ప్రైడ్ నెలలో, ూARI లైబ్రరీ పెద్ద మెట్రోలకు, నగరాలకు దూరంగా నివసిస్తోన్న క్వీర్ కమ్యూనిటీ వారి జీవితాలను, డేటాను వెలుగులోకి తెస్తోంది, వారి గొంతులను వినిపిస్తోంది. వారి వ్యక్తిగత, వృత్తిగత జీవితాలలో ఎదుర్కొంటోన్న సామాజిక బహిష్కరణను గురించి తెలియజేస్తోంది.
అంతర్జాతీయ న్యాయ నిపుణుల కమిషన్ ప్రచురించిన లివింగ్ విత్ డిగ్నిటీ 2019 నివేదిక ప్రకారం, నిర్బంధం, బలవంతపు పెళ్ళి, లైంగిక, శారీరక హింస, ‘దిద్దుబాటు’ (corrective) చికిత్సలు అనేవి ఎల్‌జిబిటిక్యుఐఎG (LGBTQIA+) కమ్యూనిటీ సభ్యులు తరచుగా ఎదుర్కొనే అనుభవాలు, బెదిరింపులు.
ముంబైలో కలిసి జీవించడానికి మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్ జిల్లాల్లోని తమ ఇళ్ళను విడిచిపెట్టాల్సి వచ్చిన విధి, ఆరుష్ (పేర్లు మార్చబడ్డాయి)ల విషయాన్నే తీసుకోండి. విధి, ఆరుష్ (ట్రాన్స్ మ్యాన్‌గా గుర్తించబడుతున్నారు)లు నగరంలోని ఒక అద్దె గదిలోకి మారారు. ‘‘మా ఇంటి యజమానికి మా సంబంధం గురించి తెలియదు. మాకు ఈ గదిని ఖాళీ చేయాలని లేదు. అందుకని మేం మా బంధాన్ని దాచిపెట్టాలి,’’ అని ఆరుష్ చెప్పారు. ఎల్‌జిబిటిక్యుఐఎG వ్యక్తులకు తరచుగా ఆశ్రయం దొరకదు. కుటుంబాలు, అద్దె ఇంటి యజమానులు, ఇరుగుపొరుగు వాళ్ళు, పోలీసులు వారిని వేధిస్తారు, ఇళ్ళ నుంచి బలవంతంగా గెంటేస్తారు. అనేకమంది ఇల్లూ, వాకిలి లేనివారుగా మిగిలిపోతున్నారని లివింగ్ విత్ డిగ్నిటీ రిపోర్ట్ చెబుతోంది.
అపవాదులు, వేధింపులు చాలామంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను, ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో, వారి ఇళ్ళను విడిచిపెట్టి, సురక్షిత స్థలాలను వెదుక్కునేలా చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ 2021లో విడుదల చేసిన అధ్యయనం, ‘‘వారి లింగ వ్యక్తీకరణను దాచిపెట్టాలని కుటుంబం వారిని ఒత్తిడి చేస్తుంది,’’ అని తెలిపింది. వారి కుటుంబం, స్నేహితుల, సమాజాల వివక్షాపూరిత ప్రవర్తన కారణంగా దాదాపు సగంమంది ప్రజలు తమ ఇళ్ళను విడిచిపెట్టారు.
‘‘కేవలం మేం లింగమార్పిడి చేసుకున్నందుకే మాకు ఇజ్జత్ (గౌరవం) లేదని అనిపిస్తుందా?’’ అని అడుగుతారు ట్రాన్స్ మహిళ శీతల్. పాఠశాలలో, పనిచేసే చోట, వీథుల్లో, దాదాపు ప్రతిచోటా ఎదుర్కొన్న ఎన్నో ఏళ్ళ చేదు అనుభవాల నుంచి ఆమె ఇలా అడుగుతున్నారు. ‘‘అందరూ మమ్మల్ని ఎందుకు తిరస్కారంతో చూస్తారు?’’ అంటూ ‘మేమేదో దుష్టశక్తులమైనట్టు జనం మమ్మల్ని మిటకరించి చూస్తున్నారు’ అనే తన కథలో అడుగుతారు శీతల్. కొల్హాపూర్‌లో, సకీనా (మహిళగా ఆమె పెట్టుకున్న పేరు) స్త్రీగా జీవించాలనే తన కోరిక గురించి తన కుటుంబానికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు, కానీ (ఆమెను మగవాడిగా చూసే) కుటుంబసభ్యులు ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారు. ‘‘ఇంటిదగ్గర నేను ఒక తండ్రిగా, ఒక భర్తగా జీవించాలి. మహిళగా జీవించాలనే నా కోరికను నేను తీర్చుకోలేను. నేనొక ద్వంద్వ జీవితాన్ని… నా మనసులో ఒక స్త్రీగానూ, ప్రపంచానికి ఒక పురుషుడిగానూ జీవిస్తున్నాను.’’
