ఆడెపు లక్ష్మీపతిగారు 1996లో రాసిన కథ ‘తిర్యగ్రేఖ’. ఇటీవల అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా వెలువడిన ఆయన రెండవ కథా సంపుటి ‘త్రిభుజపు నాలుగో కోణం’లో చేర్చబడిరది. ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని రాయబడిరది ఈ కథ. ఆ సంఘటన గురించి దాదాపు కథ చివర్లో మనకు చెబుతారు రచయిత.
కొంతవరకు మనం ఆ సంఘటనను ఊహించగలిగినా, కథ నడిపిన విధానం, ఆ సంఘటన రచయిత ఎలా వివరిస్తారోనన్న ఉత్కంఠ మనల్ని కథ వెంట పరుగులు తీయిస్తుంది. లక్ష్మీపతి గారి ఈ ఒక్క కథనే తీసుకుని ఎందుకు రాస్తున్నానంటే సమగ్రమైన చర్చకు అర్హత ఉన్న కథ ఇది అని అనిపించడమే! అంతేకాకుండా ఇప్పటికీ మారవలసినంతగా మారని మన సమాజానికి వర్తించే కథ కాబట్టి!
ఇక కథలోకి వద్దాం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి రేఖ. మూడు తరాల మనుష్యులు అంటే నానమ్మ, నాన్న, మామయ్య, (వాళ్ళ పేర్లు ప్రస్తావించబడలేదు). అమ్మ (రాజ్యం), అన్నయ్య (మూర్తి), తమ్ముడు (పేరు చెప్పలేదు). వీరి మధ్య ఒక్కగానొక్క కూతురిగా రేఖ. కాలేజీలో చదువుతున్న రేఖకి రెబెక్కా, మధూలిక, లావణ్య, మీనాక్షి మంచి స్నేహితురాండ్రు. వీరిలో రెబెక్కా, మధూలికల ప్రస్తావన కథలో ఎక్కువగా ఉంటుంది. మధూలిక అందంగా కనపడాలని కోరుకునే యువతి. రకరకాల డ్రస్సులు వేసుకుని వస్తుంది కాలేజీకి. రెబెక్కా ఆమెకి వ్యతిరేకం! జీన్స్, కుర్తాలలో కనబడుతుంది. స్త్రీవాద భావజాలానికి ప్రభావితమైన యువతి అనిపిస్తుంది.
రేఖ లావుగా ఉంటుంది. మధూలిక ఆమెను జూనియర్ టున్ టున్ అని తరచు గేలిచేస్తుంటుంది. రెబెక్కా ఆమెను తనతోపాటు జిమ్‌కి వచ్చి ఎక్సర్‌సైజ్ చెయ్యమని ప్రోత్సహిస్తుంది. రేఖ ఇంట్లో వాళ్ళు దానికి అంగీకరించరు. అన్నయ్య తనతోపాటు వాకింగ్‌కి రమ్మని పిలుస్తాడు. అలా వాకింగ్ మొదలవుతుంది. నెయ్యి, బంగాళదుంపలు, పప్పులు తినడం తగ్గిస్తుంది. శరీరం బరువు తగ్గి కొంతలో కొంత మార్పు వస్తుంది. దానికి సంతోషపడుతుంది. ఒక యువకుడు ఈలపాట పాడుతూ ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాడు.
మూర్తికి స్కూటర్ యాక్సిడెంట్ మూలంగా చీలమండలం దగ్గర చిన్న గాయమవుతుంది. వాకింగ్ ఎక్కువ చెయ్యలేక ఒకచోట కూర్చుండిపోతాడు. రేఖని వాకింగ్ చెయ్యమని, మరీ ఎక్కువ దూరం కాకుండా ముఖ్యంగా యూకలిప్టస్ తోట దిశగా వెళ్ళొద్దు, చీకటిగా ఉంటుంది, పిచ్చి కుక్కలుంటాయి జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. అతని మాట వినకుండా, బిల్డింగ్ దాటి, బాస్కెట్‌బాల్ కోర్టు దాటి, యూకలిప్టస్ తోట దగ్గరగా వెళ్తుంది. ఈలపాట వాడు వెనకనుంచి వచ్చి ఆమె నోరునొక్కి, లాక్కువెళ్ళి అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత ఇంట్లోవాళ్ళు ఆ సంఘటనకి ఎలా రియాక్టవుతారో కథలో చెప్పబడుతుంది. ఇదీ క్లుప్తంగా కథ!
