గమనమే గమ్యం – ఓల్గా

స్వరాజ్యం శారదకు అర్జంట్‌ కాల్‌ బుక్‌ చేసి మరీ తెలుసుకుంది తన గర్భం విషయం తల్లికి తెలియదని, శారద చెప్పలేదని. మొత్తానికి ఐదారు నెలల్లో అంతా సర్దుకుని మళ్ళీ శారదా, అన్నపూర్ణలు మామూలయ్యారు.

ఆ వేసవి సెలవులకు బంధువులు, స్నేహితుల పిల్లలందర్నీ ఒక పదిరోజులు తన ఇంట్లో చేర్చి ఆటపాటలతో ఆనందంగా ఉంచాలనీ, ఆనందంతో పాటు వాళ్ళ బుర్రల్లో తగుమాత్రం రాజకీయాలు నింపాలనీ అనుకుంది శారద. నటాషా బియస్సీ పూర్తి కావస్తోంది. బంధువుల్లో, స్నేహితుల్లో నటాషాకు పదేళ్ళు అటూ పదేళ్ళు ఇటూ ఉన్న పిల్లలు పాతికమంది దాకా ఉన్నారు. వాళ్ళందరినీ రమ్మని కబురు చేసింది. కబురు వెళ్ళటం ఆలస్యం చాలామంది వచ్చారు. నటాషా కంటే పెద్ద వయసు వాళ్ళు ఎక్కువమంది రాలేదు. వాళ్ళకు పెళ్ళిళ్ళయి పోయాయి. అత్తవారిళ్ళకో, పుట్టిళ్ళకో, పురుళ్ళకో పరిమితమై పోయారు.
వచ్చిన వాళ్ళందరి చేతా రకరకాల కార్యక్రమాలు చేయాలని శారద, అన్నపూర్ణ, సరస్వతి ముందుగానే ఆలోచించారు. డాన్సులు, నాటకాలు, తమకు నచ్చిన పుస్తకాల గురించి మాట్లాడటం, పాట కచ్చేరీలు, దగ్గర తోటలకు వెళ్ళి వంటలు చేసుకుని తినటం, ఒకటి రెండు సినిమాలు చూడటం ఇలాంటి వాటితో పాటు శారద, అన్నపూర్ణ, సరస్వతి వాళ్ళకు చరిత్ర గురించి, సంస్కరణోద్యమం గురించీ, స్వాతంత్య్రోద్యమం గురించీ, తెలంగాణా సాయుధ పోరాటం గురించీ పాఠాలు చెప్పాలని కూడా అనుకున్నారు.
స్వరాజ్యం, సరస్వతి కూతుళ్ళు మనోరమ, విద్య రెండో తరం నాయకురాళ్ళుగా బాధ్యతలు తీసుకున్నారు. స్వరాజ్యం తన కూతురిని చంకనేసుకునే ఇల్లంతా గిరగిరా తిరుగుతోంది. ఇంతలో ఎవరో ఒకరు ఆ పిల్లను ముద్దు చేస్తూ ఎత్తుకుంటారు. ఒకరి చేతుల్లోంచి ఇంకొకరి చేతుల్లోకి మారుతూ బుల్లి అరుణ కూడా సంతోషంతో కేరింతలు కొడుతోంది.
ఒక్కోరోజూ గడుస్తున్నకొద్దీ అందరికీ దిగులు పదిరోజులయితే ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాలి గదా అని.
పగలూ, సాయంత్రాలూ కోలాహలంగా గడుస్తున్నాయి. రాత్రిళ్ళు శారద, అన్నపూర్ణ, సరస్వతి రాజకీయ పాఠాల్లాగా తమ అనుభవాలు చెబుతున్నారు. పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు.
‘‘ఎంతైనా తరానికీ, తరానికీ మధ్య అంతరం ఉంటుందోయ్‌. వాళ్ళ తెలివి, చురుకు మనకు లేదోయ్‌’’ అని శారదే అనాల్సి వచ్చింది.
‘‘అన్నపూర్ణా, నీ కూతురు స్వరాజ్యం ఉందే అది వజ్రమే’’ అంది సరస్వతి. అప్పుడు అనిపించింది శారదకు నటాషా మిగిలిన వాళ్ళున్నంత చురుకుగా లేదని. మామూలుగా ఉండే చురుకుదనం ఏమైపోయింది? అనుకుని మర్నాడు నటాషా మీద ఓ కన్నేసి ఉంచింది. తేడా స్పష్టంగా తెలుస్తోంది. పరధ్యానంగా, అనాసక్తంగా ఉంటున్నదనిపించింది. అందరితో కలిసి ఆడుతూ పాడుతూనే ఏదో ఆలోచనలో పడిపోతోంది. ఎవరన్నా పిలిస్తే ఉలిక్కిపడుతోంది. అపుడపుడూ ముఖంలోకి దిగులు వచ్చి కూర్చుంటోంది. రెండు రోజులు గమనించాక శారదాంబ నటాషాను ఉదయాన్నే తన గదికి పిలిపించుకుంది. నిద్రకళ్ళతో వచ్చిన నటాషా కళ్ళూ ముఖమూ తుడిచి వేడి కాఫీ అందించింది.
