‘‘ఒక మనిషికి మరో మనిషికి మధ్య ఉండే అత్యంత సహజమైన సంబంధం స్త్రీ పురుష సంబంధం. అందుచేత మనిషి సహజ ప్రవర్తన ఎంత మానవీకరించబడిరదో అది తెలియజేస్తుంది.’’ ` కారల్ మార్క్స్
మధ్యయుగ భూస్వామ్య, ప్రగతి నిరోధక భావజాలం స్థానంలో నూతన సమాజాన్ని ప్రజాస్వామ్యయుత వ్యక్తి స్వాతంత్య్రాన్ని గౌరవించే స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం ఆనాటి సమాజంలో కాగడా వేసి వెదికినా కనిపించని అంశం. కానీ గురజాడ ‘సౌదామిని’లో వీరి మధ్య పరస్పర గౌరవ భావముండాలని చెప్పారు. బాల్యవివాహాలు, నిర్బంధ వైధవ్యాలు, మూఢనమ్మకాలు, శకునాలు, జాతకాలు, కన్యాశుల్కం మొదలైన సామాజిక రుగ్మతలు తానాశించిన కొత్త సమాజంలో స్త్రీల ప్రగతికి ప్రతిబంధకం కాకూడదని, వాటి నిర్మూలనకు తన రచనలే ఊతంగా చేసుకున్నారు. స్త్రీత్వ అనుగుణమైన భావసంపత్తిని, అసంపూర్ణమైన రచనైనా స్త్రీల స్వావలంబన దిశగా సాధికారిక వ్యక్తిత్వ వికాస ప్రతిపాదనలను ‘సౌదామిని’లో ప్రతిపాదించారు. ఈ సందర్భంలోనే మధ్యయుగ విలువల నుండి మార్పువచ్చి కొత్త భావాలు, సిద్ధాంతాలతో ఒక సంక్షిప్త ప్రగతిపూర్వక సమాజం రూపుదిద్దుకుంటున్న సందర్భంలోనే సరికొత్త స్త్రీత్వ (feminine) నిర్వచనాన్ని ‘సౌదామిని’లో గురజాడ ప్రతిపాదించారు.
ఇలాంటి సరికొత్త ఆలోచనల్ని ఆహ్వానించడానికి కావాల్సిన నేపథ్యం ఆయన జీవన సామర్థ్యాల వల్లనే కలిగింది. విజయనగర సంస్థానానికి, ఆంగ్లేయులకు మధ్య మిత్రసంబంధాలు కొనసాగుతున్న దశలో గురజాడ అప్పారావు కీలక పాత్ర వహించినట్లు (డైరీల ద్వారా) తెలుస్తుంది. సంస్థానానికి సంబంధించిన పరిపాలనా వ్యవహారాలలో న్యాయవాదులతో, న్యాయమూర్తులతో మెలగడం, ముఖ్యంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేయడంలో ఇటు బ్రిటిష్ వాళ్ళకు, అటు విజయనగర సంస్థానాధీశులకు మధ్య వారధిగా, మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తిగా గురజాడ అప్పారావు ద్వారానే విద్యాది సంస్కరణ కార్యక్రమాలు నడిచాయని ఆయన డైరీలు, ఇతర రచనలు, నోట్ చేసుకున్న విషయాల ఆధారంగా తెలుస్తోంది. ఈ నేపథ్యం గురజాడలోనూ, ఉత్తరాంధ్ర సాంస్కృతిక జీవనంలోనూ ప్రజాస్వామికీకరణ ప్రక్రియ వేగవంతం కావడానికి దోహదం చేసిందనిపిస్తుంది. గతకాలపు ఆలోచనలను, విలువలను కాలరాసి ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక విలువలకు నాందీవాచకం పలకడం ‘సౌదామిని’లో చూడగలం. భార్యాభర్తల మధ్య అసమానతలు ఉండాల్సిన పనిలేదని ప్రకటించారు. సమానత్వం స్త్రీల జన్మహక్కుగా భావించాల్సిన ఆవశ్యకత, పూర్తి స్థాయిలో స్త్రీల వికాసాన్ని చర్చించారు. స్త్రీల స్థానాన్ని ఉత్తమ సంస్కారంతో పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరాన్ని తెలుగు సమాజానికి కల్పించినవాడు గురజాడ అనడం అతిశయోక్తి కాదు.
భూస్వామ్య సంస్కృతి స్త్రీకి స్వాతంత్య్రాన్ని ఇవ్వలేదు. పెట్టుబడిదారీ వ్యాపార సంస్కృతి వల్ల స్త్రీలకు ఆ వెసులుబాటు కలిగింది. స్త్రీ పురుష సంబంధాలలోని అసమానతలను గురజాడ వ్యతిరేకించారు. కుటుంబంలోని మనుషులందరి మధ్య ప్రజాస్వామిక సంబంధాలు విస్తరిల్లి, వర్థిల్లాలని కోరుకున్నారు. స్త్రీల అణచివేతలకు వ్యతిరేకంగా తన అభిప్రాయాలను వ్యక్తీకరించారు.
‘‘మనం ఒకరికిచ్చే ప్రేమ మళ్ళీ మనకు ప్రేమను కలిగిస్తుంది. ఒకరినొకరిని ప్రేమించుకోవడం ఎంతో మహత్తరమైనది. ఈ భూమి మీదకు స్వర్గం వచ్చినంత’’ అన్నారు. ప్రేమలోని సమగ్రతను అంతరాల మధ్య సాధించలేమన్న స్పృహ ఉండటం వల్లనే సరికొత్తగా ఆలోచించారు. ప్రేమ వయసుకు సంబంధించిన అంశం కాదని, స్త్రీ పురుషుల మధ్య స్నేహ సంబంధాలు ఉండాలని గురజాడ గుర్తించారు. ఆలోచనాక్రమం స్త్రీలకు పురుషులకు ఒక్కటిగానే ఉంటుందని చెప్పడంలో స్త్రీలు ఈ విషయంలో అమూర్తతను అధిగమించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పినట్లయింది. సంఘ సంస్కరణోద్యమం ద్వారా మెరుగైన ఆధునిక సమాజం మార్పుల ఛాయలు గురజాడ ‘సౌదామిని’ పాత్ర చిత్రణలో కనబడతాయి. ఆనాటి సమకాలీన సమాజం ఫ్యూడల్ యుగానికి, వ్యాపార యుగానికి సంధికాలం. అందువల్ల అసమాజ ప్రతిఫల రూపాలుగా ఆ భావజాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా స్త్రీ పాత్రల సృజనలో కొన్ని మార్పులు రూపొందాయి. పితృస్వామిక స్వాభావికత నుండి స్త్రీల జీవితాన్ని పురుషుడు ఎలా సాధిస్తాడో తెలియజేయడానికి గురజాడ సౌదామిని పాత్రను ఇంత శక్తివంతంగా తీర్చిదిద్దారు.
