మగవాళ్లు మారాలి

బోర సుభాష్‌
రోజురోజుకీ స్త్రీలపై నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఆడపిల్లగా పుట్టినందుకు, ఆడపిల్లల్ని కన్నందుకు, మగపిల్లల్ని కననందుకూ… ప్రేమని కాదన్నందుకూ… కోరిక తీర్చనందుకూ… తీర్చినందుకూ… మరొకరితో నవ్వి నందుకూ… తలవంచుకోనందుకు… కట్నం డబ్బుల్ని తేనందుకూ… అదనంగా ఇవ్వనందుకూ… ఒకటని కాదు ఇలా సవాలక్ష సమస్యలతో నేడు స్త్రీలు ప్రతిరోజు, ప్రతిక్షణం చస్తూ బ్రతుకుతుండటం సభ్యసమాజానికే సిగ్గుచేటు. ఎందరో ఆడపిల్లలు నిరంతరం అత్యాచారాలకు, అవమానాలకు, అపనిందలకు, అరాచ కాలకు, అన్యాయాలకు, హత్యలకు వయసు తో సంబంధం లేకుండా బలైపోతున్నారు. మాటలురాని పసికందు నుండి, చనిపోయే పండు ముదుసలి వరకు ఈ దారుణాలకు బలైపోతున్నా సమాజంలో కనీస మార్పు రావడం లేకపోవడానికి కారణం ఏమిటి? ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమయిందని, చట్టాలు కఠినంగా లేవని, కఠినమైన శిక్షలు ‘కంటికి కన్ను-పంటికి పన్ను’లాగా విధించాలని కొందరు చెబుతుంటే కేవలం ఆడపిల్లల మూలంగానే ఇన్ని సమస్యలు వస్తున్నాయని, నేటి ఆడపిల్లలు మన సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా, రెచ్చిపోయే తరహాలో వస్త్రధారణ చేయడమే కారణమని, సినిమాలే కారణమని ఇంకొందరు వాదిస్తున్నారు. కాని వాస్తవ పరిస్థితిని గ్రహించడంలో, సత్యంను సత్యంగా చూడటంలో మన సమాజం ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇది మగవాళ్ళ ప్రపంచం కాబట్టి. స్త్రీకి శరీరం ఉంది: దానికి వ్యాయామం యివ్వాలి. ఆమెకు మెదడు ఉంది: దానికి జ్ఞానం యివ్వాలి. ఆమెకు హృదయం ఉంది: దానికి అనుభవం యివ్వాలి – అనే సంగతిని గుర్తించని ఈ సమాజానికి నేను రాసే సంగతులు అర్థమవుతాయా? అని ‘స్త్రీ’ పుస్తకానికి ముందుమాట రాస్తూ 1952 లోనే మహనీయుడు చలం ఆవేదనపడ్డా 2009 నాటికి కూడా చలం ఆవేదనను అర్థం చేసుకోని సమాజం మనది కావడం బాధాకరం. ప్రపంచ చరిత్రంతా వర్గపోరా టాల చరిత్రే అన్న మార్క్స్‌ మాటలాగే ప్రపంచమంతా మగవాళ్ళదే కావడం యాదృచ్ఛికం కాదు. సమాజంలో సగభాగమైన ఆడవాళ్ళని కనీసం మనుషులుగా చూడటం లేదు. ఆడవాళ్లకి కుటుంబాలు లేవు. వాళ్లు కేవలం కుటుంబాల్ని వృద్ధి చేసేందుకు, సేవ చేసేందుకు, ఆశ్రయం పొందేందుకు, కుటుంబం నుంచి కుటుంబానికి మారతారు. ఆడవాళ్లకి వంశాలు లేవు. వంశాలు మగవాళ్లవి. వంశోద్ధారకులూ మగవాళ్ళే. ఒక మగవాళ్ల వంశం నుంచి మరొక మగవాళ్ళ వంశానికి మారతారు ఆడవాళ్లు. అందుకే