దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం జయప్రభ ‘చూపులు’ అనే కవితలో ‘‘రెండు కళ్ళనించి చూపులు సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతుంటాయి.’’ అని రాశారు. ప్రతి మహిళ ఈ చూపుల దాడిని అన్ని చోట్ల, అన్నివేళలా అనుభవిస్తుంది.
చాలాసార్లు ఈ చూపుల దాడి ఇంకొంచెం ముందుకెళ్ళి మాటలుగా, కామెంట్లుగా బురద పారినట్టు ప్రవహిస్తుంటాయి. దానికి వయసు, ప్రదేశం లాంటి పరిమితులుండవు. ఆఫీసుల్లో, రోడ్లమీద, ప్రయాణాల్లో, చివరికి ఇళ్ళల్లో కూడా ఈ జాడ్యం ప్రబలిపోయింది. ఈ రోగం చట్టాలతో నయమయ్యేది కాదు. శస్త్రచికిత్సలు చెయ్యాల్సినంత విపరీతంగా ముదిరిపోయింది.
ఈ విపరీత, వికృత ధోరణి ఏదో ఒక దేశానికి పరిమితం కాదు. సో కాల్డ్ అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు, ఎలాంటి అభివృద్ధికి నోచుకోని దేశాలు… అన్నింటా ఈ సెక్సిస్ట్ ధోరణి కామన్‌గా ఉండడం ఆశ్చర్యం కలిగించక మానదు. అభివృద్ధిలో దూసుకుపోతున్న దేశాల దృష్టిలో ‘అభివృద్ధి’ అంటే ఏమిటి? ఆయా దేశాల్లో మహిళలు పేట్రియార్కి పడగ నీడలోనే బతుకుతుంటే, లింగ వివక్షను ఎదుర్కొంటుంటే అది ఎలాంటి అభివృద్ధి అవుతుంది? మహిళల్ని తోటి పౌరులుగా కాకుండా వివక్షాపూరితంగా చూస్తుంటే అది సమానత్వమౌతుందా? ఒక దేశం అభివృద్ధి చెందిందనడానికి కొలమానం ఏమిటి? ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పురోగమిస్తున్న దేశాల్లో సైతం మహిళల శరీరాల చుట్టే చూపులు, చేష్టలు పరిభ్రమించడం చాలా ఆందోళన కలిగించే అంశం.
ఇటీవల ఇంటర్నెట్లో ‘Everday Sexism’’ అనే ప్రాజెక్టు గురించి చదివినప్పుడు sexist behaviour కి ఏ దేశమూ అతీతం కాదని, అన్ని దేశాల్లోని మహిళలు ఈ దుర్మార్గపు సంస్కృతి బాధితులని అర్థమైంది. ఆ ప్రాజెక్టు కింద వివిధ దేశాలకు చెందిన వేలాది మహిళలు తమ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. లింగవివక్ష తమ జీవితాలను ఎలా తాకిందో, తమ బతుకున్ని ఎలా ఛిన్నాభిన్నం చేసిందో చాలా వివరంగా రాస్తున్నారు. అవన్నీ చదువుతుంటే వెన్నులోంచి ఒణుకు పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మహిళలు తరతమ భేదాలు, దేశ భేదాలు, ప్రాంత భేదాలు లేకుండా అనుదినం, అనుక్షణం ఎదుర్కొనే సెక్సిజం ఎంత తీవ్రమైన సమస్యగా, కరోనా వైరస్‌ని మించిన జాడ్యంలా ప్రబలి ఉందో అర్థమైంది.
