మోహనరాగం – దినవహి సత్యవతి

సముద్రతీరాన స్థితమై, ప్రకృతి అందాలకు అలవాలమైన, విశాల నగరం విశాఖపట్నం. నగరంలో అభివృద్ది చెందుతున్న ప్రాంతం మధురవాడలో అధునాతనంగా కట్టిన నూతన గృహ సముదాయంలో, విశాల ప్రాంగణం, చుట్టూరా పరిమళాలు గుబాళిస్తున్న పూలతోటలో కనువిందు చేస్తున్న ఒక డ్యూప్లెక్స్‌ ఇల్లు.

ఒక సంవత్సరం క్రితం గృహప్రవేశం చేసుకుని కొత్త ఇంట చేరారు ప్రభాస్‌, ధరిత్రి దంపతులు.
తెల్లవారనున్నదని సూచిస్తూ తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి.
ఆ రోజు ఆదివారం. ఆఫీసు ఉంటే తప్ప సెలవు రోజున ఆరునూరైనా పదిలోపు నిద్ర లేవడు ప్రభాస్‌. బద్ధకంగా నిద్రలో ప్రక్కకి ఒత్తిగిలి, భార్యని వెచ్చని కౌగిట్లోకి చేర్చి పరవశిద్దామని, చేయి వేసిన ప్రభాస్‌కి పక్క ఖాళీగా తగిలింది.
‘అబ్బబ్బ ఈ ధరికి చాదస్తం రోజురోజుకీ ఎక్కువైపోతోంది. అయ్యో ఆదివారం మొగుడు మహారాజుకి సెలవే కదా మరి కాసేపు ప్రక్కన పడుకుని సేదదీరుద్దామే అనుకోదు ఏం మనిషో ఏమిటో?’ విసుక్కున్నాడు.
మనసూ, శరీరం భార్య పొందు కోసం పరితపిస్తుంటే ‘‘ధరీ ఎక్కడున్నావోయ్‌?’’ బిగ్గరగా పిలిచాడు.
సరిగ్గా అదే సమయానికి, చేతిలో సూట్‌కేసుతో శబ్దం చేయకుండా తలుపు తీయబోతున్న ధరిత్రికి భర్త పిలుపు వినిపించింది. మరోసారీ మరోసారీ అయితే ఆ పిలుపుకి పులకించిపోయేదే!
కానీ ఇప్పుడు, జీవితమనే చదరంగపు ఆటలో, భర్త చేతిలో పావుగా మారకూడదని నిర్ణయించుకున్నాక, ప్రభాస్‌ పిలుపు విని క్షణకాలం చెదరబోయిన మనసుని కుదుటపరచి, గుండె చిక్కబట్టుకుని, గడపదాటి అడుగు బయటకి వేసింది…
… … …
కిటికీలోంచి పడకగదిలోకి పరుచుకున్న సూర్యకిరణాల వేడికి చిరు చెమటలు పట్టి నిద్రాభంగమైంది ప్రభాస్‌కి. చూస్తే ఎ.సి. కూడా ఆగిపోయింది. ‘ఛ ఈ కరెంట్‌ కూడా ఇప్పుడే పోవాలా. ప్చ్‌…’ టైం చూశాడు.
పదకొండు కావొస్తోంది.
‘అబ్బా ఇంతసేపు పడుకున్నానా?’ బద్దకంగా ఒళ్ళు విరిచి ‘‘ధరీ వేడి వేడి కాఫీ ఇవ్వవోయ్‌’’ భార్యకి వినపడేలా అరిచాడు.
ఉదయం నుంచే భార్య ప్రక్కన లేదన్న విషయం ప్రభాస్‌ మస్తిష్కంలో లిప్తపాటు మరుగునపడిరది.
స్నానాదికాలు ముగించి హల్లోకి వచ్చి పది నిముషాలైనా కాఫీ వస్తున్న సూచనలు కనబడలేదు సరికదా అసలు వంటగది నుంచి ఎటువంటి అలికిడి వినపడక ‘‘ధరీ కాఫీ’’ పిలుస్తూ లోపలికి వెళ్ళాడు.
ధరిత్రి కనిపించలేదు.
కడుపులో ఆకలి నకనకలాడుతుంటే తానే కాఫీ కలుపుకుని త్రాగుతూ ‘ఎక్కడికెళ్ళి ఉంటుందబ్బా’ అనుకుంటూంటే చటుక్కున జ్ఞప్తికి వచ్చింది ఉదయం తను పిలిచినా ఆమె పలకలేదన్న విషయం!
సగం త్రాగిన కప్పు టీపాయ్‌ మీద పెట్టి గబగబా ఇంటా బయటా వెతికాడు. ఎక్కడా ధరిత్రి జాడలేదు.
‘ఆ… అదీ! మునుపోసారి ఇలానే అత్యవసరంగా వెళ్ళాల్సి వస్తే చీటీ వ్రాసి నా దిండు వద్ద పెట్టింది’ గబగబా అక్కడ చూశాడు కానీ అలాంటిదేమీ కనిపించలేదు.
నిరాశ చెంది భార్య సెల్‌కి ఫోన్‌ చేశాడు. స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. ఆమెపై చిరాకు, కోపం ఉప్పెనలా వచ్చి తలనెప్పి మొదలైంది. సోఫాలో కూలబడి మునివేళ్ళతో నొసలు రుద్దుకుంటుండగా అతడి దృష్టి టి.వి. సెట్‌టాప్‌ బాక్స్‌ క్రింద గాలికి రెపరెపలాడుతున్న ఎరుపు కాగితంపై పడిరది.
‘‘ఎన్నిసార్లు చెప్పినా బిల్లు కాగితాలు ఎక్కడపడితే అక్కడ వదిలేస్తుంది. ఏమైనా అంటే ఇంటి పనంతా ముగిశాక అలాంటివన్నీ తీరుబడిగా సర్దుతాను కదా మీకెందుకు అంత హడావిడి?’ అంటూ చిత్రమైన లాజిక్‌ చెప్తుంది’ అనుకుంటూ విసురుగా వెళ్ళి కాగితం సర్రున లాగాడు. అది తాననుకుంటున్నట్లు బిల్లూ గిల్లూ కానే కాదు వేరేదో!
‘ఇదేమిటి ఇదేదో ఉత్తరంలా ఉందే? ఇది ధరిత్రి చేతివ్రాత! ఏదైనా సూటిగా చెప్పొచ్చుగా ఉత్తరం వ్రాయడమెందుకో? ఇంతకీ ఏం వ్రాసిందో?’ ఆత్రంగా చూపులు అందులోని అక్షరాల వెంట పరిగెత్తాయి…
ప్రియమైన మీకు,
ఇలా ఉత్తరం వ్రాయడమెందుకో! అదేదో సూటిగా నాతోనే చెప్పొచ్చుగా అనుకుంటున్నారు కదూ! నాకు తెలుసు మీ ఆలోచనలు. కానీ నా మనసులో ఏముందో తెలుసుకోవాలని మీరెప్పుడూ ప్రయత్నించలేదు. నా అంతట నేనే చెప్పడానికి ప్రయత్నించి ఓడిపోయాను. అందుకనే ఈ పద్ధతి ఎంచుకున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. కారణం ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. కొన్ని పనులు మీరు తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో లేక తెలిసినా తెలియనట్లు ప్రవర్తిస్తున్నారో మాత్రం నాకు తెలియట్లేదు. కాలం గడిచేకొద్దీ అన్నీ అవే సర్దుకుంటాయిలే అని ఇన్నాళ్ళూ వేచి చూశాను. కానీ మీ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు సరికదా ఇకపై వస్తుందన్న ఆశ సన్నగిల్లింది. నా సహనం హద్దులు దాటి నేను గడప దాటాల్సి వచ్చింది ఇలా! మీ ధరిత్రి
‘‘అయ్యో ధరీ ఇలా చెప్పాపెట్టకుండా నన్ను వదిలి వెళ్ళిపోవడం నీకు భావ్యమేనా! నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నానే, అయినా ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నావు’ ఉత్తరం హృదయానికి హత్తుకున్నాడు. ఎంత బుర్ర చించుకున్నా తన అపరాథమేమిటో గ్రహింపుకి రాలేదు.
అసలది అపరాథమని అనిపిస్తే కదా గ్రహింపుకి రావడానికి! ధరిత్రి విన్నపాలను పట్టించుకోనట్లే తన ఆత్మఘోషనీ పెడచెడిన పెట్టాడు. భార్య తనని వదిలి వెళ్ళిపోయిందన్న బాధ మనసును పిండేస్తుంటే విలపిస్తూ సోఫాలో కుప్పకూలాడు ప్రభాస్‌.
.. … …
ఇల్లు విడిచి ఆటో ఎక్కి విశాఖపట్నం బస్టాండ్‌ చేరుకుని, ఏలూరు మీదుగా విజయవాడ వెళ్ళే బస్సెక్కి, కిటికీ ప్రక్కన సీటులో కూలబడి అలసటగా తల వెనక్కి వాల్చిన ధరిత్రి కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. ఇప్పటివరకూ తాను గర్భవతినని తెలిశాక, ప్రభాస్‌ తోడు వచ్చి అమ్మా వాళ్ళింట్లో దిగబెడతారనీ, అతన్ని విడిచి ఉండడం తనకు బహు కష్టతరమవుతుందనీ అనుకుంది. కానీ ఈ ప్రయాణం ఇలా చేయవలసి వస్తుందని, ఇక తిరిగి వెళ్ళకూడదని నిశ్చయించుకుని ఆ ఇంటి గడప దాటవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ధరిత్రి ఆలోచనల్లో గత జ్ఞాపకాలు సుడులు తిరిగాయి.