‘‘నట్టూ చెప్పమ్మా… ఏంటోగా ఉంటున్నావు. దేని గురించో దిగులు పడుతున్నావు. నాతో చెబితే ఆ దిగులు తగ్గదా?’’ అని తల్లి అనునయంగా అడుగుతుంటే నటాషా కళ్ళనుండి బొటబొటా కన్నీళ్ళు కారాయి.
శారద కూతుర్ని దగ్గరకు తీసుకుని హత్తుకుని ‘‘పిచ్చిపిల్లా. ఏడుస్తావెందుకు. ఎవరినన్నా ప్రేమిస్తున్నావా?’’
తల్లి అడిగిన ప్రశ్నకు బావురుమంది నటాషా.
ఆ ఏడుపుని ఆపి విషయం రాబట్టేసరికి శారదాంబకే అలుపు వచ్చింది. శారదాంబ సందేహించింది నిజమైంది. నటాషా ప్రేమలో పడిరది. ఆ కుర్రాడు ఎమ్మెస్సీ ఈ ఏడాదే పూర్తి చేశాడు. ఉద్యోగం దొరికేలా ఉంది. వెంటనే పెళ్ళి చేసుకుందామంటున్నాడు.
‘‘వాళ్ళింట్లో ఒప్పుకుంటారు. మనదీ వాళ్ళదీ ఒకే కులం’’ అని నటాషా చెప్తుంటే శారద పేలవంగా నవ్వింది. కులం ప్రసక్తి తన ఇంట్లోకి కూడా వచ్చేసింది.
‘‘మరి నీ చదువు? బీయస్సీ తర్వాత మెడిసిన్‌ చదవవా?’’
‘‘లేదమ్మా. నాకింకి చదవాలని లేదు. పెళ్ళి చేసుకుని సెటిల్‌ అవ్వాలని ఉంది’’ నటాషాకి ఇప్పుడు ఉత్సాహం వచ్చింది. బరువు దిగిపోయింది.
‘‘సరే… నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి. వెళ్ళి హాయిగా అందరితో సంతోషంగా ఉండు. నేను నాన్నతో చెప్పి వాళ్ళ వాళ్ళతో మాట్లాడమంటాను.’’
నటాషా రెక్కలొచ్చిన పిట్టలా తుర్రుమని అక్కడ్నుంచి ఎగిరిపోయింది.
శారద వెంటనే మూర్తికి ఫోన్‌ చేసి శనాదివారాల్లో రమ్మంటూ విషయం కూడా చెప్పింది. మూర్తి ఆశ్చర్యపడి ‘‘దానికప్పుడే పెళ్ళేంటి’’ అంటే శారదకు కళ్ళవెంట నీళ్ళొచ్చాయి.
ఆ సాయంత్రం అన్నపూర్ణతో ఆ సంగతి చెప్పి దిగులు పడుతూ కూర్చుంది శారద.
‘‘నా జీవిత విధానం నా కూతురికి నచ్చలేదోయ్‌. కారణం నేనేననుకుంటా. నటాషా చదువుకి ఇబ్బంది కలగకూడదని నాకు దూరం చేసుకున్నాను. నా విలువలు నేర్పలేకపోయాను. ఇప్పుడు చేయగలిగింది లేదు. నటాషా తన జీవితాన్ని తనే జీవించాలి. తన ఇష్టప్రకారం జీవించాలి. డాక్టర్‌ అవుతుందనుకున్నా, నా ప్రాక్టీస్‌ తీసుకుంటుందనుకున్నా. నా రాజకీయాలను ముందుకు తీసుకుపోతుదనుకున్నా. పోనీలే… కూతుళ్ళూ కొడుకులే మనకు వారసులనుకోకూడదు. మన ఆశయాల వారసులు ఎక్కడో పుట్టి పెరుగుతుంటారు.’’
అన్నపూర్ణకు చెబుతున్న ఆ మాటలు శారద తనకు తానే చెప్పుకున్నట్లు ఉన్నాయి.
మూర్తి రెండు రోజుల్లో వచ్చి నటాషానడిగి వివరాలన్నీ కనుక్కొని విశాఖపట్నం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చాడు.
‘‘అంతా బాగానే ఉంది గానీ వాళ్ళు పెళ్ళి శాస్త్రోక్తంగా జరగాలంటున్నారు. కన్యాదానం చెయ్యాలట.’’
శారద నవ్వేసి ‘‘కన్యాదానం ప్రసక్తే లేదు’’ అంది.
‘‘లేదు. వాళ్ళు చాలా పట్టుదలగా ఉన్నారు. మనం ఏదో మార్గం ఆలోచించాలి.’’
‘‘ఏం మార్గం ఉంటుంది. నువ్వూ నేనూ పీటల మీద కూర్చుని నటాషాని వాళ్ళకి కన్యాదానం చేద్దామా? నా వల్ల కాదు.’’