అగ్ర ఆధిపత్య, పురుషాధిపత్యాలను ఇంత ధీమంతతతో జయించిన స్త్రీలు సామాజిక ఉద్యమాల్లో కనిపించినంతగా తెలుగు సాహిత్యంలో ఇప్పటికీ మనకు కనిపించడం లేదు. అయితే గురజాడ సృజించిన సౌదామిని లాంటి స్త్రీ పాత్రల ఒరవడిని స్త్రీవాద రచయితలు కొంతవరకు అందిపుచ్చుకోగలిగారు. కానీ ఇంకా ఆ ప్రాసెస్ పూర్తికాలేదు. వీరు సృజించిన పాత్రలు అధికారికంగా పితృస్వామ్య స్వభావాన్ని ఇంకా అందిపుచ్చుకోవాల్సి ఉంది. అయితే గురజాడ సృజించిన స్త్రీ పాత్రలకు ఉండే స్వేచ్ఛ కుటుంబ చట్టంలోని స్త్రీలకు లేదన్న పరిమితిని గురజాడ గుర్తించారనడానికి ఆధారం నాంచారమ్మ, కమలిని పాత్రల సృజలో కనబడుతుంది. ఈ పాత్రలు కుటుంబ చట్రంలో ఉంటూనే సంఘ సంస్కరణ ధోరణిలో తమకు వ్యతిరేకంగా ఉన్నవాటిని సానుకూల ప్రమాణాల్లో సాధించుకోగలిగారు. అందుకే ఆ పాత్రలు సమకాలీన సామాజిక వ్యవస్థలో రూపుదిద్దుకున్నాయి. కానీ కుటుంబ ఆధిపత్య పరిధిలో ఉన్నప్పటికీ ఈ పాత్రలకున్న పరిమితుల్ని దాటిన అధిగమన తత్వం సౌదామిని పాత్ర చిత్రణలో కనిపిస్తుంది.
ఉదాహరణకు ‘‘ముఖ్యంగా యవ్వన స్వభావంలో వికారం ఉంది. స్త్రీలలో అది మరీ అధికం. వెళ్ళిపోమ్మా అన్నాననుకోండి ఆమె ఉండిపోతుంది, ఉండమన్నాననుకోండి వెళ్ళిపోతుంది’’ అంటాడు ఆమె తండ్రి. గురజాడ ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుందని ఆశించాడో ఆ స్త్రీ మూర్తి అచ్చంగా సౌదామిని. పురుషుడి దౌర్జన్యం నుండి ఆత్మరక్షణ కోసం స్త్రీ కత్తిసాము నేర్చుకోవాలన్న ప్రతిపాదన వెనుక సడలించలేనంత గట్టిగా బిగుసుకుపోయిన వైవాహిక బంధాలను గురించి చేసిన చర్చ, వంటింటి చాకిరీ నుండి స్త్రీల విముక్తి, కుటుంబానికి అవసరమయ్యే ఆహార అవసరాలు తీర్చడానికి రావాల్సిన మార్పుల గురించి చేసిన ప్రతిపాదనలు గురజాడ జీవించిన కాలానికి ఊహించడానికి కూడా వీలుకానివి. శతాబ్ద కాలానికి కూడా సాధించలేకపోయినవి. అంతెందుకు భవిష్యత్తులోనైనా సాధిస్తామన్న ఆశను మిగల్చలేని సామాజిక సందర్భం.
శ్రమలో ఉన్న సౌందర్యాన్ని గురజాడ దర్శించారు. శ్రమజీవనం వలన పెంచుకునే దృఢత్వం ఆధారంగా స్త్రీలు అబలలని స్థిరీకరించే పితృస్వామ్య సమాజాన్ని ఆయన ఖండిరచారు. స్త్రీలు అబలలనే మాట అర్థం లేనిదని, మన దేశంలో నిరంతరం శ్రమ చేసే రైతు కుటుంబంలోని స్త్రీ పొలంలో కునుకుపాట్లు పడే పురుషుని కంటే బలమైనది, గట్టిది, ఓపిక గలదని అన్నారు. అందుకు సాక్ష్యంగా ‘‘నాట్లు వేసేది ఎవరు? చెప్పు దద్దమా, పత్తి ఏరేది ఎవరు? చింతపండులోని పిక్కలు తీసేది ఎవరు? అన్ని పనులు చేసే పనిమనిషి ఎవరు? వడ్లు దంచేది ఎవరు?’’ అంటూ నిజమైన శ్రామికులు స్త్రీలేనని ‘సౌదామిని’ అసంపూర్ణ రచనలో రాసుకున్న అంశాల ద్వారా తెలుస్తుంది. శ్రామిక స్త్రీలు చేయలేని పనులేవీ లేవని, స్త్రీ శ్రమ విలువను ఆనాడే గురజాడ గుర్తించారు. ఆయన ఆశించిన ఆధునిక స్త్రీ ఆవిర్భావం జరగాలంటే, సమకాలీన స్త్రీలు సంస్కరించబడాల్సిన దుస్థితిలో ఉన్నట్లు భావించారు. రాజుల గొప్పదనంగా భావించిన వాళ్ళ ప్రేమ కలాపాలను, ఆయా క్రూరత్వాలను సంతృప్తిపరచుకునే రాజ్యకాంక్షని వీరత్వంగా, చరిత్రగా చూస్తున్న ప్రపంచ చరిత్రను, ఆధునిక స్త్రీ తిరగరాస్తుందని వాంచించారు. ఇలాంటి స్త్రీ మూర్తులే అలాంటి బాధ్యతలను నిర్వర్తించగలరన్నది గురజాడ వాంఛ. స్త్రీల సామర్ధ్యాన్ని అంచనా వేయడంలో ఆయన అవగాహన, స్త్రీల పట్ల గల విశ్వాసం తెలుస్తోంది. శ్రమైక జీవనతత్వాన్ని అలవరచుకున్న స్త్రీల సౌందర్యం మరింతగా ఇనుమడిరచగలిగితే, వాళ్ళను ధీర వనితలుగా శ్రమైక సౌందర్యం ఎలా నిలబెట్టగలదో ఉదాహరణ ప్రాయంగా ‘సౌదామిని’లో ఈ క్రింది విధంగా ఆవిష్కరించారు.
‘‘శ్రమించు, శ్రమించు ఆరుబయట గాలిలో నడుస్తూ, సైకిల్ తొక్కుతూ, గుర్రపుస్వారీ చెయ్యి’’. కత్తిసాము లాంటి విద్యలను స్త్రీలు నేర్చుకోవాలని, అప్పుడే తమను తాము రక్షించుకోగలరన్నారు. (పేజీ నెం.88) పురుషులకు బుద్ధిమాంద్యం, క్రూరత్వం ఉన్నాయి కాబట్టి వాటిని జయించడానికి బయటకు వెళ్ళే ప్రతి స్త్రీకి ఆయుధం ఉండాలన్నారు. అవి రివాల్వరు, చాకు అని కూడా ప్రత్యేకంగా నొక్కి మరీ చెప్పారు. ఇవన్నీ చెయ్యాలంటే సాంప్రదాయ స్త్రీలు వంటింటికి మాత్రమే పరిమితమై బయటి ప్రపంచంలోకి రాలేకపోవడానికి వ్యక్తిగత వంటిళ్ళే ప్రధాన కారణంగా గుర్తించారు. ఆ స్థితిని అధిగమించడానికి వాటిని ‘‘నిషేధించి పారేయాల’’ని కోరుకున్నారు. స్త్రీలను ఇంటిచాకిరీ ఎంత వెనుకకు నెట్టివేస్తుందో ఆయనకు అవగాహన ఉంది. స్త్రీలు అనుభవిస్తున్న అణచివేతకు, వేదనలకు మూలకారణంగా వ్యక్తిగత వంటింటిని పేర్కొన్నారు. వాటిపట్ల ఎంత కోపం ఉందో ‘‘వంట చేయడాన్ని నిషేధించి పారేయాలి’’ (పేజీ 86) అన్న మాటల్లోనే తెలుస్తుంది. మామూలుగా అయితే వంట చేయడాన్ని నిషేధించాలి అంటే సరిపోతుంది. కానీ నిషేధించి పారేయాలి అన్న పదానికిచ్చిన వత్తిడి (stress) గురజాడ కంఠస్వరాన్ని పట్టిస్తుంది.
