1980-81 మధ్యకాలం. నేను పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న రోజులు. దిల్‌సుక్‌నగర్‌లో రూ. 150 లకు అద్దె ఇంట్లో వుంటూ రోజూ ఓ కిలోమీటర్ నడిచి, బస్సు డిపోకి వచ్చి, ఓ అరగంట క్యూలో నిలబడి, ఆర్‌టిసి బస్సులో సీటు సంపాదించి ఆఫీసుకెళ్ళేదాన్ని. ఓ రోజు విశాలాంధ్ర పుస్తకాల షాపుకెళ్ళి కొ.కు పుస్తకాలు కొన్నాను. ఆ సంకలనంలోని ఓ చిన్న గల్పిక నా మీద పెను ప్రభావాన్ని చూపింది. దాని పేరేమిటో నాకిపుడు గుర్తు లేదు. అందులో ఆఫీసులకి బస్సుల మీద వెళ్లే వాళ్ళ మీద ఆయన ఇలా రాస్తారు. ”పది పదిహేను నిమిషాల బస్సు ప్రయాణానికి సీటు కోసం ఈ ఉద్యోగస్తులు అరగంట ముందొచ్చి క్యూలో నిలబడతారు. అదో అలవాటుగా చేసేస్తారు గాని, ఆ అరగంట బస్సులో నిలబడిపోదామని ఆలోచించరు. పడీ పడీ, ఇంట్లో వాళ్ళని తొందర పెట్టి వచ్చి క్యూలో నిలబడతారు. కాళ్ళు పీక్కుతున్నా క్యూలోంచి కదలరు”. ఆ గల్పికలో ఇలా అర్ధం వచ్చేట్టు వుంటుంది. ఈ చిన్న గల్పిక చదివిన తర్వాత నేను ఏ రోజూ క్యూలో నిలబడలేదు. ఆ మూసని తోసిరాజని రద్దీ బస్సుల్లో ఎక్కడంటే అక్కడ, ఆఖరికి ఫుట్‌బోర్డింగు కూడా చేసేదాన్ని. మనుష్యులు ఒక యాంత్రికతకి ఎలా అలవాటు పడిపోయారో, కొత్త దారుల్ని వెతక్కుండా ఎలా దానిలోనే కొట్టుకు పోతుంటారో ఈ బుల్లి గల్పికలో చెప్పిన కొకు రచనల్ని ఎంతో ఇష్టంగా, ప్రేమగా చదవడం మొదలుపెట్టాను. కొ.కు శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మీద ప్రత్యేక సంచిక తేవాలనే ఆలోచన మొదలైన దగ్గర నుండి ఈ గల్పిక నాకు పదే పదే గుర్తుకు రాసాగింది.
ఈ ప్రత్యేక సంచికకు బీజం పడింది శ్రీకాకుళంలో. ఆగష్టు పదహారున కేంద్ర సాహిత్య అకాడమీ, కథానిలయం సంయుక్తంగా కొ.కు రచనల మీద సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమయంలో నేను వైజాగులో వున్నాను. నాయుడుపేట నుంచి ప్రతిమ ఫోన్ చేసి శ్రీకాకుళం మీటింగుకి వెళుతున్నావా అని అడగడం, ఆవిషయం నాకు తెలియదని చెప్పడంతో, తనే వివరాలన్నీ చెప్పింది. శ్రీకాకుళం వెళ్ళాలనే తపన మొదలైంది. అప్పటికీి టైమ్ ఎనిమిది. మీటింగు 10 కి. నేనేమో ఒక అవసరమైన వ్యక్తిగత పని మీద వైజాగులో వున్నాను. ఇంకేమీ ఆలోచించలేదు. టాక్సీి తెప్పించుకుని అప్పటికప్పుడు బయలుదేరి ఆ సమావేశానికి వెళ్ళాను. సింగమనేని నారాయణగారు, కాళీపట్నం రామారావు మాస్టారు, చాగంటి తులసి ఇంకా ఎందరినో కలిసాను. రామమోహనరాయ్‌గారు ‘కొ. కు చారిత్రక దృక్పధం” మీద అద్భుతమైన ప్రసంగం చేసారు.నేను టాక్సీ మీద ఖర్చు చేసిన రెండున్న వేలు ఈ సమావేశంలో పాల్గొన్న ఆనందం ముందు ఎందుకూ కొరగానివయ్యాయి. అంతే కాదు కొ.కు మీద నేనెందుకు భూమిక ప్రత్యేక సంచిక వెయ్యకూడదు. వేసి తీరాలి అనే నిర్ణయానికి రావడం జరిగింది.
హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఉదయమే శాంతసుందరిగారికి ఫోన్ చేసి, కొ. కు గారి ప్రత్యేక సంచిక తీసుకొద్దాం. మీరు సహసంపాదకురాలిగా బాధ్యత తీసుకుంటారా? అని అడిగిందే తడవు ఆవిడ ఒప్పుకోవడం, ప్రత్యేక సంచికకి రూపకల్పనా జరిగిపోయాయి. ఆవిడ వెంటనే రచనల సేకరణ పని మొదలు పెట్టేసారు. నిజానికి ఈ ప్రత్యేక సంచిక వెనుక కృషింతా శాంతగారిదే. అందరికీ ఫోన్‌లు చేసి మాట్లాడటం, వాళ్ళ వెంటబడి రచనలు రప్పించడం అంతా ఆవిడే చేసారు. ఆవిడ ఒప్పుకోక పోయి వుంటే అసలు ఈ ప్రత్యేక సంచిక సాధ్యమయ్యేది కాదు. ఆవిడకి ‘థాంక్స్’లాంటి పడికట్టు పదాలతో కృతజ్ఞతలు తెలపడం నా కిష్టం లేదు. స్నేహంలో ఇలాంటి పదాలు ఇమడవు. ఇక కొ.కు.గారి రచనలకు సంబంధించి వివిధ కోణాలు ఈ సంచికలో ఆవిషృతమయ్యాయనే నేను భావిస్తున్నాను. ఈ అన్ని కోణాలను ఒకేసారి చదివే ‘అదృష్టం’ (దీనికేదైనా ప్రత్యామ్నాయ పదం వెదకాలి) నాకు కలగడం నన్ను ఆనందోద్వేగాల్లో ముంచేసింది. వందేళ్ళ క్రితం పుట్టిన ఈ మనిషికి ఇంత విశాల దృక్పధం, శాస్త్రీయ భావజాలం అన్నింటిని మించి స్త్రీ సమస్య మీద ఇంత సంస్కారవంతమైన ఆలోచనలు ఎలా వంటబడ్డాయి? అక్టోబరు 28న అంటే నేను ఈ ఎడిటోరియల్ రాస్తున్న రోజుకు సరిగ్గా వందేళ్ళ ముందు ఆయన పుట్టారు.
”ఇరవయ్యో శతాబ్దంలో వచ్చిన తెలుగు సాహిత్య పరిణామం విషయంలో కొ.కు కొంత కాలం ద్రష్టగాను, ఆ తరువాత స్రష్టగాను కూడా పని చేసారు. ముఖ్యంగా రాయప్రోలు అభినవ కవితకు, కృష్ణశాస్త్రి భావకవితకు కొ.కు ద్రష్ట. శ్రీ శ్రీ కంటే కాస్త ముందు పుట్టినా కొ.కు భావ కవితా ప్రవాహంలో దూకలేదు. శ్రీ శ్రీ దూకి తిరిగి ఒడ్డుకెక్కి తన త్రోవ తాను చూసుకొంటున్న కాలందాకా కొ.కు ప్రపంచాన్ని చూస్తూ, తెలుసుకుంటూ, చదువు , ఆలోచించుకుంటూ వచ్చాడు. చలం సాహిత్యం కొ.కును ఎంతగానో ఆలోచనలకు, కలవరానికి గురి చేసింది. ” అంటుంది కాత్యాయనీ విద్మహే కొ.కు వాజ్మయ జీవితం గురించిన వ్యాసంలో.