‘‘మనం చెయ్యాలని కాదు. మన బంధువులెవరైనా ఆ పని చెయ్యొచ్చు.’’
‘‘మీ లాయర్ల తెలివి తేటలే వేరేం…’’ చిరాకు పడిరది శారద.
‘‘అంతకంటే మరో మార్గం లేదు. ఇదో తతంగం. దానికంత ప్రాముఖ్యం అనవసరం. కుర్రాడు చాలా మంచివాడు. నటాషాకు అతనంటే ప్రాణం. వాళ్ళిద్దరి ప్రేమనూ ఈ తతంగం కోసం కాదంటామా? ఏదో ఒక ఉపాయం చూసి పెళ్ళి జరిపిస్తామా?’’ శారదకు నిరుత్సాహం, నీరసం కమ్ముకొచ్చాయి.
‘‘సరే… నువ్వే ఏదో ఒకటి చెయ్యి’’ అని హాస్పిటల్‌కి వెళ్ళిపోయింది. ఆ రోజంతా మనసు మనసులో లేదు. ఎంతమందికి తను దండలు మార్పించి, టీ పార్టీ ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిందో లెక్కలేదు. ఇప్పుడు తన కూతురు పురోహితుడి మంత్రాలతో, మంగళసూత్ర ధారణతో, కన్యాదానంతో శాస్త్రోక్తంగా పెళ్ళి చేసుకుంటానంటోంది. ఎక్కడ జరిగింది లోపం?
అన్నపూర్ణ కూతురి పెళ్ళి తను చేసింది.
తన కూతురి పెళ్ళి ఇంకెవరో చేస్తారు.
సమాజంలో సంక్లిష్టత పెరుగుతోంది. సరైన దిశగా వెళ్ళటం లేదు. స్వీయ జీవితాన్ని సామాజిక సందర్భాలతో సరిచూసుకునే సామర్ధ్యం ఉంది గనుక శారద తప్పంతా తనమీద వేసుకుని బాధపడలేదు. కూతురి పెళ్ళి జరిపించే బంధువులెవరా అని ఆలోచిస్తూ ఇక ఆ పెళ్ళి పనుల్లో పడిపోయింది.
నటాషా వివాహం జరిగిపోయింది. బంధువులు, స్నేహితులు ఇల్లంతా తిరుగుతోంటే తన ఇంట్లో తానే పరాయిదానిలా అనిపించింది శారదకు. పెళ్ళి తంతు జరుగుతుంటే శారద, అన్నపూర్ణ, సరస్వతి మండపానికి కాస్త దూరంగా కూర్చున్నారు. సరస్వతి ‘‘మీరిద్దరూ మీ కూతుళ్ళ పెళ్ళిళ్ళను మీరు చెయ్యలేకపోయారు. ఎవరో చేస్తున్నారు. ఏంటిది అర్థం లేకుండాను’’ అంది ఆలోచిస్తూ. అన్నపూర్ణ టక్కున ‘‘ఆధునిక స్త్రీలం గదా… అందుకు’’ అనేసరికి శారద పెద్దగా నవ్వేసింది. గలగలా నవ్వుతున్న శారద నవ్వులో అన్నపూర్ణా జతగలిపింది.
సరస్వతి ‘‘ఊరుకోండి అందరూ ఇటే చూస్తున్నారు’’ అంది తనూ నవ్వాపుకోలేక సతమతమవుతూ. ఒకవైపు మంత్రోచ్ఛారణల మధ్య మాంగల్యధారణ జరుగుతోంటే ఈ ముగ్గురు తల్లులూ నవ్వాపుకోలేక పగలబడి నవ్వుతున్నారు.
వీళ్ళకు దగ్గరగా ఉన్నవారంతా వింతగా చూస్తోంటే మరింత నవ్వొచ్చింది ముగ్గురికీ.
… … …
నటాషా పెళ్ళి జరిగాక రాజకీయ శూన్యత్వాన్ని భరించలేననిపించింది శారదకు. ప్రాక్టీసు ఎంత సమయాన్ని తీసుకున్నా, డాక్టర్‌గా ఎంత సేవ చేసినా తృప్తి కలగటం లేదు. సరస్వతి, అన్నపూర్ణల స్నేహం ఎంత సేద తీర్చినా ఏదో అశాంతి మనసును తొలిచేస్తోంది. ప్రజా రాజకీయాలు లేకుండా జీవించడం కష్టంగా ఉంది. డబ్బు సంపాదించింది. మంచి హాస్పిటల్‌, ఇల్లు, కళ్ళముందు ఆనందంగా తిరుగుతున్న కూతురు, స్నేహితులు, పేరు, ప్రతిష్టా… కానీ ఒక మూల శూన్యం. రైతు కూలీలతో, వెనుకబడిన వర్గాల వారితో కలిసి వారికోసం పనిచేయాలనే తపన… ఆడవాళ్ళ అభివృద్ధి కోసం చేయవలసిన, తీసుకురావలసిన చట్టాల గురించి ఆలోచన… ఆరోగ్యపరమైన పాలసీల కోసం ఉద్యమించాలనే ఆతృత… ఇవన్నీ శారదాంబ మనసుని తొలిచేస్తున్నాయి. ప్రతి విషయం గురించి నోట్సు రాసుకుంటోంది. రావాల్సిన మార్పుల గురించి స్నేహితులతో మాట్లాడుతోంది.