కథకు ప్లస్ పాయింట్ పాత్ర చిత్రణ! కథలో చెప్పబడిన సంఘటనకు పాత్రలు ఎలా స్పందిస్తాయో, వ్యవహరిస్తాయో తెలుసుకోవడం ద్వారా పాత్రల మనస్తత్వాలను, గుణాలను, స్వభావాలను అంచనా వెయ్యవచ్చు. ముందుగా నానమ్మ. వయసుకి తగ్గట్టే సనాతన అభిప్రాయాలు కలది. కట్టుబాట్లు సడలించి చదువు, సమానత్వం అంటూ ఆడపిల్లలను వదిలేసి, ఇప్పుడు కొడితే, తిడితే ఏమిటి ప్రయోజనం అంటుంది. యవ్వనంలో భర్త రసికుడై ఎటువంటి లీలలు చేశాడో వివరిస్తుంటుంది. సౌందర్యరాశి నారాయణమ్మ కాలుజారి ఎలా ఆత్మహత్య చేసుకుందో, ఆ తర్వాత దానికి కారణమయిన భర్త పక్షపాతంతో మంచానపడి ఎలా పోయాడో చెప్తుంది. ఆ శాపమే ఇప్పుడు కుటుంబాన్ని పీడిస్తోందని, అందుకే ఇటువంటి సంఘటన జరిగిందని అంటుంది.
అమ్మ రాజ్యం గడపలో అలుకు పిడుచలా కూలబడుతుంది. ఆకాశంలో సగానికి అనాదిగా ఈ బాధలు ఎందుకు దాపురిస్తున్నాయో అని తలపోస్తూ కుమిలిపోతుంది. అపరాధ భావన, ఆత్మ గౌరవం, పరువు ప్రతిష్టల భయం, నిస్సహాయత ఆమెని రేఖ పట్ల కఠినంగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. గదిలో నుండి బయటికి రావద్దని రేఖను శాసిస్తుంది. కానీ అదే సమయంలో తల్లి ప్రేమ ఆమెను కరిగిస్తుంది. తన ఒడిలో పడుకున్న రేఖ తలని తన చల్లని చేతితో నిమురుతుంది.
పితృస్వామ్య యూనిట్ పెద్ద నాన్న! ఈ సమయంలో ఏం చెయ్యాలో తెలియక రాజ్యం అన్నని, అంటే రేఖ మామయ్యని సమస్యను పరిష్కరించడానికి ఆశ్రయిస్తాడు. వయస్సులో పెద్ద అయిన, సంఘంలో పరపతి ఉన్న మామయ్య సమాజానికి వ్యతిరేకమైన సిద్ధాంతాలను ఆమోదించనివాడు. ఒక సంబంధం ఉందని, పెళ్ళి ప్రస్తావన తెస్తానని, వాళ్ళు సానుకూలంగా ప్రతిస్పందిస్తే సమస్య పరిష్కారమవుతుందని చెప్తాడు. ఒకసారి చట్టాన్ని ఆశ్రయిస్తే క్షోభ తట్టుకోవడం మన వల్ల కాదని కూడా అంటాడు.
అన్నయ్య ఆదర్శవంతమైన పాత్ర. పిచ్చి పిచ్చి కథలను, సనాతన భావాలను రేఖ బుర్రలోకి ఎక్కించవద్దని నానమ్మ మీద ఎగురుతాడు. ఇంట్లోవాళ్ళు రేఖని జిమ్‌కి వెళ్ళడానికి వ్యతిరేకిస్తే, రోజూ తనతో వాకింగ్‌కి రమ్మని ప్రోత్సహిస్తాడు. సంఘటన తర్వాత రేఖకి తోడుగా ఉన్నాడు. మహిళా పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇప్పించటంలో, వైద్య పరీక్ష జరిపించడంలో అతని పూర్తి సహకారం ఉంది. ఇంట్లో అందరూ జరగరాని అనర్థం జరిగినట్లు ప్రవర్తిస్తుంటే, తను చేతులు ముడుచుకుని కూర్చోలేదని, ఇవాళ వీథి కాలువలో నెత్తురు ప్రవహించాల్సిందే అని ఆవేశపడతాడు. కానీ పెద్దవాళ్ళ ఆధిపత్యానికి లొంగిపోయి మెదలకుండా ఉండిపోతాడు. చివరికి రేఖ స్వతంత్ర నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ విశాల విశ్వంలో ఆమెతోపాటు నడవడానికి సిద్ధపడిన అభ్యుదయ వాది!
