భూమికకు జన్మదిన శుభాకాంక్షలు
స్త్రీవాద పత్రిక భూమిక ముప్పయ్యో పుట్టినరోజు జరుపుకునే వేళ సంపాదక వర్గానికి, భూమికకు తమ రచనలందిస్తూ వచ్చిన రచయితలకూ, ఈ పత్రికనాదరిస్తూ వచ్చిన పాఠకులకూ అనేక శుభాకాంక్షలు.
ఎన్నో పత్రికలున్నాయి. కొన్ని అచ్చు పత్రికలూ, కొన్ని జాల పత్రికలూ. ఏవైనా వ్యాపార ధోరణి ఎంతమాత్రమూ లేకుండా చాలాకాలం నడవాలంటే అది దాదాపు అసాధ్యమే. అందులోనూ కుల మత వర్గ బేధాలు లేకుండా అందరికీ సమ న్యాయం, సమాన గౌరవం లభించే దిశగా, ముఖ్యంగా స్త్రీలలో పీడిత వర్గానికి ఆసరాగా, పీడన అలవాటైన వారికి తోటివారి పట్ల అదెంత అన్యాయమో ఆలోచింపజేసే దిశగా సాగుతూ వచ్చిన భూమిక పయనం మిగిలిన పత్రికల ప్రయాణానికి భిన్నమైనది. గృహ హింస బాధితులైనా, సామాజికంగా వంచితులైనా బాధిత మహిళలనగానే గుర్తొచ్చేది భూమిక టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్. మహిళలకు ఆసరానిచ్చే, అలంబననిచ్చే ఎన్నో చట్టాలున్నాయి. వాటి గురించి ఏ మాత్రమూ తెలియని వర్గానికి, వాటి ఉనికి గురించి తెలియజేసే ఏకైక పత్రిక భూమిక.
ఈ ముప్ఫయి సంవత్సరాల్లో భూమిక కొన్ని సామాజిక యాత్రలు చేపట్టింది. సామాజిక న్యాయానికి దూరమైన కొన్ని సమూహాలని ప్రత్యక్షంగా కలిసి న్యాయ పోరాటంలో పోరాడి పోరాడి తమ నమ్మకాన్ని, ధైర్యాన్ని, చివరికి తమదైన స్వరాన్నీ కోల్పోయిన వారికి భూమిక ద్వారా తమ ఘోషని వినిపించే అవకాశాన్నిచ్చింది. కత్తికన్నా పదునైన కలాలతో ప్రత్యామ్నాయ పోరాట మార్గానికి కొంత దిశానిర్దేశం చేసింది. 80వ దశకం నుంచీ ఊపందుకున్న స్త్రీవాదానికి 90వ దశకపు ఉత్తరార్థంలో పుట్టిన భూమిక ఒక చక్కని వేదికగా నిలబడిరది.
ఈ పత్రిక ఆర్థికంగా వెన్నూ దన్నూ లభించక తడబడుతున్న దశలో కొండవీటి సత్యవతి పూనుకుని మాసపత్రికకు జీవిత సభ్యత్వాలని ఆఫర్ చేస్తూ, కొంత ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురాగా, తమ లక్ష్య సాధనలో భూమిక టీమ్ సాధిస్తూ వచ్చిన విజయాలు గమనించిన ప్రభుత్వం ‘షి’ టీమ్స్, భరోసా సెంటర్స్ వంటి బాధిత మహిళల కోసం నడిపే కేంద్రాల నిర్వహణలో, పోలీస్ వ్యవస్థకవసరమైన జెండర్ సెన్సిటివిటీ శిక్షణలో భూమిక సత్యవతి బృందాన్ని ఇన్‌వాల్వ్ చేయడంతో భూమిలో వేళ్ళూనుకుంటూ అప్పుడప్పుడే కొమ్మలు విస్తరిస్తున్న మొక్క అతి త్వరగా శాఖోపశాఖాలుగా ఎదిగి ఎందరికో నీడనిచ్చే మహా వృక్షంగా ఎదిగింది. ఏ దిక్కూ లేదని నిస్పృహకు లోనైన మహిళలకు ఒక్క టోల్‌ఫ్రీ ఫోన్ కాల్ దూరంలో సహాయ సహకారాలు అందేలా ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది.
తామెన్నుకున్న లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన నిబద్ధతా, సంబంధిత జ్ఞానమూ, శక్తి సామర్ధ్యాలూ ఒకచోట కూడితే పనులెలా జరుగుతాయన్న దానికి ఒక ఉదాహరణగా ఈనాడు భూమిక నిలబడిరది. విజయ దరహాసంతో సగర్వంగా నిలబడిన భూమికకు పుట్టినరోజు సందర్భంగా అనేకానేక అభినందనలూ, శుభాకాంక్షలూ!
`వారణాసి నాగలక్ష్మి