ఇది మగవాళ్ల ప్రపంచం. విలువలూ, ప్రమాణాలూ, పరిష్కారాలు, న్యాయాన్యాయాలు అన్ని మగవాళ్ల దృష్టికోణంనుంచే ఇక్కడ నిర్ణయమౌతు న్నాయనేది పచ్చినిజం. మతాలు, కులాలు, సభలు, సంస్కృతులు, సైన్యం, కోర్టులూ, చట్టాలు, స్వర్గ, నరకాలు, దేవుళ్లు, ఆదర్శాలు, విప్లవాలు, హీరోయిజాలు, పత్రికలూ, టీవీలు, సినిమాలు ఒకటేమిటి ఆస్తులు, అంతస్తులు, యావత్‌ ప్రపంచం మగవాళ్ళదే కావడంవల్ల స్త్రీ మనిషిగా చూడబడటం లేదు. చొక్కా విప్పి సల్మాన్‌ఖాన్‌ డాన్సు చేసినా, గద్దర్‌ పాట పాడినా, గాంధీ ఉపన్యసించినా.. అది కవ్వించే వస్త్రధారణ కాదు. కాని అదే స్త్రీల విషయంలో అయితే మాత్రం ప్రమాణాలు వేరే ఉంటాయి. ‘కవ్వించే వస్త్రధారణ అంటే పురుషుల్ని కవ్వించే’ అని అర్థం. స్త్రీలు కూడా కవ్వింపుకు గురికాగలరని ఏ మగవాడైనా ఆలోచించాడా? సెక్స్‌ అనేది మగవాళ్ల మజా కోసమే. చొక్కా విప్పిన హీరోల్ని, చాతీ ప్రదర్శించే హీరోల్ని, నిక్కర్‌ మీద తిరిగే హీరోల్ని మనం ఏనాడైనా అభ్యంతర పెట్టామా? రెచ్చగొట్టే దుస్తులు ధరించారని హాహాకారాలు చేశామా? కేసులు పెట్టామా? లేదు. ఆడవాళ్లు ప్యాంటు వేసుకుంటే మాత్రం మన కట్టుబొట్టు వదిలిపెట్టారని విమర్శలు చేస్తూనే ఉంటాం. ధోవతుల్ని, పంచెల్ని వదిలి ప్యాంట్లకీ, జీన్‌ప్యాంట్లకీ, టీషర్ట్స్‌కీ, షార్ట్స్‌కీ… మగవాళ్లు మారితేరాని విమర్శలు స్త్రీల విషయంలో మాత్రమే ఎందుకు రావాలి? ఘనత వహించిన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే బాధ్యత మగవాళ్ళకేమి ఉండదా? అది వాళ్లకేనా? మగపిల్లలు ‘+’ అని, ఆడపిల్లలు ‘-‘ అని లెక్కలువేసి మగపిల్లలకోసం తపించి పోతున్నారు. భ్రూణహత్యలు, అక్రమ నియంత్రణలకి పాల్పడి నేడు జనాభాలో 1000 మంది పురుషులకి 920 మంది స్త్రీలు కూడా లేని పరిస్థితిని కల్పించాం. పౌష్టికాహారం ఆడపిల్లల్లోనే ఎక్కువ. పెద్ద చదువులు చదివించే విషయంలో ఆడపిల్లల పట్ల చిన్నచూపు… ఎందుకు? (లాభం మరో ఇంటికి మరలిపోయేటప్పుడు..మనం పెట్టుబడి ఎలా పెట్టగలం?) మగవాళ్ల వ్యాయామాన్ని బాడీబిల్డింగు అని పిలిచే మనం ఆడవాళ్ల వ్యాయామాన్ని కేవలం ఫిట్‌నెస్‌ అని వ్యవహరించడం వెనుక దుర్మార్గం ఏమిటి? సమాజంలో అనేక మార్పులు వచ్చినప్పటికీ నేటికీ మగవాళ్లకో నీతి, ఆడవాళ్లకో నీతి కొనసాగుతోంది. ఎందుకు మగపిల్లలు కావాలని తపిస్తున్నాం? ఎందుకు ఆడపిల్లలు పుట్టకుండానే అమ్మ కడుపులోనే చంపేస్తున్నాం? ఎందుకు కట్నాలు తీసుకొని పెళ్లి చేసుకున్నాం? కట్నమిచ్చి ఎందుకు పెళ్ళి