కాలేజీ ప్రిన్సిపాల్ గరిమాదేవి, రేఖ స్నేహితురాండ్రు రేఖకు పూర్తి చేయూతనిస్తారు. నీ వెనుక నారీ జగత్తంతా నిలబడుతుంది, నీవు ఒంటరిదానివి కాదు, ఉద్యమ శక్తివి, సమాజం, భయాలు, భేషజాల నడుమ కృత్రిమ దర్పం ఒలకబోస్తూ బతుకుతుందని, దాన్ని మార్చడం ఈ యువతరానికి సాధ్యమవుతుందని రేఖ కన్నీళ్ళు తుడుస్తుంది గరిమాదేవి. తల్లిలా వెన్ను తడుతుంది. స్నేహితురాండ్రు వెచ్చటి కరస్పర్శల ద్వారా నూతనోత్తేజాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తారు.
రేఖ ఫ్రెండ్స్ అందరిలో ప్రత్యేకంగా కనిపించే పాత్ర రెబెక్కా. రేఖను తనతో జిమ్‌కి వచ్చి వ్యాయామం చేయమని ప్రోత్సహిస్తుంది. ఆడపిల్లలకి తిండి, చదువు ఈ రెండే పరమావధి కాదు, నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి అంటుంది. సిటీబస్సులో అసభ్యంగా ప్రవర్తించిన తుంటరిని అదరగొడుతుంది. స్త్రీ సెక్స్ ఆబ్జెక్టుగా, కమర్షియల్ ట్రేడ్ మార్కుగా ఉండేందుకు ఇష్టపడుతోందని, మహిళా పత్రికల్లో సైతం ఈ ధోరణి కనబడుతోందని, ఇది మారాలని అభిప్రాయపడుతుంది. గుట్కా నములుతూ, పబ్లిక్ స్థలాల్లో అశ్లీల పదాలు కూయడం, అమ్మాయిల్ని ఏడిపించడం పురుష లక్షణాలని అనుకుంటున్నారని నిరసిస్తుంది.
ఇక ప్రధాన పాత్రధారి రేఖను చూద్దాం! ఆమె సంఘటన తర్వాత తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయింది. గుండెల్లో దడతో, ఉద్వేగంతో కాలేజీలో అడుగుపెడుతుంది. నలభై ఎనిమిది గంటలు ఆమె జీవితంలో నలభై ఎనిమిదేళ్ళ అభౌతిక సారాన్ని ప్రవేశపెట్టాయి. గరిమాదేవి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అత్యాచారం మీద సమాజ దృక్పథం మారదా మేడమ్ అని ప్రశ్నిస్తుంది.
కానీ ఆమెలో సమస్యలను ఎదుర్కొనే శక్తి, ఆత్మవిశ్వాసం ఉన్నాయని ఆమె ధైర్యంగా కాలేజీలో అడుగుపెట్టడంలోనే తెలుస్తుంది. నాన్న, మామయ్య తనను సంప్రదించకుండా తన భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటుంటే సహించలేక పోతుంది. తనను మనసులేని మరబొమ్మ అనుకుంటున్నారని, పురుషాధిక్య సమాజంలో స్త్రీకి జరిగిన అన్యాయానికి పురుషకోణం నుండే విచారణ జరిగి, పురుష స్వభావం నుండే తీర్పు ఇవ్వబడుతోందనీ, జీవితంపై తనకు గల హక్కును గొంతు పగిలేలా చాటింపు వెయ్యాలని ధైర్యంగా ఆలోచిస్తుంది. స్త్రీకి స్వేచ్ఛ ఆర్థిక స్వాతంత్య్రంతో సాధ్యమవుతుందన్న వర్జీనియా వుల్స్ మాటలు గుర్తు చేసుకుంటుంది. ఆత్మన్యూనతా భావాన్ని, ఆడది అబల అన్న పిరికి ఆలోచనను నిర్దాక్షిణ్యంగా చంపెయ్యాలనుకుంటుంది. ‘‘మీరు కాలం వెంట పరుగెత్తే మనుషులు మామయ్యా! నేను కాలాన్ని నా వెంట పరుగెత్తేలా చేస్తాను’’ అని ఆత్మవిశ్వాసంతో స్థిరంగా పలుకుతుంది.
