ఎప్పుడూ ఆలోచించి వుండవు
అడుగు బైట పెడుతూ వున్న నిన్ను
ఎన్నిసార్లు తరచి చూసుకుంటుందో…!!
నీ చుట్టూరా తిరుగుతూ
నీకేం కావాలో
నువ్వేం అడుగుతావో
అని నీ వెన్నంటి వస్తున్న
ఆమెను చూస్తే నీకు అసహనం
నీకు ఆలస్యం అవుతుందని
పెట్టుకునే మేల్కొలుపు గంటకి
నువ్వెక్కడ ఉలిక్కిపడతావోనని
మనసులోనే గంట కట్టుకుని
పడుకునే తనకేం తెలుసు
ఎప్పటికప్పుడు మారిపోయే
నీ మనసులోని కువకువలు
అడిగింది ఇవ్వలేదన్న కినికు నీది,
అవసరానికి మించి
ఇవ్వలేని విజ్ఞత ఆమెదీ…
రెక్కలు రాకుండానే ఎగరాలనుకునే
టీన్ ఎమోషన్‌ని ఇంక్యుబేటర్‌లో పెట్టి చూసుకుంటున్న
ఆమెని చూస్తే ఎద్దేవా
ఏ సానుకూలతలు లేని అనుకూలతలకు
ఊసరవెల్లి ఆలోచనల్లో మెరిసే చీకటి నీడ
నీకు ఆకర్షణ
మెరిసేటి తళుకుల్లో తారాడే కాసినో
చప్పుళ్ళు, పబ్జి వేటలు, నేటి నెట్టింట
యువత ఆదర్శం
గ్యాంబ్లింగ్ గ్యారేజీల్లో కె సిరీస్ ప్రేమలు,
రిపేర్‌కి వెళ్ళనివ్వని క్లీన్ షేవ్డ్ మనో వికారాలు
కలిసి ఊపిరాడనివ్వనప్పుడు…
నీ ఆలోచనల చిక్కుముడులు ఎన్ని వున్నా
ఫిష్ ట్యాంక్లో, లక్కీ ఛాంప్ లాంటి నిన్ను
వేలు పట్టి నడిపించే ఆక్సిజన్ మాస్క్ ‘ఆమె’