రోజులిలా గడుస్తుండగా శారద బంధువు, కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు, ఉన్నత విద్యావంతుడు అయిన రావుగారు శారదను కాంగ్రెస్‌లో చేరమని గట్టిగా అభ్యర్థించటానికి వచ్చాడు.
ఆయన మాటలు విని శారద తేలిగ్గా తీసిపారేయలేదు. సూర్యం కూడా అక్కడే ఉన్నాడు.
‘‘తమ్ముడూ ` నువ్వు అడగటంలో పొరపాటు లేదు. కానీ కాంగ్రెస్‌కు సర్వస్వం ధారపోసి పనిచేసిన మా అన్నపూర్ణ, అబ్బయ్యలు స్థానిక రాజకీయ ధోరణుల గురించి నాకు చెప్తుంటారు. వాళ్ళే క్రమంగా దూరమవుతున్నారు. నేను కాంగ్రెస్‌లో చేరి ఏం చెయ్యాలి? నా స్వభావం నీకు తెలుసు. అవినీతి అక్రమాలు సహించను. ఎవరి అధికారానికి తలవంచను. రాజీపడను. నాకు రాజకీయాలంటే ఆసక్తి ఉంది. కానీ నేను వాటిలో ఇమడలేను. దుర్గాబాయిని ఓడిరచిన పార్టీలో నా స్థానమేంటి? నేనేం చెయ్యగలుగుతాను?’’
రావు నిదానంగా ఆచితూచి మాట్లాడాడు.
‘‘నువ్వన్నదంతా కరక్టేనక్కా. కానీ నేను నిన్ను కాంగ్రెస్‌లోకి రమ్మన్న కారణం వేరు. ఇప్పుడు పరిస్థితులు నీకు తెలుసు. రాజ్యాంగం రాసుకుని పదేళ్ళు కాలేదు. దేశ నిర్మాణమనే పెద్ద బాధ్యత అందరి మీదా ఉంది. అది సక్రమంగా జరగాలంటే మేధావులు, నిజాయితీపరులు శాయశక్తులా పని చెయ్యాలి. అన్ని రంగాల నుంచీ విద్యావేత్తలు, సోషలిస్టు భావాలు గలవారు, దేశ నిర్మాణం మీద ఆసక్తి గలవారు పార్లమెంటుకి రావాలి. ఇది నా ఆశ మాత్రమే కాదు. నెహ్రు గారి కోరిక కూడా. ఎన్నికలు దగ్గరకొచ్చాయి. నువ్వు నిర్ణయం తీసుకోవాలి?’’
‘‘నేను ఎన్నికల్లో పోటీ చేయటమా? దుర్గాబాయి సంగతి తెలియదా?’’
‘‘తెలుసక్కా… కానీ నాకు నమ్మకం ఉంది. బెజవాడ ప్రజలు నిన్ను ఎన్నుకుంటారు. పార్లమెంటుకెళితే నీకోసం చాలా పనులున్నాయి. హిందూ కోడ్‌ బిల్లు ఇంకా సంస్కరించబడాలి. హెల్త్‌ పాలసీలు రూపొందించాలి. స్త్రీ శిశు సంక్షేమ పథకాలు ఒక అవగాహనతో ఏర్పడాలి. వీటన్నిటికీ నీ మేథస్సు, నీ విజ్ఞానం, నీ చట్ట పరిజ్ఞానం, సోషలిస్టు ఆలోచనా ధోరణి అన్నీ దోహదం చేస్తాయి. అందుకే నీ గురించి అంతా తెలిసీ నేను ఈ మాట అడిగే సాహసం చెయ్యటానికి సిద్ధపడ్డాను. ఆలోచించు. ఎన్నికలలో గెలుపోటముల గురించి ఎవరూ చెప్పలేరు. కానీ నువ్వు పాలసీలు రూపొందించే కమిటీలలో పనిచేయడానికి ఎం.పి.వే కానవసరం లేదు. కాంగ్రెస్‌ సభ్యురాలివైతే చాలు. సభ్యురాలివి కాకున్నా ఫర్వాలేదు. కానీ చాలా ఆటంకాలు, చికాకులు ఎదుర్కోవాలి. అసలు నువ్వు ఎం.పి.గా గెలుస్తావనే నమ్మకం నాకుంది. ఆలోచించు ప్రజలకు నీ మీద ఉన్న అభిమానం సామాన్యమైంది కాదు. అది నీకు తెలియదేమో కానీ అందరికీ తెలుసు.’’ శారదను ఒప్పించేందుకు ఓపికగా మాట్లాడుతున్నాడు రావు.
‘‘బెజవాడ కమ్యూనిస్టుల కంచుకోట. నేను కమ్యూనిస్టు పార్టీ నుంచి బైటికి వచ్చినదాన్ని… వాళ్ళ దృష్టిలో బహిష్కరించబడిన దాన్ని నేనెలా గెలుస్తాను.’’