ఎల్‌జిబిటిక్యుఐఎG కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల పట్ల పక్షపాత వైఖరి మన దేశంలోని అనేక ప్రాంతాల్లో చాలా బలంగా ఉంది. ఉదాహరణకు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సంరక్షణ, ఓటింగ్, కుటుంబం, వివాహం వంటి రంగాలలో సిస్‌జెండర్ (ట్రాన్స్‌జెండర్ కాని) వారికి అందుబాటులో ఉన్న అనేక హక్కులు ట్రాన్స్‌జెండర్ సముదాయానికి అందుబాటులో లేవని ‘హ్యూమన్ రైట్స్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్ యాజ్ థర్డ్ జెండర్’ అనే ఈ అధ్యయనం చూపుతోంది. ‘‘ఇది సరైనదని నేను అనుకోను, వారు (విలక్షణ వ్యక్తులు) దీనికోసం పోరాటకూడదు, ఎందుకంటే వారు అడిగేది సహజమైనది కాదు ` వారికి పిల్లలు ఎలా పుడతారు?’’ అని హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల పట్టణంలో, ఏప్రిల్ 2023లో జరిగిన మొదటి ప్రైడ్ మార్చ్‌పై నవనీత్ కోఠివాలా వంటి కొంతమంది స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు నిత్యం వివక్షకు, ఒంటరితనానికి గురవుతారు. వారికి వసతి, ఉద్యోగాలు ఇవ్వడానికి నిరాకరిస్తారు. ‘‘మాకు అడుక్కోవడం ఇష్టం లేదు, కానీ ప్రజలు మాకు పని ఇవ్వరు’’ అని రాధికా గోసావీ అంటున్నారు. ఆమె తనకు 13 ఏళ్ళ వయస్సులో తాను ట్రాన్స్‌జెండర్‌నని గుర్తించారు. ‘‘దుకాణదారులు మమ్మల్ని పక్కకు పోండని చెబుతారు. మా పొట్ట నిండేంత సంపాదించుకోవటం కోసం మేం ఆ ఛీత్కారాలన్నిటినీ భరిస్తుంటాం’’ అని చెప్పారామె.
సామాజిక తిరస్కరణ, హక్కుగా రావలసిన ఉద్యోగ అవకాశాలను తిరస్కరించడం ట్రాన్స్‌జెండర్లకు ప్రధాన సమస్య. ‘హ్యూమన్ రైట్స్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్ యాజ్ ఎ థర్డ్ జెండర్’ ఉత్తరప్రదేశ్, ఢల్లీిలో నిర్వహించిన అధ్యయనంలో 99 శాతం మంది ఒకటి కంటే ఎక్కువసార్లు సామాజిక తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. 96 శాతం మందికి ఉపాధి అవకాశాలను నిరాకరించారని తెలిపారు.
‘‘మేం ఎక్కడికైనా వెళ్ళాలంటే రిక్షా తొక్కేవాళ్ళు మమ్మల్ని ఎక్కించుకోరు. రైళ్ళలోనూ, బస్సులలోనూ జనం మమ్మల్ని అంటరానివాళ్ళను చూసినట్టు చూస్తారు. ఎవరూ మా పక్కన నించోవటం కానీ, కూర్చోవడం గానీ చేయరు. కానీ మేమేదో దుష్టశక్తులమైనట్లు మావైపు
కళ్ళు మిటకరించి చూస్తుంటారు’’ అంటారు ట్రాన్స్‌జెండర్ వ్యక్తి రాధిక.
