ఎంత ఉద్యోగం చేసినా, అంతో ఇంతో ధైర్యవంతురాలిని అయినా ఒక్కోసారి పరిస్థితుల వల్ల భయం బారిన పడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఆ రోజు నాకు జీవితం ఒక కొత్త పాఠం నేర్పుతుందనీ నేను అనుకోలేదు. వృత్తిరీత్యా నేను ప్రముఖ సంస్థలో ఆఫీసర్ని కావడంతో బాధ్యతల వల్ల ఆలస్యంగా రావడం పరిపాటే.
నేను, మా పాప కొత్తగా కట్టుకున్న ఇంట్లో ఊరికి కొంచెం దూరంగా ఉన్న కాలనీలో ఉంటున్నాం. మా వారికి ఇటీవలే ప్రమోషన్ రావడం వల్ల తప్పనిసరిగా వేరే ఊరికి బదిలీ కావడంతో వారం, పక్షం రోజులకోసారి వస్తూ పోతూ ఉంటారు. మార్చి నెల చివరి రోజు కావడంతో ఎప్పటిలాగానే ఆఫీసులోనే చాలా ఆలస్యమైపోయింది.
అందుకే పదిన్నరే కదా ఆటోలు ఉంటాయి, నే వెళతాను అంటూ మా సార్ వారిస్తున్నా వినకుండా బయటకు వచ్చేశాను. లోకల్ అయినా ఎంత లేదన్నా ముప్పావు గంట ప్రయాణం. రెండు మూడు ఆటోలు రామంటూ వెళ్ళిపోయాయి. ఒక అతను వస్తానన్నాడు. లోపలికి చూశాను. అందులో మరో ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు. గౌరవప్రదంగా కనిపించారు. అయినా నాకు వేరే ఛాన్స్ లేదు అందుకే ఎక్కి కూర్చున్నాను. కొంచెం దూరమెళ్ళాక ఒకతను, మరికొంచెం దూరమెళ్ళాక మరొకతను దిగిపోయారు. ఎవరూ ఎక్కలేదు. ఆటోలో ఒక్కదాన్నే ఉన్నాను. ఆటో డ్రైవర్ వైపు చూశాను. చిన్నవాడే 20 నుండి 25 సంవత్సరాలుంటాయేమో. ప్రవర్తన కొంచెం అనుమానాస్పదంగానే అనిపించింది. ఎందుకంటే మిర్రర్ నుంచి ఓరకంట నన్ను చూస్తున్నట్లు అనిపించింది. పాటలు పెట్టాడు… అంటే ఆ సౌండ్‌కి ఏమైనా వినిపించకూడదనా… ఇలాంటప్పుడు షీ టీంకి మనం ఎక్కడ ఉన్నామో తెల్పెట్లు యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేదని విచారించాను. ఇప్పుడు అంత సమయం లేదు. అయినా ఏమీ జరగకముందే నేనే ఏదో ఎక్కువ ఊహించుకుంటున్నానేమో. పాసింజర్ ఒక్కరే ఉంటే, దారి మళ్ళించడం… అత్యాచారం… తదితర పేపర్ న్యూస్ కళ్ళముందు తిరిగాయి. సెల్ పట్టుకున్నాను. సెల్ మోగింది.
‘‘హలో… ఆ… హన్మకొండ దాటాను. ఆ… వస్తున్నాన్లే. ఫలానా టర్నింగ్ వరకొచ్చాను. ఇంట్లో పాలు విరుగుతాయేమో, ఒక్కసారి మరిగించండి. ఆటో నంబర్ 2525. మనింటి ప్రక్క ఎస్‌ఐ గారిని కొంచెం ఇల్లు చూస్తుండమని మీరైనా, అతనైనా రోడ్డు వరకు రండి. మరేం ఫర్లేదు. నే రాగానే చేస్తాగా…’’ అలా మా వీథి రోడ్డు వరకు మాట్లాడుతూనే ఉన్నాను. వీథి క్రాస్ వరకు రాగానే ఆపమంటూ దిగి డబ్బులిచ్చాను. అక్కడినుండి లోపలికి దాదాపు ఒక ఏడు నిమిషాలు నడవాలి. కొత్తగా ఇల్లు కట్టుకుని వచ్చాను ఆ కాలనీకి. రోడ్డు నుండి సందులోకి తిరిగాను. ఆ సందు చివరవరకెళ్ళి మరో సందు తిరిగితే మా ఇల్లు వస్తుంది. కొత్తగా పడ్డ కాలనీ కావడంతో విసిరేసినట్లున్నాయి ఇళ్ళు. వీథిలైట్లు లేక గుడ్డి వెలుతురులో నిర్మానుష్యంగా ఉన్న రోడ్లు భయం గొల్పుతున్నాయి. ఏదో క్షేమంగా ఒక రోజు చేరగలిగానని సంతోషపడ్డాను. కానీ అంతకు మించిన ప్రమాదం పొంచి ఉందని గ్రహించలేకపోయాను. ఇలా సందు తిరిగానో లేదో ఆ సందు మొదట్లో దారి ప్రక్కగా నిలబడ్డ ఇద్దరు అడుగుల శబ్దానికేమో నన్ను చూశారు. నేను ఊహించలేదేమో భయపడ్డాను. అయినా ఏమీ గమనించనట్లు నడవసాగాను. దారికిరువైపులా పిచ్చిగా పెరిగిన చెట్లు, తుప్పలున్నాయి. చలి కాలం కావడం వల్లేమో చుట్టూ ఉన్న నాలుగైదు ఇళ్ళల్లో కూడా లైట్లు ఆర్పేసి తలుపులు పెట్టేసి ఉన్నాయి. ఒకటి రెండు ఇళ్ళల్లో ముందున్న చిన్న లైట్ల వెలుతురే ఆ సందులో కాస్తంత వెలుగునిస్తోంది. నేను వెళుతుంటే నా వెనకాలే వస్తూ ‘‘అరెరె… ఏం ఫిగరు. అచ్చం శ్రీదేవిలా ఉంది బాసు…’’ అంటూ దగ్గరికొస్తున్నారు. పరుగెత్తితే ఎలా ఉంటుందో… అప్పుడు వారూ పరుగెత్తుతారు. వారి స్పీడ్‌కి నేను నిలవగలనా… ఆలోచిస్తూ నడక వేగం పెంచాను. కానీ అప్పటికే ఆలస్యమయింది. వారు నా ముందుకొచ్చి ఒకడు నా నోరు మూశాడు. మరొకడు, నోరు మూసినవాడు కలిసి ప్రక్కనున్న చెట్లవైపు లాక్కెళుతున్నారు. ఆ హఠాత్పరిణామానికి గుండె ఆగినట్లయింది. ఒక్క నిమిషం ముందయినా మేల్కొని పరుగెత్తని నా బుద్ధి మాంద్యానికి తిట్టుకుంటూ, ఎంత గింజుకున్నా వారి పశుబలం ముందు నేను బలహీనురాలినవుతున్నాను. కొన్ని క్షణాలు ఆలోచించాను. వెంటనే గింజుకోవడం ఆపేశాను. ఈలోగా తుప్పల్లో చెట్టులాంటి ప్రదేశం దగ్గర ఆగారు. నేను గింజుకోవడం ఆపేయగానే ఆశ్చర్యపోయినట్లున్నారు. ‘‘గిదేందిరో… ఈ పోరికి కూడా ఇష్టముందేమో ఏమో… ఎయ్యాలైపు ఇవి కామనైపోయినాయి…’’ వెంట వచ్చినవాడు వెకిలిగా నవ్వుతూ అంటున్నాడు. ఇద్దరి దగ్గర లిక్కర్ వాసన గుప్పుమంటోంది. ఆ వాసన భరించడం వారిని భరించడం చాలా కష్టంగా ఉంది. వారి చేతులు నోటిపై ఉన్నందున ఒళ్ళంతా కారం రాసుకున్నట్లు, గొంగళి పురుగులు పారినట్లు అనిపిస్తోంది.
ఆశ్చర్యపోయినపుడు కొంచెం సడలిన చేతిని బలవంతాన నా చేయితో నోటిపైనుండి తీసేశాను. ‘‘అరె! ఏం చేస్తార్రా… ఏం చేస్తారు. పండి పోయి ఉన్నాను. తరగని రోగం అంటించుకోవాలని అంత కోరిగ్గా ఉంటే రండి. ఎయిడ్స్ బారిన నేనొక్కదాన్నే కాక మరో ఇద్దరు తోడు దొరుకుతారు. అందరం కల్సి వాడొచ్చు మందు. రండిరా… ఇంకోసారి జన్మలో ఆడదాని మొహం చూడకుండా అవుతారు. రండి…’’ ఆవేశంతో వూగిపోతూ నేనంటుంటే వాళ్ళు ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. వాళ్ళు నన్ను వదిలేసినా నేను పారిపోయే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఎంత పరుగెత్తినా ఆ తుప్పల్లో నుండి రోడ్డుపైకి వచ్చి రక్షిస్తారన్న ఆశ లేదు. పైగా ఆ చుట్టుప్రక్కల ఇళ్ళు లేవు. అందుకే ధైర్యంగా చీకట్లో బాణం విసిరాను.
