‘‘ఇదెక్కడి ఘోరమమ్మా! రోడ్డు మీద నడవాలంటే భయమయితాంది. ఈడ మదమెక్కినోళ్ళు తోడేళ్ళ లెక్క ఆడోళ్ళమీన పడి గుడ్డలూడబీకుతుంటే చుట్టూతా జనం గుడ్డివాళ్ళయిండ్రట. దర్శి కాడ మగనితో పెండ్లాం సుత ఆడదాని మీద పడి గుడ్డ లూడబీకె… కోపముంటే, కక్షలుంటే ఆడోళ్ళ బట్టలూడబీకుడేనా? థూ… సిగ్గులేని మనుషులు’’ గొణుక్కుంటూ చీపురుతో బర బరా ఊడవటం మొదలుపెట్టింది యాదమ్మ.
ఆ మాటలు వింటుంటే, మద్యానికి బానిసైన యువకుడు ఫుల్‌గా మందుకొట్టి రోడ్డుపై వెళ్తున్న పాతికేళ్ళ యువతి నడుముపై చెయ్యేసి దగ్గరకు లాక్కోవడం, అడ్డుకున్న ఆమెను వివస్త్రను చేసి కొట్టడం… ఆ దృశ్యాన్ని చూసి చలనం లేని జనంÑ దుశ్శాసన చర్యను అడ్డుకోబోతున్న యువతిని కూడా వివస్త్రను చేస్తానని బెదిరించడం కళ్ళముందు మెదిలి మనసంతా కల్లోల సముద్రమయింది.
ఛీ… ఛీ… ఏం మనుషులమ్మా! ఆ పొద్దు ఆ తాగుబోతోడిని నాలుగు తన్ని తగ లెయ్యాల్సిన జనం, ఘోరకలిని చూసుకుంట సెల్ ఫోన్ల సిన్మా తీసుకుంటున్నరట. బద్మాష్… ఆ తాగుబోతోడేనా? ఇసొంటోళ్ళది తప్పుకాదా? చప్పుడు చెయ్యక చూసుకుంట ఉన్నోళ్ళది సుతం తప్పే కద.
ఈ పొద్దు, మా పక్కపొంటి నర్సమ్మ అన్న బిడ్డ తల్లిగారింటికి పోతే వాళ్ళమీద కక్షనోళ్ళు ఇంటికొచ్చిన ఆడబిడ్డ గుడ్డలూడబీకి బండికి కట్టి తాడుతో ఈడ్చుకుపోయి ఇంట్లో పడేసిన్రట. అవి మడిసి పుటకలేనా? థూ… అసొంటోళ్ళ బొక్కలేసి మక్కెలిగదన్నాలే… కత్తులు నూరుతున్నది యాదమ్మ.
ఆనాడు నిండు సభలో పాంచాలిని చెరబట్టిన వారసత్వం కొనసాగిస్తున్న వాళ్ళను చూసి రగిలిపోతున్న యాదమ్మ ఆవేశంలో, ఆవేదనలో అర్థం ఉంది. లోలోపల బాధ పడుతున్నప్పటికీ యాదమ్మకున్న కనీస స్పందనలేని తనానికి సిగ్గనిపించింది.
మానవత్వం మంట కలిసి పోతున్నది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. మనిషికన్న జంతువులు నయం. ఒక కాకికి ఆపద వస్తే పది కాకులు చేరతాయి. పక్షులు, జంతువులు ఎదురు తిరిగి కొరికి తమను రక్షించుకుంటాయి. కానీ వాటన్నిటికన్నా తెలివైన మనిషి ఏం చేస్తున్నాడు?
ఆ దారుణానికి ఒడిగట్టిన వాళ్ళతో పాటు అది చూస్తూ, వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. నిజమే, యాదమ్మ అన్నట్లు నేరం చేసిన వాడికి, చోద్యం చూస్తూ నిల్చున్న వాళ్ళకి పెద్ద తేడా ఏముంది?