… … …
జనార్ధన్‌, లలితల ఏకైక పుత్రుడు ప్రభాస్‌. చక్రవర్తి, కౌసల్య దంపతుల సంతానం ధరిత్రి. సార్థక నామధేయురాలు. సహనం ఆమెకు పెట్టని ఆభరణం.
ధరిత్రి, ప్రభాస్‌ పదవ తరగతి దాకా కలిసి చదువుకున్నారు.
ఇరువురి మధ్యనా స్నేహాన్ని మించిన బంధం చిగురించి మొగ్గతొడిగే దశలో, ఉద్యోగరీత్యా ఇరు కుటుంబాలూ వేర్వేరు ప్రాంతాలకి తరలివెళ్ళాయి.
కొద్దికాలం రాకపోకలు, ఫోన్‌ కాల్స్‌ సాగినా కాలక్రమేణా అవీ తగ్గిపోయాయి.
ప్రభాస్‌ ఇంజనీరింగ్‌ చదివి ఒక బహుళ జాతీయ సంస్థలో మేనేజర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు. ధరిత్రి తెలుగులో ఎం.ఎ. చేసి, విజయవాడలోని ఒక కాలేజీలో లెక్చరర్‌గా చేరింది.
ప్రభాస్‌ ఉద్యోగరీత్యా తరచూ ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. అలాంటి ఒక సందర్భంలో యాధృచ్ఛికంగా ధరిత్రి తటస్థపడిరది. ఆ కలయికలో మదిలో నిక్షిప్తమైయున్న చిన్ననాటి స్నేహపు మధుర జ్ఞాపకాలు తలపుకి వచ్చి పరవశం చెందారు.
ఇరు కుటుంబాల మధ్యనా మళ్ళీ స్నేహలత క్రొత్త చిగుర్లు తొడిగింది.
ప్రభాస్‌, ధరిత్రి పరస్పరం ఇష్టపడడంతో ఒక శుభముహూర్తాన వారి పెళ్ళి వైభవంగా జరిగిపోయింది. ‘నీ పుణ్యంకొద్దీ యోగ్యుడైన భర్త దొరికాడు. అవునూ! మీరిద్దరూ మంచి స్నేహితులు కూడానట కదా! ఇకనేం నీ మనసెరిగి మసలుకుంటాడులే. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడులే’ లాంటి పొగడ్తలు ధరిత్రి మనసుని ఆనందడోలికలూగించాయి.
‘అవును! చిన్నప్పటినుంచీ మేమిద్దరం ఒకరినొకరం తెలుసును. ప్రభాస్‌ నిజంగా ఎంతో మంచివాడు. నిజంగానే నేనెంతో అదృష్టవంతురాలిని’ మురిసిపోయింది ధరిత్రి.
మనసులు కలిసిన ఇద్దరికీ మూడు రాత్రులూ తొలిరాత్రులే అయ్యాయి.
భర్త చిలిపిచేష్టలు, సరససల్లాపాలు తలుచుకుని ముసిముసిగా నవ్వుకుంటూ… అంతలోనే తననెవరైనా గమనించి పిచ్చిదనుకుని అపార్థం చేసుకోగలరని తొట్రుపాటుతో, నవ్వుని అధరాలు దాటనీయక అదిమిపెడుతూ… ప్రభాస్‌ ప్రేమానురాగాల వర్షపు జల్లులో తడిసి ముద్దయ్యింది ధరిత్రి.
ప్రభాస్‌ కూడా ధరిత్రి సాంగత్యానందామృతాన్ని గ్రోలి పరవశించాడు.
కోటి ఆశలతో విశాఖపట్నంలోని క్రొత్త ఇంట్లో తమ దాంపత్య జీవితం ఆరంభించారు ధరిత్రి దంపతులు. సెలవు ముగిసి ఆఫీసుకి వెళ్ళనారంభించాడు ప్రభాస్‌.
ఒకనాడు విపరీతమైన కడుపు నెప్పి అనిపించి గబగబా పని ముగించుకుని అలసటగా మంచంపై వాలిన ధరిత్రికి, మళ్ళీ సాయంత్రం ప్రభాస్‌ ఆఫీసునుంచి ఇంటికి వచ్చినప్పుడు మెలకువ వచ్చింది.
అలసట ప్రక్కన పెట్టి నెమ్మదిగా లేచి కాఫీ కలిపిచ్చింది.
‘ఏమైంది ధరీ అలా ఉన్నావు?’ నీరసంగా కనిపిస్తున్న భార్యని అడిగాడు.
కారణం విన్నాక ప్రభాస్‌ ముఖంలో కదలాడిన ఛాయామాత్రపు నిరాశా వీచికలు ధరిత్రి దృష్టిని సోకలేదు. రాత్రి భోజనాలై నిద్రకుపక్రమించాక ఎప్పటిలాగా తనని దగ్గరకు తీసుకోబోయిన భర్తని సున్నితంగా వారిస్తూ ‘‘వద్దండీ ఇవాళ నాకు ఒంట్లో బాగోలేదు, ప్లీజ్‌’’ అంది.
‘‘మరేం ఫరవాలేదులెద్దూ! అయినా ప్రతినెలా ఉండేదేగా! ఆ వంకన నువ్వు దూరంగా ఉంటే నా గతేం కావాలి? కాసేపు ఓర్చుకుందూ. నిన్ను కలవకుండా నాకు నిద్రపట్టదోయ్‌’’ తపనగా ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ‘పోనీలే పాపం పెళ్ళైన క్రొత్త కదా! నెమ్మదిగా అర్థం చేసుకుంటారులే’ అనుకుని అతడి చేతులు కాంక్షగా ఎక్కడెక్కడో తడుముతుంటే తియ్యటి భావాలను అణచుకోను అసాధ్యమై, నొప్పిని పళ్ళబిగువన భరిస్తూ, అతడిలో ఐక్యమైంది ధరిత్రి.
‘మా దాంపత్య జీవితానికి ఇవాళ అర్థసంవత్సర పుట్టినరోజు. అయితే అనుకున్నట్టుగా నేను నిజంగా అదృష్టవంతురాలినేనా?’ ఆలోచనలో పడిరది.
‘గడచిన కాలంలో ప్రభాస్‌ పడకగది ప్రవర్తనలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ఎప్పటికప్పుడు నా బాధను అర్థం చేసుకోకుండా తన సుఖం చూసుకుంటున్నాడు. ఎన్ని విన్నపాలు చేసినా పెడచెవిన పెడుతున్నాడు. అన్నివిధాలా ఉత్తముడైన అతడిలో ఇటువంటి ప్రపర్తన ఏమిటో?’
రేయీపగలూ మనసుని కమ్మేసి అతలాకుతలం చేస్తున్న ఆలోచనలను తప్పించుకోవాలంటే తనకేదైనా వ్యాపకం ఉండాలని నిర్ణయించుకుని ఆ మాటే ప్రభాస్‌తో చెప్పింది.
‘‘నువ్వు కష్టపడడం నాకిష్టం లేదోయ్‌. అయినా ఇప్పుడు నీకేం తక్కువైందని ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నావు? కాలక్షేపం కోసమే అయితే ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ ప్రయత్నించు. ఏదీ వద్దంటావా ఇదిగో ఇవాళే నీ పేరున ఒక క్రెడిట్‌ కార్డ్‌ తీసిస్తాను. హాయిగా నీ ఇష్టమొచ్చినంత ఖర్చు పెట్టుకో’’ ప్రేమగా నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు.
‘‘నాపై మీకున్న ప్రేమ తెలుసు ప్రభాస్‌. అయినా చదివిన చదువు సార్థకం చేసుకోవాలని ఉంది. ఏదైనా కాలేజీలో లెచ్చరర్‌గా చేరతాను. ప్లీజ్‌.’’
‘‘సరే! నీకంతగా ఉద్యోగమే చేయాలనుకుంటే ఓకే! నీ ఆనందమే నా మహాద్భాగ్యం’’ చిలిపిగా భార్య చెక్కిలి నిమిరాడు. లెక్చరర్‌ ఉద్యోగంలో చేరి నెల రోజులైంది.
… … …
కాలేజీకి దసరా సెలవలు. ప్రభాస్‌ ఆఫీసుకి వెళ్ళిపోయాక, అతడి గది సర్దుతుంటే ఒక అరలో కనిపించిన పుస్తకం చూసి షాకయ్యింది!
అన్నింటికంటే వెనకాలగా, ఎవరికీ కనపడకూడదని దాచినట్లుగా అనిపించిన ఆ పుస్తకం పలుమార్లు చదివినట్లుగా నలిగిపోయి జీర్ణావస్థలో ఉంది.
కొన్ని పుటలలో అక్కడక్కడా కొన్ని వాక్యాలు ఎర్రపెన్నుతో గుర్తుపెట్టి ఉన్నాయి. అవి చదివిన ధరిత్రి మనసుని అవ్యక్తమైన భయం ఆవహించి మెదడు మొద్దు బారింది.
‘ఊ… ఇదన్నమాట, ఆ విషయంలో ప్రభాస్‌ ప్రవర్తన వెనక ఉన్న చిదంబర రహస్యం!’.
ఈయనకి ప్రకృతి సహజంగా ఉండవలసిన దానికంటే కోరికలు కొంచెం అధికమన్నమాట. కొంతమందికి అలా ఉంటుందని విన్నాను. అది సమస్య కాదు కానీ నాకు ఒంట్లో బాగోలేనప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా, ఊహు! గత ఆర్నెల్లుగా చూస్తున్నాను, అంతటి విచక్షణ ఉన్నట్లు అనిపించలేదు. తనకి కావలసినప్పుడల్లా కలవాలని ఒత్తిడి చేస్తాడు, వద్దంటే మూర్ఖంగా వాదిస్తాడు.
ప్రభాస్‌ ప్రవర్తనలో నాకు తెలియని కోణమిది. పెళ్ళికి ముందు ఎంత పరిచయమున్నా ఇటువంటి విషయాలు ఎలా తెలుస్తాయి. హు! దీర్ఘంగా నిట్టూర్చింది.
‘అయినా ఒకసారి వద్దు అంటే వద్దనే! అది ఎవరైనా సరే, చివరికి భార్యయినా! కట్టుకున్న పెళ్ళాన్ని కోరిక తీర్చుకునే సాధనమని భావించడం తగునా? ఆమెకంటూ కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు, బాధలు
ఉంటాయని అనిపించదా ఈ మగవాళ్ళకి?’ ఆలోచిస్తుంటే ఆవేశానికి లోనైంది ధరిత్రి. ప్రభాస్‌ ప్రవర్తన రోజురోజుకీ నరకప్రాయమవుతోంటే ‘ఇక లాభం లేదు. ఈ విషయమై ఏదో ఒకటి చేయాల్సిందే’ అనుకున్నాక, ధరిత్రి ఆలోచనలు ఒక రూపుదిద్దుకున్నాయి.
ఒకరోజు సాయంత్రం ఆఫీసునుంచి వస్తూ వస్తూ పూలచెండు తెచ్చి భార్య చేతికిచ్చి చిలిపిగా కన్నుగీటి హుషారుగా ఈలవేస్తూ ఫ్రెష్‌ అవడానికి వెళ్ళాడు ప్రభాస్‌. భర్త ఉత్సాహం వెనుక దాగున్న కారణం అర్థమై ఆనందానికి బదులు దుఃఖం తన్నుకొచ్చింది ధరిత్రికి.
చేతిలో పూలదండ తనని కాటు వేయబోయే పాములా అగుపించింది.
అసలు ఈ మధ్య రాత్రవుతోందంటేనే భయంతో ఒళ్ళంతా జలదరిస్తోంది.
భర్తలో మొదట కనిపించిన అనురాగం, ఆప్యాయత స్థానంలో తన పంతం నెగ్గాలి, తన కోరిక తీరాలి అన్న మూర్ఖత్వం స్పష్టంగా గోచరిస్తోంది ధరిత్రికి. దైవం ఆమె బాధని అర్థం చేసుకున్నాడా అన్నట్లు ధరిత్రి నెల తప్పింది.
ఆ శుభవార్త విని ప్రభాస్‌ ఆనందం మిన్నంటింది. భార్యని అభినందనలతో ముంచెత్తాడు.
ఎటువంటి బరువులు ఎత్తవద్దనీ, కావాలంటే ఇంటి పనిలో సాయానికి మనిషిని కుదుర్చుకోమనీ చెప్పాడు. పుట్టబోయే బిడ్డకోసం సకల సౌకర్యాలూ ఏర్పరచడంలో నిమగ్నమయ్యాడు.
ధరిత్రి ఆరోగ్యం నాజూకుగా ఉంటోంది. చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది డాక్టర్‌.
‘నాకోసం కాకపోయినా పుట్టబోయే బిడ్డని దృష్టిలో ఉంచుకునైనా ప్రభాస్‌ నన్ను అర్థం చేసుకుని ప్రవర్తన మార్చుకుంటారు’ అనుకున్న ధరిత్రి ఆశలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.
‘‘నేను కొన్ని రోజులు అమ్మ దగ్గర ఉండి వస్తాను’’ మర్నాడు ఫలహారాలప్పుడు యథాలాపంగా చెప్పింది.
గతుక్కుమని ‘‘నువ్వు లేకపోతే నాకు తోచదు ధరీ!’’ ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు.
భర్త మాటల్లో ధ్వనించిన గూఢార్థానికి ‘ఏం చేయాలి? ఈ బాధాకర పరిస్థితులలోంచి ఎలా బయటపడాలి? అతడికి నేనంటే ప్రేమ లేకపోతే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సులభతరమయ్యేది. అన్నీ అర్థం చేసుకుని సహకరిస్తాడు ఈ ఒక్క విషయంలో తప్ప. అలా అని చిరుతిళ్ళకి ఆశపడే రకం కాదు ఇంటి భోజనమే శ్రేష్టమని నమ్ముతాడు. బాధాకరమైన విషయమేంటంటే అది తన హక్కుగా భావిస్తాడు. ఇతడిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. ఇది నా అదృష్టమా, దురదృష్టమా?’
‘‘ఏమోయ్‌ నన్నెదురుగా పెట్టుకుని ఏమిటా పరధ్యానం? నువ్వెక్కడికీ వెళ్ళడం లేదు. కావాలంటే అత్తయ్య వాళ్ళనే ఇక్కడికి రమ్మందాం’’ ఆర్డర్‌ చేసినట్లుగా చెప్పి ఫలహారం ముగించి లేచాడు ప్రభాస్‌.
‘అమ్మా వాళ్ళు ఇక్కడికి వచ్చినా అతని ప్రవర్తనలోనూ, నా జీవితంలోనూ మార్పు మాత్రం రాదుగా. ఇతడి మూర్ఖత్వంతో పుట్టబోయే బిడ్డకి ఏదైనా హాని జరిగితే?’ భయానకమైన ఆ ఊహకే ముచ్చెమటలు పట్టి అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది.
… … …
ధరిత్రికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా సమాధానం రాకపోయేటప్పటికి అత్తమామలకి చేశాడు ప్రభాస్‌. అప్పటికే స్నేహితురాలిని చూసి వస్తానని కూతురు చెప్పింది కనుక ఆ విషయమే తెలియచేశారు అల్లుడికి.
అయితే ధరిత్రి తానెక్కడికి వెళ్ళేదీ ప్రభాస్‌కి చెప్పలేదని తెలిసి ఆశ్చర్యపోయారు.
ఫోన్‌ చేసి విషయమేమిటని అడుగుదామనుకుని కూడా కూతురు అతనికి చెప్పకపోవటం వెనుక ఏదో బలమైన కారణమే ఉంటుందనిపించి, ఆ ప్రయత్నం విరమించుకున్నారు చక్రవర్తి, కౌసల్య.
‘స్నేహితురాలింటికి వెళతానంటే నేనేమైనా వద్దంటానా? అయినా అత్తమామలనే ఇక్కడికి పిలిపిద్దామని అన్నాక కూడా మాటమాత్రమైనా చెప్పకుండా వెళ్ళటంలో ధరి ఆంతర్యమేమిటి? అసలిప్పుడు ఇల్లు వదిలి వెళ్ళాల్సినంత అగత్యం ఏమొచ్చింది? ఎందుకిలా చేసింది? ఫోన్‌ చేయటం లేదు. నేను చేసినా కూడా ఎత్తడం లేదు’ అర్థంకాని వ్యథకు లోనయ్యాడు ప్రభాస్‌.
ధరిత్రి లేక రోజులు గడవడం కూడా కష్టంగా అనిపించి పోనీ తానే వెళ్ళి చూద్దామా అనిపించినప్పటికీ అహంకారం అడ్డొచ్చి, ‘కావాలని ఇల్లొదిలి వెళ్ళింది, రావాలనిపిస్తే మళ్ళీ ఆమే వస్తుంది. నువ్వెందుకూ వెళ్ళడం, నువ్వేం తప్పు చేశావని ఆమెను బ్రతిమలాడాలి?’ మనసు ఘోష పెట్టడంతో ఆగిపోయాడు.
… … …
ఆలోచనలలో మునిగి ఉన్న ధరిత్రి, అలికిడికి కళ్ళు తెరిచి ప్రక్క సీటులో కూర్చున్నామె దీక్షగా తనవైపే చూస్తుండడం గమనించి సర్దుకుని కూర్చుంది. ‘‘ఎందుకు ఏడుస్తున్నారు?’’ ఆమె స్వరంలో మార్దవం.
బొత్తిగా ముక్కూమొగమూ తెలియని వ్యక్తితో మనసులో జరుగుతున్న సంఘర్షణ ఏమని చెప్పగలదు? అయితే ఆమె ప్రశ్నించిన తీరుకో ఏమో మళ్ళీ దుఃఖం తన్నుకు వచ్చింది.
సంభాళించుకుని ‘‘మీరెక్కడిదాకా?’’ మాట మారుస్తూ మాట కలిపింది. అలా మొదలైన సంభాషణలో, ఆమె పేరు సుకన్య అనీ, ఏలూరులో ఉంటుందనీ, వృత్తిరీత్యా డాక్టర్‌ అనీ తెలిసింది. మాటల్లో బస్సు ఏలూరు చేరింది.
ఏలూరులో దిగి సుకన్యకి వీడ్కోలు చెప్పి, ఆటోలో స్నేహితురాలు విమల ఇంటికి చేరుకుంది.
‘‘హేయ్‌ ఏమిటీ చెప్పాపెట్టకుండా ఊడిపడ్డావు?’’ ఆశ్చర్యపోయింది విమల.
ధరిత్రి బదులిచ్చేలోగానే ‘‘ముందుగా అభినందనలు తల్లివి కాబోతున్నందుకు’’ గాఢంగా కౌగలించుకుంది.
‘‘థాంక్స్‌’’ ఆ మరుక్షణానే ధరిత్రి కళ్ళమ్మట గంగా ప్రవాహం తిరిగి మొదలైంది.
‘‘ఏమిటే ఇదీ, ఏమైందీ? నీ నుంచి చాలా రోజులనుంచి కబురు లేకపోతే ఉద్యోగంలో చేరావు కదా, పని ఒత్తిడిలో ఉన్నావేమో అనుకున్నాను. ఊరుకోవే, ఏడవకు. మనం సరిగ్గా వెతకాలే కానీ ఏ సమస్యకైనా పరిష్కారం తప్పక ఉంటుంది.’’
స్నేహితురాలి మాటలతో ఊరటచెంది ఫ్రెష్‌ అయి వచ్చి వేడి టీ త్రాగి, తెరిపినపడిరది ధరిత్రి.
‘‘ఊ… ఇప్పుడు చెప్పు’’ అంది విమల ప్రక్కనే కూర్చుంటూ.
స్నేహితురాలికి తన స్థితి పూసగ్రుచ్చినట్లు చెప్పాక మనసు తేలికైనట్లనిపించింది.
‘‘ఇదంతా నాతో ఎప్పుడూ మాటమాత్రమైనా చెప్పలేదేమే?’’
‘‘చెప్పి నిన్ను కూడా బాధపెట్టడమెందుకు?’’ ‘‘ఊ… కానీ ప్రభాస్‌ని చూస్తే అలా అనిపించడే?’’
‘‘అదేనే నా బాధ. అతడి గురించి ఎంతో తెలుసనుకున్న నాకే అతగాడి ఇటువంటి మనస్తత్వం గురించి తెలియట్లేదంటే ఇంక బయటివారి సంగతేం చెప్పాలి!’’ నిట్టూర్చింది. ‘‘నిజమేనే బాధపడకు. ఏం చేయాలో ఆలోచిద్దాం కానీ ముందిది చెప్పు నువ్విక్కడికి వస్తున్నట్లు మీ ఇంట్లో చెప్పావా?’’ ‘‘చెప్పాను. కారణం చెప్పకుండా నిన్ను కలుసుకుని ఇంటికి వస్తానని మాత్రం చెప్పాను.’’
‘‘మంచిపని చేశావు. పద కాస్త విశ్రాంతి తీసుకో.’’ భోజనాల సమయానికి ధరిత్రిని లేపి బలవంతాన నాలుగు ముద్దలు తినిపించింది.
భోజనం చేసి మళ్ళీ నిద్రపోయిన ధరిత్రికి మర్నాడు ఉదయం ఎనిమిదింటికి గానీ మెలకువ రాలేదు.
‘‘అమ్మాయిగారికి అలసట తీరిందా? ఇదిగో కాఫీ తీసుకో’’ కప్పు చేతికిచ్చి ‘‘నువ్వు చెప్పినదాన్ని బట్టి ఆలోచిస్తే, నువ్వొకసారి ఎవర్నైనా సైకాలజిస్టుని సంప్రదిస్తే ఉపయోగం ఉండవచ్చనిపిస్తోంది.’’ ‘‘ఆ ప్రయత్నం కూడా చేశానే’’
‘‘మరి?’’ ‘‘ప్రభాస్‌తో ఆ విషయమై చర్చించాలని చాలాసార్లు ప్రయత్నించాను కానీ అసలు నేను చెప్పేది వినడానికే సుముఖత చూపించలేదు. ఎంతసేపూ తన ధోరణి తనదే. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది’’ దీర్ఘంగా నిట్టూర్చింది.
‘‘పోనీ ముందు నువ్వొక్కదానివీ సైకాలజిస్టుని కలిసి నీ సమస్య చెప్పి చూడు’’ అని లేచి వెళ్ళి ఒక కార్డు తెచ్చి ధరిత్రికి ఇచ్చింది.
‘‘సుకన్య అని సైకాలజిస్ట్‌. నా సహోద్యోగిని సరళ ఈవిడని సంప్రదించగా, చక్కని పరిష్కారం చూపిందట.’’
‘‘సుకన్య…’’ పేరు చదివి ఆలోచిస్తున్న స్నేహితురాలిని చూసి ‘‘ఏంటీ ఆవిడ నీకు తెలుసా?’’
‘‘అహహ… ఇవాళ వస్తుంటే బస్సులో ఒకావిడ పరిచయమయ్యారని చెప్పానే. ఆమె పేరు కూడా సుకన్యే.’’
‘‘ఆవిడ సైకాలజిస్టా?’’ ‘‘తెలియదు.’’ ‘‘సర్లే ఆ పేరు గలవాళ్ళు ఇంకా ఉండరా ఏంటి?’’
‘‘నువ్వన్నదీ నిజమే.’’ ఆ తర్వాత స్నేహితురాళ్ళిద్దరూ ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. ఆ సాయంత్రమే ఏలూరు నుంచి, విజయవాడ, తన పుట్టింటికి వచ్చేసింది ధరిత్రి.
… … …
ఇంట్లో అడుగు పెడుతూనే అలసటగా ఉందని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది ధరిత్రి.
‘‘అమ్మాయి దేని గురించో కలవరపడుతోంది. దానిలో మునుపటి ఉత్సాహం లేదు. నీ సందేహాలతో ఊరికే దాన్ని విసిగించకు’’ భార్యని హెచ్చరించాడు చక్రవర్తి. ‘‘అవునండీ నాకూ అదే అనిపిస్తోంది.’’ నెమ్మదిగా మాట్లాడుకున్నా తల్లిదండ్రుల సంభాషణ చెవినపడి నిట్టూర్చింది ధరిత్రి. ఇంతలో ఫోన్‌ మ్రోగితే చూసింది. ప్రభాస్‌ నుంచి. ప్రక్కన పెట్టేసింది.
మర్నాడు ఫలహారాల సమయంలో, ఎప్పుడు గలగలా మాట్లాడి సందడి చేసే కూతురు ముభావంగా ఉండడం గమనించి ముఖాముఖాలు చూసుకున్నారు చక్రవర్తి దంపతులు. కూతురు వచ్చినప్పటినుంచీ అల్లుడి ఊసే ఎత్తకపోవటం ఇరువురికీ విస్మయం కలిగించింది.
కూతురికీ, అల్లుడికీ మధ్య కలతలు మొదలయ్యాయని చూచాయగా అర్థమై మనస్థాపానికి లోనయ్యారు.
రెండు రోజుల తర్వాత తనకీ, ప్రభాస్‌కీ మధ్య గత ఆరునెలలుగా జరిగింది తల్లికి విపులంగా చెప్పింది.
భార్య ద్వారా విషయం తెలిసి చక్రవర్తి ముఖం కోపంతో జేవురించింది. ‘‘కట్టుకున్న భార్య బాధను అర్థం చేసుకోలేని వాడూ ఒక మనిషేనా? ఆ పశువుతో బ్రతికేకంటే విడిపోవటం మంచిది’’ ఆవేశంతో ఊగిపోయాడు. ‘‘ఏమిటండీ అలా మాట్లాడతారు. ఎంతైనా అతను మన అల్లుడండీ. పిల్లనిచ్చిన వాళ్ళకి అంత ఆవేశం తగదండీ’’ భర్తని శాంతపరడానికి ప్రయత్నించింది కౌసల్య.
‘‘తల్లివయ్యుండి కూతురి బాధను అర్థం చేసుకోకుండా అల్లుడిని వెనకేసుకొస్తున్నావా? అసలు అల్లుడు చేసే దాష్టీకాన్ని దాంపత్య జీవితంలో రేప్‌, అంటే భార్య అనుమతి, ఇష్టం లేకుండా ఆమెను అనుభవించటం అంటారు. నే చెప్పేది వినడానికి అభ్యంతరకరంగా, చేదుగా ఉన్నా దాన్నలాగే పిలుస్తారు. ఇంతకాలం అమ్మాయి అంత బాధను దిగమింగుకోవడమే తప్పు. అమ్మాయికి చెప్పు అధైర్యపడవద్దనీ, వెంటనే విడాకులకి అర్జీ పెట్టమని.’’ ‘‘మీరు చెప్పినదంతా ఒప్పుకుంటానండీ. కానీ విడాకులు తప్ప మార్గమే లేదంటారా?’’
‘‘వేరే మార్గమా! ఏముంది కౌసల్యా? నీకు తెలిస్తే చెప్పు.’’
తల్లి చెప్పగా తండ్రి అభిప్రాయం తెలుసుకుని ప్రభాస్‌ నుంచి విడిపోవడమన్న ఆలోచనకే చిగురుటాకులా వణికిపోయింది ధరిత్రి.
… … …
ఆ మర్నాడు భోజనాలయ్యాక ‘‘నీ సమస్య గురించి నా అభిప్రాయాన్ని అమ్మద్వారా వినే ఉంటావు. ఇంతకీ అసలు నువ్వేమనుకుంటున్నావు ధరీ?’’ అడిగాడు చక్రవర్తి. ‘‘ప్రభాస్‌ చాలా మంచివారు నాన్నా. నేనంటే ఎంతో ప్రేమ. కానీ…’’
‘‘అంత మంచివాడైతే నీ బాధని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు?’’ కోపం పెల్లుబికింది చక్రవర్తి మాటల్లో.
‘‘ఇదిగో మీరు కొంచెం శాంతంగా ఉండండి. అమ్మాయిని కాస్త ఆలోచించుకోనివ్వండి.’’
‘‘నా సమస్యని తేలికగా కొట్టిపారేయకుండా సానుకూలంగా అర్థం చేసుకుని సహకరిస్తున్నందుకు థాంక్సమ్మా.’’
‘‘పిచ్చితల్లి’’ ప్రేమగా కూతురి బుగ్గలు పుణికింది కౌసల్య.
