డా. రోష్ని
ముత్యాల్లాంటి పలువరుస, వెన్నెల్లాంటి చిరునవ్వు అని మన నోరు, నోటిలోని పళ్ళగురించి అందంగా వర్ణిస్తూ సంతోషపడతాం. కాని దైనందిన జీవితంలో నోటి శుభ్రత, పళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తున్నామా?- అనే సందేహం వస్తూ ఉంటుంది. పళ్ళతో సీసా మూతలు తియ్యడం, ప్లాస్టిన్ ప్యాకెట్లను తెరవడం లాంటి పనులు చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల పంటి మీది ఎనామిల్ పాడవ్వడమే కాకుండా ఇతర ఇబ్బందులు చూడగలుగుతాయి. అవేంటో తెలుసుకుంటే పళ్ళ గురించి శ్రద్ధ వహిస్తారని ఆశ.
మన నోటిలో పంటి చిగుళ్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు గులాబి రంగులో ఉంటాయి. ఇవి గనుక ఎర్రగా ఉబ్బి ఉంటే చిగుళ్ళ వ్యాధి ఉందని గుర్తించడమే కాకుండా వీరిలో గుండెజబ్బు మొదలుకొని మధుమేహం ఉండే అవకాశం ఉంది. కారణాలు వివరించడానికి ఇంకా పరిశోధన జరగాల్సిఉంది. మామూలుగానే పళ్ళ మీద పొరలాంటి ‘గార’ ఏర్పడుతుంది. ఇది సూక్ష్మజీవులతో కూడి ఉంటుంది. ఈ గారను కనీసం రోజుకు రెండు సార్లయినా నోటిని బ్రష్ చేసుకోడం ద్వారా శుభ్రం చేసుకోవాలి. లేకుంటే చిగుళ్ళకు, పంటి మూలాలకు వ్యాధులొచ్చే అవకాశం ఉంది.
ఈ గారలోని సూక్ష్మజీవులు వేరే అవయవాల్లో ఉన్న రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, రక్తప్రసరణకు అంతరాయం కలగడానికి దోహదం చేస్తాయని పరిశోధకులు చెపుతున్నారు. దీనివల్ల గుండెపోటు, జ్ఞాపకశక్తి తగ్గడం జరగొచ్చు. మధుమేహం ఉన్న వాళ్ళలో ఇన్‌ఫెక్షన్‌ని ఎదుర్గొనే శక్తి తగ్గుతుంది. రక్తంలో చక్కెర పెరిగితే చిగుళ్ళ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి చక్కెరను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.
నోరు పొడి బారితే చిగురు, పంటి వ్యాధులు వస్తాయి. నోటిలో ఊరే లాలాజలం పళ్లు, వాటి చిగుళ్ళు సూక్ష్మజీవుల బారిన పడకుండా కాపాడుతుంది. కొన్ని రకాల మందులు, జబ్బులు (ఉదా. మధుమేహం) నోరు పొడిబారేలా చేస్తాయి. దీనివల్ల పంటి జబ్బులు రావచ్చు. మానసిక వత్తిడిని గురయ్యేవారిలో పంటి జబ్బులు ఎక్కువ. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు 50% మంది సరిగా బ్రష్ చేసుకోరు. ఎముకల్లో కాల్షియం తగ్గిన (ఆస్టియోపోరోసిస్) స్థితిలో ఊడిపోయే అవకాశం ఉంది. రక్తహీనత ఉన్న వారిలో నోటిపుండ్లు ఏర్పడతాయి. నాలుక నున్నగా వాచినట్లు అవుతుంది. బులేమియా పేషంట్లలో అధికంగా అయ్యే వాంతుల వల్ల పళ్లు పాడయ్యే అవకాశం ఉంది.
రుమాటాయిడ్ ఆర్ధ్రరైటిస్ (కీళ్ళవ్యాధి)లో పంటిజబ్బులు సామాన్యం. ఈ వ్యాధి వున్న పేషంట్లు చేతివేళ్ల కీళ్లలో నొప్పులవల్ల సరిగా బ్రష్ చేసుకోలేదు. దీనివల్ల పంటి జబ్బులు పెరుగుతాయి. పళ్లు ఊడిన వారిలో మూత్రపిండాల వ్యాధులు అధికం. అసలు పంటి జబ్బులకు సరిఅయిన వైద్యం చేస్తే ఈ వ్యాధులను నివారించవచ్చు.
చిగుళ్ళ వ్యాధులున్న స్త్రీలకు తక్కువ బరువున్న పిల్లలు పుడతారు. నెలలు నిండకుండా కాన్పు అయ్యే ప్రమాదం వుంది. అలాగే గర్భవతులలో, హార్మోన్ల సమతుల్యంలో తేడాలున్నప్పుడు పంటి వ్యాధులు రావచ్చు.
ు మొత్తానికి పంటి, చిగురు వ్యాధులున్న వారిలో ఈ క్రింది వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
ు గుండెపోటు (గుండె రక్తనాళాలో రక్తప్రసరణ తగ్గడంవల్ల)
ు జ్ఞాపకశక్తి తగ్గటం (మెదడుకు రక్తప్రసరణ తగ్గడంవల్ల)
ు బరువు తక్కువ పిల్లలు పుట్టడం, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం.
ు మధుమేహం ఎక్కువవుతుంది.
ు కీళ్లకు సంబంధించి రుమాటాయిడ్ ఆర్ఘ్రెటిస్ ఎక్కువవుతుంది.
ు కాబట్టి పై సమస్యల నుంచి కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ు పండ్లపై గార పట్టకుండా రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. దీనికై మరీ బిరుసుగా ఉండే బ్రష్ వాడకూడదు గంటల తరబడి బ్రష్ చేయకూడదు. 3-4ని. చేస్తే చాలు.
ు పిన్నులతో పళ్ళమధ్య చిక్కుకున్న ఆహారపదార్ధాలు తీయరాదు. సీసాల మూతలు తీయరాదు.
ు ఒక వేళ పంటి పళ్ళతో చిగురు వ్యాధులుంటే వెంటనే వైద్యం చేసుకోవాలి.
ు మధుమేహం ఉంటే రక్తంలో చక్కెర శాతం కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి. గర్భవతులు పంటి జబ్బులకు సరయిన వైద్యం చేయించుకోవాలి.
ు భోజనానికి భోజనానికి మధ్య చిరుతిండ్లు, స్వీట్లు, చాక్‌లెట్లు తినకూడదు. దీని బదులు పీచు పదార్ధం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల సలాడ్‌లు తినడం మంచింది.
ు ఎక్కువగా వేడి పదార్ధాలు, ఎక్కువ చల్లని పదార్ధాలు తినరాదు.
ు మరీ పుల్లటి పదార్ధాలు తినడం కూడా మంచిందికాదు.
ు శరీరంలో కాల్సియం తగ్గకుండా చూసుకోవాలి
ు ఏదైనా తినప్పుడు వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి.