జాతి వైతాళికుడు గద్దర్‌ – డా॥ కత్తి పద్మారావు

జనం గుండెల నుంచి ప్రభవించిన సజీవ వాగ్గేయకారుడు గద్దర్‌. కవిత్వాన్ని పాటలో రంగరించి తత్వాన్ని బోధించిన మానవతా మూర్తి. గద్దర్‌ పాటల్లో కరుణరసం ప్రవహిస్తుంది. తల్లి హృదయం ధ్వనిస్తుంది. ఆయన పాటల్లో పల్లె జీవన సంస్కృతీ వికాసం ఉంది. ఆయన మాట పాటల్లో అట్టడుగు ప్రజల జీవన వేదం ఉంది.

ఆయన పేద ప్రజల గుండెచప్పుడు. ప్రపంచానికి వినిపించిన వాగ్గేయకారుడు. గద్దర్‌లోని గొప్పతనం ఆయన మహా మనిషి. మనసున్న మనిషి. ఆయన గుంపుగా జీవించి గుంపు నృత్యాన్ని రూపొందించడంలోనే ఆయనలో అమ్మతనం ఉంది. ఆయన కోటి గొంతులను సృష్టించిన గాన కళా నాయకుడు. గద్దర్‌ స్వరంలో మృదుత్వం ఉంది. సరిగమలు అలవోకగా పలుకుతాయి. వేమన, పోతులూరి వీరబ్రహ్మం, కబీరు, సంత్‌ రవిదాసు సూక్తులు, ఆయన పాటల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. ఆయన జననాట్యమండలి సృష్టికర్త. జనంలో ఒక అంతర్గత శృతి ఉంది. నదీ ప్రవాహాల సవ్వడి ఉంది. కొండ చరియల్లోని మూలుగు ఉంది. పక్షి గుంపుల్లోని ఏక స్వరం ఉంది. అది పట్టుకున్నాడు ఆయన. ఆయన పాటల్లో సంఘ శృతి ఉంది. ప్రజల గుండెల అలజడిని అలవోకగా పాట కట్టాడు. ఆయన నాలుక మీద ఆదిమ జాతుల స్వర విన్యాసం ఉంది. అవి అడవి రaంరaామృత ధ్వనులు కూడా వినిపించగలవు. సముద్ర ఘోషను ఆయన ఊరిలోనికి మోసుకొచ్చాడు. అడవి వేదనలను రాజ్య ప్రసాదాల్లోకి ప్రవహింప చేశాడు. పాలకవర్గాల కోట కోడలు కుదిపే రణ ధ్వని వినిపించాడు గద్దర్‌. గద్దర్‌ ఒక వేదనాపూరిత సముద్ర ఘోష. ఆయన నడకలోనే భూమి కంపించే ధ్వని ఉంది. ఆయన గజ్జల మోతకు ప్రపంచం కంపించింది. మృత కళేబరాల పుర్రెల్లో దాగున్న దళిత తత్వాన్ని ఆయన ప్రపంచానికి చాటాడు. నేను విశాఖపట్నం జైల్లో ఉన్నప్పుడు నక్సలైట్‌ సెల్‌ నుంచి ‘‘సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మా, నీవు సినబోయి కూచున్నవెందుకమ్మా’’ పాట అర్ధరాత్రి పాడాడు. అది నాలో పునరుత్తేజాన్ని తీసుకొచ్చింది. అందరూ దళిత వీరుల చెవుల్లో విప్లవ స్వరాన్ని వినిపించి సైనిక కవాతు చేయించిన సైన్యాధ్యక్షుడు ఆయన.