చేస్తున్నాం? మనం వంట ఇంటిని, ఇంటి చాకిరీని పట్టించుకోవడంలేదు? బట్టలెందుకు ఉతకడం లేదు? మగపిల్లలకి కూడా వంటపని, ఇంటిపని, శుభ్రం చేసే పని నేర్పడం లేదు? మనం మన ఆడపిల్లలకు సంరక్షకులుగా వ్యవహరించే నెపంతో, శాసకులుగా, విధాతలుగా ఎందుకు ప్రయత్నిస్తున్నాం? దార్లో ఎదురయ్యే ఆడవాళ్లని.. తేరిపార ఎందుకు చూస్తున్నాం? బూతుసీన్లనీ, పోర్నోసైట్లనే రహస్యంగా ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? మన ఆడవాళ్లు మనకే చెందాలని మూర్ఖంగా ఎందుకు భావిస్తున్నాం? అవసరం తీర్చుకోవడమే కానీ, ఆడవాళ్లకి భావప్రాప్తి కలుగుతోందో…లేదో…ఎన్నడన్నా పట్టించు కున్నామా మనం? ఎందుకు అనుమాని స్తున్నాం? మన ఆడవాళ్లు మనకే…స్వంతమై ఉండాలని ఎందుకు మూర్ఖిస్తున్నాం? ఎందుకు ఈవ్‌టీజ్‌ చేస్తున్నాం? ఎలాగైనా తాకాలని… రాసుకోవాలని… ఎందుకు వెర్రెత్తి పోతున్నాం? ఎవరి సెక్స్‌ జీవితం వారి స్వంతమని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? జెలసీ (అసూయ)ని, పొసెసివ్‌నెస్‌ (స్వంతపొత్తు) అనే భావననే ఎందుకు వదుల్చుకోవడం లేదు? స్కాండల్స్‌ ఎందుకు మాట్లాడుతున్నాం? పక్కవాళ్ల ప్రయివేటు జీవితంపైనా వ్యాఖ్యానాలు చేస్తున్నా యెందుకు? ఆఫీసుల్లో తోటి ఉద్యోగినుల్ని ఎందుకు వేధించుకు తింటున్నాం? మగ ఆధిపత్యాన్ని నీతులుగా, విలువలుగా మార్చి వల్లిస్తున్నాయెందుకు? తీర్పులెందుకు చెపుతున్నాం? నిండుగర్భిణి సీతని, స్కాండల్‌కి వెరచి..అమానవీయంగా అడవిలో..వదిలిన పాఫిస్టు రాయుళ్లని… దేవుళ్లుగా కొలుస్తున్నాయెందుకు? స్త్రీలని అణచమని, దండించుమని బోధించే ధర్మాల్ని…గ్రంథాల్ని నేలకేసి తొక్కట్లేదెందుకు మనం? రాజకీయం, అధికారం, పోలీస్‌ మిలటరీ, జ్యుడిషియరీ, విప్లవ పార్టీల పొలిట్‌బ్యూరో వంటివి మగవాళ్లకి రిజర్వ్‌ చేయబడి…ఆడవాళ్లని కేవలం రిసెప్షనిస్టులుగా, సెక్రటరీలుగా, ఫంక్షన్లలో బొకేలు ఇచ్చే బొమ్మలుగా… పార్టీలకు ఓట్లు సమీకరించేందుకు మహిళా విభాగాల ఆర్గనైజర్లుగా…ఇవేమీకాకపోతే వంటింట్లో బానిసలుగా బతకమని అనుమతించడం ఎంత దుర్మార్గం? ఈ దేశపు న్యాయమూర్తుల్లో, రాజకీయనాయ కత్వంలో, పోలీస్‌స్టేషన్లలో, పరిశ్రమల్లో, పరిపాలనల్లో, సంపాదనల్లో, అధికారంలో సమాజంలో సగభాగమైన మహిళల భాగస్వామ్యమెంత? మన సంస్థల్లో, సంఘాల్లో, రాజకీయ పార్టీలలో, ఉద్యమాలలో, అధికారంలో, అవకాశాలలో ఆడవాళ్లు లేరని ఎందుకు గమనించడం లేదు? ఎందుకు నిలదీయడం లేదు? మగవాళ్ల భాషనే ఎందుకు మాట్లాడు తున్నాం? మగవాళ్ల