‘‘కలికాలం కలికాలం అంటరు గిందు కేనేమో… ఛీ… ఏం ఆడది. అసాంటి ఆడది బతుకుడు కంటే సచ్చుడే నయం.
పసి పొరల పానం తీసెతందుకు చేతులెట్ల చ్చినయో… పానం ఎట్ల ఒప్పిందో. ఇయ్యాల అమ్మల దినం అంటున్నరు.
అమ్మల ఇజ్ఞత్ తీసిపడేసే’’ అప్పుడే వచ్చిన యాదమ్మ గొణుక్కుంటున్నది.
యాదమ్మ అసహనానికి కారణం అర్థం కాలేదు. ఏమిటి సంగతి అన్నట్టు ఆమెకేసి చూశా. ‘‘అయ్యో… ఏం జెప్పాలె అమ్మా పాపం పాలుగారే పసిపోరలు.. యాడాది, రెండేండ్ల పోరలు. సక్కదనం ఉండే. ఆ తల్లి కడుపుల పుట్టుడే పాపమయ్యే…
కనుపాపల్లెక్క జూసుకోవాలి గని గిట్ల జేసే… జిందగీల ఇంతకన్న అన్యాలం ఉంటదా?’’ తన ధోరణిలో చెప్పుకుపోతన్నది యాదమ్మ.
చేతిలో పేపర్ పక్కన పెట్టి అసలు విషయం ఏంటో చెప్పకుండా ఏంటి నీ గోల? అని గట్టిగా అనడంతో తమ బస్తీ పక్కనే ఉన్న అపార్ట్ మెంట్‌లో జరిగిన సంఘటన చెప్పుకొచ్చింది. ఓ తల్లి పిల్లలిద్దరికీ విషం కలిపిన కూల్ డ్రిరక్ తాగిచ్చి తను తాగిందని, పిల్లల ప్రాణాలు గాలిలో కలిశాయని, తల్లి చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్నదని చెప్పింది. తన పని చేసుకుంటూనే, మొగుడు పిల్లలు అన్నాక గొడవలు, కొట్లాటలు అవకుండా ఉంటాయా, మొగుడి మీద కోపం పిల్లలపై చూపడం ఏంటని తెగ బాధపడిపోయింది యాదమ్మ.
పసికూనల్ని బలితీసుకున్న కసాయి తల్లి అని, పిల్లలతో తల్లి బావిలోకి దూకిందని, చెరువులో దూకిందని, పిల్లలకు విషమిచ్చి చంపిందని, గొంతు నులిమిందని, నిప్పు అంటించిందని రకరకాల వార్తలు నిత్యం పత్రికల్లో పతాక శీర్షికలు అవుతున్నాయి.
మాతృత్వాన్ని, తల్లి ప్రేమను పొగిడే సమాజం మనది. కోరికలను, ఇష్టాయిష్టాలను పక్కకు పెట్టి పిల్లల ఇష్టమే తన ఇష్టంగా జీవితం వెళ్ళదీసే తల్లులను, పిల్లలకు ఏ కష్టం వచ్చినా తట్టుకోలేని తల్లుల తల్లితనాన్ని కీర్తించే సమాజం, తల్లి ప్రేమ మరెవ్వరికీ ఉండదని పెద్దపీట వేస్తుంది. అదే సమాజం పిల్లల కోసం ఏదైనా చేసే తల్లి, ఎంత కష్టమైనా భరించే తల్లి, నవమాసాలు తనలో భాగం చేసుకుని రక్త మాంసాలు పంచి కన్న తన పిల్లలను ఎందుకు చంపుతున్నదో ఆలోచించ దేమిటి? పరిపరి విధాల సాగుతున్న ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ… జన్మనిచ్చిన తల్లికి బిడ్డలు బరువైతే ఎవరికైనా ఇస్తే పెంచుకునేవారు, లేదా అనాథాశ్రమంలో పడెయ్యాల్సింది, ఎట్టగొట్టా బతికేవారు. ఆడదంటే గంగమ్మ తల్లిలాగా ఎంత కష్టమైనా ఓర్వాలి అని యాదమ్మ అంటుంటే అగ్నిపర్వతాన్ని గుండెల్లో దాచుకున్నప్పుడే స్త్రీ జన్మ సార్థకమని అన్న ఓ కవి వాక్కు గుర్తొచ్చింది.