గద్దర్‌ 1985లో కారంచేడు ఉద్యమంలో మమేకమై ‘‘దళిత పులులమ్మ, కారంచేడు భూస్వాములతో కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ’’అని దళితులకు చైతన్యాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని, పోరాట శక్తిని కల్పించిన దళిత వీరుడు ఆయన. ఆయన తండ్రి అంబేద్కర్‌ స్థాపించిన మిలింద విశ్వవిద్యాలయానికి రాళ్లేత్తాడు. గద్దర్‌ అంబేద్కర్‌ కుల నిర్మూలన ఉద్యమానికి వెన్ను తట్టాడు. చేతిలో ఎర్ర జెండా ఉన్నప్పుడు కూడా గుండెల్లో అంబేద్కర్‌ని నింపుకున్నాడు. అందుకే ఆయన తన గమనంలో కుల నిర్మూలన వాదిగా, అస్పృశ్య నివారణ ఉద్యమంగా ధ్వనిస్తూ వచ్చాడు. కులం మీద ఆయన గొడ్డలి వేటు వేశాడు. ‘‘దళిత పులులమ్మ’’ ఆ పాటలో కథా కథన చాతుర్యాన్ని చూపాడు. కారంచేడులో వధించబడిన వారు వీరులు అని చాటి చెప్పాడు. అమరవీరుల జీవన గాథల సంపుటి ఆయన. కన్నీటి నుండి మంటలు తెప్పించగలిగిన సామాజిక విప్లవకారుడు గద్దర్‌. ఆయన ఒక నిర్మాణ కర్త. నిస్తేజంగా ఉన్న సమాజాన్ని వెన్ను తట్టి లేపిన వైతాళికుడు. నిజానికి గద్దర్‌ జీవన ప్రయాణంలో అనేక మలుపులు ఉన్నాయి. ప్రతి మలుపులో ఆయన సమాజ శ్రేయస్సునే కోరాడు. ఆయనకు నాకు పాటకు మాటకు ఉన్న సంబంధం ఉంది. ఆయన అనేక వేదికల్లో పాట పాడినప్పుడు నేను ఉపన్యాసకుడిగా ఉన్నాను. ఆయన పాట పాడిన తర్వాత ఉపన్యాసం చేయటం చాలా కష్టం. ఆయన పాటలోనే చాలా ఉపన్యాసాలు ఉంటాయి. ఆయన పాటని ఏక స్వరంతో పాడడు. ఆయనది గుంపుగానం. అందులో నృత్యం ఉంటుంది. సూక్తి ఉంటుంది. ప్రహసనం ఉంటుంది. హాస్యం ఉంటుంది. వీరత్వం ఉంటుంది. ఆయన బ్రాహ్మణవాదం మీద విషయ వెల్లంబులు వింధ్యాత్మకంగా వారి గుండెల్లోకి దూసుకెళ్తాయి. ఆయన దళితుల చరిత్రను కథాగానంగా చెప్తాడు. గద్దర్‌ మూలుగు కూడా సింహ గర్జనలా ఉంటుంది. ఆయన వేదిక మీద నృత్యం చేసేటప్పుడు ఆకాశ నక్షత్రాలు ఆయన పాదాలకు వెలుగులు కుమ్మరిస్తాయి. ఆయన కళ్ళలో నుంచి సూర్యుడు ఉదయిస్తాడు. ప్రకృతి అంతా వేదికను కమ్ముకుంటుంది. ప్రేక్షకులు సంలీనం అవుతాడు ఆయనలో. తన్ను తాను మర్చిపోయి తనలో మమేకమవుతాడు. ప్రేక్షకుడితో ప్రయాణించి గద్దర్‌ వారి చెవుల్లో వీర గాధలు చెబుతాడు. మనిషి శరీర మాత్రంగా జీవించకూడదని, జీవితానికి సాఫల్యం పోరాటమేనని, పోరాడే వారు వెన్నుచూపకూడదని బోధిస్తూ వెళ్తాడు. అందుకే ఊరు దాటని వాడు కూడా ఆయన పాటల్లో నుండి అడవుల దాకా వెళ్తాడు. అందుకే గద్దర్‌ అంటే ఒక పోరాటాల విశ్వవిద్యాలయం. ఆయనలో మార్మికత లేదు. ఆయనది తల్లి హృదయం.
