నిత్యం నిప్పు రాజేసి వండి వడ్డించే
వంటింటికే నిప్పంటించాలనే ఆలోచన
కుటుంబ వ్యవస్థనే కూల్చేస్తుంది!
ఓపెన్ కిచెన్‌ల ఆధునికత నడక నేర్చి
నడి రోడ్డెక్కి జొమాటో స్విగ్గీలై
జోడు గుర్రాల స్వారీ చేస్తోంది!
ఇంటింటా ఉండే పాకశాస్త్ర
ప్రావీణ్యం పాఠ్యాంశంగా మారి
పరాయిదైపోయింది!
అరుదైపోయిన ఇంటి వంట
అపురూపమైన మహా ప్రసాదంలా
కళ్ళకద్దుకోవాలన్నా వేచి చూడాల్సిందే!
మారిన తరం అర్థం చేసుకుని ఎన్నో
బాధ్యతల్ని పంచుకున్నా రోజు
వండుకోవటం అందని ద్రాక్షవుతోంది!
వంటింటిని వదిలేసినా ఆగని
గడియారంలా అనునిత్యం ఆకలి
అగ్గి రాజేస్తూనే ఉంటుంది!
నిర్లక్ష్యమే ఆహారంగా ఆరోగ్యాన్ని వేపుకు
తింటే అనారోగ్యం చెల్లించమంటుంది
అధిక బరువైన బిల్లుల్ని!
ఆన్‌లైన్ ఆర్డర్ సౌకర్యాన్ని కొడుకుతో
పంచుకు తింటూ నాన్నకు
చెప్పొద్దంటుంది అమ్మ!
అడగరని తెలియక అడిగితే
ఆకలి లేదని చెప్పాలనుకుంటాడు
బయట తిని వచ్చిన నాన్న!
ఇంటి భోజనంతో సంతోషాన్ని కలిసి
పంచుకున్న నిన్నటి తరానికి వారసులైన
వారి మధ్య ఎదుగుతున్నారు
‘‘రేపటి పౌరులు’’!!