‘‘ధరీ ఇది నీ జీవితానికి సంబంధించిన సమస్య. నువ్వెలాంటి నిర్ణయం తీసుకున్నా మేము నీతో ఉంటాము’’ కూతురి భుజం తట్టి చెప్పాడు చక్రవర్తి. భోజనానంతరం తన గదికి వచ్చిన ధరిత్రిని మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి. ‘‘హు… నా జీవితం ఒక నాటకంలా తయారైంది. రోజుకొక రంగం, ఘడియకొక అంకం తెర లేస్తున్నాయి. నాటక పర్యవసానం సుఖాంతమా దుఃఖాంతమా?’’ బాధగా కణతలు నొక్కుకుంది. ప్రభాస్‌ ఫోన్‌ చేస్తూనే ఉన్నాడు. సమాధానం ఇవ్వకపోయినా అతనెలా ఉన్నాడోనని మనసు పీకుతూనే ఉంది.
విమల ఇచ్చిన అడ్రస్‌లోని డా॥సుకన్య, పిహెచ్‌డి, కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌ అనే బోర్డు చూసి లోనికి వెళ్ళింది.
రిసెప్షన్‌లో డాక్టర్‌ ఫోటో చూసి, బస్సులో పరిచయమైన వ్యక్తి, ఈ డాక్టర్‌ ఒక్కరేనని తెలిసి ఆశ్చర్యానందాలకి లోనైంది ధరిత్రి.
‘‘ఓ మీరా, రండి. కూర్చోండి. ఎలా ఉన్నారు?’’ ధరిత్రిని చూసి గుర్తుపట్టి నవ్వుతూ పలకరించింది సుకన్య.
‘‘బాగానే ఉన్నాను.’’ ‘‘చెప్పండి ఏమిటిలా వచ్చారు?’’
‘‘మీ సలహా కోసం వచ్చాను’’ తన వివాహం అయినప్పటినుంచి జరిగినదంతా వివరంగా చెప్పింది ధరిత్రి.
అంతా శ్రద్ధగా ఆలకించి ‘‘ఊ… ముందిది చెప్పండి మీ సమస్యని మీరు ఎలా చూస్తున్నారు?’’
‘‘ప్రభాస్‌తో వివాహం తర్వాత ఎంతో సంతోషంగా మొదలైన మా దాంపత్య జీవితం రాన్రానూ నా పట్ల నరకప్రాయంగా మారింది. మా కలయికలో నా ఇష్టాయిష్టాలూ, అనుమతితో పనిలేకుండా పోయింది. ప్రభాస్‌ మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. నాకే ఈ సమస్య ఎందుకు రావాలి?’’
‘‘ఇది చాలామందిలో ఉండే సమస్యే. మనకి సంతోషం కలిగించే పనులు చేసినప్పుడు డోపమైన్‌ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. అటువంటి ఇష్టమైన పనుల్లో సెక్స్‌ కూడా ఒకటి. అయితే ఈ చర్య హద్దు మించితే ఒక సమస్యలా పరిణమిస్తుంది. ప్రభాస్‌ విషయంలో అదే జరుగుతోంది.’’ ‘‘మరైతే ఈ సమస్యకి పరిష్కారం ఏమీ లేదా?’’
‘‘ప్రయత్నించాలే కానీ పరిష్కారం లేని సమస్యంటూ లేదు. కానీ అంతకుముందు ప్రభాస్‌తో మాట్లాడాలి. ఒకసారి వచ్చి నన్ను కలవమనండి.’’ ఈ విషయమై మునుపొకసారి తాను ప్రయత్నించి విఫలమైన సంగతి చెప్పింది.
‘‘మళ్ళీ ప్రయత్నించండి. అది తప్ప వేరే దారి లేదు కదా!’’
సుకన్యకి ధన్యవాదాలు తెలిపి ఇంటికొచ్చే దారిలోనే ప్రభాస్‌కి ఫోన్‌ చేసింది.
‘ఓ! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ధరి నుంచి ఫోన్‌’ పరమానందభరితుడై ‘‘ఏమిటోయ్‌ ఈ అన్యాయం. చెప్పకుండా వెళ్ళిపోయిందే కాక ఫోన్‌ చేస్తే ఎత్తడం మానేశావు. నేనే వద్దామనుకుంటే తెలుసుగా ఆఫీసు పనితో క్షణం తీరిక దొరకదని, అందులోనూ సెలవంటే ఇంకా కష్టమని! నేనంటే అసలు ప్రేముందా నీకు? మరీ అంత నిర్దయా! నువ్వు లేక ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు?’’ అడిగాడు మనసులో ఉత్సాహాన్ని మాటల్లో ఒలికిస్తూ. ఆఫీసు పనంటూ నెపం చెప్తున్నాడని, ప్రభాస్‌ తన తప్పు తెలుసుకోలేదని స్పష్టంగా అర్థమై, బాధగా నిట్టూర్చి ‘‘మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి’’ అని సుకన్య గురించి చెప్పి ‘‘మిమ్మల్ని కలవారన్నారు’’ అంది.
‘‘ఎందుకూ! నేను బాగానే ఉన్నానుగా. ఏంటిదీ మరీ సిల్లీగా, అసలిప్పుడు నాకేమయ్యిందని? నన్ను రచ్చకీడ్చాలనే నిర్ణయించుకున్నావా? నేను రాను కావాలనుకుంటే నువ్వే రా’’ ధరిత్రి మాట పూర్తి కాకుండానే ఫోన్‌ కట్‌ చేశాడు.
ప్రభాస్‌తో మాట్లాడి వారం దాటినా అటునుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో నిరాశ చెందింది.
ఆ మర్నాడే తల్లిదండ్రులకు సుకన్యని కలుసుకున్న విషయం, ప్రభాస్‌తో జరిగిన సంభాషణ చెప్పింది.
తనవైపు నుంచి, తమ వివాహం విచ్ఛిన్నం కాకూడదని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక, తన బాధని అర్థం చేసుకోలేని ప్రభాస్‌ని ఇంకా పట్టుకుని వ్రేలాడటం అనవసరమనిపించి లాయర్‌ ద్వారా విడాకుల నోటీసు ఇప్పించింది.
… … …
ధరిత్రి ఇల్లు విడిచి వెళ్ళిన కారణం చూచాయగా గ్రహించగలిగినా భార్యతో సుఖాన్ని ఆశించడంలో తప్పేముందో, దాన్ని ఘోర నేరంలాగా పరిగణించి యాగీ చేయడమెందుకో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఎప్పటికైనా తనే దిగివస్తుందిలే అని ఎదురుచూస్తున్న ప్రభాస్‌ విడాకుల నోటీసు అందుకుని షాక్‌ తిన్నాడు.
తనని చట్టపరంగా ఛాలెంజ్‌ చేసిన ధరిత్రిపై పీకలదాకా కోపం పొడుచుకొచ్చి ‘ఎంత పొగరు నన్నే సవాలు చేస్తుందా? ఆడదానికి ఇంత అహంకారం పనికి రాదు. చూస్తాను. ఇంతకింతా పగ తీర్చుకుంటాను’ అనుకుని వెంటనే తనకు తెలిసిన లాయర్‌ని సంప్రదించాడు.
‘భారతదేశంలో వివాహానంతరం జరిగే భార్యాభర్తల దాంపత్య సంబంధాన్ని రేప్‌ అనకపోయినా కొన్ని స్త్రీ సంక్షేమ
సంఘాలు ఈ విషయాన్ని తీవ్రమైన స్త్రీ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నాయనీ, ఒకవేళ ధరిత్రి కనుక ఆ మార్గంలో వెళ్ళి ఏదైనా చేయాలనుకుంటే అనవసరంగా అప్రతిష్ట పాలవడం తప్ప ఫలితమేమీ ఉండదనీ, ఆమె అభియోగానికి చట్టబద్ధత లేకపోయినా అసలే సున్నితంగా ఉన్న వారి దాంపత్య జీవితం ఛిన్నాభిన్నం అవడం తథ్యమనీ, కనుక ఏదైనా చర్య తీసుకునే ముందర ఒకసారి ధరిత్రితో మాట్లాడి కోర్టు వెలుపల పరిష్కారానికి ప్రయత్నించమనీ, అప్పటికీ వ్యవహారం కొలిక్కి రాకుంటే ఏం చేయాలో అప్పుడే ఆలోచిద్దామనీ’ లాయర్‌ చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు ప్రభాస్‌.
ధరిత్రిపై హృదయంలో ఏ మూలో నిక్షిప్తమై ఉన్న ప్రేమే ప్రేరేపించిందో లేక ఈ వ్యవహారం తెగేదాకా వెళ్ళేలా ఉందనిపించిందో కానీ వెంటనే వెళ్ళి ధరిత్రిని కలుసుకున్నాడు.
ఇటు ధరిత్రి లాయర్‌ కూడా కోర్టు వరకూ వెళ్ళవద్దని సలహా ఇచ్చినపుడు, అప్పటివరకూ తాను చేసిన ప్రయత్నాన్ని లాయర్‌కి తెలిపి, కనీసం ఈ నోటీసు చూశాకైనా పరిస్థితుల గంభీరతను అర్థం చేసుకుని, కలుసుకోవడానికి వస్తాడని ఆశిస్తున్నానని చెప్పింది ధరిత్రి.
నోటీసు కారణంగానో లేక వేరే కారణంగానో తెలియకపోయినా ప్రభాస్‌ రాక ధరిత్రికి సంతోషాన్నిచ్చింది.
‘‘ధరీ ఏమిటిది నాకు విడాకులిస్తావా? నేను లేకుండా నువ్వు బ్రతకగలవా? మనకి పుట్టబోయే బిడ్డని గురించి ఆలోచించే ఈ నోటీసు పంపించావా?’’ అన్నాడు ఉబికి వస్తున్న కోపావేశాలను అణచుకుంటూ.
ఆ అడగడంలోనూ అతని అతిశయాన్ని గమనించి, ‘‘నేను బాగా ఆలోచించాను కానీ మీరే మా గురించి ఇసుమంతైనా ఆలోచించట్లేదు. కనుకనే నేనీ కఠినమైన నిర్ఱయం తీసుకోవాల్సి వచ్చింది.’’