కారంచేడు దాడిమీద హిందూ పురాణాల ప్రభావం వుంది. ఒక్కొక్క దేవుడికి, ఒక్కొక్క ఆయుధాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. ఇంద్రుడికి వజ్రాయుధం, శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రం. పరశురాముడికి గండ్రగొడ్డలి మొదలైన ఆయుధాలు, వాటితో నరికివేతకు గురైన వారిని దుష్టులని ప్రచారం చేశారు. ఈ ప్రభావం కారంచేడు కమ్మ భూస్వాముల మీద ఉంది. మనం ఒకసారి కారంచేడులో దెబ్బలు తగిలిన వారి పేర్లు, తగిలిన దెబ్బలు దేనితో కొట్టారో పరిశీలిస్తే మనకు ఈ ప్రభావం అర్ధమవుతుంది. దుడ్డు వందనంను గడ్డ పలుగుతో పొడిచారు. దుడ్డు యెహోషువాకి 30 పోట్లు తగిలాయి. గండ్ర గొడ్డలి, బరిసె, సరిగ బాదులు వీటికి ఉపయోగించారు. గాయపడిన వారు దుడ్డు ఫిలిప్పు, దుడ్డు సుబ్బారావు, దుడ్డు రత్తయ్య, దుడ్డు పెదఅబ్రహం, తేళ్ళ విల్సన్‌, తేళ్ళ సలోమాన్‌, తేళ్ళ సులోచన – ఇలా నలభై మంది గాయపడ్డారు. ఏడుగురు చనిపోయారు. అయితే వీళ్ళు కేవలం చంపిన వారు కాదు. గాయపడ్డ వారు కాదు. వీళ్ళూ పోరాటం చేశారు. వీరు బరిశెలు, గండ్ర గొడ్డళ్ళు, శూలాలు, వేటకొడవళ్ళు వాడారు. కారంచేడు భూస్వాముల కంటే కూడా వీళ్ళు బలవంతులు. వీళ్ళ బలానికి కారణం దున్నకుర్ర మాంసం. దున్న కుర్ర కోయడానికి కూడా వీళ్ళు ఆయుధాలే వాడతారు. అందులో కత్తి, మడ్డు కత్తి పదునైనవి. ఈ రెండిరటిని కూడా కారంచేడు భూస్వాముల మీద వీరు వాడారు. ఇక్కడ దళితులు బలంగా ఉండటానికి కారణం దున్న కుర్రలోని మాంసం. కార్జము, గుండె, ముడుసులు, కొవ్వులు నాలుక, మెదడు, తలకాయ వీరిలో శక్తిని తీసుకొచ్చాయి. వీరి సంఖ్య తక్కువ అవడం వలన ఓడిపోయారు గాని బలవంతులు కాక కాదు. అందుకనే వీరు చనిపోయిన తరువాత గద్దర్‌ ఆ స్థలానికి వచ్చినపుడు, వీళ్ళు పోరాటంలో చనిపోయారు గాని, పిరికి వాళ్ళై చనిపోలేదని నాయకుడు గద్దర్‌కు చెప్పడం జరిగింది. అప్పుడు గద్దర్‌ ఈ పాట రాశాడు.
‘‘దళిత పులులమ్మా / కారంచేడు భూస్వాములతోనే / కలబడి నిలబడి పోరు చేసినా/ మాలసాయిబు వడ్డెర జాతికి ` మాదిగపల్లె తల్లిలాంటిది/ శరణుకోరిన శత్రువునైనా ` ప్రేమతో చూసే పేదలపల్లె/ మాదిగపల్లె పేరు వింటెరా/ బరిశె నెత్తుకొని పందెమాడితే ` ఊరి దొరలకు ఉచ్చబడతది/ కోటి బాధలతో మునిగి తేలినా ` అన్నమాటకు అటుఇటు గారు/ వడ్డీల మీద వడ్డీలు గట్టి – నడ్డి విరిగినా బుద్ధిమంతులు/ మట్టిలో మట్టె మన్నులో మన్నై – పండిరచిన ప్రతి వడ్లగింజను/ బలిసిన దొరల గరిసెలు నింపి – పస్తులు పండే కష్ట జీవులు.