ఎల్‌జిబిటిక్యుఐఎG వ్యక్తులు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లతో సహా పబ్లిక్ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వివక్షను ఎదుర్కొంటారు. వారిని లోపలికి రానివ్వరు. సేవలను అందించడానికి నిరాకరిస్తారు. అనవసర నిఘాకు గురవుతారు. వారినుంచి అధిక ధరలను వసూలు చేస్తారు. విద్యను పూర్తిచేయడం వీరికి అదనపు సవాలుగా మారుతుంది. మదురైకి చెందిన కుమ్మి (సంప్రదాయ గీతం) నృత్య ప్రదర్శకురాలైన కె.స్వస్తిక తన బిఎ డిగ్రీని, ఐ.శాలిని తన 11వ తరగతిని ట్రాన్స్ మహిళలు కావటం వల్ల వేధింపులకు గురై, మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. 2015లో (ట్రాన్స్‌జెండర్లను మూడవ జెండర్‌గా గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఒక సంవత్సరం తర్వాత) ప్రచురించబడిన ఈ సర్వే, కేరళలో 58 శాతం మంది ట్రాన్స్‌జెండర్ సముదాయానికి చెందినవారు, 10వ తరగతి పూర్తికాకముందే బడి మానేసినట్లు చూపిస్తోంది. పాఠశాలల్లో తీవ్రమైన వేధింపులు, రిజర్వేషన్ లేకపోవడం, ఇంట్లోవాళ్ళ మద్దతు లేకపోవడం, ఇలా చదువును మధ్యలోనే వదిలేయడానికి కారణాలు.
… … …
‘‘మహిళల జట్టులో ఒక పురుషుడు ఆడుతున్నాడు’’ ఇటువంటివి శీర్షికలుగా ఉండేవి అని పురుషుడిగానూ, ఇంటర్ సెక్స్ వ్యక్తిగానూ గుర్తింపు ఉన్న బోనీపాల్ గుర్తుచేసుకున్నారు. మాజీ ఫుట్‌బాల్ ఆటగాడైన ఈయన, 1998 ఆసియా క్రీడలలో ఆడే జాతీయ జట్టుకు ఎంపికయ్యారు కానీ, లింగ గుర్తింపు కారణంగా జట్టు నుంచి తొలగించబడ్డారు.
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల హై కమిషనర్ కార్యాలయం ప్రకారం, ఇంటర్‌సెక్స్ వ్యక్తులు లైంగిక లక్షణాలలో (జననేంద్రియాలు, వృషణాలు లేదా అండాశయం (gonads), క్రోమోజోమ్ నమూనాలతో సహా) సాధారణ ఆడ, మగ శరీరాలకు సరిపోలరు.
‘‘నాకు గర్భాశయం, ఒక అండాశయం, లోపల ఒక పురుషాంగం కూడా ఉన్నాయి. నాకు రెండు వైపులకు చెందినవి (పునరుత్పత్తి భాగాలు) ఉన్నాయి’’, అని బోనీ చెప్పారు. ‘‘నా శరీరం వంటి శరీరం భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా ఉంది. అథ్లెట్లు, టెన్నిస్ క్రీడాకారులు, ఫుట్‌బాల్ క్రీడాకారులు… ఇలా నాలాంటి క్రీడాకారులు చాలామంది ఉన్నారు.’’ సమాజానికి భయపడి ఇంటినుంచి బయటకు వచ్చేదిలేదని బోనీ అన్నారు. ఎల్‌జిబిటిక్యుఐఎG కమ్యూనిటీ సభ్యులు తరచుగా బెదిరింపులకు, హింసకు గురికావడమే కాక, హీనంగా చూడబడతారని ఈ నివేదిక పేర్కొంది. వాస్తవానికి, భారతదేశంలో 2018లో నమోదైన గణాంకాల ప్రకారం మొత్తం మానవ హక్కుల ఉల్లంఘన కేసులో 40 శాతం భౌతిక దాడికి సంబంధించినవి కాగా, ఆ తర్వాత అత్యాచారం, లైంగిక వేధింపులు (17 శాతం) ఉన్నాయి.