మాటలు నెమ్మదిగా వచ్చినా మొదటిసారి ధరిత్రి స్వరంలోని తీవ్రతకీ, స్థిరత్వానికీ జంకాడు ప్రభాస్‌.
తన మూర్ఖపు పట్టుదలను వీడి సహకరించకపోతే ధరిత్రిని శాశ్వతంగా కోల్పోతానని సుస్పష్టంగా అవగతమై, వద్దు వద్దని హుంకరిస్తున్న పురుషాహంకారం పడగలు విప్పకముందే తొక్కిపెట్టి ‘‘సరే సరే నువ్వు చెప్పినట్లే వింటాను. ఎవరిని కలుసుకోవాలో చెప్పు’’ అన్నాడు.
‘‘నిజంగానే అంటున్నారా?’’ ధరిత్రి మనసులో ఏ మూలో ఇంకా రవంత సందేహం.
‘‘అవును, మన బిడ్డ సాక్షిగా’’. ధరిత్రి మనస్సు ఆనందంతో నాట్యం చేసింది.
ఆ మర్నాడే ఇద్దరూ వెళ్ళి సుకన్యని కలుసుకున్నారు. ప్రభాస్‌తో సుదీర్ఘ సంభాషణ జరిపి, అతనికి ఆరోగ్యరీత్యా ఇతర సమస్యలేవీ లేవని నిర్ధారించుకోవడం కోసం ఓవరాల్‌ చెకప్‌ చేయించుకుని రిపోర్ట్‌ తీసుకుని మళ్ళీ కలవమంది.
రిపోర్టులు పరీక్షించి అన్నీ సవ్యంగానే ఉన్నాయని తెలిపింది డాక్టర్‌.
‘‘నా గురించి ధరిత్రి మీకు ఏం చెప్పిందో నాకు తెలియదు. నాకేమీ సమస్య లేదు. మీరే అనవసరంగా ఏదేదో ఊహిస్తున్నారనిపిస్తోంది.’’
‘‘మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. నిజాయితీగా జవాబిస్తారని ఆశిస్తాను.’’
సాలోచనగా చూసి ‘‘అడగండి’’ అన్నాడు. సుకన్య అడిగిన కొన్ని ప్రశ్నలు ప్రభాస్‌ని చాలా ఇబ్బందికి గురిచేశాయి.
‘అసలిదంతా నాకు అవసరమా? నేనేం తప్పు చేశానని నాకీ కౌన్సిలింగ్‌? భార్యతో సుఖం కోరుకోవడం తప్పా?’ అదే ఆలోచన తనని మళ్ళీ అహంకారపూరితం చేస్తోంటే తెలియని భయానికి లోనయ్యాడు.
ప్రభాస్‌ మనోభావాలు చదివినట్లుగా ‘‘కౌన్సిలింగ్‌ అంటే మీకున్న సందేహాలను అర్థం చేసుకోగలను. దాని గురించి సవివరంగా తెలియజేస్తాను. ఒక సెషన్‌ ప్రయత్నిద్దాం. ఆ తర్వాత కొనసాగించాలా వద్దా అనేది పూర్తిగా మీ నిర్ణయానికే వదిలేస్తాను. కాబట్టి రేపటినుంచి మొదలుపెడదామా?’’ అడిగింది సుకన్య.
కౌన్సిలర్‌ చెప్పింది అంత ఒప్పుదలగా అనిపించకపోయినా, ధరిత్రిని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేకా, తాను కూడా తమ బంధం నిలవాలనే కోరుకుంటున్నానని భార్యకి తెలియజెప్పడం కోసం కౌన్సిలింగ్‌ సెషన్‌కి అంగీకరించాడు ప్రభాస్‌.
మర్నాడు నిర్ధారిత సమయానికే క్లినిక్‌ చేరుకున్న ప్రభాస్‌తో ‘‘ఇక్కడ మీరు మీ మనోభావాలు నిస్సంకోచంగా తెలపవచ్చు. మానసిక శాస్త్ర సిద్ధాంతాలకు లోబడి మీ సందేహాలను తీర్చడానికి ఒక కౌన్సిలర్‌గా నేను సహకరిస్తాను. ఇక్కడ మన మధ్య జరిగే సంభాషణ, ఇతరులెవ్వరికీ అంటే మీ భార్యకు కూడా తెలియకుండా గోప్యంగా ఉంచబడుతుంది. ఒకవేళ చెప్పాల్సి వచ్చినా, అది కేవలం అత్యవసరమైన పరిస్థితులలో మాత్రమే, అంటే మీవల్ల ఎవరికైనా ప్రాణహాని జరిగే అవకాశం ఉందని అనిపించినప్పుడు మాత్రమే, అదీ అవసరమైనంతవరకే తెలియజేయబడుతుంది.’’
తన ప్రవర్తనని నిందిస్తూ ప్రవచనాలు ఇస్తుందేమోనని ఆలోచిస్తున్న ప్రభాస్‌ మనసుని సుకన్య పలుకులు సాంత్వన పరిచాయి.
‘హమ్మయ్య! అయితే నేనిక్కడ నా మనసులో మెదిలే సందేహాలను ధైర్యంగా చెప్పుకోవచ్చు. కౌన్సిలర్‌ సహాయంతో నాది నిజంగా ఒక సమస్యే అయితే కనుక, పరిష్కారమార్గం కూడా ఆమె ద్వారానే తెలుసుకోవచ్చు’ అనే నమ్మకం కలిగి స్వేచ్ఛగా సంభాషించడానికి ఉద్యక్తుడయ్యాడు. ప్రభాస్‌ ఆలోచనలని లీలామాత్రంగా గ్రహించగలిగిన సుకన్య ‘‘మీ గురించి వివరంగా… అంటే మీ కుటుంబం గురించి, మీరు పెరిగిన వాతావరణం, చేస్తున్న ఉద్యోగం, మీ వివాహం, భార్యతో మీ అనుబంధం గురించి చెప్పండి’’ అని అడిగింది.
తన బాల్యం నుంచీ మొదలుపెట్టి ధరిత్రితో పరిచయం, వివాహం వరకూ కూలంకషంగా చెప్పి ‘‘ధరిత్రిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అందమైనదే కాదు ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఆమెను ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోలేను’’ అన్నాడు.
‘‘మీరు ఈ కౌన్సిలింగ్‌కి అంగీకరించినప్పుడే ఈ విషయం గ్రహించాను. అయితే ఇదంతా మీ బంధాన్ని నిలుపుకోవడం, ఆమెను తిరిగి పొందడం కోసమే చేస్తున్నారని అనుకోవచ్చునా?’’
కౌన్సిలర్‌ తన ప్రయత్నాన్ని అర్థం చేసుకుని అభినందించినందుకు సంతోషించి ‘‘అవును’’ దృఢంగా పలికాడు ప్రభాస్‌.
‘‘కానీ ప్రస్తుత పరిస్థితులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయని నాకు అనిపిస్తోంది. అందుకు మీరేమంటారు?’’
‘‘అవును సరిగ్గా చెప్పారు. ఇదంతా నాకే మాత్రం నచ్చట్లేదు. అసలు నా తప్పేమిటో కూడా తెలియడంలేదు. ఎంత బాగా చూసుకుంటున్నా నా ప్రేమని అర్థం చేసుకోకుండా, నాలో తప్పుల్ని వెదకడానికి ప్రయత్నిస్తోంది ధరిత్రి.’’
‘‘ఊ… అది నిజంగా బాధాకరమే! అయితే ఎటువంటి విషయాలలో మీ ప్రవర్తన సరికాదని మీ భార్య అభిప్రాయపడిరదో చెప్పగలరా?’’
‘‘దాంపత్య సుఖం కోసం ఎప్పుడూ బలవంతపెడతానని నిందిస్తుంది. తనకి నాతో కలవాలని అనిపించదా? నేను మగవాడిని. నా భార్యతో నాకు కావలసినప్పుడల్లా శారీరక సుఖం కోరుకోవడం నా హక్కు. తీర్చాల్సిన బాధ్యత నా భార్యగా ఆమెది. అదీ తప్పంటే ఎలా?’’ ఉక్రోషం, అసహనం కలగలిపిన భావాలతో చూశాడు ప్రభాస్‌.
‘‘ఊ… వింటున్నాను చెప్పండి.’’ ‘‘ఆమెపట్ల నా నిబద్ధత అర్థం చేసుకోదు. భార్యగా నా కోరిక తీర్చడం పోయి నలుగురిలో నన్నొక దుర్మార్గుడిలా చిత్రిస్తోంది. బయట స్త్రీల వద్దకి వెళ్ళకుండా ఆమెతోనే సుఖం కోరుకుంటున్న నన్ను చూసి గర్వపడాలి’’ అనేసి, సుకన్య తన గురించి తప్పుగా అనుకుంటుందేమోనని క్షణం ఆగాడు. అయితే దీక్షగా తన మాటలు వింటున్న సుకన్యని చూసి తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.
ప్రభాస్‌ ఆలోచనలు చదివినట్లుగా ‘‘జరుగుతున్న సంఘటనలన్నీ మీకెంత అసహనం కలిగిస్తున్నాయో అర్థం చేసుకోగలను. భార్యపట్ల ఉన్న ప్రేమవల్ల మనసు పడినప్పుడల్లా ఆమెనుంచి సుఖం పొందాలని ఆశిస్తున్నారు. అది ఆమె అర్థం చేసుకుని సహకరించట్లేదని ఆవేదన చెందుతున్నారు’’ ప్రభాస్‌ చెప్పినదాన్ని తిరిగి ఒత్తిచెప్తూ మృదువుగా అంది సుకన్య.