‘వంటరి వంటగదులు కూల్చేందుకు రండి
వేరు వేరు సొంత పోయిలను
పునాదులతో సహా తవ్విపోద్దాం రండి’
అని విమల ‘‘వంటిల్లు’’ కవిత రాశారు. 1990లలో స్త్రీవాద ఉద్యమ ప్రభావంతో సోషలిస్టు భావాల నేపథ్యంలో నుండి పిలుపునిచ్చింది. రష్యాలో బోల్షివిక్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవ భావాల అంతర్జాతీయ నేపథ్యం నుండి ఈ భావజాలం కలిగిందా అన్న సందేహం పీడిరచినా ఈయన ‘సౌదామిని’ రాసేనాటికి ఫ్రెంచి ఫెమినిజం మొదలే కాలేదు. ఫ్రెంచ్ రచయితలెవరూ సామూహిక వంటశాలల నిర్మాణం గురించి కానీ, వాటి గుణాత్మకతను కానీ ప్రస్తావించలేదు. కానీ గోర్కీ ‘అమ్మ’ నవలలో విప్లవాచరణలో భాగంగా సామూహిక వంట ఈనాటి ఉద్యమాలకు తెలుగు సాహిత్యం నుండి పిలుపునిచ్చింది. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా గురజాడ వంటింటి చాకిరీని నిషేధించాలని చేసిన ప్రతిపాదనల మూలాలు నేటి సోషలిస్టు స్త్రీ వాదుల సాహిత్యంలో చోటుచేసుకోనున్నాయని చెప్పడానికి సంకోచించనక్కర్లేదు.
వంటను నిషేధించడం అంటే, వంటింటి సంస్కృతిని నిషేధించడం. మరింత లోతుగా, స్పష్టంగా చెప్పాలంటే పితృస్వామ్యాన్ని బలహీనపరచడం. చారిత్రక క్రమంలో ఆడవాళ్ళను ఇంటి పనులకు పరిమితం చేసి మగవాళ్ళు సామాజిక వృత్తి కార్యకలాపాలను తమవిగా చేసుకున్నారు. వంటను స్త్రీలు మాతమ్రే చేసే పనిగా చూశారు. పురుషాధిపత్య సమాజం ‘వంట’ చేయటం స్రీల కర్తవ్యం అన్న విషయం ఏ మాత్రం మరిచిపోకుండా చేస్తుంది. స్త్రీలు ఉత్పత్తి రంగంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం వంట పని, ఇంటి పని స్త్రీలదే కావడం, స్త్రీలు చేస్తున్నందువలన అవి సునాయాసమైనవిగా, హీనమైన పనులుగా పరిగణించడం. అలా స్త్రీల చుట్టూ చుట్టుకున్న జీవన విషాదాన్ని వంటింటి చాకిరీతో అనుసందించి ‘సౌదామిని’ రచనను చేపట్టడంలోనే గురజాడ సాధించిన దార్శనికత బహిర్గతమవుతుంది.
వంటతో ముడిపడి ఉన్న స్త్రీల జీవితం, వాళ్ళు కోల్పోతున్న సౌకుమార్యాన్ని, మాధుర్యాన్ని గురజాడ గుర్తించారు. వంట నిషేధం సొంత ఆస్తి లేని సమాజాలలో మాత్రమే సాధ్యం. విప్లవానంతర కమ్యూనిస్టు సమాజాలలో సొంత ఆస్తి రద్దవుతుంది. కనుక కుటుంబ వ్యవస్థలోని వ్యక్తిగత లక్షణం కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. స్త్రీల శ్రమ సామాజికీకరించబడుతుంది. స్త్రీలకు ఉత్పత్తి కార్యకలాపాలలో నిర్మించుకునే సామాజిక భాగస్వామ్యానికి అవకాశాలు కూడా ఏర్పడాలన్న ఆకాంక్ష గురజాడకు ఉందని వంటింటి రద్దు గురించి ‘సౌదామిని’లో చేసిన ప్రతిపాదనల వలన తెలుస్తోంది. దుకాణం నుంచి ఆహారం తెచ్చుకోవాలని, దాన్ని వెచ్చబెట్టడానికి అవసరమైన సామగ్రిని తమవద్దే ఉంచుకోవాలని ప్రతిపాదించారు. పైగా దుకాణాలోనే వంట బాగుంటుందని సర్టిఫై చేశారు. ఒకవేళ సామూహిక వంటలో మొనాటమీ వల్ల ప్రజలకు రుచించదన్న భావన వస్తుందని భావించారేమో, అందుకే దుకాణంలోనే వంట బాగుంటుందంటారు. ఇంకా ప్రతి వీథికి ఒక దుకాణం ఉంటే, కుటుంబ సభ్యులందరూ అక్కడికే వెళ్ళి భోజనం చేస్తుంటారంటారు. దాంతో స్త్రీలకు వంటావార్పూ చింత ఉండదు. ఈ విధంగా చేస్తే స్త్రీల శ్రమ శక్తి ఎంత ఉత్పాదకత రూపంలో పోగవుతుందో కూడా ‘సౌదామిని’లో గురజాడ చర్చకు పెట్టారు.
ఎందుకింతగా వంట గురించి ఇంత సుదీర్ఘ చర్చ చేయాల్సి వచ్చిందంటే, స్త్రీలకు వంటతో గల సంబంధం సామాజిక నిమగ్నతా రాహిత్యానికి, స్త్రీల ప్రగతికి గల అతి పెద్ద అవరోధంగా ప్రపంచ స్త్రీవాదులందరూ 1965ల తర్వాత గుర్తించిన అంశం. వంటింటి చాకిరీ ఉత్సాదక శ్రమ శక్తిగా గుర్తించబడనప్పుడు దాన్ని నిషేధించబడాలన్నది ఆయన ఆకాంక్ష. ఈనాటికీ ఈ అంశం స్త్రీవాదుల ప్రధాన అజెండాగా రూపుదిద్దుకోలేదు. అయితే ‘సౌదామిని’ అసంపూర్ణ రచననుంచైనా ఆయన ఉద్దేశిత లక్ష్యం అవగాహన అవుతుందనుకుంటాను. స్త్రీల జీవితం వంటింట్లో మగ్గిపోరాదని ప్రపంచ సాహిత్యంలో ఏ రచనా ప్రతిపాదించక ముందే గురజాడ ప్రతిపాదించటం విలక్షణం. ఆయనకు ఈ ఆలోచన ఎలా కలిగింది అని ఆలోచిస్తే వంట చేయని స్త్రీల శక్తిసామర్ధ్యాలను, వాళ్ళ చైతన్యాన్ని ఆయన చూసిన, పనిచేసిన సంస్థానాల సమాజంలోనే కలిగి ఉంటుందనిపిస్తుంది.