యాదమ్మ అనే కాదు, సమాజం, కుటుంబం అంతా స్త్రీని సహనశీలిగానే చూస్తారు. అలాగే ఉండాలని కోరుకుంటారు. అలా లేని, చేతు లారా బిడ్డలని చంపుకున్న తల్లిని నేరస్థులుగా చూస్తారు. నేరం చేసిన వాళ్ళను నేరస్థులుగా చూడడంలో తప్పేమీ లేదు కానీ ఆ తల్లి అలా చేయడానికి ముందు వెనక ఉన్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, ఆరోగ్య కారణాలు ఏమున్నాయో ఆలోచించడం లేదని మధనపడు తున్న నా మనసు అందుకు గల కారణాలేమిటో అని అన్వేషిస్తున్నది.
నిజానికి అన్ని కాలాల్లోని సమాజంలో మహిళలు ఎప్పుడూ బాధితులుగానే కనిపిస్తారు. మహిళల హక్కుల కోసం పోరాడి చట్టాలు తెచ్చుకున్నప్పటికీ వాటిపట్ల ప్రజల్లో అవగాహన లేకపోవడం, వాటి అమలులో ఉదాసీనత, చట్టాల్లో ఉన్న లొసుగులు ఆమె వెనుకబాటుకు ఒక కారణం. అందువల్ల ఎన్ని చట్టాలు చేసు కున్నప్పటికీ ఆమెపై నేరాలు పెరిగిపోతున్నాయి. పెరిగిన సాంకేతికత, ఆధునిక విజ్ఞానం, వేగంగా విస్తరించిన ప్రపంచీకరణ కొంతమేర ఆజ్యం పోస్తున్నాయి. మానవ జీవన విధానంలో అనేక మార్పులొచ్చి డబ్బు ఆధిపత్యం పెరిగింది. మనుషుల ఆలోచనల్లో, ప్రవర్తనల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి.
అధికశాతం మగవాళ్ళు అనేక రకాల అలవాట్లకు బానిసలయ్యారు. (కొద్ది శాతం ఆడవాళ్ళు కూడా) హింసాత్మక ప్రవృత్తికి లోన వడం, మానసిక ఉద్వేగాల నియంత్రణ కోల్పో వడం వల్ల సమాజంలో హింస పెరిగిపోతున్నది.
మహిళల్లో అటువంటి అలవాట్లు లేవు, అయినా ఎందుకు నేరస్థులుగా మారుతున్నారు? ముఖ్యంగా కన్నపిల్లల్నే ఎందుకు కడతేరు స్తున్నారు? స్త్రీ నేరస్థురాలిగా మారడంలో పురుషుడి బాధ్యత ఎంత? అని ప్రశ్నించు కున్నప్పుడు దారి తప్పిన మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, స్త్రీ పురుష సంబంధా లు, ఆధిపత్య భావజాలం, మద్యం, అత్తింటి వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు, మతపరమైన మూఢనమ్మకాలతో పాటు క్షణికావేశం కూడా ఆమె సమాజం దృష్టిలో నేరస్థురాలిగా ముద్ర పడటానికి, చేతులకు సంకెళ్ళు వేసుకోవడానికి కారణమవుతోంది.
కొన్ని సందర్భాల్లో క్షణికావేశంతో కాకుండా ఎంతో యాతన తర్వాతే ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కూడా! తను లేని సమాజంలో పిల్లలు ఎన్ని అగచాట్లు పడవలసి వస్తుందోనన్న భయం ఆ తల్లిని అటువంటి పనికి పురికొల్పు తుండొచ్చు. వైవాహిక బంధంలో ఆధిపత్యం చెలాయించే, అహంకారయుతంగా ప్రవర్తించే లేదా ఆమెను అసలు పట్టించుకోని భర్త లేదా నరకం చూపెట్టే భర్తలే ఆమెను నేరస్థురాలిగా మార్చేది. లేదా ఆమెను మానసిక ఆరోగ్య స్థితి బాగుండకపోవడం కూడా కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రం పగ ప్రతీకారంగా అభం శుభం ఎరుగని పిల్లలు బలవుతున్నారు.
విచ్ఛిన్నమైపోతున్న మానవ సంబంధాలు, మనిషి మనిషికి మధ్య పెరిగిపోతున్న అంతరాలు, భావోద్వేగాల నియంత్రణ లేకపోవడం కూడా మహిళల్లో హింసాత్మక ఆలోచనలు, నేరపూరితమైన ప్రవర్తన పెరగడానికి కారణం.
అంతేకాకుండా ఎన్ని డిగ్రీలు సాధించిన ప్పటికీ అది జీవన నైపుణ్యాలు అందించే చదువు కాకపోవడం కూడా కారణం కావచ్చేమో!