కర్ణాటక మినహా దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2014 నుంచి ఈ మూడవ జెండర్‌ను ఒక గుర్తింపుగా, చట్టబద్ధంగా గుర్తించే అవగాహనా కార్యక్రమాలను చేపట్టలేదని ఈ నివేదిక చూపిస్తోంది. పోలీసు అధికారుల నుంచి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఎదుర్కొంటోన్న వేధింపుల గురించి ఈ నివేదిక ప్రముఖంగా పేర్కొంది. భారతదేశంలో మొదటి కోవిడ్`19 లాక్‌డౌన్ సమయంలో, సెక్స్ డెవలప్‌మెంట్‌లో తేడాలు ఉన్న చాలామంది వ్యక్తులు ‘‘వారి నిర్దిష్ట సమస్యలు, అవసరాల గురించి కనీస జ్ఞానం’’ లేని కారణంగా అవసరమైన ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని పొందడంలో విఫలమయ్యారని కరోనా క్రానికల్స్ పేర్కొంది. భారతదేశంలో ఎల్‌జిబిటిక్యుఐఎ+ ఆరోగ్య స్థితిని వివరించడానికి, అర్థం చేసుకోవడానికి PARI లైబ్రరీలోని లైంగిక, లింగ మైనారిటీల ఆరోగ్యం విభాగంలో ఉన్న ఇటువంటి అనేక నివేదికలు కీలకమైనవి. కోవిడ్`19 విపత్తు తమిళనాడు అంతటా అనేకమంది జానపద కళాకారులను నాశనం చేసింది. వారిలో ట్రాన్స్ మహిళా ప్రదర్శకులు అతి ఎక్కువగా నష్టపోయారు. ఏ పనీ లేదు, సాయం అందలేదు, రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు కూడా దక్కలేదు. ‘‘మాకు స్థిరమైన జీతం లేదు. ఈ కరోనా ముప్పు వలన మాకున్న కొద్దిపాటి జీవనోపాధి అవకాశాలను కూడా కోల్పోయాం’’ అని మదురై నగరానికి చెందిన ట్రాన్స్ మహిళా జానపద కళాకారిణి, అరవై ఏళ్ళ థర్మ అమ్మ అన్నారు.
థర్మ అమ్మ ఏడాదిలోని మొదటి సగంలో నెలకు రూ.8,000 నుంచి రూ. 10,000 మధ్య సంపాదించేవారు. రెండో సగంలో ఎలాగోలా నెలకు రూ. 3,000 వరకూ సంపాదించగలిగేవారు. అయితే కరోనా లాక్‌డౌన్‌లు ఈ అంతటినీ తలకిందులు చేశాయి. ‘‘ఆడ, మగ జానపద కళాకారులు పెన్షన్‌కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, ట్రాన్స్ వ్యక్తులకు అది చాలా కష్టం. నా దరఖాస్తులను ఎన్నోసార్లు తిరస్కరించారు’’ అని ఆమె అన్నారు. కనీసం కాగితాల మీదనైనా మార్పు వస్తోంది. 2019లో, భారతదేశం మొత్తానికి వర్తించే విధంగా ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల రక్షణ) చట్టం పార్లమెంటులో ఆమోదం పొందింది. ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, వృత్తి, స్వేచ్ఛగా సంచరించే హక్కు, ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయటం, లేదా అద్దెకు తీసుకోవడానికి, ఏదైనా ప్రభుత్వ సంస్థలో చేరటం, ఎన్నికల్లో పాల్గొనటం, సామాన్యులకు అందుబాటులో ఉన్న ఏ వస్తువు, వసతి, సేవ, సదుపాయం, ప్రయోజనాలనైనా పొందే హక్కు… వీటన్నింటికీ సంబంధించి ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల పట్ల ఎవరైనా వ్యక్తి, లేదా సంస్థ వివక్ష చూపకూడదని ఈ చట్టం చెబుతోంది.
లైంగిక గుర్తింపు ఆధారంగా ఎలాంటి వివక్షను చూపడమైనా రాజ్యాంగం ప్రకారం నిషేధం. మహిళల, పిల్లల హక్కుల పట్ల వివక్ష చూపడం, లేదా నిరాకరించటం చేయకుండా చూసేందుకు రాష్ట్రాలు ప్రత్యేక నిబంధనలను ప్రవేశపెట్టవచ్చునని కూడా రాజ్యాంగం చెబుతోంది. అయితే, క్వీర్ వ్యక్తుల కోసం అలాంటి నిబంధనలను ప్రవేశపెట్టవచ్చని ఇందులో ఎక్కడా పేర్కొనలేదు.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/en/articles/everyday-lives-of-queer-people-in-rural-india-te/) జూన్ 30, 2023 లో మొదట ప్రచురితమైనది.)