స్త్రీలంతా విషాదాన్ని తలకెత్తుకుని ఒక్కళ్ల పై ఒక్కలుగా ఏతం
పోస్తున్న దుఃఖంతో వలపోస్తూ
ఎట్లా తెల్లారుతుందో ఎట్లపొద్దు
గుంకుతుందో అన్న గుబులు..
సర్కారు పథకాల్లో మునిగి
పోతున్న పల్లెల రోదన… తాత
ముత్తాతలనుండి సజీవంగా ఉన్న ఆనవాళ్లను తనలో కలుపుకున్న జలధి గవర్నమెంటు ఇచ్చిన పైసలు శనిగెలు బుక్కీ
చెర్ల చెయ్యి కడిగినట్లయ్యింది
డజనుమందిని కనిపెంచి సాది
సంబాళించిన మా పెంకుటిల్లు
బాయిగడ్డ యాపచెట్టు ఆవు
లాగేను కట్టేసిన దొడ్డి చేను చెల్కా వలసన్నియాదు
తడుమంగా పొట్టచేత బట్టుకొని బతుకు తరుముతుంటే..
తీరని… దుఃఖం.. మోసుక పోయే ఇసిరెలు కాదుకదా జ్ఞాపకాలు! ఆపతికి సంపతికి ఆదుకునే నేనరు మంచి చెడ్డలు ఇసారిచ్చే కనికరం ఊరి సొత్తు
అనువాదానికందని… ఉద్వేగం
ఇప్పుడు సర్కారీ పథకంలో భాగశీగా
పల్లెలన్నీ ఆగమైనయి చెట్టుకొక్కలుగా పుట్టకొక్కలుగా
చెదిరిపోయిన సమయం… ఇల్లు
ఖాళీ చెయ్యలన్నప్పుడు మా తాత నేనున్నా పోయినా ఈన్నే
తాతలు తండ్రులు బల్గమంతా
పోయి సందేమైన జాగ నా ఉసురు ఈన్నే పోవాలె అనిపడ్డ
మనాది ఎ పైసగట్టిచ్చినా..పుట్టినూరుకు
సాటి రావు..గావురంగా పావు
రంగా మాసిపోని యాదులు
పాసిపోని ప్రేమలు… ఆచారాలు ఉనికి గోజలతోటి ఇంత పాలు
పెరుగు కైకిలో కంబటో చేసుకు
కాయో గడ్డతోటి కాళ్ళు కడుపుల
మసుల్కునే పల్లెలు తల్లిపాల
పొదుగునుంచి శిశువును బలిమీటికి తప్పించిన విధారకం
గుండెల్లో దుఃఖం అలుగు దుంకుతుంటే కండ్లు ఏతంపోస్తూన్నయి… నీళ్లల్ల నుంచి ఒడ్డుకే సిన చాపల్లా నిర్దాక్షిణ్యంగా. బొడ్డుతాడు తెగుతున్న సందర్భం…