‘‘అవును! మీరు బాగా అర్థం చేసుకున్నారు. కానీ ఆమెకి అర్థం కావడంలేదే! అదే విసుగు తెప్పిస్తోంది.’’
ఇటు ప్రభాస్‌, అటు సుకన్య భావోద్వేగపరమైన ఆలోచనలో నిమగ్నులవడంతో కొద్ది క్షణాలు నిశ్శబ్దం తాండవించింది ఆ గదిలో.
ఆలోచనలోంచి బయటపడి ‘‘మీరు చెప్తున్నది వింటుంటేనే మీ మానసిక వేదన అవగతమవుతోంది. మీరూ, మీ భార్యా దాంపత్య సుఖానికి సంబంధించి పడుతున్న సంఘర్షణ అర్థమవుతోంది. వైవాహిక బంధం సజావుగా సాగడానికి భార్యా భర్తల నడుమ దాంపత్య సుఖం చాలా కీలకం. కానీ అది చాలామందికి అర్థం కాదు. పైగా ఇలాంటి సున్నితమైన విషయాలు ఎవ్వరితోనూ చెప్పుకోలేరు కూడా. అందుకే ఇది ఒక చక్కని అవకాశం మీ ఇరువురి సమస్యల గురించి విపులంగా చర్చించుకుని అర్థం చేసుకోవడానికి.’’
‘‘ఊ… మీకేమనిపిస్తోంది, ఈ సమస్యకి కారణం నేనా నా భార్యా?’’
‘‘ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఆలోచించినందువల్ల ప్రయోజనం ఉండదు. అంతకంటే మీకు కలుగుతున్న అసౌకర్యంపై దృష్టి పెడదాము ముందు. మీరేమనుకుంటున్నదీ మీ భార్యకి చెప్పారా ఎప్పుడైనా?’’ ‘‘దేని గురించి?’’ ‘‘దాంపత్య సుఖానికి సంబంధించి మీ ఆలోచనలు ఏమిటీ అన్నది.’’ కొంతసేపు ఆలోచించి ‘‘లేదు. అసలేమని చెప్పాలి?’’
‘‘ఊ…’’ చేతిలో ఉన్న లెటర్‌ ప్యాడ్‌లో ఏదో వ్రాసుకుని ‘‘ధరిత్రి మీతో ఎప్పుడైనా చెప్పిందా తనకి ఇష్టం లేదని?’’
‘…….’’ ‘‘ఫరవాలేదు దాచకుండా చెప్పండి.’’
‘‘నాకు ప్రతిరోజూ తనతో సుఖం కావాలనిపిస్తుంది. అది తనకి ఇబ్బందిగా ఉందని చెప్పింది.’’
‘‘అందుకు మీరేమన్నారు?’’ ‘‘అటువంటప్పుడే నాకు కోపం వస్తుంది. నా కోరికను అర్థం చేసుకోకుండా ఇబ్బంది అంటే ఎలా. నేనెక్కడికి వెళ్ళాలి? అందుకే ఆ ప్రస్తావనే నేను పట్టించుకోను.’’
‘‘ఆమె ఇబ్బంది గురించి వినడమే ఇష్టం ఉండదు కనుకనే ఆ ప్రస్తావన దాటవేస్తాను అంటున్నారే! అలా చేసినందువల్ల మీకేమైనా లాభం కలిగిందా?’’ ‘‘లేదు. అందుకేగా ఇక్కడిదాకా వచ్చింది విషయం.’’ ‘‘మరైతే ఏం చేసుండేవారు?’’
కౌన్సిలర్‌ ప్రశ్నలతో చిర్రెత్తుకొచ్చి ‘‘నాకు తెలియదు. ఆమెకి ఇబ్బంది కలుగుతోందని వదిలేసి దాంపత్య సుఖం లేకుండా బ్రతకాలా?’’
‘‘అస్సలు కాదు. దాంపత్య సుఖం లేని వైవాహిక బంధం మీకూ, ధరిత్రికీ కూడా అంగీకారమవదు.’’
‘‘……..’’ ‘‘దాంపత్య జీవితంలో ధరిత్రి సంతోషంగా ఉందని మీరు అనగలరా?’’
ఏమని సమాధానం చెప్పాలో తెలియక మౌనాన్ని ఆశ్రయించాడు.
‘‘శారీరకంగా ఆమెకి దగ్గరైనప్పుడు మీకు సంతోషం కలిగిందా?’’
‘‘అవును, చాలా. నాకు ఆమె అంటే ప్రేమ. తను కూడా ఇష్టపూర్వకంగా నాతో కలిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అయితే నా మటుకు నాకు ఎంతో సంతోషం కలుగుతుంది.’’
‘‘ఆమెకూ సంతోషం కలిగిందని మీకు అనిపించిందా?’’
కొంతసేపు మౌనంగా ఉండి ‘‘నాకు తెలియదు’’ అని సుకన్య తననెక్కడ తప్పుపడుతుందోనని ‘‘చెప్పాలంటే ఆడవాళ్ళకి అంతగా కోరిక ఉండదు. కానీ నేను మగవాడ్ని. నా కోరికలు కొంత భిన్నంగా ఉంటాయి’’ అహంకారం ధ్వనించింది ప్రభాస్‌ స్వరంలో.
‘‘ఇక్కడ ఆలోచించవలసింది ఎవరికి ఎక్కువ కోరికలు ఉంటాయన్నది కాదు. ఆడా మగా భేదం లేకుండా ప్రతి మనిషికీ శారీరక సుఖమనేది అవసరం. ఆ విషయంలో ప్రతి ఒక్కరి కోరికలూ, అభిప్రాయాలూ కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ అందరూ ఆ సుఖం కోరుకుంటారు.’’
‘‘నేను ఆ దృష్టితో ఎప్పుడూ ఆలోచించలేదు. మరైతే ధరిత్రి నాకెప్పుడూ ఎందుకు చెప్పలేదు?’’
‘‘దానికి సమాధానం మీ భార్య మాత్రమే చెప్పగలదు. మీరు ఎప్పుడైనా ఈ విషయంలో ఆమె అభిప్రాయం కూడా ముఖ్యమని భావించి అడిగుంటే తప్పక చెప్పి ఉండేదేమో?’’ కౌన్సిలర్‌ చెప్పేది శ్రద్ధగా వినసాగాడు ప్రభాస్‌.
‘‘మీ శారీరక సుఖం తీరితే చాలనుకున్నారే కానీ ఆ విషయంలో ధరిత్రికి కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయనేది మర్చిపోయారు. శారీరక సంబంధమనేది యాంత్రికమైన చర్య కాదు. భార్యాభర్తలిరువురికీ అంగీకారమై, ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు సంతోషపరచుకునే సమయంలో కలిగే మధురమైన అనుభూతి. ఇక్కడ ఇరువురి అంగీకారం… అంటే మీకు తెలుసనుకుంటాను?’’
‘‘తెలుసు. అంటే ధరిత్రి నన్నెప్పుడూ వద్దని చెప్పలేదు.’’
‘‘వద్దని చెప్పలేదంటే మనస్ఫూర్తిగా అంగీకరించానని చెప్పిందా?’’
‘‘ఊహు… అలా అని ప్రత్యేకంగా ఎప్పుడూ చెప్పలేదు కానీ…’’
‘‘దాంపత్య సుఖానికి సంబంధించినంతవరకూ ఎదుటివారికి అంగీకారమా లేదా అన్నది మాత్రం తప్పక తెలిసి
ఉండాలి.’’ ‘‘అంటే ప్రతిసారీ నీకిష్టమా లేదా అని పర్మిషన్‌ అడగాలా?’’
‘‘ఒక విధంగా చెప్పాలంటే అవును. ముఖ్యంగా పెళ్ళైన కొత్తలో తప్పనిసరిగా అడగాలి. అలాగే ఆమె కూడా మిమ్మల్ని అడగాలి. ఇరువురిలో ఎవరూ, ఎదుటివారికి ఇష్టం కాకుండా ఎక్కడికి పోతుందిలే అని తమకి తామే నిర్ణయించేసుకోరాదు.’’
‘‘కానీ, ఆమె నా భార్య.’’
‘‘అలాగే మీరు ఆమె భర్త. వైవాహిక బంధంలో భార్యాభర్తలు పరస్పరం అవగాహన కలిగి ఉండాలి. భర్తగా మీ కోరికలు తీరాలనుకోవడం ఎంత ముఖ్యమో, భార్యగా ఆమె సుఖసంతోషాలు అంతే ముఖ్యమని అనుకోవాలి. నేను మగాడిని కాబట్టి నా పెళ్ళాం నేనేం చెప్పినా చచ్చినట్లు చేయాలని భర్త అనుకోకూడదు. అలాగే భార్య కూడా తన భర్త గురించి అనుకోకూడదు.’’
మౌనంగా వింటున్నాడు ప్రభాస్‌.
‘‘వైవాహిక బంధంలో స్త్రీ పురుషుల మధ్య సంబంధం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిదనే విషయమై రాబోయే సెషన్స్‌లో ఒకసారి మళ్ళీ తప్పక చర్చిద్దాము. ప్రస్తుతానికి మీ విషయంలో పరస్పర అంగీకారం అంటే మీకు తెలుసన్నారు కాబట్టి, మీ దంపతుల మధ్య శారీరక సంబంధానికి ధరిత్రి పూర్తి అంగీకారం లేదని, చాలాసార్లు బలవంతంగా మాత్రమే ఆ చర్యలో పాల్గొనేదని ఒప్పుకుంటారా?’’
‘‘ఊ… అవును’’ నెమ్మదిగా మంద్రస్థాయిలో జవాబిచ్చాడు కౌన్సిలర్‌ ప్రశ్నకి.
