అస్తిత్వ అన్వేషణ (స్వీయకథ) – ఎమ్‌.శ్రీధర్‌

నేను ఈ పుస్తకం చదువుతున్నప్పుడు సాహిత్యంలో డిగ్రీ చదువుతున్న మా పాప ‘ఆత్మకథలు’ ‘గొప్ప’ వ్యక్తులే రాయాలా?’ అని అడిగిన ప్రశ్నతో ఈ సమీక్షను మొదలుపెడితే బాగుంటుందని అనిపించింది. ‘గొప్ప’ వ్యక్తులు రాసిన సాధారణమైన ఆత్మకథల కంటే, ‘సాధారణ’ వ్యక్తులు రాసిన అసాధారణ ఆత్మకథలే మెరుగేమో’ అని ఆమెతో నేనన్నాను.

వనమాల రాసింది ఒక ‘గొప్ప’ వ్యక్తి ఆత్మకథో, ఒక ‘అసాధారణ’ ఆత్మకథో పుస్తకం గురించి ఈ సమీక్ష ద్వారా తెలుసుకున్నాక, ఇంకాస్త ముందుకెళ్ళి పుస్తకం చదివాక, మీ నిర్ణయానికి వదిలేస్తాను. పై ప్రశ్నలకూ, పుస్తకం చివరి అధ్యాయంలో ‘నేను ఏమంత గొప్ప పనులు చేశానని నా జీవిత చరిత్ర రాయమంటున్నారు?’ అని వనమాల హరగోపాల్‌ను అడిగిన ప్రశ్నకూ, అటుపిమ్మట వారిద్దరి మధ్య జరిగిన చర్చకూ సంబంధం ఉండడం పూర్తిగా యాథృచ్ఛికమే!
‘అడుగులు’ అనే మొదటి అధ్యాయంలో తాను స్కూల్లో చేరేటప్పటినుంచి, కాలేజి విద్య, ఉద్యోగం, పెళ్ళి, కవలపిల్లల పెంపకం, పరిశోధన, ఉద్యమాల్లో పనిచేయడం వరకు తాను వేసిన ప్రతి అడుగూ ఒక పోరాటమంటూ వనమాల తన స్వీయ కథను మొదలుపెడుతుంది. తన వైయక్తిక జీవనం నుండి సమాజంతో సమిష్టి జీవనం వైపు చేసే ప్రయాణంలో సజీవ సంబంధాల్ని సాధిస్తూ సాగడం మానవ లక్ష్యంగా మొదట్లోనే వనమాల చెప్పుకోవడం గమనించాలి. మరొక విషయం ఏమిటంటే, తన ఈ మార్గంలో ఉన్నత పౌర సమాజాన్ని అందుబాటులోకి తెచ్చిన తన సహచరుని (హరగోపాల్‌) పాత్రను మెచ్చుకుంటూనే ఇంటి పనుల్లోనూ, ఇంటి ఖర్చులకి సహకారం అందించడంలోనూ అతని పట్ల తన అసంతృప్తినీ నిర్మొహమాటంగా చెప్పడం ముఖ్యంగా గమనించాలి. బాల్యం గురించి, చదువుల గురించి రాసిన అధ్యాయాలు పల్లెటూళ్ళ నుంచి పట్నాలకు వెళ్ళేవారి, ముఖ్యంగా చేతిలో ఎక్కువ డబ్బులు ఉండని, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల్లోని స్త్రీల కష్టాల గురించి తెలియజేస్తాయి. పెద్దన్నకు తాను చదువుకోవడం ఇష్టం లేకున్నా బియ్యం రవాణాకు అనుమతించని ఆ రోజుల్లో దొంగతనంగా బియ్యం తెచ్చిన నాన్న, కోళ్ళను పెంచి అంతో ఇంతో సంపాదించి ఇచ్చిన అమ్మల ప్రోత్సాహం, గురువుల ఆదరణ తనలో ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఎలా ఇచ్చాయో తెలియజేస్తాయి. గురువులు రమా మేల్కొటే, వసంత్‌ కన్నాభిరాన్‌, రావి భారతులు తనకు నేర్పిన విషయాలు తనకు రాజకీయ అవగాహన వచ్చిన తర్వాత ఎలా బోధపడ్డాయో చెబుతుంది. కవలపిల్లల్ని ఒక్క రోజు చూసుకోవడంలో తన భర్త చేతకానితనాన్నీ, ప్రతిరోజూ స్త్రీలు చేసే పనులకు రావలసిన గుర్తింపు గురించి వసంత్‌ ఎత్తిచూపడం ద్వారా తాను తెలుసుకున్న విషయాన్ని ఈ సందర్భంలో చెప్పడాన్ని గమనించాలి. అయితే కవల పిల్లల్నిద్దర్నీ చూసుకోవాల్సి వచ్చిన సందర్భాల్లో వాళ్ళ కొంటె చేష్టలవల్ల తన సహచరుడు ఎంత ఇబ్బంది పడ్డాడో నవ్వు పుట్టించే విధంగా వివరిస్తుంది.