వాళ్ళు కూడా నేరస్తులేనని, వాళ్ళనీ దోషులుగా శిక్షించాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి అత్యాచారం చేసిన సంఘటన తెలిసినప్పటి నుంచీ జనంలో పెల్లుబికిన ఆవేశం, ఆక్రోశం హైదరాబాద్ సంఘటనలోనో, మరో సంఘటనలోనో కన్పించడం లేదు. ఎందుకు? అన్ని సంఘట నలూ స్త్రీ జాతిని అవమానించేవే. భరతమాత కు జై అన్నది వట్టిమాటలని తెలిపేవే.
బహుశా మణిపూర్ సంఘటనలో రాజ్యం పాత్ర, మతం పాత్ర, జాతుల పాత్ర, రాజకీయం పాత్ర… అన్నీ జమిలిగా ఆమెను వివస్త్రగా మారిస్తే, దాన్ని మిగతా ప్రపంచా నికి తెలియకుండా పాతరెయ్యాలని చూసి నందువల్ల పెల్లుబికిన ఆగ్రహం కావచ్చు. ఇప్పుడు ఇక్కడ మద్యం మత్తు, కుల, ధన బలం ఆమెను వివస్త్రగా మార్చడంపై పెద్ద ఎత్తున స్పందన లేకపోవడానికి కారణం ఏమిటి? తప్పు ఎవరు చేసినా తప్పేగా…?
టార్గెట్ పెట్టి మద్యం అమ్మకాలతో ఖజానా నింపుకునే ప్రభుత్వాలకు జరిగే అనర్థాలు కనిపించవు. కులం, మతం, వర్గంతో బలిసిన వాళ్ళకి తమ కోపం, కక్ష సాధించుకోవాలంటే అవతలి పక్షపు ఆడపిల్లపై / మహిళపై దాడిచేసి అహం చల్లార్చుకోవటం తప్ప మంచి, చెడు విచక్షణ ఉండదు.
ఆనాడు అయోధ్యలో సీతకు అవమానం జరిగిందని ఇప్పటికీ వాపోతున్నారు. ఇప్పుడు మన కళ్ళముందే జరుగుతున్న సంఘటన ల్లోని ద్రౌపదిలు, సీతమ్మలు కనిపించరు… అప్పుడు ఒక రావణుడు, ఒక దుర్యోధనుడు అవమానించారేమో… ఇప్పుడు అడు గడుగునా వాళ్ళే.
ప్రతీకారేచ్ఛతో స్త్రీలను చెరబట్టే సంస్కృతి, వివస్త్రను చేసే సంస్కృతి మనకు కొత్త కాదు. మన పురాణ కాలం నుంచీ ఉన్నదేగా. ఈ దేశ సంస్కృతిలో భాగమవుతున్నది అంతే అని మిన్నకుందామా?! లేకపోతే మనకు జన్మనిచ్చిన మర్మస్థానాలపై వేటకుక్కల్లాగా ఎగబడే వారిపై కొరడా రaళిపిద్దామా?
ఏదేమైనా స్త్రీని వివస్త్రగా మార్చే మగో న్మాదం చూసి సిగ్గుపడటం, అవమా నపడటం వల్ల ఒరిగేదేమీ లేదు. వాటిని నిర్ద్వందంగా ఖండిరచకుండా మౌనం వహిం చడం కూడా అంతే ప్రమాదకరం అని మనం మర్చిపోకూడదు.
స్త్రీల గౌరవానికి భంగం కలిగిస్తూ, వారి ఆత్మవిశ్వాసాన్ని, ఆశని, ఉత్సాహాన్ని చంపేస్తూ, స్త్రీని అవమానించడం ఒక శక్తివంతమైన సాధనంగా భావించే వ్యక్తులను నిందితులుగా లేదా నేరస్థులుగా మారుస్తున్న పరిస్థితులపై దృష్టి సారించి నిద్రపోతున్న వ్యవస్థల, చట్టాల జుట్టు పట్టి లేపాల్సిన అవసరం ఉంది.