‘‘ఇదెక్కడి గోలరా బాబూ… అబద్ధం చెబుతోందేమో తప్పించుకోవడానికి అనుకుంటే… ఒకవేళ నిజమైతే బతుకు బస్టాండవుతుంది. ఎందుకొచ్చిన గోల అసలే పరిస్థితులు ఇదివరకులా లేవు. ఏదో… ఇలా జరిగింది, ఎవరికైనా తెలిస్తే నాకే పరువు తక్కువ నా ఇజ్జత్ పోతదనీ ఏ ఆడది అనుకుంటా లేదు. ఇదివరకయితే ఎవరికీ తెలీకుండా గుట్టుచప్పుడు కాకుండా ఉండేటోల్లు… ఇప్పుడు… ఓరినీ… అదేదో హక్కులాగా ప్రతీదీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడమే. రిపోర్టులు… ధర్నాలు… అసలే అదేదో చట్టం కింద ఏకిపారేస్తున్నారట. బతికుంటే బలుసాకు తినొచ్చు… ఇలాంటివెన్నైనా చెయ్యొచ్చు… పరుగెత్తరా బాబూ… నేవెళ్తున్నా బాబోయ్…’’ అంటూ వాడు తుప్పల్లో నుండి పారిపోయాడు. మరొకడు అంత తొందరగా నమ్మలేదు. ‘‘గదేదో పోరి
ఉషారుండి ఏదో గట్ల భయపెట్టేస్తే భయపడతావురా… మొగోనివి కాదురా… రేషమ్ లేదురా… భయపడ్డానికి నేనేమైనా పిరికోన్నా…’’ అంటూ వాడిని తిట్టేసి మీదకొస్తున్నాడు. ఇక ఆగలేదు నేను. ఆ తాగిన వాసన భరించడం దుర్భరంగా ఉంది. చేతుల్తో బలంగా నెడుతూ శక్తినంతా కాలులోకి కూడదీసుకుని వాడి రెండు కాళ్ళ మధ్య గట్టిగా లాగిపెట్టి తన్నాను. అదాటున ఉన్నాడేమో నేనలా చేస్తానని ఊహించనందున కింద పడ్డాడు. పైగా చలికాలం కావడంతో నేను షూ వేసుకుని ఉన్నందున దెబ్బ బలంగానే తగిలుంటుంది. పైగా ఈ దాడి వాడు ఊహించనిది. అంతకు ముందు మాటలు, వాడు పారిపోవడం తర్వాత ఇలాంటి సన్నివేశం కలలో కూడా ఊహించనిది కావడంతో అంత అప్రమత్తంగా లేడు. పైగా ఏదో అన్నానే గాని, నాకు విపరీతమైన భయంగా ఉంది లోలోన. ఒకవేళ ఆ క్షణంలో ఈడ్చి తన్నే దెబ్బ ఏ మాత్రం అటూ ఇటయినా ఇక నా జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసినందున చాలా జాగ్రత్తగా దెబ్బకొట్టాను. ఆ దెబ్బకు ‘అమ్మా’ అంటూ ఆ తుప్పల్లోనే కింద పడి రెండు కాళ్ళ మధ్య ఆయువుపట్టుపై రెండు చేతులతో పట్టుకుంటూ కూలబడ్డాడు. ఇక ఆలస్యం చేయలేదు. ఒక్క క్షణం మరో రెండు తన్నులు లాగి గట్టిగా అక్కడే చేతులపై నుండి తన్ని వాయువేగంతో కిందపడిన హాండ్‌బాగ్‌ను మెడకు తగిలించుకుంటూ పరిగెత్తాను, రోడ్ నుండి పరుగులంకిస్తూ ‘హెల్ప్’ అంటూ అరిచాను. నా అనుమానం నిజమే. ఎవరూ రాలేదు. కానీ పొరపాటున వాడు రికవర్ అయి కోపంతో మళ్ళీ వెంటపడడానికి వెనకాడుతాడు. పరుగెత్తుతుంటే చుక్కలు కనబడ్డాయి. అయినా జీవన్మరణ సమస్య అన్నట్లు పరుగాపలేదు. ఆ సందు తిరగ్గానే మా వీథిలో నాలుగైదిళ్ళ తర్వాతనే మా ఇల్లు కావడంతో ఇంటికి చేరి గేటు తీసి కారిడార్‌లో క్రిందనే కూలబడ్డాను. విపరీతంగా వగరుస్తున్నాను. అంత చలిలో కూడా భయం వల్ల, పరుగెట్టడం వల్ల చెమట్లు కారిపోతున్నాయి.