ఒక 17 సంవత్సరాల అబ్బాయి ఇలా రాశాడు, ‘‘నేను ప్రతి దినం సెక్సిజమ్ ప్రాజెక్టును అనుసరిస్తున్నాను. ఈ గమనింపులో ప్రతిరోజు, ప్రతిక్షణం మహిళలు ఎలాంటి లింగ వివక్షను ఎదుర్కొంటున్నారో చూసి షాక్‌కి గురయ్యాను. చూపులతో వేటాడటం, కామెంట్లతో వేధించడం, వారి వస్త్రధారణకి వ్యతిరేకంగా మాట్లాడటం, వారి శరీరాంగాలను వర్ణించడం, ముట్టుకోవడం, వెంటపడటం… ఇవన్నీ గమనించినప్పుడు నేను మగవాడిగా పుట్టినందుకు మొదటిసారి సిగ్గుపడ్డాను. మా నాన్న కూడా దీనికి అతీతంగా లేకపోవడం, నన్ను, మా అన్నని అమ్మాయిల్ని ఏడిపించకపోతే మగాడివే కావని హాస్యాలాడడం, ఆడవారిని వేధించమని ప్రోత్సహించడం నాకు దారుణంగా అనిపించేది. బహుశా నేను ఈ ప్రాజెక్టులో భాగంగా ఆ ప్రవర్తన మార్చుకుని గమనిస్తున్నాను కానీ, నేను కూడా అంతేనేమో అనిపించింది.’’ ఇలా వేలల్లో పురుషులు, స్త్రీలు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
ఈ “Everyday Sexium Project” ని బ్రిటిష్ ఫెమినిస్ట్ రచయిత్రి Laura Bates, 2012లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా సెక్సిస్ట్ ధోరణులు ఎలా ఉన్నాయో డాక్యుమెంట్ చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం. దీనికింద ఆమె ఒక వెబ్సైట్ నడుపుతున్నారు. దేశదేశాల నుంచి స్త్రీలు, పురుషులు తమ తమ అనుభవాలను ఈ వెబ్సైట్లో కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు (www.everydaysexium.com). ఈ కామెంట్లు చదువుతుంటే ప్రపంచమంతా ఎంత సెక్సిస్ట్ కొవ్వు పేరుకుపోయి ఉందో అర్థమవుతుంది.
ప్రతి పదిరోజులకొకసారి షీటీమ్స్ అఫెండర్ల కౌన్సిలింగ్లో మన రహదారుల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో, బస్సుల్లో, రైళ్ళల్లో ఎంత వికృతమైన సెక్సిస్ట్ కొవ్వు ప్రవహిస్తున్నదో కౌన్సిలర్లు కథలు, కథలుగా చెబుతూనే ఉన్నారు. వీరిలో మైనర్ల సంఖ్య 80% ఉండడం ఎంతో ఆందోళన కలిగించే అంశం. ఈ కౌన్సిలింగ్ సెషన్లలో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చెయ్యడం వల్ల తమని ‘పున్నామ నరకం’ నుంచి తప్పించే పుత్రరత్నాలు రోడ్లమీద ఆడపిల్లలకు ఎలాంటి ‘నరకాలు’ సృష్టిస్తున్నారో ప్రత్యక్షంగా చూసి సిగ్గుతో తలదించుకోవడమో, కన్నీళ్ళ పర్యంతమవ్వడమో చూస్తూనే ఉన్నాం.
పితృస్వామ్య కుటుంబంలో తండ్రి ఆధిపత్య, అహంకార, హింసాయుత ధోరణులను చిన్నప్పటి నుండీ గమనించే మగపిల్లలు తండ్రినే రోల్ మోడల్‌గా తీసుకుంటారు. అలాంటి ప్రవర్తన ఆమోదమోగ్యమే అనుకుంటారు. బయట బహిరంగ ప్రదేశాల్లో అదే ప్రతిబింబిస్తుంది. ఆడవాళ్ళని వేధించడం తమ హక్కనే వాళ్ళనుకుంటారు. సెక్సిస్ట్ చీడపురుగుల్లా తయారై మహిళల భద్రతకే పెను సవాల్‌గా తయారువుతున్నారు. మరి మార్పు ఎక్కడినుండి మొదలవ్వాలి? సున్నితమైన మొక్కలుగా ఉన్నప్పుడు సున్నితమైన ప్రవర్తనను నేర్పించడమే పరిష్కారం. లేకపోతే అవి మానులై విషపూరిత, సెక్సిస్ట్ ధోరణులను విరజిమ్ముతూనే ఉంటాయి.