అబ్బూరి ఛాయాదేవి
ఆడవాళ్ళ పట్ల అనేక దురాచారాలు అమలులో ఉన్న కాలంలో 1927లో కథారచన ప్రారంభించిన కొడవటిగంటి కుటుంబరావు గారు మహిళాభ్యుదయాన్ని కాంక్షిస్తూ స్ఫూర్తిదాయకమైన, వ్యంగ్యపూరితమైన ఎన్నో కథలు రాశారు.
మూడువందలకుపైగా వైవిధ్యభరితమైన సామాజికాంశాలతో కూడిన కథలు – స్త్రీపురుష సంబంధాల గురించీ, సంప్రదాయాల ముసుగులో సాగే అవినీతి వ్యవహారాల గురించీ, పేదవారి పట్లా ఆడవారి పట్లా జరిగే క్రూరమైన దోపిడీ గురించీ, వైజ్ఞానిక విషయాల గురించీ ఎన్నో కథలు రాశారు. మూడువందలదాకా అందుబాటులో ఉన్న కథల్లో మచ్చుకి మూడునాలుగు కథలు తీసుకున్నా చాలు కుటుంబరావు గారి మహిళాభ్యుదయ భావాలు ప్రస్ఫుటమవుతాయి. బాల్యవివాహాల గురించీ, బాలవితంతువుల పునర్వివాహాల గురించీ, ప్రేమ వివాహాల గురించీ, పాతివ్రత్యం గురించీ, స్త్రీ స్వేచ్ఛ గురించీ కుటుంబరావు గారి కథల్లోని స్త్రీపురుష పాత్రల సంభాషణల ద్వారా ఆయన అభిప్రాయాలు ప్రకటితమవుతాయి.
రెండవ భార్య పోయిన దాదాపు యాభైఏళ్ళ స్నేహితుడి ఆస్తిని చూసి, అతనికి పన్నెండేళ్ళ తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చెయ్యాలని యోచించి, పెళ్ళిచూపులు ఏర్పాటుచేస్తే, ఆ ‘పెళ్ళికొడుకు’తో ఆ పిల్ల, ”నన్ను మా నాన్న మీకిచ్చి చేస్తే నూతిలో పడతాను” అని ధైర్యంగా బెదిరిస్తూ మాట్లాడినట్లూ, ఆ పెద్దాయన కొడుకుని ఇష్టపడిన ఆ పిల్ల, రెండవ భార్య మీద అనుమానంతో కొడుకుని దూరం చేసుకున్న ఆయనకి సన్మార్గం చూపినట్లూ రాయడం – రచయితకున్న అభ్యుదయ దృక్పథం వల్లనే. ఈ కథ పేరు ‘పెళ్ళికూతురు’.
”భార్యాభర్తల ఇష్టాయిష్టాలతో ఏమీ సంబంధం లేకుండా ఆజన్మాంతం ఇద్దర్నీ ఒకరికొకర్ని అంటగట్టడం పాపంగా తోచడం లేదా నీకింకా?” అంటాడు కథానాయకుడితో అతని మిత్రుడు – ‘విచిత్ర వివాహం’ అనే కథలో.
”ఆడదానికి మగవాడిలో లేని బంక ఒకటి ఉంది. అందుచేత అతుక్కునే స్వభావం ఆడదానికి జాస్తి. పైగా తనను తను కాపాడుకుని పోషించుకునే సత్తాలేని పరభృతం కావటం చేత ఆడదానికి ఈ అంటుకునే ‘ఇన్ట్సింక్టు’ లేకపోతే చచ్చిపోతుంది. దాన్ని సంస్కరించాలంటే స్త్రీలకు విద్యా, ఆత్మాభిమానమూ, తమ మీద తాము ఆధారపడగల ధైర్యమూ అవీ కల్పించాలి. వేరే మార్గం లేదు. ఇప్పుడు సంస్కరించవలసింది ఈ పాతివ్రత్యమే!” అంటాడు కథకుడు ‘పతివ్రతా మహిమ’ అనే కథలో.
‘నిజమైన పతివ్రత’ అనే కథలో – మామగారి ఆస్తి హరించుకుపోయి కుటుంబం గడవడం కష్టమైపోతే, కోడలు సీత డబ్బు సంపాదించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ”కాని ఎక్కడికి పోయినా మగవాళ్ళకు ఒకటే యావగా కనిపించింది. ప్రపంచంలో ఇంతమంది ‘బాలెన్స్’ లేని మగవాళ్ళున్నారని సీత ఎరగదు” అని చెబుతూ, ”… ఎవడో దార్నిపోయే కొక్కిరాయి కన్నుకొట్టడానికి మన మంచితనంతో ఏమీ సంబంధం కనిపించదు. అటువంటివాటికి నావంటి ఆడది సంసిద్ధురాలై ఉండటమే కాక ఇంకోరి సహాయం కోరకుండా తట్టుకురావాలి!” అని కథానాయిక చేత అనిపిస్తూ, అటువంటి స్త్రీయే ”నిజమైన పతివ్రత” అని సూచిస్తారు రచయిత.
‘వరాన్వేషణ’ అనే కథలోని కథానాయిక సుశీల బాలవితంతువు. ఆమె స్నేహితురాలి అన్న సుశీలని ఇష్టపడతాడు. అతను మంచివాడే కాని చాలా లావుగా ఉంటాడు. ఇంకా లావెక్కుతున్నానని అతను చెప్పినప్పుడు ఆమె ”ఆపుకోలేకుండా నవ్వింది… మనసారా నవ్వి ఎంతో కాలమయినట్టు కూడా ఉంది తనకు… ఏ చంద్రమండలంలోకో వెళ్ళి తిరిగి భూమి మీదికి వచ్చినట్టుంది. తను సుఖంగా ఊపిరి పీల్చుకుని కూడా ఎంతో కాలమైనట్టుంది” అనుకుంటుంది. ఆ రోజుల్లో ఆడపిల్లలకి నవ్వు ఎంత నిషిద్ధమో, నవ్వు ఆడవాళ్ళకి ఎంత ప్రాణావశ్యకమో తెలియజెబుతారు రచయిత, సుశీల మనోభావాల ద్వారా.
”వివాహాల మీద అంతులేని ధనవ్యయం నాకిష్టం లేదు” అని చెప్పిస్తారు ఒక పెద్దాయన చేత – ‘పాత సంప్రదాయం’ అనే కథలో – ధన సంస్కృతి పెరిగిపోయి, వివాహం ఒక ప్రదర్శన అయిపోయి, ఆర్భాటాలకు అవకాశంగా మారిన ఈ రోజుల్లో అందరూ జీర్ణించుకోవలసిన మాటలు అవి.
ఒక శతాబ్దం నుంచి తెలుగు కథా సాహిత్యం ద్వారా ఇటువంటి అభ్యుదయ భావాలు సందేశాత్మకంగా వెలువడుతున్నప్పటికీ, స్త్రీల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. స్త్రీలు ఎప్పటికప్పుడు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవలసిన అగత్యం ఏర్పడుతోంది. అందుకే కొడవటిగంటి కుటుంబరావు గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలూ, ఇచ్చిన సందేశాలూ ఈనాటికీ వర్తించడమే కాదు, మరింత మార్గదర్శకంగా ఉన్నాయని గ్రహించాలి.
శతజయంతి సందర్భంగా మహాకథకుడు కొడవటిగంటి కుటుంబరావు గారికి జోహార్లు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags