ఎక్కడున్నా… ఏం చేస్తున్నా…
మనసంతా ఒకటే ఆతృతతో కూడిన దిగులు
తెరలు… తెరలుగా… పొరలు… పొరలుగా
అలుపన్నదే లేకుండా… ఆగడమన్నదే తెలియకుండా
కడుపులో సుడులు తిరుగుతూ… కళ్ళలోంచి అప్పుడప్పుడూ జాలువారుతూ…
అణువణువునా వెల్లువై పొంగుతూ
అనుక్షణం హృదయాన్ని ఆబగా తడుముతూ
ఎంతకూ ఆగని ఆలోచనా ఉప్పెన
ఎడతెగక కురిసే ఆవేదనా జడివాన!
ఏనాడూ ఆతృతా పరిమాణంలో మార్పులేదు
ఏ వేళా అనుభూతి లోతులో తేడా లేదు
జీవితమంతా వదలని ఉద్విగ్నతల ముసురు
ఏ వరాల జల్లులతోనూ చల్లబడనిదీ ఆందోళనా నెగడు!
ఎవరూ సమాధాన పరచలేనిదీ తీరని తపన
ఎంతకీ ఓదార్పు దొరకనిదీ నిరంతర చింతన
ఏ భరోసాతోనూ తృప్తి పడనిదీ పెను వేదన
ఎన్నాళ్ళయినా సమసిపోనిదీ ఆత్మీయ మధన!
ప్రతిసారీ… తక్కెడ వారివైపే మొగ్గుతుంది
ప్రతి ఉఛ్వాస నిశ్వాసా వారికై తపిస్తుంది
ప్రతి నిమిషం వారి క్షేమాన్నే కాంక్షిస్తుంది
ప్రతి క్షణం వారి పేరునే జపిస్తుంది!
ఇది ప్రతి తల్లి హృదయ స్పందనలో నిత్యం తారాడే వ్యథ
ఇది సంతు కోసం క్షణక్షణం ఆమె ఎద కదలికల కథ
ఎందాకా… అంటే ఆమె తనువు చాలించే దాకా…
ఎందుకూ… అంటే ఆమె ‘అమ్మ’ అయిన కారణాన!