స్త్రీల సమిష్టి శక్తి గురించిన జ్ఞానాన్ని ప్రపంచంలోని ప్రజాస్వామిక ఉద్యమాలు నేడు స్త్రీలకు ఇస్తున్నాయి. వంటింటి విధ్వంసాన్ని కోరుకున్న స్త్రీవాదులకు, ‘వంటింటిని నిషేధించాల’ని కోరుకున్న గురజాడకు స్త్రీల విముక్తి పట్ల గల సమాన బాధ్యతను ఈ వ్యక్తీకరణ తెలుపుతుంది. గురజాడకు తరతరాల స్త్రీల బాధల పట్ల సానుభూతి ఉంది. స్త్రీల శక్తిని, చైతన్యాన్ని సౌదామినిలో స్పష్టపరిచారు. తన తరువాతి తరం కోసం కృషి చేయడానికి తాను సిద్ధమవుతూ, తనతోటి సామాజికులను కూడా సంసిద్ధం చేసే ప్రక్రియకు నాందిగా గురజాడ ప్రతిపాదనలను గుర్తించగలం.
స్త్రీలు కౌటుంబిక జీవితైతిహాసపు చీకటికోణం అట్టడుగున పడి కనిపించకుండా పోయిన మూడు తరాల స్త్రీల చరిత్రను ఆయన గమనించారు. ఆగమనంలో నుండే మూడూ, నాలుగు తరాల స్త్రీల జీవితాలను ‘సౌదామిని’లో వ్యాఖ్యానిస్తున్నారు. మూడు తరాల స్త్రీల జీవితాలు వికాసానికి నోచుకోక నేలరాలిన పూవులుగా మారిపోయిన వేదన నుండి నాలుగో తరం స్త్రీలు ఆ బాధలను అధిగమించి ‘ఆధునిక స్త్రీ’గా తరతరాల చరిత్రను తిరగరాయాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. ఆయన ఆకాంక్షించిన ఆధునిక స్త్రీ నాలుగవ తరానికి చెందినది. నాలుగవ తరానికి చెందిన స్త్రీల పురోగతికి ప్రతిబంధకాలైన ప్రధాన అంశాలలో మొదటిది వంటింటిని నిషేధించడమైతే, రెండవది లైంగిక జీవితం. వైవాహిక వ్యవస్థలో గల ప్రజాస్వామిక సంబంధాల స్థానంలో నిజమైన ప్రేమ సంబంధాలు నెలకొల్పాల్సిన అవసరాన్ని ఈయన గుర్తించారు. అసలు ప్రేమంటే ఏమిటి? వివాహం అంటే ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు ‘సౌదామిని’లో చర్చకు పెట్టారు.
ప్రకృతి విరుద్ధంగా స్త్రీలు తయారుచేయబడిన క్రమాన్ని గురజాడ గుర్తించారని ఈ మాటల ద్వారా తెలుస్తుంది. ‘‘జన్మతః నీలో స్వేచ్ఛా సంప్రదాయాలున్నాయి. నువ్వు వివాహం చేసుకొని నిన్ను నువ్వు మరొకరికి ఎందుకు అమ్ముకోవాలి?’’ (పేజి. నెం.88, ‘సౌదామిని’, గురజాడ రచనలు, కథానికలు, సంపాదకుడు సెట్టి ఈశ్వరరావు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, ఫిబ్రవరి 2009) అని ప్రశ్నించిన గురజాడ, స్త్రీలు వివాహం చేసుకోదలిస్తే ఎలాంటి వాళ్ళను పెళ్ళాడాలో కూడా చెప్పారు. స్త్రీల శారీరక సౌందర్యం కంటే ‘నీ కళ్ళలో, నీ జీవితంలో ఎక్కువ సౌందర్యం చూడగల పురుషుడ్ని వివాహమాడాలి’ అంటారు.
జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో స్త్రీలు ఎంచుకొనే శాశ్వత బంధానికి కావాల్సిన ప్రతిపత్తి ఎలా కాపాడబడుతుందో చర్చించారు. యవ్వనంలో కనబడే సౌందర్యం నశించినప్పుడు నిలబడే అసలు సిసలైన హృదయ సౌందర్యం, సున్నితత్వం, ఆ తరువాత జీవితాన్ని శాశ్వతం చేస్తుందంటారు. నిజంగా హృదయం, మెదడు గల భర్త దృష్టిలో మాత్రం భార్య సౌందర్యం ఎన్నటికీ తరిగిపోదన్నారు. యుక్తవయస్సులో యువతీ యువకులు వివాహమాడినప్పుడు ఆమె అందం కేవలం శారీరకమైనది. అయితే రోజులు గడిచేకొద్దీ వాళ్ళ బంధాలు, బిడ్డలు, వాళ్ళ ఉమ్మడి ఆనందాలు, దుఃఖాలతో ప్రేమ చూపించే అవకాశం లేకపోవచ్చు లేదా తగ్గిపోవచ్చు, కానీ భర్త పట్ల చూపే సహజమైన ఆపేక్ష ఇవన్నీ కాలక్రమంలో శారీరక సౌందర్యం తగ్గిన స్థానాన్ని భర్తీ చేస్తాయి, కళ్ళల్లో తగ్గిన కాంతి స్థానాన్ని పూరిస్తాయన్న భరోసా కూడా వైవాహిక బంధంలో ఉండాలంటారు గురజాడ. ఈ భరోసానే స్త్రీవాదులు సహజీవనంలో (living together) ఉండాలని కోరుకుంటున్నారు. స్త్రీలు పుష్పిస్తున్న వృక్షాల్లాంటి వారంటారు. కవులందరూ స్త్రీలను పూవులతో పోల్చడం చూశాం. కానీ సమకాలికుల కంటే భిన్నంగా స్త్రీలను ‘వృక్షం’తో పోల్చడం స్త్రీల దృఢత్వానికి, పుష్పిస్తున్న వృక్షాలుగా పోల్చడంలో వారి హృదయ సౌకుమార్యానికి, పునరుత్పత్తి శక్తికి ప్రతీకగా గురజాడ సాదృశ్యం చేశారు. మొత్తానికి స్త్రీలను హృదయ సౌందర్యాది ధీరవనితలుగా చూడడం ఆయనలోని ప్రగతికాముక భావజాలానికి నిదర్శనంగా భావించవచ్చు.