స్త్రీవాద సిద్ధాంతాలను ఘంటాపథంగా వ్యక్తీకరించే ఈ కథ పురుషుడు రాసిన స్త్రీవాద కథ! స్త్రీవాద గొంతుకలు ప్రముఖంగా వినిపించిన ఆ కాలంలో ఇటువంటి రచన రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ వస్తువుని, కథా సారాంశాన్ని పరిశీలిస్తే ఈ కథ ఇప్పటికీ రిలవెంట్ అని చెప్పవచ్చు!
కథ రాసిన విధానం అత్యంత ఆసక్తికరం! రచయిత మాటల్లోనే చెప్పాలంటే (ఆయన 22 మే, 2023న ఆంధ్రజ్యోతి వివిధకు ఇంటర్వ్యూ ఇచ్చారు) నువ్వు అన్న సంబోధనతో కథ నడపడం మధ్యమ పురుష దృష్టికోణమని, తాత్విక లేక మనోవైజ్ఞానిక ఇతివృత్తాలకు బాగా నప్పుతుందని అన్నారు. రేఖ పడిన వేదన, సంఘర్షణ చిత్రించేందుకు ంష్ట్రఱట్ ఱఅ ్‌ఱఎవ ంవనబవఅషవ` ఫ్లాష్‌బ్యాక్‌లో మరో ఫ్లాష్‌బ్యాక్‌ను ఉపయోగించానని అన్నారు.
కథకు పెట్టిన శీర్షిక విలక్షణంగా ఉండి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ‘తిర్యగ్రేఖ’ జామెట్రీకి సంబంధించిన పదం. ఇంగ్లీషులో దీన్ని ట్రాన్స్‌వర్సల్ లైన్ అంటారు. ఆ లైను కొన్ని పారలల్ లైన్స్‌ని ఛేదించుకుంటూ పోతుంది. కథకు ఈ పేరు పెట్టడంలో రచయిత ఆంతర్యమేమిటి? పారలల్ లైన్స్ ఒక విధమైన ఆలోచనా ధోరణికి అంటే ముఖ్యంగా సనాతన భావాలకి ప్రతీకలని రచయిత అభిప్రాయపడినట్లు తోస్తుంది. వాటిని ఛేదించుకుంటూ వెళ్ళే తిర్యగ్రేఖ ఆధునిక, అభ్యుదయ ఆలోచనా ధోరణిని తెలుపుతుందన్నది ఆయన ఉద్దేశ్యం కావచ్చు. ఇటువంటి శీర్షికను పెట్టడం రచయితకున్న ప్రగతిశీల దృక్పథానికి నిదర్శనం!
కథను ఎంతో పాజిటివ్‌గా కూడా ముగించారు. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసానికి, స్వాభిమానానికి ప్రతీకలా ఎత్తైన కాలేజీ బిల్డింగ్, స్వేచ్ఛా విహంగాల శ్రేణి, మురిపించే మందారంలా సూర్యుడు అన్న ప్రోత్సాహకరమైన మాటలు చివరలో చేర్చడం ఆశాజనకమైన సందేశం ఇవ్వడానికేనని అనిపిస్తుంది. కథ రాసి 27 సంవత్సరాలైనా అది మనల్ని ఇప్పటికీ చదివిస్తుంది అంటే వస్తు శిల్పాల సమగ్ర సమ్మేళనంతో రాసిన మంచి కథ అని అనిపించక మానదు. అత్యాచారానికి గురైన స్త్రీ తన జీవితం ముగిసిపోయిందనుకోకుండా, సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలన్నదే కథ ఇచ్చే సందేశం!