‘‘గెలుస్తావు. మాకందరికీ నమ్మకం ఉంది. గెలవవు… నీకు ఎంపి అవటం ముఖ్యం కాదు కదా…’’
శారదకు ఎటూ పాలుబోలేదు.
‘‘నేను ఆలోచించి చెబుతాలే’’ అని రావు గారిని పంపించింది. సూర్యంతో ఎప్పటికప్పుడు తన మనసులోని మాటలు చెపుతూనే ఉంది. రావుగారు వెళ్ళాక సూర్యం ‘‘రాజకీయ జీవితం లేకుండా నువ్వు శాంతిగా ఉండలేవు అక్కా, ఎన్నికల్లో పోటీ చెయ్యి’’ అన్నాడు.
‘‘ఎన్నికలంటే మాటలా? డబ్బూ, ప్రచారం.’’
‘‘అదంతా నేను చూసుకుంటాను కదా. ఆ విషయాలు నాకు ఒదిలెయ్‌’’ అన్నాడు. ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రావటం కష్టంగానే ఉంది. మూర్తితో మాట్లాడితే అతనూ ఏమీ చెప్పలేకపోయాడు.
‘‘నువ్వే ఆలోచించుకో. బెజవాడనంతా ఎర్రదనంతో నింపిన ఇల్లు మూడు రంగులకు మారటం… చాలా ఐరనీ…’’ అని నవ్వేశాడు.
‘‘నాకు రాజకీయ జీవితం లేకుండా బతకడం చాలా వెలితిగా ఉంది.’’
‘‘వెలితి గురించి నాతో చెప్తున్నావా? అది నీకంటే వంద రెట్లు నేను అనుభవిస్తున్నాను.’’
‘‘ఏదో ఒకటి చేయాలి మూర్తీ. నేను కాంగ్రెస్‌ పార్టీలో చేరతాను. ఎన్నికల్లో పోటీ చేస్తాను. అది పొరపాటనిపిస్తే దిద్దుకుంటాను. ఏ పనీ చెయ్యనివాళ్ళు పొరపాట్లు చెయ్యకుండా పరిశుద్ధంగా ఉంటారు. నాకు ప్రవహించాలని ఉంది. నిలవనీరులా ఉండాలని లేదు. ప్రవాహంలో ఒక్కోసారి చెత్తా చెదారం చేరుతుంది. దాన్ని పక్కకు నెట్టి ప్రవహించకపోతే నిల్వనీరు మురికినీరవుతుంది. పార్లమెంటుకి వెళ్తాను. ఏమైనా చెయ్యగలనేమో చూస్తాను.’’
మూర్తితో మాట్లాడుతూనే ఒక నిర్ణయానికి వచ్చింది శారద.
నాలుగు రోజుల్లో శారదాంబ కాంగ్రెస్‌ పార్టీలో చేరిందనే వార్త బెజవాడలో సంచలనం సృష్టించింది.
‘‘చూశావా? శారదాంబ ఎంత పని చేసిందో, శత్రుశిబిరంలోకి వెళ్ళి చేరింది’’ అన్నారు కొందరు.
‘‘మనం ఆమెను శత్రువులా చూస్తే లేనిది ఆమె కాంగ్రెస్‌లో చేరితే వచ్చిందా తప్పు. మనం ఆమెను దూరం చేసుకున్నాం. వాళ్ళు తెలివిగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఆమె తెలివి, మంచితనం అన్నిటినీ కాదనుకున్నాం. ఇప్పుడావిడ ఏం చేస్తే మనకెందుకు’’ అన్నారు కొందరు. ఎవరేమనుకున్నా ఆగని కాలం ఎన్నికలను తరుముకుంటూ వచ్చింది.
అన్నపూర్ణ, అబ్బయ్య బెజవాడ వచ్చారు. స్వరాజ్యం పది రోజుల ముందు వస్తానని ఉత్తరం రాసింది గానీ ఆ ఉత్తరంలో ఏదో అసంతృప్తి ఉంది. ‘‘స్వరాజ్యానికి నేను చేసిన పని నచ్చలేదనుకుంటానోయ్‌’’ అంది శారద. ‘‘చిన్నపిల్ల, దానికేం తెలుసు’’ అంది అన్నపూర్ణ.
‘‘అది కమ్యూనిజం వైపు వెళ్తుంటే మీరు అటునుండి ఇటు వచ్చారు. స్వరాజ్యం కొంత గందరగోళం పడి ఉంటుంది’’ అన్నాడు అబ్బయ్య.
శారద ఎన్నికల్లో పోటీ చేస్తోందని తెలిసి రామస్వామి గారు తన పనులన్నీ పక్కనబెట్టి ప్రచారం చేయడానికి వచ్చారు.
‘‘మన వాళ్ళందరికీ మీ మీద కోపం పెరుగుతుందండీ’’ అంది శారద నవ్వుతూ.