ఈ పాట చరిత్రకు సాక్ష్యంగా నిలబడిరది. దళితుల పోరాట పటిమకు అద్దం పడుతుంది. గద్దర్‌ పాట నిర్మాణ దక్షతకు ఇది ఒక నిదర్శనం. ఒక పోరాటం నుంచి అనంత సాహిత్యం పుడుతుంది. ఫ్రెంచి రివల్యూషన్‌ ఎంత సాహిత్యాన్ని సృష్టించిందో, కారంచేడు
ఉద్యమం కూడా అంతే సాహిత్యాన్ని సృష్టించింది. దళితుల పోరాట పటిమను, పోరాట యోధత్వాన్ని నిర్దేశించింది. అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా గ్రామీణ భారతంలో వారికున్న ఆధిపత్యాన్ని ప్రయ్యలు చేసింది. భూస్వామ్య – కులాధిపత్యం గుట్టును రట్టు చేసింది. గద్దరు దళిత బిడ్డ, ఆయన అంబేడ్కర్‌ బుర్రకథల ద్వారానే ముందుకు నడిచాడు.. తరువాత జననాట్యమండలి నిర్మించాడు. పీపుల్స్‌ వార్‌ అనుబంధంగా జననాట్యమండలి కృషి చేసింది. జననాట్యమండలి ఆనాడు దళిత ఉద్యమానికి వ్యతిరేకంగా ఉంది. పీపుల్స్‌ వార్‌ ఆనాడు దళిత ఉద్యమాన్ని హైజాక్‌ చేయాలని అనుకొంది. ఆ సందర్భంగా గద్దర్‌పై దళిత ఉద్యమ ప్రభావం పడిరది. ఇంకా ఆపాటను ఇలా కొనసాగించాడు.
‘‘కోడెలాంటి కుర్రవాళ్ళు రా ` సాము నేర్చినరు చదువు నేర్చినరు/ అరే ఒరే అని ఎవరన్నరంటే ` మాట చక్కగా రానియ్యంటరు / ఉన్న గుడ్డలు తెల్లగ ఉతికి – మల్లెపూవులా పిల్లలుంటరు/ ఆస్తులు పాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉన్నదంటరు / కుర్చిలో కూర్చొని కాఫీ తాగితే – ఉన్న దొరలకే కడుపులో మంట/ ఎవడబ్బ సొత్తుమేం తింటలేమురా – మా సొత్తే మా ఇష్టమంటరు’’
మాదిగపల్లెల్లో ఆత్మగౌరవంతో ఎలా జీవిస్తున్నారో గద్దరు బాగా వర్ణించాడు. స్వాతంత్య్రం వచ్చాక దళిత పల్లెల్లో చదువు రావడం, కొంచెం మంచి బట్టలు వేసుకోవడం, కమ్మ, రెడ్డి, రాజు, కాపు కులాలకు కంటగింపుగా వుండేది. శూద్ర భూస్వామ్య కులాలు దళితుల మీద బాగా కక్ష పెంచుకున్నాయి. వారికి విద్య వస్తే మా పొలాల్లో పని చేయరు, మాతో సమానంగా జీవిస్తారేమో అని భయభ్రాంతులయ్యారు. నాతోటి మానవులు అనే మానవతా దృక్పథం వీరిలో అణుమాత్రం లేదు. వీరు ఒక అమానుష జీవన విధానానికి అలవాటు పడ్డారు. దీన్నే గద్దర్‌ తన కవితా సామర్థ్యంతో పాట గట్టగలిగాడు. ఇది ఆంధ్రదేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపగలిగింది. అగ్రకులాల్లో దాగిన ద్వేషాన్ని, ఆధిపత్యాన్ని, ఈర్ష్యని ఈ పాట కళ్ళకు కట్టి చూపించింది. తెలుగు నేలలో అప్పటికి కవితా, కళారంగాల్లో దళితులే అగ్రస్థానంలో వున్నారు. అందుకే ఆ పోరాటంలో అన్ని గొంతులు లేచాయి. కమ్మ వారు ఆర్ధిక రంగాల్లో ఎలా పరిపుష్టి చెంది ముందుకెళుతున్నారో కండకావరంతో ఉన్నారో గద్దర్‌ ఇలా వర్ణించాడు.