తమపై బలవంతంగా అమలవుతున్న ఆధిపత్యాలను నిరసిస్తూ ‘పూర్ణమ్మ’ అనే బాలిక తమపై బలవంతంగా అమలు చేయాలనుకున్న ఫ్యూడల్ సంప్రదాయ ఆధిపత్యాన్ని అంగీకరించకుండా ప్రాణత్యాగం చేస్తుంది. అలాగే ‘కన్యక’ పాత్ర కూడా రాజ్యం అమలు చేయాలనుకున్న ఆధిపత్యానికి లొంగక ప్రాణత్యాగం ద్వారా తన నిరసనను తెలియజేస్తుంది. అలాగే నాంచారమ్మ, కమలిని… ఈ పాత్రల పరిణామ రూపవిన్యాసం ఆధునిక స్త్రీ మూర్తిమత్వం ‘సౌదామిని’లో ఆవిష్కృతమవుతుంది. గురజాడ సౌదామినికి వారసత్వంగా, ఓల్గా కవిత్వం ‘పంచాది నిర్మలనవుతా’ నంటూ తెలుగు సాహిత్యంలో కొనసాగుతున్నారు. స్త్రీ శరీరం మగవాడి సొత్తు అనే భావం లైంగికంగాను, సాంస్కృతికంగాను, ఆర్థికంగాను ఫ్యూడల్ సమాజం నుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. స్త్రీ అనుభవించే అణచివేత స్వంత ఆస్తి మీద ఆధారపడే సమాజాలు ఉన్నంతకాలం ఇవి ఉంటూనే ఉంటాయనిపిస్తుంది. ప్రేమ, పెళ్ళి విషయాలలో వివాహంపైన గురజాడ చేసిన ప్రతిపాదనలు ప్రధానమైనవి.
ఈ కొత్త ప్రతిపాదనలు వివాహ వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి అందులో స్త్రీలకు ఉన్న అడ్డంకుల్నీ, వాళ్ళ వికాసానికి గల ఆటంకాలన్నింటినీ కూడా ఎలా తొలగించుకోవాలి అనే విషయాన్ని కూడా ఈయన ‘సౌదామిని’ అసంపూర్ణమైన కథానికలో చర్చించటం జరిగింది. స్త్రీలను ఉద్దేశించి జన్మతః నీలో స్వేచ్ఛ సంప్రదాయాలు ఉన్నాయి, నువ్వు వివాహం చేసుకొని నిన్ను నువ్వు మరొకరికి ఎందుకు అమ్ముకోవాలి? శారీరక సౌందర్యం కంటే నీ కళ్ళల్లోనూ, నీ జీవితంలోనూ ఎక్కువ సౌందర్యం చూడగల పురుషుని వివాహమాడాలంటారు.
నేను అసహ్యించుకునే మనిషితో శాశ్వతంగా కాపురం ఎలా చేసేది? అనే ప్రశ్నకు ‘‘ఈ సమస్యపై నేను సాధికారికంగా ఏమీ చెప్పలేను. స్త్రీ ఏమనుకుంటూ ఉంటుందో నేను ఎలా చెప్పగలను? నా దేశంలో ఎక్కువమంది స్త్రీలు అది తమ ఆచారం, తాము పుట్టింది అందుకేనని అనుకుంటారు’’ అని కూడా గురజాడ ‘సౌదామిని’ రచనలో వ్రాశారు. ఆడపుట్టుక అధ్వాన్నం అన్న లోకోక్తి ఉన్న మాట వాస్తవమే. పెళ్ళిలో ప్రేమ లేదన్న సత్యాన్ని గురజాడ అప్పారావు ‘సౌదామిని’లో ప్రస్తావించడం జరిగింది. ‘‘ప్రస్తుతం ఉన్న బంధం మరీ బిగుసుకుపోయి ఉంది’’ అంటారు. నిస్సందేహంగా ఈ మాటలు వివాహ వ్యవస్థని గురించి ఆయన ‘సౌదామిని’లో చర్చించాలను కున్నారనిపిస్తుంది.
ఈ సమస్యకు మరో పార్శ్వం కూడా ఉంది. ‘‘నేను అసహ్యించుకునే మనిషితో శాశ్వతంగా ఎలా కాపురం చేసేది’’ అనే సందేహానికి, స్త్రీలు ఏమనుకుంటున్నారో నాకు ఎలా తెలుస్తుంది? అనడంలో దాదాపు శతాబ్దకాలం ముందున్నారని తెలుస్తుంది. స్త్రీవాదులు డిమాండ్ చేసిన అస్తిత్వ చైతన్యాన్ని గురజాడ ‘సౌదామిని’లో స్త్రీల పక్షం వహించి, చాలా సున్నితంగా జెండర్ బారియర్స్‌ను పురుష రచయితగా తనను తాను ప్రశ్నించుకొని, తిరస్కరించడంలో ఆయనలోని జెండర్ స్పృహ వ్యక్తమవుతుంది.
అలాగే వైవాహిక జీవితంలో భర్త అసమర్ధుడైతే అనే ప్రశ్న వచ్చినప్పుడు ‘‘ఈ సమస్యపై నేను సాధికారికంగా ఏమీ చెప్పలేను. స్త్రీ ఏమనుకుంటుందో నేనెలా చెప్పగలను?’’ అంటారు. స్త్రీల సమస్యలను స్త్రీలే పరిష్కరించుకోవాలన్న 1980లలో స్త్రీవాదులు చేసిన డిమాండ్, అజెండాలు, 1915 నాటికే గురజాడ రచనల్లో చూడడం యాదృచ్ఛికం ఎంత మాత్రం కాదు, ఆయనలోని దార్శనికతకు నిదర్శనం.
స్త్రీలు అబలలనే మాట అర్థం లేనిది. మన దేశంలోని రైతు కుటుంబాలలోని స్త్రీ, పొలంలో కునుకుపాట్లు పడే పురుషుడికంటే బలమైనది, గట్టిది, ఓపిక గలదని ఆయన నమ్మారు. ‘‘నాట్లు వేసేది ఎవరు చెప్పు, పత్తి ఏరేది ఎవరు? చింతపండులోని పిక్కలు తీసేది ఎవరు? అన్ని పనులకు పనిమనిషి ఎవరు? వడ్లు దంచేది ఎవరు?’ అని ప్రశ్నించడంలో ఇంటి చాకిరీ చేస్తున్న స్త్రీల శక్తి సామర్ధ్యాలను గుర్తించారు. అలాగే శ్రామిక స్త్రీలతో పాటు ఉన్నత కులాల స్త్రీల శ్రమ గురించి ‘ఆమె నీళ్ళు తోడుతుంది, వంటావార్పూ చేస్తుంది’ అని సమర్ధిస్తూనే నాగరికత గల స్త్రీ దైవదృష్టిలో ఉత్కృష్టమైనదని, ‘‘ఈమె శారీరకంగా బలహీనురాలని నేను ఒప్పుకుంటాను’’ అంటారు. అన్ని పనులను చక్కబెట్టగల సామర్ధ్యం
ఉన్నప్పటికీ, స్త్రీలను బలహీనులుగా తయారుచేసిన పితృస్వామిక సమాజక్రమం పట్ల కూడా ఈయనకు అవగాహన ఉందన్న అభిప్రాయం కలుగుతుంది.
