స్పురద్రూపం, ఖంగుమనే కంఠస్వరం, సంగీతం సాహిత్యం చిత్రలేఖనం పట్ల అభిరుచి, అవగాహన, ముక్కుసూటితనం, అన్నీ వున్న వ్యక్తి, దాదాపు 30 సంవత్సరాలు ఆమెతో నా అనుబంధం. మరణం ఆమెను భౌతికంగా వేరుచేసేవరకు.
ఒక పోలీస్ ఆఫీసర్ భార్యగా వీరలక్ష్మీ దేవి గారి స్నేహితురాలిగా తనను పరిచయం చేసుకుంది, సమయం సామ్రాజ్య లక్ష్మి అనే ఆహ్వానం లక్ష్మి, విజయవాడ రాగానే. మంచి చదువరి, చలం అభిమాని మంచి పాటలు యిష్టం, దబాయించినట్లు మాట్లాడుతుందే గాని ఆ దబాయింపు వెనక ఆమె స్వచ్ఛమైన నవ్వు, స్నేహం వుంటాయని ఆమె అలా లేకపోతే వీరలక్ష్మిగారి స్నేహితురాలు కాగలిగి వుండేవారు కాదనీ త్వరగానే అర్థమైంది. మా స్నేహం నిలిచి వెలిగింది.
ఆకాలంలోనే ఏదో ఒక మంచి పని చెయ్యాలనే తపన నుంచి ఆహ్వానం ఆవిర్భవించింది. మంచి స్నేహాలు, మంచి సలహాలు వినే గుణం, పత్రికను మంచి ప్రమాణాలతో నడపాలనే ఉత్సాహం, పలువురు రచయితలతో పరిచయం, చర్చలతో ఆహ్వానం ఆఫీసు కళకళ లాడేది. ఆ ఉత్సాహంలో నాకు కూడా చిన్న పాత్ర వుండడం నా జీవితంలో కూడా ఆహ్వానం రోజులు అందమైన రోజులుగా నిలిచిపోయాయి. ప్రసిద్ధ చిత్రకారులు ఎస్వీ రామారావు గారు, చలసాని ప్రసాదరావు గారు, భుజంగ రాయశర్మగారు, సంజీవ్ దేవ్‌గారు అందరూ నాకు అక్కడే పరిచయం. చిత్రకారుడు బాలి గారితో కూడా. ఆ రోజుల్లో నాకొక ఉద్యోగం వుండేది. ఇంటి బాధ్యత వుండేది. చదువుకోవడం రాసుకోవడం వుండేది. అయినా లక్ష్మిగారి ఆఫీస్‌కి వెళ్ళాలంటే అదొక ఉత్సాహపు ఊరట.
పత్రికలు కొని చదివే అలవాటు తక్కువగా వున్న తెలుగు రాష్ట్రంలో, సర్క్యులేషన్ బట్టి ప్రకటనలు వచ్చే పరిస్ధితిలో ఆర్ధిక వొడిదుడుకులు తట్టుకుంటూ ఒంటి చేతిమీద పత్రిక నడిపిన సాహసి లక్ష్మిగారు. రచయిత మిత్రులం రచనలు యివ్వగలమే గానీ మరే విధంగానూ చెయ్యి అందించలేము.
ఆహ్వానం ఎన్నతగిన కథలు ప్రచురించింది. మంచి వ్యాసాలు ప్రచురించింది. నేను కూడా సమకాలీన రచయిత్రుల ఇంగ్లీష్ నవలా పరిచయాలు రాశాను. ఒక విధంగా అవి రాయడానికి మంచి నవలలు ఎంచుకుని చదివే అవకాశం కలిసి వచ్చింది నాకు. సలహామండలిలో వుండంవల్ల నాతో ఎన్నో విషయాలు పంచుకునేది. నడిచినన్నాళ్ళూ ఆహ్వానం తెలుగు రచయితల అభిమాన పత్రికగా వుండడం వెనుక లక్ష్మి గారి పట్టుదల ఒక్కటే కారణం. తెలుగు పత్రికలకు సమర్థవంతులుగా వుండిన చాలా కొద్ది మంది స్త్రీలలో నా స్నేహితురాలు కూడా ఒకరు అనుకోవడం సంతోషంగా వుంటంది. ఒక రచయితగా స్నేహితురాలిగా పత్రిక నిలుపుకోడానికి ఏమీ చేయలేకపోయామని విచారంగా వుంటుంది. మంచి స్నేహితురాలు దొరికిందని ఊరటగానూ వుంటుంది.
వ్యక్తిగతంగా చూసుకుంటే సంసార సాగరాన్ని సమర్ధవంతంగా నిర్వహించుకొచ్చిన హుందాతనం, జీవితంలో హటాత్తుగా సంభవించిన కొన్ని విషాదాలను నిబ్బరంగా ఎదుర్కుని ముందుకు సాగిన తెలివిడితనం వ్వవహార దక్షత, గత కొద్ది కాలంగా అనారోగ్యాన్ని కూడా మేనేజ్ చేసిన తీరు అబ్బుర పరుస్తాయి.
హిందూపురం నుంచి పనిమీద తెనాలి వెళ్ళి వస్తూ, మా ఇంటి దగ్గర ఆగి నా చేతిలో వెచ్చని జిలేబీల పొట్లం పెట్టి హడావుడిగా వెళ్ళి పోయిన లక్ష్మి ప్రేమ. నేను పడిపోయి పడుకుని వుంటే మనవడిని తీసుకుని నన్ను చూడ్డానికి వచ్చింది. మనవడు తనని వదిలి పని మీద వెళ్ళి ఎంత సేపటికి రాలేదు. నీరసంతో దివాన్ మీద వాలి నిద్రపోయి లేచి శాంతీ నాకు అన్నం పెడతావా అని అడిగింది. ఆవిడ చేత అలా అడిగించుకోకుండా మేము తనకు ముందే భోజనం పెట్టనందుకు మంచంమీద వున్న నాకూ శాంతికి కూడ దుఃఖం వచ్చింది. ఈమాట అంటే మీ దగ్గర నాకు చనువు కదా అంది దబాయింపుగా, ఇప్పుడు ప్రేమ జిలేబీలు లేవు. చనువు దబాయింపులూ లేవు. కానీ మీరున్నారు లక్ష్మి గారూ మాతోనే వున్నారు.
`