‘‘కాలువ కింద వేల ఎకరములు – కమ్మదొరతనం కాళ్ళకిందరా / మంత్రులు కంత్రుల సీలింగొచ్చిన ` సెంటు భూమి చేయి జారలేదురా / పొగాకు రెమ్మలు పొగరు పెంచినయ్‌ – పత్తి చేలు మరి నెత్తి కెక్కినయ్‌/ వడ్డీకి వడ్డి సినిమా రంగం – వరాల వర్షం నరాలకెక్కే/ కమ్మ దొరతనం కాదని అంటే – కాలువలోన శవం తేలురా/ అట్టి దొరలకు పక్కలో బల్లెం – మాదిగ పల్లె దళిత పులులారా’’ ఆంధ్రదేశ వ్యాప్తంగా వెలమలు, కొన్ని ప్రాంతాల్లో క్షత్రియులు, కొన్ని ప్రాంతాల్లో రెడ్లు, కొన్ని ప్రాంతాల్లో కమ్మలు దొరలుగా వ్యవహరిస్తూ, దోపిడీ చేస్తూ వచ్చారు. ఆధిపత్యం చేస్తూ వచ్చారు. కారంచేడులో ఇది పరాకాష్ట రూపానికి చేరింది. పొగాకు బ్యారన్‌లు, సినిమా పరిశ్రమ, రాజకీయ ఆధిపత్యం ఇవన్ని కలిసి కమ్మ వారికి కండకావరం పెరిగింది. వారికెదురు తిరిగితే చంపి కాలువలో పడవేయడం ప్రారంభించారు. ఈ విషయాన్నే గద్దర్‌ తన పాట ద్వారా లోకానికి ఎలుగెత్తి చాటాడు. మొదటిసారిగా, జననాట్యమండలి పాటల్లో కులాధిపత్యం వర్గాధిపత్యాన్ని జోడిరచి పాడటం ప్రారంభమైంది. ఇది దళిత ఉద్యమ విజయం. ఈ పాటను 1985 సెప్టెంబర్‌ 1న ఛలో చీరాల మహాసభలో గద్దర్‌ పాడడం జరిగింది. ఈ పాట ఒక మహోజ్వల జ్వలనాన్ని ప్రేక్షకుల్లో రూపొందించింది. సుమారు మూడు లక్షల మంది దళితులు దళిత మహాసభ ఆధ్వర్యంలో చీరాల హైస్కూలు గ్రౌండ్స్‌లో హాజరయ్యారు. ఈ సభకు దళిత ఉద్యమనేత కత్తి పద్మారావు అధ్యక్షత వహించారు. ఈ సభలో గద్దర్‌ పాడిన పాట ఒక ఉత్సాహాన్ని నింపింది. అప్పటికి పీపుల్స్‌ వార్‌ కూడా ఆంధ్రదేశంలో బలంగానే వుంది.
గద్దర్‌ కారంచేడు భూస్వాములతో దుడ్డు వందనం పోరాడిన ఘట్టాన్ని ఇలా వర్ణించారు.
మాదిగపల్లెకు గుండెకాయరా – పేదల బిడ్డ దుడ్డు వందనం / కాశె పోసుకుని కట్టె పట్టితె – కత్తుల వర్షం నేల రాలురా / చెంగున దూకి సాము చేసితె – భూతల్లె మరి దద్దరిల్లు రా / చేతికర్ర చేతికందితే – వేయి మందినే ఎదురు కొంటడు / ధర్మ యుద్ధము తప్ప ఎన్నడు – దుడ్డు పట్టడు దుంకులాడడు
ఈ ఘట్టంలో కూడా కారంచేడు మాదిగలు ఈ పోరాటంలో తమ పోరాట పటిమను యుద్ధ కౌశలాన్ని ఎలా చూపించారో వర్ణించాడు. గద్దర్‌లో సన్నివేశ కల్పనా చాతుర్యం ఎంతో వుంది. కళ్ళకు కట్టినట్టు ఆనాటి పోరాట ఘట్టాలను మన కళ్ళకు కట్టాడు. కులాధిపత్యాన్ని స్పష్టం చేశాడు. గద్దర్‌ మీద దళిత ఉద్యమం లేవనెత్తిన కులాధిపత్యమే నిజమైన వైరుధ్యమనే అంశం స్పష్టపడిరది.
ఆనాడు దళితులు పోరాడి, పోరాడి గాయపడ్డారు, చనిపోయారు అనేది ముఖ్యమైన విషయం. ప్రతి అడుగులో దళితులు కులాధిపత్యాన్ని ఎంతబలంగా ఎదుర్కొన్నారో, గద్దర్‌ ఈ పాటలో బలంగా చెప్పాడు. అందువల్లే ఈ పాట ఆంధ్రప్రదేశ్‌లో దళితుల్లో ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ పాటల మీద వ్యాఖ్యానిస్తూ గద్దర్‌ మీద పీహెచ్‌డి చేసిన డా॥ ఎన్‌.చంద్రశేఖర్‌ ఇలా వ్యాఖ్యానించారు.