ఇంట్లో నా కోసం ఎదురుచూస్తూ చదువుకుంటున్న నా కూతురు, అత్తయ్య గేటు తీసిన శబ్దానికి తలుపు తెరుచుకుని బయటకొచ్చి నేను కూర్చున్న తీరుకు, రేగిన జుట్టుకు, చెమటకు, తడిచి బట్టలు, కారుతున్న చెమట చూసి భయపడిరది. ‘‘అమ్మా… ఏం జరిగిందమ్మా…’’ ఆదుర్దాగా అడుగుతోంది. అత్తయ్య నా తలను తన గుండెలపై పెట్టుకుంది ఆసరా ఇస్తున్నట్లు.
మా వారు ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉంటారు. వారానికి ఒకసారి వచ్చి పోతుంటారు. ఇంట్లో పాప, అత్తయ్య, నేనే ఉంటాము. ప్రొద్దుటే పాప స్కూలుకెళ్ళిపోతుంది. నేను ఆఫీస్‌కి వెళ్తాను. ఆటోవాడే ప్రొద్దున్న, సాయంత్రం మా కాలనీలో ఉన్న పిల్లలతో పాటు మా పాపను కూడా స్కూల్‌లో దింపుతాడు, తీసుకువస్తాడు. కాబట్టి పాప గురించిన టెన్షన్ లేదు. చుట్టుప్రక్కల ఉన్న రెండు కుటుంబాలు చాలా మంచివి. అవి తప్పితే మిగతా ఇళ్ళు విసిరేసినట్లు ఉంటాయి. ఆటోవాడు ఏం చేయకుండా సెల్ఫ్ రింగ్ ఇచ్చుకుని మా వారితో మాట్లాడుతున్నట్లు సెల్‌లో మాట్లాడాను. వాడిని భయపెట్టడానికి ఈ ప్లేస్‌కొచ్చాను అంటూ జాడలు చెప్పాను. పైగా ఇంటిపక్క ఎస్‌ఐ ఉన్నాడన్న కలరింగ్ ఇచ్చా… ‘‘అమ్మా… ఏం జరిగిందమ్మా… ఆర్ యూ ఆల్‌రైట్’’ కుదుపుతూ, దగ్గరకొచ్చి హాండ్‌బాగ్ తీసి పక్కకు పెడుతూ నా పక్క కూర్చుంటూ అడుగుతోంది పాప.
అత్తయ్య లోనికెళ్ళి నీళ్ళు తెచ్చింది. ఇప్పుడు నాకు జరిగిన సంఘటన ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న పాపకి చెప్పాలా వద్దా అంటూ ఒక్క నిమిషం తటపటాయించినా అంత చలిలోనూ చెమట్లు కక్కుతున్న నన్ను ఆదుర్దాగా చూస్తున్న దానిని చూస్తే నాకు చెప్పాలనే అనిపించింది. ఎందుకంటే ఒక నిర్భయ అనవసరంగా, ఒక మగ తోడు ఉండి, సురక్షితమైన బస్సులోనే ఎక్కినా సమిధయింది. మరో అభయ అంతగా బయటి ప్రపంచంలో జరుగుతున్నవన్నీ తెలిసినా అమాయకంగా ఆహుతయ్యింది. అందుకే నా కూతురికి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పిస్తున్నా. పైగా లోకం పోకడలు వారిని ఒక్కోసారి యుక్తితో బెదిరించి, ఎలా ఎదుర్కోవచ్చో తల్లిగా నేను చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు అనిపించి, ఏం లేదురా… బంగారు తల్లీ… ‘జీవనసమరంలో ఓ రోజు’ అనే పాఠం ఈ రోజు చెబుతాను అంటూ ఫ్రెష్ అయి క్షేమంగా చేరుకున్నానని మా సార్ చేసిన కాల్‌కి రిప్లై ఇచ్చి, 100కి డయల్ చేసి విషయం చెప్పి మా అమ్మాయికి పాఠం మొదలెట్టాను. జరిగిన సంఘటనతో పాటు ఇటీవల ఒక యువతి బాగ్‌లో చిన్న కత్తిని ఆత్మరక్షణార్ధం ఉంచుకొన్నదని చెబుతూ, కనీసం కారంలాంటివైనా దగ్గరుంచుకుని తప్పించుకునే ప్రయత్నం చేయాలని, ‘హార్డ్‌వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్’ చేయాలంటూ చెబుతూ పోయాను.