తనకు తోచిన ఆలోచనలను ఏ సంకోచం లేకుండా వెలిబుచ్చడం వనమాల ప్రత్యేకత. ఉదాహరణకు తనకు ఎం.బి.బి.ఎస్‌.లో సీటు రాకపోవడం, తన స్నేహితురాలికి ఆమె తండ్రి మంత్రి కోటాలో సీటు ఇప్పించడం గురించి చెబుతుంది. విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయలోపం వల్ల తాను ఉస్మానియాలోను, కాకతీయలోనూ పిహెచ్‌.డి.లో రిజిస్టర్‌ చేసుకోలేకపోవపడాన్ని, డిగ్రీ కాలేజీలో అధ్యాపకులకు వారానికి 21 గంటల పనిభారం విధానాన్ని విమర్శిస్తూ అది ఎంత యాంత్రికంగా, జ్ఞానసృష్టికి ప్రతిబంధకంగా ఉందో వివరిస్తుంది. విద్యాబోధనకు విశ్వవిద్యాలయాల లోపలే కాలేజీల్లో కూడా పరిశోధన, ప్రచురణలు అర్హతలైనప్పుడే విద్య గుణాత్మకంగా, నూతన జ్ఞానసృష్టికి తోడ్పడేలా మారుతుందని సూచిస్తుంది. తెలంగాణా ఉద్యమకాలంలో విద్యార్థుల చదువులు సరిగ్గా సాగకపోవడం, అందువల్ల ఉత్పన్నమైన కాపీలు కొట్టే ఆచారాన్ని తాను అర్థం చేసుకోలేకపోవడం, అలా పట్టుబడ్డ ఒక విద్యార్థిని వదిలివేయాల్సి వచ్చిన అనుభవాన్ని పంచుకుంటూ, నిజాయితీగా ఉండడం అంటే లౌకికంగా వ్యవహరించడం అని తనకు తెలిసివచ్చిన వైనాన్ని వివరిస్తుంది.
ఆడపిల్లలకు చదువు అవసరం లేదన్న తన పెద్దన్న అభిప్రాయం, తనకు ఉద్యోగం వచ్చినపుడు రెండో అన్న అమ్మాయిలు ఒకళ్ళే బయటకు వెళ్ళి ఉండకూడదనడం, నాన్న ఆడపిల్లలు చదువుకోవడాన్ని, ఈత నేర్చుకోవడం, ట్రాక్టర్‌ నడపడం వంటి నైపుణ్యాలను ప్రోత్సహించినప్పటికీ, ఇంట్లో అబ్బాయిలకు ఇచ్చినంత ప్రాధాన్యత అమ్మాయిలకు ఇవ్వకపోవడం వంటి విషయాలు వనమాలను వెంటాడినట్లుంది. అందువల్ల సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయాల్ని గుర్తుచేసుకుంటుంది. అమ్మాయిల చదువు గురించి కలిగిన ఇలాంటి నిర్దిష్టమైన అనుభవం తనలో సామాజిక చైతన్యం కలిగించి యువతులకు మొగిలిగిద్దలో జూనియర్‌ కాలేజీ తీసుకురావడానికి పునాది కావడం గురించి వివరిస్తుంది. తన వ్యక్తిగత పోరాటం ఎలా మరో మూడు షెడ్యూల్డ్‌ కులాల కుటుంబాల్లోని వ్యక్తులు చదువుకోవడానికి బాటలు వేసిందో ఇంకొక సందర్భంలో చెబుతుంది. కుటుంబాల్లో స్త్రీల ఇంటిపనులకు సరైన గుర్తింపు లేకపోవడం ఆమెను వెంటాడిన మరో అంశం. ఒక సందర్భంలో ‘స్త్రీ పురుషుల మధ్య శ్రమ విభజన విలువలు అసాంఘికంగానూ, అశాస్త్రీయంగానూ, అన్యాయంగానూ ఉన్నందునే తన కళ్ళముందే ఇబ్బంది పడుతున్న అమ్మ గురించి మా నాన్న ఆలోచించలేదు’ అంటుంది. ఉద్యమాల్లో, సాంఘిక అసమానతలు, ఆధిపత్యాలు, అణచివేతల గురించి పోరాడే తన సహచరుడు వంటి వ్యక్తులు కూడా