స్త్రీలు కత్తిసాము నేర్వగలిగిన సాహసిగా ఉండాలని అప్పుడే తమను తాము రక్షించుకోగలరని నమ్మిన గురజాడ, ఖడ్గవిద్య నేర్చుకోవడం వల్లనే ‘సౌదామిని’ తనను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించిన జమిందారును కత్తితో పొడిచి తనను తాను రక్షించుకోగలిగింది, అందుకే పురుషాధిక్య సమాజం పాల్పడే పాశవిక దాడులను ఎదుర్కొనే పరికరాన్ని ఆమె చేతుల్లో పెడదామంటారు. స్త్రీలు ఖడ్గవిద్య నేర్చుకోవాలని, స్త్రీలకే అవసరం అనే విషయం కూడా వారికి తెలుసంటారు. పురుషునికి బుద్ధిమాంద్యం, క్రూరత్వం ఉన్నందున బయటకు వెళ్ళే సమయంలో ప్రతి స్త్రీకి ఆయుధం ఉండాలని చాలా శక్తివంతంగా ప్రతిపాదించారు. గురజాడ కాంక్షించిన ఆధునిక స్త్రీ ప్రతిరూపం సౌదామిని పాత్ర చిత్రణలోని సంకల్పం విదితమౌతుంది.
‘‘ప్రపంచం దుర్మార్గమైంది. దీనికి కుతూహలం, కిరాయితత్వం మెండు. నా కూతురు అవివాహిత. ఆమె పెళ్ళి చేసుకొని బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. అంతవరకు నేను అనుకుంటే తప్ప ఆమెను ఎవరూ చూడకూడదు, తెలుసుకోకూడదు. ఈ రోజుల్లో ఇది తండ్రి బాధ్యత. నా కూతురుకు బాల్యంలోనే వివాహం చేశాను కాదని విచారిస్తున్నాను’’ అంటాడు సౌదామిని తండ్రి. ఆమెకు సొంత ఆలోచన ఉన్నా దాన్ని ఆమోదించక చిన్నపిల్లకేం తెలుసునని అనుకుంటాడు. స్త్రీల సామర్ధ్యాలను గుర్తించడంలో కానీ, అంచనా వేయడంలలో గానీ సౌదామిని తండ్రి తరానికి గల పరిమితిని చూపించడం కోసమే అతని వ్యాఖ్యానాలను, సంభాషణలను గురజాడ ఉద్దేశించారు.
‘‘ద్రౌపదిలాగా ఒకేసారి డజను మంది జమీందారులకు ఇచ్చి పెళ్ళి చేసేయగలను. ఆమె కడగంటి చూపు కోసం వారేమైనా చేయగలరు’’ అన్న సౌదామిని తండ్రి మాట్లాడిన ఈ వాక్యాలలో తొంగి చూసేటటువంటి ఫ్యూడల్ భావజాలాన్ని గురజాడ అప్పారావు ఒకవైపు రికార్డ్ చేస్తూనే, సౌదామిని లాంటి పాత్ర చిత్రణ చేయడంలో గల ఉద్దేశ్యమేంటి? అని గమనిస్తే, ఫ్యూడల్ భావజాలం, అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యాపార భావజాలంతో ప్రభావితమైన సమాజం రెండు పార్శ్వాలుగా ఆధునిక సమాజంలో ఎమర్జవుతున్న సందర్భంలో స్త్రీ ఔన్నత్యాన్ని తగ్గించడంలోని పితృస్వామిక అభిజాత్యాలను, ఆధిక్యతలను చర్చకు పెట్టినట్లుగా అర్థమవుతుంది.
‘‘కవీ, ప్రవక్తా ఎల్లప్పుడూ కాలంకంటే ముందుంటారు’’ అని ఆయన చెప్పిన మాట సత్యదూరం కాదని ఆయన రచనలే నిరూపిస్తున్నాయి. సమకాలీన వర్తమాన సమాజంలో, అంటే స్త్రీవాద ఉద్యమం ఉధృతంగా వచ్చిన తరువాత అన్నిరకాల ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో స్త్రీల సాధికారత అనేది ఒక పాలసీ విషయంగా కొంతవరకు అమల్లో కూడా ఉంది. అయితే ఈ సందర్భంలో కూడా ఇంకా స్త్రీలు ఆయుధాలు ధరించడం, నేడు విప్లవ ఉద్యమంలో ఉన్నటువంటి స్త్రీలు ఆయుధాలు ధరించి ఉద్యమంలో పాల్గొంటున్న మాట వాస్తవమే కానీ, చాలా కొద్దిమంది మాత్రమే ఆయుధాలు ధరిస్తున్నారు. అయితే గురజాడ అప్పారావు గారు చెప్పింది ఇలా విప్లవోద్యమంలో పాల్గొన్నటువంటి స్త్రీల గురించి కాకుండా ప్రతి స్త్రీ కూడా స్వావలంబనలో సాధికారతతో ఆయుధాలు ధరించి అయినా సరే తమ రక్షణ బాధ్యతను తామే తీసుకోవాలన్నటువంటి ఆధిక్యత ‘సౌదామిని’ కథలో కనిపిస్తుంది. ఈ క్రమంలో స్త్రీలు ఎలాంటి గుణాలు, వ్యక్తిత్వాలు సంతరించుకోవాలనే అంశాలను ప్రతిపాదించడంలో గురజాడ అప్పారావు ప్రాపంచిక దృక్పథం తెలుస్తుంది. స్త్రీల పట్ల ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవడంలో గురజాడ ఆ రోజుల్లోనే (1915) ఇంత రెబల్‌గా సౌదామిని పాత్రను సృజించటం ఆయన భావదార్శనికతకు నిదర్శనం. ఇది కూడా ఆయన మాటల్లోనే గమనించవచ్చు.
అన్ని అంశాలను గ్రహించి వాటిని చాటి చెప్పేవారు నియమాలన్నింటినీ అధిగమించే స్వేచ్ఛను, జ్ఞానం ప్రసాదించే స్వేచ్ఛను పొందుతారు. అలాంటి వ్యక్తి సమాజం విధించే నియమాలకు మినహాయింపు అవుతాడు. ‘‘ఋషులని చూడండి వాళ్ళు శాసనాలు చేశారు. వాటిని ఉల్లంఘించిందీ వారే’’ అని వ్యక్తి స్వేచ్ఛకు గల విస్తృతి, పరిమితుల మధ్య గల వ్యత్యాసం ఎలా ఏర్పడుతుందో వివరిస్తారు. మహా వ్యక్తి తనకు తానే శాసనం. అయితే అలాంటి మహావ్యక్తి ఇతరుల కోసం సామాజిక శాసనాలను, వాటి కాఠిన్యాన్ని ఏ మాత్రం సడలించకుండా విధిగా నిలబెట్టాలనుకుంటారు.
