నాగేటి సాళ్లు దున్ని
చెమట చుక్కలతో సాగు చేసి
నేలమ్మ ఒడిలో దాచిన విత్తనాలకై
కళ్లలో ఒత్తులేసుకొని చూడగ
కొండకోనలు చీల్చుకు వచ్చే భానుడిలా
నేలమ్మ కడుపు చీల్చుకునొచ్చిన పైరు చూసి
మట్టి బిడ్డ మోము….
వెయ్యి మతాబుల్లా వెలుగుతోంది
మాగాణంతా విస్తరించిన పైరు
పుడమి తల్లి చీరగా మారి
మన్ను మిన్ను ఏకమై ఆ పచ్చదనం రవినంటి
నిప్పులు చెరిగే రవి కాంతులు సైతం
ఆకుపచ్చ వెన్నెల కాంతులైనవి
తొలిచూలు బిడ్డను మోసే తల్లిలా
పొట్టకొచ్చిన పైరును పైలంగా కాపాడాలని
ప్రకృతి నేస్తాలకు తన సద్ది పంచి
మురిసేదొక కృషివలుడే
నెలలు నిండిన వనితలా
బరువు మోయలేక ఊగిసలాడే పైరు చూసి
రొమ్ము విరిచి ధీమాగా నిలబడి
భువి నలుమూలలా వినబడేలా కళ్లతోనే చెప్తుండు
ఇకపై ఆకలి చావులుండబోవని…
దేశ భవితవ్యానికి ఢోకాలేదని
కానీ, ప్రకృతి ప్రకోపం పంట నేల కూల్చి
కర్షకుని కళ్లలో రక్తాశ్రువు చిందించి…
చుట్టూతా గాఢాంధకారం ఆవహించి…
మాగాణెటు చూసినా అప్పుల కుప్పలు
ఆకలి చావులే కనిపించి
ప్రకృతితో జూదమాడలేక
విసిగిన పృథివి వెన్నుపూస
పుడమితల్లి ఒడిని చేరెను