కుటుంబంలో పితృస్వామ్య భావజాల ప్రభావం వల్ల స్త్రీలకు జరిగే అన్యాయాన్ని గుర్తించకపోవడాన్ని నిర్మొహమాటంగా ఎత్తిచూపుతుంది. ఆస్తి పంపకాల్లో తండ్రులు తమ బాధ్యతలను మరచి కొడుకులకే అంతా కట్టపెట్టడం, ఈ విషయంలో తమ కోడళ్ళను సంప్రదించకపోవడం వంటి ‘అప్రజాస్వామిక’ పద్ధతులను తన కుటుంబంలో జరిగిన సంఘటనలను ఉదహరించి వేళ్ళూనుకున్న పితృస్వామ్య భావజాల ప్రభావాన్ని వివరిస్తుంది. ఈ సందర్భంలో తన ఆస్తి పంపకంలో తన కొడుకూ, కోడళ్ళకు సమాన ప్రాతిపదికన హక్కు కలిగేటట్లు తాను వీలునామాను రాయించడాన్ని గర్వంగా చెప్పుకుంటుంది.
‘ఉద్యమాలు`అనుభవాలు’ అధ్యాయంలో మహిళల సమస్యల గురించి, కార్మికుల సమస్యల గురించి జరిగిన పోరాటాల్లో పాల్గొనేందుకు తనకు వచ్చిన అవకాశాల గురించి (ఉదాహరణకు చైతన్య మహిళా సంస్థ తరపున నందిగ్రాంలో మహిళలపైన, వారి కుటుంబాల ఆస్తులపైనా జరిగిన దౌర్జన్యాలపై నిజ నిర్థారణ కమిటీ సభ్యురాలిగా, తెలంగాణా రాష్ట్ర సాధన మలి పోరాట దశలో, తెలంగాణా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విద్యుత్‌ కార్మికుల ఉద్యమంలో, విద్యా పరిరక్షణ కమిటీలో) మనతో పంచుకుంటుంది.
పరిశోధనా రంగంలో తన అనుభవాలను వనమాల పంచుకున్న తీరును గమనిస్తే అవి కష్టపడి చదువుకునే ఏ స్త్రీలనైనా ఉత్తేజపరిచేవిగా కనిపిస్తాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేసి వాటిని ప్రైవేటు రంగానికి ధారాదత్తం చేయడం అనే అంశంపై చేసిన పరిశోధనలో ఈ నిర్ణయం వల్ల గ్రామీణ వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని, ముఖ్యంగా మహిళా కార్మికుల స్థితిగతుల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేయడం గమనించాలి.
తన అనుభవాలను, ఆలోచనలను పంచుకోవడం ద్వారా తన ఆత్మకథ నుంచి పాఠకులు ఏమి నేర్చగలరో సూచించే విధంగా ఒక పథకం ప్రకారం రాసినట్లు తెలుస్తుంది. ఉదాహరణకు ‘స్ఫూర్తిదాయక వ్యక్తిత్వాలు’ అనే అధ్యాయంలో మానవ సంబంధాలను పటిష్టం చేయడంలో స్నేహం యొక్క పాత్రను, వరవరరావు, కన్నాభిరాన్‌, బాలగోపాల్‌, జి.రామిరెడ్డి, చుక్కా రామయ్య, వి.ఎస్‌.ప్రసాద్‌ వంటి ప్రముఖ వ్యక్తుల, వారి సహచరుల నుండి మాత్రమే కాక, తన సహోద్యోగులు, బంధువుల నుంచి కూడా తాను పొందిన స్ఫూర్తిని వివరించడం గమనిస్తాము.
ఆత్మకథల గురించి, అందులోనూ స్త్రీల స్వీయ కథల గురించి విస్తృత పరిశోధనలు జరిపిన అల్లాడి ఉమ ఈ పుస్తకానికి ముందుమాట రాయడం సముచితంగా ఉంది.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.