ఉదాహరణకు ‘‘నేను సేవలు చేస్తున్న మహారాజా గారి తాత్విక సూత్రం ఇదే. కాలం కంటే ముందున్న వ్యక్తులు ప్రపంచంలోని అంశాలను తిరస్కరించలేరు’’ అన్న మాటల ఆంతర్యంలో గురజాడ అప్పారావు గారికి విజయనగర సంస్థానాధీశుల విద్వత్తును చూసిన అనుభవం నుండి ఈ వ్యాఖ్యానం చేశారనిపిస్తుంది. ‘‘ఉత్కృష్ట సౌందర్యం, యవ్వన పరిమళం నిండిన దశలో ఆమె స్ఫూర్తి జాజ్వల్యమానంగా ఉంది. అవును అలాగే ఉండక తప్పదు. ఆ తర్వాత అది తగ్గిపోవచ్చు. గులాబీ పువ్వు కొన్నాళ్ళకు వాడిపోవచ్చు. కానీ పూర్తిగా వికసించిన దశలో దానికి అందం ఉంటుంది, పరిమళం ఉంటుంది’’ అని అంతకుముందు చర్చకు రాని ‘లైంగిక ప్రేమ’ను ‘సౌదామిని’లో ప్రతిపాదిస్తారు.
వయసులో చిన్నదైనప్పటికీ ఆమె భావాలు ఉన్నతమైనవని, మనుషులను జయించిన వాడికి ఉన్న గొప్ప గర్వభావం ఆమెకున్నదని, నెపోలియన్ చక్రవర్తి అంతటి గొప్ప సంపద ఉందంటారు. ‘ఏ రాజు కంటే చక్రవర్తి కంటే మిన్నగా ఆమె ఇవ్వగలదు. ఇవ్వకుండా ఆపనూ గలదు.’’ ఈ వాక్యం చాలా లోతైనది. సాధారణంగా పెత్తనంతో గాక ప్రేమతో కూడుకున్న అధికార చైతన్యం ఆమెది. ప్రేమ తనకంటే అధికమైన దానితో మార్పు చెందుతుంది. అది తన ప్రమాదాలను గుర్తించేంత అప్రమత్తతతో ఉంటుందంటారు. సాధారణంగా ప్రేమ, అనురాగం లాంటి భావనలు స్త్రీ పురుషులను మైకంలో, అంటే మోహంలో పడేస్తుందని భావవాదులు, భౌతికవాదులు కూడా ఇంచుమించుగా వ్యాఖ్యానిస్తారు. కానీ దోషాలు, అజ్ఞానం కూడా అందంగా, ఆనందంగా మారే సుగుణం ప్రేమ తత్వానికి ఉంటుందనడం గురజాడలోని అనుభవ విభిన్నత. గురజాడ లైంగిక ప్రేమ అనే ఒక కొత్త పదబంధాన్ని ఈ సందర్భంలోనే ప్రస్తావించారు. ఈ లైంగిక ప్రేమలో సుఖాలు బోధించిన సంతృప్తి ఉంటుందనటంలో స్త్రీల లైంగికత్వానికి సంబంధించిన స్పష్టాస్పష్టమైన రూపం కనబడుతుంది.
‘‘జీవితం బోధించేది ఏమిటో స్త్రీకి తెలిసి ఉండవచ్చు. కానీ పురుషుడు మాత్రం తనకు తెలియని లేదా లీలగా మాత్రమే తెలిసిన జీవితాన్ని మొదట నేర్చుకొని స్త్రీ చేత దాని రేకులను ఒక్కొక్కటే ఆవిష్కరింపచేయడానికి ప్రయత్నిస్తాడు.’’ ఇంటి వెలుపల పురుషుడు సాగించే కార్యకలాపాల్లో ఆమె పాలుపంచుకోలేదు. ఆమెకొక అస్తిత్వాన్ని ప్రసాదించేదే నిజమైన జీవితం. ఆమె జీవితానికి, ఆమె కుటుంబ జీవితానికి మధ్య వ్యత్యాసం ఉంది. ఇవన్నీ సోదర సంబంధాలలో ఎంత మాత్రం పట్టించుకోరన్న సత్యాన్ని గురజాడ అప్పారావు గుర్తించారు. ఎందుకంటే స్త్రీల హృదయ సౌకుమార్యం తను పుట్టి పెరిగిన ఇంట్లో పురుష పెత్తనాలను అత్యంత సహజమైనవిగా భావిస్తారు, కానీ భర్త విషయంలో పోషించే పాత్ర చాలా ముఖ్యమంటారు గురజాడ అప్పారావు.
సాధారణంగా అందం కేవలం శారీరకమైనదిగా చూడకూడదన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే రోజులు గడిచేకొద్దీ స్త్రీలు పునరుత్పత్తిలో ప్రధానపాత్ర నిర్వహించడం, పిల్లల పెంపకం, ఇంటిచాకిరీలో నిమగ్నులై ఉండటం వలన స్త్రీలలో శారీరకంగా అనేక మార్పులు జరుగుతాయి. మరలాంటప్పుడు వాటిని ఎలా స్వీకరించాలి? అందుకు కారణాలేంటి? అని ఆలోచించడమే కాక వాటిని ఎలా పరిష్కరించుకోవాలి లేదా ఎలా సమన్వయపరచుకోవాలి అనే విషయాలను కూడా గురజాడ సౌదామినిలో ఇలా స్పర్శించారు ` ‘‘కలయికలు, దైనందిన జీవిత బంధాలు, బిడ్డలు, ఉమ్మడి ఆనందాలు, దుఃఖాలలో ప్రేమ అధికంగా లేకపోవచ్చు.’’ కానీ స్త్రీలు భర్త ఎడల చూపే సహజమైన ఆపేక్ష ఇవన్నీ వాటిని భర్తీ చేస్తాయి, కళ్ళల్లో తగ్గిన కాంతి స్థానాన్ని పూరిస్తాయంటారు.