‘‘ఆ దళితులు ఒక్కొక్కడు ఒక్కొక్క వీరుడు. వాళ్ళ స్త్రీలు కూడా వీర వనితలు. తమ మీద భూస్వాములు దాడి చేసి తమ బిడ్డల్ని, భర్తల్ని, తండ్రుల్ని తెగనరికి తమ చెల్లెళ్లు అక్కలపై అత్యాచారాలు చేస్తే గాయపడి గుంటూరు ఆసుపత్రిలో ఉండగా, వారిని చూడ్డానికి ఆ భూస్వాముల బంధువైన అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు పండ్లు తీసుకొని వస్తే, వాటిని ఎగరదన్నిన అభిమానవతులైన వీర వనితలు. పేదల ప్రాణాలు బలి తీసుకొని నష్టపరిహారం పేరుతో వారి ప్రాణాలకు పదివేల రూపాయలను విలువగట్టే దుష్ట సంస్కృతిని, ‘ముష్టి డబ్బులు మాకు వద్దని మరో చరిత్రను రాసి పెట్టినారు’ అని వారి వీరోచిత న్యాయ పోరాటాన్ని మహోన్నతంగా చిత్రించాడు గద్దర్‌. ఈ పాట దళితులకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని, పోరాట స్ఫూర్తిని ఇచ్చింది. వారి వెన్ను తట్టి మేల్కొల్పింది. దళితులను జాగృతం చేసిన పాటల్లో ఇది అగ్రభాగాన వుంది. వీర మరణం పొందిన వారి వీరత్వాన్ని మహోన్నతంగా చిత్రించాడు గద్దర్‌.
గద్దర్‌ కవిత్వం ఒక ఊట బావి. తాను రాసిన పాట మీద ఒక తాత్త్వికమైన విశ్లేషణ చేయగలిగినవాడు గద్దర్‌. నిజానికి పాట ఊరికే పుట్టదు. అది జీవితం నుండి, జీవన సంఘర్షణ నుండి పుడుతుంది. గద్దరయితే తనలో తాను ఎంతో సంఘర్షణ పడిన తరవాతే అతను బయటికొస్తాడు. ఆయన నిజానికి ఒక తాత్త్వికుడు. గద్దర్‌ నీకిష్టమైన పాటేదంటే ‘‘ఏలరో ఈ మాదిగ’’ అంటాడు. నిజానికి ఈ పాటలో ఈ దళిత కులాల జాతీయతను ఎలుగెత్తి చాటాడు గద్దర్‌.
‘‘యాలరో యీ మాదిగ బతుకు ` మొత్తుకుంటే దొరకదురా మెతుకు/ బంగారు పంటలిచ్చె ` భరత గడ్డమనది / గంగమ్మ ప్రవహించే ` పుణ్యభూమి మనది / గంగ యమున బ్రహ్మపుత్ర కృష్ణ పెన్నా కావేరి/ ఎన్నెన్నో జీవ నదులు ` ప్రవహించే జీవగడ్డ / మాల మాదిగలకే ` మంచినీళ్లు కరువాయే’’
అని గద్దర్‌ సామాజిక తత్త్వాన్ని, సామాజిక సమస్యని దళిత జాతీయ దృక్పథంలో అనేక పాటల్లో విశ్లేషిస్తాడు. దళిత ఉద్యమంలో పాటలు పాడే దళాలన్ని అవి ఏ పేరుతో వున్నా గద్దర్‌, మాష్టార్జీ ప్రభావంలోనే పాటలు పాడుతూ వచ్చారు. అందుకే దళిత ఉద్యమం మీద గద్దర్‌ ప్రభావం సాంస్కృతికంగా బలం వుందనక తప్పదు.
మనం ఎన్ని దృక్కోణాల నుంచి చూసినా ఆయన జాతి వైతాళికుడు. కుల మత బేధాలు లేని బౌద్ధ సిద్ధాంతగామి. ఆయన ఒక నశించని సామాజిక విప్లవ స్వరం. ఆయన తెలంగాణ విప్లవ పోరాట యోధుడు. తెలంగాణ పోరాటం మీద ఆయన రాసిన పాటలు ఆకాశంలో విహంగాల్లా విహరిస్తున్నాయి. ఆయన కురుస్తున్న మానవతా ధార. ఆయన పాటలతో లోకం మేల్కొంది. అందుకే ఆయన ఈ యుగం జాతి వైతాళికుడు. ఆయన పాటల బాటలో నడుద్దాం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.