గురజాడ, శ్రీశ్రీ, చలం, వీరేశలింగంలాంటి వారి ఆలోచనాధోరణి యువకుడైన కొ.కు మీద బలంగానే వుండింది. ఆ తరువాత దాస్ కాపిటల్ చదవడంతో కొ.కు కు మార్కి ్సస్టు ప్రాపంచిక దృక్పధం ఏర్పడడం, అభ్యుదయ రచయితల సంఘంలో భాగస్వామి కావడం జరిగాయి. ఉద్యోగాల వేటలో ఊళ్ళు తిరుగుతూ, వివిధ ఉద్యోగాలు చేయడంతో విస్తృతమైన జీవితానుభవం సంపాదించాడు. భిన్నమైన అనుభవాలను పొందాడు. ఈ అనుభవాలన్నింటిని విశ్లేషించుకుంటూ వాటినన్నింటిని తన రచనల్లో పొందుపరిచాడు. అసంఖ్యాకంగా వ్యాసాలు, కథలూ రాస్తూ పోయాడు. నిజానికి ఒక్క కవిత్వం తప్ప ఆయన రాయని ఆధునిక సాహితీ ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు.
ఆయన రచనల్లోని సూటిదనం, వ్యంగ్యం, నిర్మోహమాటం పాఠకుల గుండెలకు నేరుగా తాకుతాయి. మారదలుచుకున్న వాళ్ళకు చుక్కానిలాగా పనిచేస్తాయి. బండబారిన వాళ్ళకు కొరడా దెబ్బల్లా తాకుతాయి. మన సాహిత్యం అనే వ్యాసంలో ”ఆత్మగౌరవం కల జాతి తన కళలను ఎంతో అభిమానంతో చూసుకుంటుంది. మన కళల మీద మనకున్న అభిమానం చూస్తే మనకు ఆత్మగౌరవం ఏమీ లేదని స్పష్టమౌతుంది” అంటారు.
స్త్రీల మానసిక సంఘర్షణలను, ఆనాటి సమాజంలో స్త్రీలు పడుతున్న ఆగచాట్లను చాలా ఆర్తితో, గుండెలోతుల్లోంచి కొ. కు. రాయడం కన్పిస్తుంది. ‘ఆడజన్మ’ నవల్లో ”నువ్వు మా జీతం లేని నౌకరువు. నీది ఇరవై నాలుగ్గంటల నౌకరీ, శలవుల్లేవు నీకు, ఫిించను లేదు. నువ్వు చేతులు మారినా నీ నౌకరీ మారదు.” అంటారు. ఇంకోచోట ”నీకు ఆత్మజ్ఞానం లేకుండా, చదువూ విజ్ఞానమూ లేకుండా చేసి ఉంచింది దేనికనుకున్నావు. నీకు అడుగడుగునా అంకుశాలు దేనికనుకున్నావు? నిన్ను అబలగాను నీ కీర్తి లేత తమలపాకులకంటే సుకుమారంగానూ, నీ మార్గం కంటక భూయిష్టంగాను, నీ జీవితం ఒక అంతులేని అగ్ని పరీక్షగాను ఉంచింది దేనికనుకున్నావు” అంటారు కోపస్వరంతో. అలాగే సౖౖెరంధ్రి కథలో జానకి పాత్ర చిత్రణ, ఆ పాత్రను మలిచిన తీరు అమోఘం. ”నాలుగేళ్ళ భరించాను. ఇక చాలనిపించింది. ఒక రోజు చెప్పేసాను. నన్ను మీరు మెదడులేని ఆడగాడిద అనుకుంటున్నారో, ఊరందరితోను రంకు పోగల సాహసికురాలిననుకుంటున్నారో నాకు తెలియడం లేదు. నేను చిన్నతనంలో కుర్రాళ్ళతో మొగుడూ, పెళ్ళాం ఆటలు ఆడినదాన్నే” అంటూ మొగుడి ముఖంతోపాటు సమాజ ముఖాన్ని ఫెెడేల్మని తన్నినట్లు సమాధానం చెప్పింది. ‘యావజ్జీవ స్నేహం’ అనే అందమైన వాక్యాన్ని ఈ కధలోనే రాసారు.
అలాగే 1955 లో రాసిన ‘దాలిగుంటలో కుక్కలు’ ఆశయాలు వల్లిస్తూ, తనవరకు వస్తే ఆచరణలో ముఖం చాటేసే వాళ్ళ గురించిన కథ. సమ్మె చేస్తున్న ఒక కథలోని కూలీల పట్ల సానుభూతి వర్షం కురిపించి ”యజమానులను చంపినా పాపం లేదు” అంటూ రంకెలు పెట్టె మనుష్యులు, తమ బంధువుల పొలంలో పనిచేసే కూలీలు సమ్మె కడితే ”కూలీ లంజా కొడుకులు సమ్మె చేస్తున్నారు.” అంటూ విరుచుకు పడుతూ ”పోలీసుల్ని పిలిపించి, పికెటింగు చేసేవాళ్ళని మిల్లు ముందు నుంచి వెళ్ళగొట్టించి, కొత్త కూలీల్ని తెచ్చుకోలేకపోయావా” అంటూ సలహాలిస్తారు. ఒకటిన్నర పేజీల ఈ కథలో ఆశయాలకి, ఆచరణకి మధ్య వున్న అగాధాన్ని, మనుష్యులు ఎంత తేలికగా ఆశయాలు వల్లించి తనదాకా వస్తే ఎలా జారిపోతారో అద్భుతంగా ఆవిష్కరించిన కథ ఇది.
చివరగా ‘ఆడ బ్రతుకే మధురం’ కధలోని ఓ పదునైన వాక్యంతో నేను ముగిస్తాను. 1947లో రాసిన ఈ చిన్న కథ ఆనాటి స్త్రీలకే కాదు ఈనాటి స్త్రీలకి కర్తవ్య బోధ చేయడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ”నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ని మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయే. ఎవరు పడతారమ్మా దెబ్బలూ, తిట్లూను.” చిన్నపిల్ల అంతరంగంలోంచి వుబికి వచ్చిన ఈ మాటలు, తిట్లూ, తన్నులూ తింటూ హింసాయుత జీవితాల్లో మగ్గుతున్న ఈనాటి స్త్రీల చెవిన పడితే ఎంత బావుండు.
ఆత్మగౌరవాన్ని ప్రోది చేసే, ఆత్మవిశ్వాసాన్ని అంతరంగం నిండా నింపే కొ.కు రచనలు ఈనాటి సమాజానికి ఎంత అవసరమో ఆయన రచనల్ని మళ్ళీ చదువుతున్నపుడు మరింతగా అర్ధమైంది. కొ.కు ప్రత్యేక సంచికను తేవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది.
మా ప్రయత్నాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ, ఈ సంచిక రూపకల్పనలో, రచనలు సేకరణలో సహకరించిన సహసంపాదకురాలు శాంతసుందరికి అభినందనలు చెబుతూ అలాగే విరసం ప్రచురించిన సంకలనాల్లోంచి కొన్ని రచనలను పునర్ముృదించుకోవడానికి అంగీకరించిన కృష్ణాబాయిగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే విశాలాంధ్ర పబ్లిషింగు హౌస్‌వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రత్యేక సంచికపై స్పందించాల్సిందిగా పాఠకుల్ని అభ్యర్ధిస్తూ… మీ
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
శ్రీశ్రీ యువకుడుగా ఉన్నప్పుడు అబ్బూరి రామకృష్ణరావుగారు తనకు మంచి విదేశీ సాహిత్యాన్ని పరిచయం చేసి తన దృక్పథాన్ని విశాలతరం చేశారని ఆయనే చెప్పాడు. మా నాన్నకు ఇటువంటి సహాయమేదీ లభించలేదు. స్కూలు రోజుల నుంచీ స్వయంగా పుస్తకాలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. చనిపోయే కొన్ని నిమిషాల ముందుదాకా ఆయన ఈ అలవాటును మానుకోలేదు. ఇప్పటి, చదువుకున్న నిరక్షరాస్యులకు ఇటువంటివి చెప్పినా అర్థంకాదు.
సత్యవతి గారికి,
నవంబర్ సంచికని కొ.కు ప్రత్యేక సంచికగా తెచ్చినందుకు అభినందనలు. ఓల్గా గారి “ఐశ్వ ర్యం” వ్యాసం, బాలగోపాల్ గారి “యుద్ధసంస్కృతికి అద్దం పట్టిన కథలు” , సత్యవతి గారి వ్యాసాలు చదివాను. ప్రత్యేక సంచిక సమ గ్రంగా వుంది. కొ.కు సాహిత్యంపై ఇంత లోతైన విశ్లేషణని ఒకే చోట చదవడం చాలా బావుంది. మరోసారి అభినందనలు చెబుతూ,
-పసుపులేటి గీత