కొంతమంది స్త్రీలకు సౌందర్య పోషణ గురించి తెలుసు. వారు తక్కినవారికంటే తమ సౌందర్యాన్ని ఎక్కువ కాలం భద్రంగా కాపాడుకుంటారు. ‘‘వీరు శ్రమ చేసేవారు. వీరు ఆనంద ప్రవృత్తి కలిగిన వారు. తత్వజ్ఞులంటాను’’ అంటారు గురజాడ. అలాగే ‘‘అందాన్ని కాపాడుకోవాలంటే అది నిజంగా కాపాడుకోతగిన సంపద’’ అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్త్రీవాదులు 36`24`38 కొలతల్లో చూడొద్ద అన్నారే కానీ అందం కాపాడుకోతగిన సంపదగా, తత్వజ్ఞతకు కొలమానంగా ఉదహరించడం అపూర్వమైన అంశం. అందం గురించిన ఈ వ్యాఖ్యానాన్ని గురజాడ అప్పారావులోని భావుకతకు సంబంధించిన అంశంగా చూడకూడదనిపిస్తుంది. స్త్రీలను అందం కోసం శ్రమించమని, అందుకు తగిన వ్యాయామం కూడా అవసరమని ఇలా సూచించారు. ‘గాలిలో నడు, సైకిల్ తొక్కు, గుర్రపు స్వారీ చెయ్, తత్వవేత్తగా జీవించు. ఈ ప్రపంచపు కష్టాలు నీ నుదుటిపై ముడతలు పడెయ్యకూడద’ని కూడా అంటారు. చలం స్త్రీలకు శరీరం ఉంది, దానికి వ్యాయామం కావాలి అని 1920ల తర్వాత చెప్పిన మాట గురజాడ అప్పారావు 1915లోనే చెప్పారు. స్త్రీ సౌందర్య పోషణ గురించి శ్రద్ధ తీసుకోవడం అంటే శ్రమించడంలో కూడా శారీరక, మానసిక శ్రమలు రెండూ స్త్రీలు సమపాళ్ళలో నిర్వహించాలనేది గురజాడ అప్పారావు ఆకాంక్ష. అందుకే ఆయన ‘అందం కోసం శ్రమించు’ అని చెప్పడంలో శారీరక, మానసిక సౌందర్య పోషణలు రెండూ ఉన్నాయి. స్త్రీ శరీరానికి వ్యాయామం అనేది చాలా అవసరమని చెప్పటం, సైకిల్ తొక్కటం, గుర్రపు స్వారీ చెయ్యటం, బాహ్యప్రపంచంతో సంబంధం కోసం గాలిలో నడవమనటం, తత్వవేత్తగా జీవించమనటంలో స్త్రీల జీవనశైలి (లైఫ్ సైల్), మానసిక వికాసం, శారీరక అభివృద్ధి అంశాల గురించి చర్చించాలనుకున్నారు.
ప్రపంచపు కష్టాలు నీ నుదుటిపై ముడతలు పడేయకూడదంటారు. ఇక్కడ నుదుటిపై ముడతలు పడకూడదనటం శారీరక సౌందర్యానికి సంబంధించిన అంశం కాదు. స్త్రీలు తత్వవేత్తలుగా జీవించే క్రమంలో వారు చేసే ఆలోచనాపరంపరలో ఆశ్చర్యం, సందేహాత్మకంగా జీవించాల్సినటువంటి స్థితి ఉండరాదని చెప్పటం గురజాడ అప్పారావు ఉద్దేశ్యం. నుదుటిపై ముడతలు పడడం అంటే భృకుటి ముడిపడడం. సందేహాత్మకమైన జీవితం నుంచి స్త్రీలు మానసిక ఎదుగుదల గురించి చెప్పటం. ఇది ఒకసారి చదవగానే బోధపడే అంశంగా అనిపించక పోయినప్పటికీ, నిశితంగా పరికించి చూస్తే ఒక స్పష్టమైన అవగాహనా దృక్పథంలోని మూలాంశాలను ‘సౌదామిని’ కథానికలో చూడవచ్చు.
స్త్రీ పురుషులు వివాహ సమయంలో శారీరకమైన అందాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే అలా మొట్టమొదట పరిగణనలోకి తీసుకున్న పై అంశాలు, ఆ తర్వాత సెకండరీగా మారిపోవడం గురించి ప్రస్తావించారు. వాళ్ళిద్దరూ కలిసి జీవించే క్రమంలో శారీరక సౌందర్యంలో మార్పు కలగడం సహజం. వాళ్ళ సంబంధాలలో ప్రేమ అనేది ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో ఆ బంధంలో అవగాహనా రాహిత్యం చోటుచేసుకోదు. ఆనందం, సుఖం, ప్రేమ అన్నీ కూడా సమపాళ్ళలో స్త్రీ పురుషులిద్దరూ పంచుకోగలిగిన స్థితిలో మాత్రమే వాళ్ళ సౌందర్యం నశించదు. స్నేహం, సహజీవనం వాళ్ళ సంబంధాలను బలోపేతం చేస్తుందనేది గురజాడ అప్పారావు గారి ఉద్దేశ్యంగా ‘సౌదామిని’లో స్పష్టంగా తెలుస్తుంది. ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందని ‘గురజాడ’ కాంక్షించారు. ‘‘భగవంతుని సృష్టిలోకెల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీ రత్నమే.’’ (దిద్దుబాటు కథ, గురజాడ రచనలు, సంపాదకులు సెట్టి ఈశ్వరరావు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2006) అని విశ్వసించారు గురజాడ. కమలిని, నాంచారమ్మ పాత్రలతో మొదలైన ఉత్కృష్టమైన వస్తుగత స్త్రీత్వం మంజువాణి, మధురవాణి పాత్రల నుండి ఒక పరిణామక్రమాన్ని సంతరించుకోవడాన్ని ‘సౌదామిని’లో గమనించవచ్చు. నాంచారమ్మ సంప్రదాయ విద్యను అభ్యసించిన స్త్రీ. కమలిని పాఠశాలలో విద్య నేర్చిన స్త్రీ. మధురవాణి సంగీత, నాట్య శాస్త్రాలతో పాటు లోకాన్ని చదువుకున్న స్త్రీ. ఎవరి స్వభావం ఎలాంటిది, పసిగట్టగలిగిన నేర్పరి. ఎత్తులకు పైఎత్తులు వేయగల మేధావి. కానీ జన్మతః వేశ్యాకులంలో పుట్టడం ఆ పాత్రకు బలం, బలహీనత కూడా. సౌదామిని కమలినిలా చదువుకుంది. మధురవాణిలా సంగీత, నాట్య, సాహిత్యాలలో ప్రావీణ్యం గల స్త్రీ. వీటికి తోడు ఖడ్గవిద్యలో కూడా తర్ఫీదు పొందింది. అయితే సౌదామిని పాత్ర అచ్చంగా గురజాడ కలలు కన్న ఉత్కృష్టమైన స్త్రీకి ప్రతిరూపం.
స్త్రీల మనోవికాసానికి ఆటంకంగా ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సమస్యల గురించిన అవగాహన గురజాడకు ఉంది. సమకాలీన సమాజంలో స్త్రీలు పడుతున్న బాధల పట్ల నిరంతర చింతన కలిగినవాడు కావడంవల్ల స్త్రీ పాత్రల సృజన క్రమంలో, ఆయా పాత్రల పరిణామక్రమ ఆవిష్కరణను చూడగలుగుతున్నాం. ఆయన ‘ఆధునిక స్త్రీ’ ఆకాంక్ష వెనుక నిర్దిష్టమైన ఆలోచన, నిబద్ధతతో కూడిన రచనా సంవిధానం… ఈ రెండూ గురజాడలోని ఉత్కృష్టమైన స్త్రీరత్నం ఆవిర్భావ అభిలాషను స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాయి. అలా అభిలషించడంలో గురజాడ అప్పారావు విశిష్టత వ్యక్తమవుతుంది. ఇంగ్లీష్, ఫ్రెంచ్ సాహిత్య అధ్యయనం వలన, అలాగే ఆయనకు గల తాత్విక, విమర్శనాత్మక, విశ్లేషణాత్మక దృష్టికోణం ఇవన్నీ కూడా ఆయనలో ఉత్కృష్ట స్త్రీ రత్నం గురించి చేసిన ఆలోచనలకు దోహదం చేశాయని ‘సౌదామిని’ రచన బహిర్గతం చేస్తుంది.