‘‘ఆ సమయంలో చాలాసార్లు ఏదో చెప్దామని ప్రయత్నించేది ధరి. బహుశా దీని గురించేనేమో’’ ఏవేవో ఆలోచనలు మనసుని ఆందోళనకు గురిచేస్తోంటే అక్కడనుంచి లేచి వెళ్ళిపోదామనుకుని కూడా కౌన్సిలర్‌ ఇంకా ఏమి చెప్తుందో తెలుసుకుందామని ఉండిపోయాడు.
‘‘అయితే ఈ విషయంలో ఆమె ఆరోపణ సరైనదే కదా?’’
‘‘ఊ…’’ సిగ్గుతో చితికిపోతూ తలదించుకున్నాడు.
‘‘మీకు ఇదంతా జీర్ణించుకోవడం అంత సులభం కాదని నాకు తెలుసు. కానీ ఈ విషయంలో మీరెంతో ధైర్యం చూపిస్తున్నారు. మరిక కొనసాగిద్దామా?’’ ‘‘ఊ…’’ ‘‘పలుమార్లు బలవంతంగా మీ భార్య నుండి దాంపత్య సుఖం కోరడంవల్ల మీకు దగ్గరవ్వాలంటేనే ఆమెలో ఒక విధమైన బెరుకు, భయం కలిగి ఉంటాయి. అందుకే మీతో కలవాలనే కోరిక ఎంత ఉన్నప్పటికీ ఆ కారణం వల్ల ఈమె జంకిందేమో?’’
‘‘అయ్యుండొచ్చు.’’ ‘‘మీ భార్యకు దగ్గరగా ఉండాలని మీరు కోరుకుంటే కనుక ఆమె గురించి ఆలోచించాలి. ఆమె అభిప్రాయాలకు విలువనిచ్చి గౌరవించాలి. మీ కోరికని ఆమె అర్థం చేసుకోవాలని కోరుకుంటే ఆమె అవసరాలనీ, ఇబ్బందులనీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఆమెకి శారీరకంగా దగ్గర కావాలని అనిపించినప్పుడు ఏ కారణం చేతనైనా సరే ఆమె వద్దంటే మీరామెను బలవంతపెట్టకూడదు.’’
‘‘ఊ… అంటే నేనేగా చెడ్డవాడిని.’’ ‘‘కాదు ప్రభాస్‌. కొన్నిసార్లు మనం చేసే పనులు సరైనవో కాదో మనమే చెప్పలేము. కానీ అది తెలుసుకుని సరిదిద్దుకోవడం అత్యవసరం. మీరెంత మగవారైనా ఆమెని బలవంతం చేయడం ఆమెను బాధిస్తోంది. అవునా.’’
‘‘అవును’’ ‘‘ఎంత మీ భార్య అయినా ఆమెనుంచి బలవంతంగా శారీరక సుఖం కోరడం తప్పు, అలా చేయకూడదు అంటే ఒప్పుకుంటారా?’’ అంగీకారంగా తల ఊపాడు.
‘‘కాబట్టి మీ ఇరువురూ, పరస్పర అంగీకారంతో సంతృప్తికరమైన దాంపత్య జీవితం గడిపే మార్గాలని అన్వేషించాలి. ఏ విషయం గురించైనా మనసు విప్పి సంభాషించుకుంటే దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇటువంటి సున్నితమైన అంశం గురించి భార్యతో ఎలా మాట్లాడాలనే విషయంలో కొన్ని సూచనలు ఇస్తాను. ప్రస్తుతానికి, ఇప్పటివరకూ జరిగినది మీరు అర్థం చేసుకున్నారని మీ చర్య ద్వారా ఆమెకి నమ్మకం కలిగించండి. ఆ తర్వాత మీ వైవాహిక జీవితంలో మీ మధ్య సాన్నిహిత్యాన్ని బలపరచుకునే మార్గాల గురించి చర్చిద్దాము. మీకు అంగీకారమేనా?’’ తల ఊపాడు. భావోద్వేగానికి లోనైనా ఆత్మనిందకి పాల్పడకుండా తనని తాను అర్థం చేసుకోగలగడమే కాకుండా సైకో థెరపీ పట్ల నమ్మకం కూడా కలిగింది ప్రభాస్‌కి. ‘‘ఈ విషయమై ముందుకు ఎలా వెళ్ళాలో అనే దానిపై ఒక ఆలోచన చేద్దాము. ఈ థెరపీపై మీరు నమ్మకంతో ఉండాలి. ఉండగలరా?’’ ‘‘తప్పకుండా’’ ధృఢంగా పలికాడు.
ఆ తర్వాత కొంతసేపటికి ఆనాటి సెషన్‌ ముగిసింది. మళ్ళీ వచ్చే వారం సెషన్‌లో కలుసుకునేలా సమయం నిర్ధారించబడిరది.
కౌన్సిలింగ్‌కి సందేహాలతో వెళ్ళినా, సెషన్‌ ముగిసి క్లినిక్‌ బయట అడుగుపెట్టాక ప్రభాస్‌ ఆలోచనల్లో మార్పు ఆరంభమైంది.
‘ధరిత్రికి తనంటే ఎంతో ప్రేమ ఉంటే తప్ప నా గురించి ఇంతలా తాపత్రయపడదు. ఆమె తలచుకుంటే మా వైవాహిక జీవితం ఒకే ఒక్క క్షణంలో విచ్ఛిన్నమై ఉండేది అనడంలో ఇసుమంతైనా సందేహం లేదు.
ఆమెకేం తక్కువ. అందం, ఐశ్యర్యం అన్నీ ఉన్న కుందనపు బొమ్మ. ఎవరైనా ఆమెని ఇట్టే ఇష్టపడతారు. అలాంటిది నేను ఎంత అమానవీయంగా ప్రవర్తించినా సహనంతో నాకు అర్థమయ్యేలా నచ్చచెప్పాలని చూసిందే తప్ప లేశమంతైనా విసుగు కనబరచలేదు. అసలు ధరిత్రిలాంటి జీవన సహచరి దొరకడం నిజంగా నా అదృష్టం. ఎంతసేపూ మగవాడిగా నా హక్కులు పొందాలనుకున్నానే గానీ ఆమెని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు.
సుకన్యని కలిసిన తర్వాత కానీ నా ఆలోచన, ప్రవర్తన ఇంత సమస్యాత్మకమైనదని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికైనా మించిపోయిందేముంది? కొంచెం సహనంగా వ్యవహరిస్తే ఇందులోంచి బయటపడగలనని సుకన్య చెప్పనే చెప్పింది కదా. ఆమె సలహా పాటిస్తాను. నన్ను నేను బాగు చేసుకుంటాను. ధరిత్రి మాట వింటాను. మా జీవితాలలో మళ్ళీ వసంతం చిగురించేలా చేస్తాను. అదే నేను నా ప్రియమైన ధరిత్రికి ఇవ్వగలిగే బహుమానం’ అనుకున్నాక ప్రభాస్‌ మనసు తేలికైంది.
క్లినిక్‌ నుంచి సరాసరి ధరిత్రిని కలిసి భావోద్వేగంతో గాఢంగా కౌగలించుకున్నాడు.
అసలు విషయమేమిటో తెలియకపోయినా భర్త కౌగిలి సాంత్వన కలిగించింది ధరిత్రికి.
‘‘ఇప్పటివరకూ నా ప్రవర్తనలో ఏమీ లోపం లేదనే అనుకున్నాను ధరీ! నిన్ను కష్టపెట్టినందుకు మన్నించు. నాకు అర్థమైంది నా ప్రవర్తన మార్చుకోవాలని, తప్పక ఆ దిశగా ప్రయత్నిస్తాను. అప్పటివరకూ నాతో సహనంగా ఉంటావు కదూ’’ థెరపీ సెషన్‌ తర్వాత భర్తనుండి అటువంటి ప్రతిక్రియ సంతోషం కలిగించింది ధరిత్రికి.
‘ప్రభాస్‌ చాలా మంచి వ్యక్తి. అందుకే అహాన్ని కూడా ప్రక్కన పెట్టి, అయిష్టంగానైనా నాతో కౌన్సిలింగ్‌కి రావడానికి సంసిద్ధుడయ్యాడు. వచ్చాడు కూడా. ఇవాళ ప్రభాస్‌తో మాత్రమే ప్రత్యేకంగా సంభాషించి ఏం మంత్రం వేసిందో కానీ దాని ఫలితం ఇదిగో ఇలా పనిచేసింది. అతనికి ఇదంతా కొత్త, చెప్పాలంటే నాకూ కొత్తే కదా మరి! అతనికి కొంత సమయం ఇవ్వాలి, నేనూ తీసుకోవాలి. తొందరపడితే పనులు సానుకూలమవ్వవు. థెరపీ వల్ల అంతా మంచి జరుగుతుందనే నమ్మకం కలుగుతోంది. ప్రస్తుతానికి నా ఆలోచనలను ప్రక్కకి పెట్టి పుట్టబోయే పాపాయిపై ధ్యాస పెట్టాలి’ పెల్లుబికిన ప్రేమతో భర్తని మరింత హత్తుకుంది.
సుమారు ఆరునెలల పాటు ధరిత్రి, ప్రభాస్‌ దంపతులతో విడివిడిగానూ, ఇరువురితోనూ సుకన్య నిర్వహించిన కౌన్సిలింగ్‌ సత్ఫలితాలను ఇచ్చింది. ఒక శుభదినాన ముద్దులొలికే పాపాయికి జన్మనిచ్చింది ధరిత్రి.
ప్రభాస్‌, ధరిత్రిల జీవనవీణ పాపాయి బోసినవ్వులతో మోహన రాగం ఆలపించింది మధురంగా!

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.