ఆలోచనలే ఎందుకు చేస్తున్నాం? బయట నేరగాడు చేసేది మాత్రమే హత్య ఎందుకైంది? మన ఇళ్లలో, వంటిళ్లలో జరుగుతున్నవి హత్యలు కావా? ఒకటే తేడా – మనం ఒక్క వేటుతో కాకుండా సంవత్సరాల తరబడి కోస్తున్నాం! అందుకే ఇకనైనా సమస్త పురుష ప్రపంచం ఇంతటి నేరాల్ని, ఘోరాల్ని తెలిసో, తెలియ కనో చేసినప్పటికీ సిగ్గుతో తలదించుకోవాలి. ఎందరు ఆడవాళ్ల నెత్తుటిని అలికితే మన ఇళ్లు ప్రశాంతంగా అయ్యాయో ఆలోచించాలి. పొగచూరిపోయిన ఆడవాళ్ల జీవితాలను, ఆవిరైపోతున్న ఆడవాళ్ల వ్యక్తిత్వాలను ఇకనైనా అందరం గుర్తిద్దాం! పెళ్ళి అనే లీగల్‌ హక్కుతో, ప్రేమ అనే లైసెన్స్‌తో నిస్సిగ్గుగా సాటిమనిషి జీవితాన్ని ఆక్రమించవచ్చని, పెత్తనం చేయవచ్చుననే పురుష దురహంకారం నుండి బయటపడదాం. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో పెట్టుకునే ఎటువంటి సంబంధాన్నైనా అభ్యంతరపెట్టేందుకు, ఆటంకపరిచేందుకు, వ్యాఖ్యానించేందుకు, తీర్పు చెప్పేందుకు, శాసించేందుకు ఏ వ్యక్తికిగానీ, సమాజానికి గానీ, ఏ ధర్మానికి గానీ, మతానికి గానీ, ప్రభుత్వాలకు గానీ ఎలాంటి హక్కు లేదని, వ్యక్తుల ప్రయివేటు జీవితాల్లోకి వారి అనుమతి లేకుండా చొరబడే హక్కు ఎవరికీ లేదనే సంస్కారం మనకు అవసరం. సహస్రాబ్ధాలుగా పీడకులుగా ఉండటం వలన – మగవాళ్లు మనుషులు కాకుండాపోయారు. పీడించి… పీడించి… ఆడవాళ్లని హాయిగా బ్రతక నివ్వలేదు… మనమూ హాయిగా బ్రతకలేదు. న్యాయంగా బతకడంలో, ప్రజాస్వామికంగా బతకడంలో, స్వేచ్ఛగా వికసించిన వ్యక్తుల సహచర్యాన్ని అందుకోవడంలో సౌఖ్య మేమిటో తెలుసు కోలేకపోయిన సమస్త మగ ప్రపంచం ఇకనైనా కళ్లు తెరవాలి. స్త్రీలు-పురుషులు సమానంగా, సంతోషంగా జీవించడానికి మగవాళ్లు మారాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to మగవాళ్లు మారాలి

  1. loknath kovuru says:

    జైభారత్ రాష్ట్ర సమితి ది 14.8.2009 నాటి సమావేశంలో ఆమోదించిన డాక్యుమెంట్ ఇది ..రాసినది విజయవిహారం సంపాదకులు రమణ మూర్తిగారు. మిత్రుడు బోర సుభాష్ దాన్ని కాపి కొట్టి ఇలా తన పేరుతో ఈ పత్రిక కు పంపెంత పనిచేస్తాడని ఉహించడం కాస్త కష్టంగా ఉంది…..”కలెక్టర్ గారి భార్య” సినిమాలో (భూమిక,ప్రకాష్ రాజ్ నటినటులు… ) ఈ డాక్యుమెంట్ లోని పేరాలను యదాతదంగా వాడుకోవడం చూసాను….అసలు డాక్యుమెంట్ లింక్ ఇస్తున్నాను చూడగలరు http://www.scribd.com/doc/119337735/Maga-Vallum-Ar-a-Ali

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.