించింది. ఆర్భాటం లేని ఆదర్శ వివాహాలు ప్రోత్సహించి అభినందించాలి అన్న అంశంపై రాసి భూమిక పత్రికకు మెయిల్ చేశాను. కొన్ని రోజులకే భూమిక ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. మీ వ్యాసం ఫిబ్రవరి 2017 సంచికలో ప్రచురిస్తున్నాం అని తెలిపారు. ఇక నా ఆనందానికి అవధుల్లేవంటే నమ్మండి. భూమిక పత్రిక ఆన్లైన్లో అందుబాటులో ఉండడంతో ఆ వెబ్సైట్లో నా పేరు టైప్ చేయగానే నేను రాసిన వ్యాసం కనిపించింది. నేను రచయిత్రిని కాదు. కానీ నా పేరు అలా చూసుకోవడంతో ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆ లింక్ని నా స్నేహితులకు, బంధువులకు షేర్ చేయడంతో అందరూ అభినందించారు.
మార్చి 2017 సంచికలో స్పందన పేజీలో అబ్బూరి ఛాయాదేవి గారు నా పేరు ప్రస్తావిస్తూ నేను రాసిన వ్యాసాన్ని అభినందించారు. అది చదివి, ఒక బంగారు పతకం గెలిచినంత ఆనందం కలిగింది. అంత గొప్ప రచయిత్రి నేను రాసింది చదివి స్పందించడం, ఇదంతా భూమిక కారణంగానే జరిగింది. అప్పుడు నేను ఖమ్మంలో ఉండేదాన్ని. ఒకసారి హైదరాబాద్ వచ్చినపుడు మా అమ్మాయిని భూమిక ఆఫీసుకు తీసుకుని వెళ్ళమన్నాను నేను వ్యాసం రాసిన సంచిక, అబ్బూరి ఛాయాదేవి గారు రాసిన స్పందన సంచిక కాపీలు తీసుకునేందుకు. మా అమ్మాయి ఆఫీసులోకి వెళ్ళి పసుపులేటి రమాదేవి రాసిన సంచిక కావాలి అని అడిగితే, రెండు కాపీలు ఇచ్చారు. మా అమ్మాయి ఆ సంభాషణ నాతో చెప్పినప్పుడు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఇంకా రాయాలి అన్న స్ఫూర్తిని ఇచ్చింది.
2018 డిసెంబర్ సంచికలో కవనం శర్మ గారు రాసిన ‘‘ఆమె ఇల్లు’’ కథ చదివాను. నా మనసుకు చాలా దగ్గరగా అనిపించింది. ఆ సంచిక మా స్నేహితులకు ఇచ్చి వారితో కూడా చదివించాను. 2019 జనవరి సంచికలో ఆమె ఇల్లు కథకు నా స్పందన కూడా రాసి పంపాను. అలా లక్ష్మి గారు పరిచయమయ్యారు.
ప్రశాంతి గారికి నేను అభిమానిని అయిపోయాను. తన పేరుకు తగ్గట్టుగా ప్రశాంతంగా, ఏ విషయంపైనయినా ఎంతో విషయ పరిజ్ఞానంతో ఆలోచిస్తారు. సత్యవతి గారు ఈ సమాజానికి ఒక రోల్ మోడల్. సత్యవతి గారిని చూసి ఎన్నో విషయాల్లో ఇన్స్పైర్ అయ్యాను. ఛాయాదేవి గారి పేరు మీద మొబైల్ లైబ్రరీ ప్రారంభించాలి అనుకుంటున్నాను అని సత్యవతి గారు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినపుడు, ఎంత మంచి ఆలోచన అనుకున్నాను. నా వంతు ఉడుత సాయం చేసి అంత ఉత్తమ కార్యక్రమంలో పాల్గొన్నాను. అలా భూమిక ఆఫీసుకి నాలుగైదుసార్లు వెళ్ళాను. సత్యవతి గారు, ప్రశాంతి గారి స్ఫూర్తిదాయక ఆలోచన ప్రతిబింబించేలా ఉంటుంది భూమిక ఆఫీస్.
భూమిక పత్రిక మరో ప్రత్యేకత, ఈ పత్రిక ఆన్లైన్లో అందుబాటులో ఉండడం, ప్రతి నెల 10వ తారీకు లోపేపోస్టులో కాపీ వచ్చేయడం. భూమిక సంపాదకీయ టీమ్ ఎంత అంకిత భావంతో పని చేస్తారు అన్న దానికి అదే ఉదాహరణ.
భూమిక పత్రికతో నాకు ఉన్న అభిమానాన్ని ఇలా షేర్ చేసుకునే అవకాశమిచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. వేడుకలలో ప్రత్యక్షంగా పాల్గొనలేని నాలాంటి అభిమానులందరినీ దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లో లైవ్ ఏర్పాటు చేస్తే వీక్షించే అవకాశం
ఉంటుంది. కాబట్టి దయచేసి లైవ్ ఏర్పాటు చేయగలరని నా మనవి.
` పసుపులేటి రమాదేవి, కూకట్పలి