‘‘పెరగనివ్వమ్మా. దానివల్ల ఎవరికి నష్టం? మంచి మనుషుల్ని దూరం చేసుకుని వారిమీద కోపం తెచ్చుకునే సంప్రదాయం మనవాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నారు. నువ్వు పార్లమెంటుకి వెళ్ళి ఏదో మంచి పని చేస్తావు. మా శారదాంబ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే నేను ఇంట్లో ఊరికే కూచోనా? బెజవాడలో నాకూ అంతో ఇంతో పేరు, ప్రతిష్టా ఉన్నాయి. నా మాటకూ విలువ ఉంది. అది నీకు ఉపయోగపడితే చాలని వచ్చేశాను’’ అన్నారాయన.
బెజవాడలో ఎన్నికల వేడి వేసవి కాలాన్ని ముందే తెచ్చింది. సరస్వతి, అన్నపూర్ణల ఆధ్వర్యంలో మహిళా బృందాలు పని చేస్తున్నాయి. సూర్యం అందరినీ ఆర్గనైజ్‌ చేసి నడిపించే పనిలో క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నాడు. శారదకు ప్రత్యర్థి కమ్యూనిస్టు పార్టీ నుంచి తమ్మిన పోతరాజు. అతనంటే శారదకు మొదటినుంచీ ప్రత్యేకాభిమానం. అతనికీ శారద అంటే గౌరవం. కానీ రాజకీయాలు ఇద్దరినీ ఎదురెదురుగా నిలబెట్టాయి. ఒకరోజు వారిద్దరూ ఎదురు పడ్డారు. మామూలుగా మాట్లాడుకుని ఒకరినొకరు అభినందించుకుని ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాలుగు రోజులకు అబ్బయ్య, సూర్యం కొన్ని కరపత్రాలు పట్టుకొచ్చారు. అన్నపూర్ణకు ఇచ్చారు. అవి చదివి అన్నపూర్ణ ముఖం పాలిపోయింది. పద్మ ఛీత్కారం చేస్తూ వాటిని నలిపేసింది.
‘‘ఇవి శారద కంటపడకుండా చూడాలి. చాలా బాధపడుతుంది’’ అంది అన్నపూర్ణ కంగారుగా. ‘‘ఆవిడ బాధ పడుతుందో, నవ్వుకుంటుందో, ఏం చేస్తుందో… ఈ కరపత్రాలు ఎలాగైనా ఆవిడ కంట పడతాయి. ఏ సభలోనో హఠాత్తుగా వీటి గురించి తెలిసే బదులు స్థిమితంగా వీటి గురించి తెలుసుకుని పబ్లిక్‌లో వీటి గురించి ఎట్లా రియాక్టవ్వాలో ఆలోచించుకోవటం తెలివైన పని’’ అన్నాడు అబ్బయ్య.
అతనే వాటిని శారద దగ్గరకు తీసుకువెళ్ళి ‘‘డాక్టర్‌ గారూ… ఇవి చూడండి. మీరొకసారి చూస్తే నేను చింపి అవతల పారేస్తాను’’ అని వాటిని అందించాడు.
శారద అవి తీసుకుని చూసింది.
కమ్యూనిస్టు పార్టీ కరపత్రాలవి. దానిలోని సమాచారం మాత్రం శారద ‘‘కాంట్రాక్టు పెళ్ళి’’ గురించిన పిచ్చిరాతలే. 1946 ఎన్నికల్లో కాంగ్రెస్‌ శారదపై బురద జల్లుతూ వేసిన కరపత్రాలకేమీ తీసిపోకుండా ఉన్నాయి.
శారద వాటిని చదివి పెద్దగా నవ్వేసింది. దూరం నుంచి చూస్తున్న అన్నపూర్ణ, పద్మ దగ్గరకొచ్చారు.
‘‘ఇప్పటివరకూ నాలో ఏమూలో కాస్త అశాంతి ఉండేది. అది కాస్తా పోయింది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ వాళ్ళు అందరూ ఒకటే ఆడవాళ్ళ విషయంలో. చాలా పెద్ద మార్పులు రావాలి. స్త్రీల సమానత్వాన్ని గౌరవించటం ఈ దేశంలో తేలిక కాదు. మనం దానికోసం చాలా పోరాడాలి. ఈ కరపత్రాలు ప్రజల్లో నా విలువను తగ్గించలేవు. ప్రజల్లో మార్పు వచ్చింది. రాజకీయ పార్టీలలోనే రావాలి’’ అంది.
సరిగ్గా అప్పుడే రామస్వామి గారు ఆ కరపత్రాలను పట్టుకుని వచ్చారు. ఆయన ముఖం బాధ, కోపం కలిసి ఎర్రబడిరది.
శారద ఆయన్ని కూర్చోబెట్టి ఆ కరపత్రాలను చేతిలో నుండి తీసి అవతల పడేసింది. ‘‘నువ్వింత స్థిమితంగా ఎలా ఉన్నావమ్మా’’ అన్నాడాయన కంటనీరొక్కటే తక్కువగా. ‘‘వాళ్ళేదో కోతిపని చేశారని మనం కొండముచ్చులమవుదామా చెప్పండి’’ అంది శారద నవ్వుతూ.
‘‘ఇది కోతిపని, అల్లరి చిల్లరి పని కాదమ్మా. అమానుషమైన పని.’’
‘‘మనుషులుగా ఉండటం చాలా కష్టమైన పని. గాలిబ్‌ అనే కవి ఎంత బాగా చెప్పాడను కున్నారు…’’ శారద మాటలు ఆయన చెవికెక్కడం లేదు.
‘‘నీ మీద వాళ్ళకింత కోపం ఎందుకో నాకు తెలుసమ్మా. నువ్వు మేధావివి. మేధావి అయిన మహిళను మగవాళ్ళు సహించలేరు. ఎలాగయినా ఆమెను అల్లరిపాలు చేసి, చిల్లర కింద తీసి పారేసి, విలువ లేకుండా చేస్తేగాని వాళ్ళ కంటే అందివచ్చేది ఏముందమ్మా. ఆ రోజు కాంగ్రెస్‌ వాళ్ళు చేసిన పని ఇవ్వాళ వీళ్ళు చేశారు. అప్పుడూ కొంతమంది నీ గురించి తప్పుగా మాట్లాడటం నాకు తెలుసు. వాళ్ళను అప్పుడు చివాట్లు పెట్టగలిగిన స్థితిలో ఉన్నాను. ఇప్పుడు అసహ్యించుకుంటున్నాను’’. మనసులోదంతా కక్కేస్తే గాని ఆయన శాంతించేలా లేడు.
‘‘ఒద్దు రామస్వామి గారూ, అసహ్యించుకోవద్దు. జాలి పడదాం. ఇన్నాళ్ళ కమ్యూనిస్టు
ఉద్యమంలో వాళ్ళు అతి చిన్న విషయాలు కూడా నేర్చుకోలేదే అని జాలి పడదాం. నవ్వగలిగితే మరీ మంచిది. ఇది చాలా అల్లరి చిల్లర విషయం. దీన్ని మనసులోకి తీసుకుని బాధపడేంత ప్రాముఖ్యత ఇవ్వకండి.’’
‘‘ఇది నీ వ్యక్తిగత విషయం కాబట్టి దాన్నలా తీసిపారెయ్యకపోతే లాభం లేదనుకుంటున్నావు. మంచిదే. కానీ తోటి మనుషులుగా మేమెట్లా ఊరుకోవాలమ్మా. ఊరుకుంటే మేం మనుషులని పించుకుంటామా?’’
‘‘ఇప్పుడు మనకు ఊపిరాడని పనులున్నాయి. ఈ విషయంతో ఊపిరాడకుండా చెయ్యాలనే, మనల్ని దెబ్బకొట్టాలనే వాళ్ళిలా చేశారు. మనం మరీ అంత బలహీనులం కాదని చెప్పటమే మంచిది. దీన్నింతటితో ఒదిలేద్దాం.’’
‘‘అక్కయ్య చెప్పినట్లు చెయ్యండి రామస్వామి గారు. పదండి చాలా పనులున్నాయి. ఈ పిచ్చి మాటలకు సమయం లేదు మన దగ్గర’’ అన్నాడు సూర్యం.
శారద ఆ కరపత్రాలను అవతల విసిరేసి ఎన్నికల ప్రచారానికి బయలుదేరడంతో అన్నపూర్ణ గుండెల మీద నుంచి పెద్ద బరువు తగ్గింది. పద్మ కూడా కాస్త చల్లబడిరది.
కానీ శారదను పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేసి, అది పార్టీకి మంచిదని బలవంతపెట్టి, ఇవాళ ఆ పెళ్ళిని అడ్డంపెట్టి శారదమీద దుష్ప్రచారం చేస్తున్న కమ్యూనిస్టులపై అన్నపూర్ణకు వచ్చిన కోపానికి అంతులేదు. ఎన్నికలైనన్ని రోజులూ ‘‘కమ్యూనిస్టులలా ఎలా చేస్తారు?’’ అని సతాయిస్తూనే ఉంది.
‘‘కమ్యూనిస్టులు పైనుంచి దిగొచ్చారా? వాళ్ళూ మనుషులే. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకొంటారు.’’
‘‘కానీ మరీ ఇంత అన్యాయమా?’’
‘‘కమ్యూనిస్టులు ఇంత అన్యాయం చెయ్యకూడదని నీ కోరిక కదూ అన్నపూర్ణా. మనందరికీ తెలిసో తెలియకో కమ్యూనిజం మీద ఆశ ఉంది. కమ్యూనిస్టులంటే ఇలా ఉండాలనే ఊహ ఉంది. వాళ్ళు ఆదర్శాలను పాటిస్తారనే నమ్మకం ఉంది. కానీ విషయమేంటంటే కమ్యూనిజం సామాన్యమైన సంగతి కాదు. ఈ కమ్యూనిస్టులంతా భూస్వామ్య భావజాలం నుంచి వచ్చినవారే. దాంతోనే వారి యుద్ధం. కానీ అది వాళ్ళకే తెలియకుండా వాళ్ళను చుట్టేసుకుంటుంది. దాన్ని ఒదిలించుకోవటం తేలిక కాదు. వాళ్ళ నుంచి ఇప్పుడే మరీ ఎక్కువ ఆశించలేం… భవిష్యత్తు సంగతి తెలియదు’’ అబ్బయ్య ఎంత చెప్పినా అన్నపూర్ణ మనసులోంచి ‘‘మరీ ఇంత అన్యాయమా’’ అన్న ప్రశ్న పోలేదు.
రెండు పార్టీల ప్రచారాలూ ఒకదానికొకటి తీసిపోకుండా జరుగుతున్నాయి. ఎన్నికల తేదీ వచ్చేసింది. వెళ్ళిపోయింది.
దుర్గాబాయి కొన్ని వందల ఓట్ల తేడాతో ఓడిపోతే శారదాంబ కొన్ని వందల ఓట్ల తేడాతో గెలిచింది.
కమ్యూనిస్టుల కంచుకోట పగలగొట్టామని, కాంగ్రెస్‌ సంబరపడిరది. కాంగ్రెస్‌ సంబరానికి కమ్యూనిస్టు పార్టీ నిర్మాత అయిన తను కారణమవటంలోని విచిత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో అలిసిపోయింది శారద. పార్లమెంటు సభ్యురాలిగా వెళ్తున్న బెజవాడ మహిళగా ఆమెను ఎంతోమంది గౌరవించారు.
… … …
ప్రమాణ స్వీకారానికి ఢల్లీి వెళ్ళింది శారద. 30వ దశాబ్దంలో కలిసి పనిచేసిన భారత జాతీయ మహిళా సంఘం నాయకులు చాలా సంవత్సరాల తర్వాత శారదను చూసి సంతోషించారు.
విశాలాక్షి కుటుంబమంతా వచ్చి శారదను అభినందించారు.
‘‘నువ్వు కొంపదీసి మంత్రివై మా డిపార్టుమెంటుకొచ్చి పెత్తనం చేస్తావేంటి?’’ అంది విశాలాక్షి నవ్వుతూ.
‘‘ఆ ప్రమాదం లేదులేవోయ్‌. పార్లమెంటులో అనుభవం లేకుండా ఒక్కసారే మంత్రినెలా అవుతాను? చూద్దాం ఏం చేద్దామో…’’ నిష్కల్మషంగా అంది శారద.
బెజవాడ తిరిగి వచ్చిన శారదను పనులు ముంచెత్తాయి.
ప్రాక్టీసు, నియోజకవర్గ సభ్యులను తెలుసుకోవటం, వచ్చినవాళ్ళతో మాట్లాడి పంపటం, తన ఆఫీసు నుంచి జరగాల్సిన పనులు జరిగేలా చూడడం… వీటన్నిటితో ఒక్క క్షణం తీరటం లేదు.
మూర్తి హైదరాబాద్‌లో తన ప్రాక్టీస్‌ పెంచుకునే పనిలో పడిపోయాడు.
పార్లమెంటులో హిందుకోడ్‌ బిల్లు పాస్‌ అయినా దాని గురించి చేయాల్సింది చాలా ఉంది. దుర్గాబాయి, శారద ఆ కమిటీలో
ఉండి దానికి మెరుగులు దిద్దే పనిలో పడ్డారు.
ప్రజారోగ్యం గురించిన పాలసీలను సమీక్షించి వాటిని మరింత ప్రజోపయోగకరంగా రూపొందించే కమిటీలో కూడా శారద మనసంతా పెట్టి పనిచేస్తోంది.
పని ఎంత చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండటం మొదట్లో శారదకు మింగుడు పడలేదు.
హిందూకోడ్‌ బిల్లు చట్టం చేయటానికి ఏర్పడిన కమిటీలో సనాతనవాదుల సంగతలా ఉంచి అంతో ఇంతో ఆలోచిస్తారనుకున్నవారు కూడా ఎంతగా సంప్రదాయాలలో కూరుకుపోయారో చూస్తుంటే శారదకు మతిపోయేది.
స్త్రీలకు మరింత వెసులుబాటు కలిగించే ఏ చిన్న సవరణను ప్రతిపాదించినా అందరూ హాహాకారాలు చేసేవారు, లేదా మౌనమన్నా పాటించేవారు.
బిల్లుని వివాహం, విడాకుల విషయాల్లో స్రీలకు, పురుషులకు స్వేచ్ఛనిచ్చేలా చేయటానికి శారద చేసిన ప్రతి ప్రతిపాదననూ తిరస్కరించారు.
ఆ చట్టం వల్ల స్త్రీలకు ఒనగూడే ప్రయోజనం అతి తక్కువని శారదకు అర్థమైంది. అది దుర్గాబాయితో తప్ప ఎవరితో చెప్పినా కనీసం సానుభూతి కూడా దొరకలేదు.
విశాలాక్షి ఒకరోజు శారదను తన ఇంట్లో భోజనానికి పిల్చింది. శారదకు వెళ్ళాలనిపించలేదు గానీ విశాలాక్షి ఒదలలేదు.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.