శివలక్ష్మి తాను రాసిన ‘‘చిగురంత ఆశ’’, ‘‘రియలిస్టిక్ సినిమా’’ సంపుటాలను ప్రచురణల ద్వారా తెలుగు పాఠకులకు అందించారు. హీరోలకు అభిమాన సంఘాలు పెట్టుకొని, పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు చేసుకుంటూ, చూసిన సినిమాలే పదేపదే చూసి వేలకు వేలు తగలేసే తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా యువతరానికి దారి చూపించే కరదీపిక ఈ ‘రియలిస్టిక్ సినిమా’ పుస్తకం.
శివలక్ష్మి దృక్పథం ఏమిటో ఈ పుస్తకం ద్వారా తను ఏం చెప్పాలనుకుందో పాఠకులకు తెలియటమే కాదు, పాఠకులను అటువైపు నడిపించేట్టుగా చేస్తుంది. ఈ పుస్తకానికి వి.వి.గారు, లలిత గారు వ్రాసిన ముందుమాటలు మరింత నిండుతనాన్ని చేకూర్చాయి. రచయిత్రి ఫిల్మ్ ఫెస్టివల్ సభ్యురాలు కావటంతో అనేక ప్రపంచ సినిమాలు చూసే అవకాశం దక్కింది. సమాజంమీద సినిమా ప్రభావం ఎలా ఉంటుందో శివలక్ష్మికి తెలుసు. తను చూసిన సినిమాలలో కొన్ని ఎన్నుకొని, వాటిని విభాగాలుగా చేసుకొని ఈ పుస్తకాన్ని రూపొందించారు. ముప్ఫై వ్యాసాలు ఉన్న ఈ సంపుటిలో సినిమాల మీద ఇరవై నాలుగు డాక్యుమెంటరీల మీద ఆరు సమీక్ష వ్యాసాలతో పాఠకుల ముందుకు తీసుకువచ్చారు. మూకీ సినిమాల కాలం నుండీ స్త్రీలపై అత్యాచారాలు, హింస, నేటి కరోనా కల్లోల కాలం వరకు వచ్చిన కొన్ని క్లాసిక్ సినిమాల సమీక్షా సమాహారం ఈ పుస్తకం. ఐసెన్ స్టీన్, విట్టోరియా డి సికా, ఆకయా కురసోవా, సత్యజిత్ రే ల కళా నైపుణ్యం, ప్రతిభ, దృశ్యాల చిత్రీకరణ పట్ల వీళ్ళు ఎంత శ్రద్ధ తీసుకునే వాళ్ళో పాఠకులకు అడుగడుగునా వివరిస్తారు. ఈ దర్శకుల సినిమాలను తెలుగు ప్రజలకు పరిచయం చేయడంతో శివలక్ష్మి ఏ ప్రజా సమూహం వైపు నిలబడుతారో పాఠకులకు అవగతమవుతుంది.
ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ కూడా సినిమా పేరు, ఏ దేశం, ఏ భాష, ఎప్పుడు తీశారు, ఎవరు తీశారు, దర్శకుడు ఎవరు, నటీనటుల వివరాలు, సినిమా నిడివి ఎంత మొదలయిన వివరాలను రెండు వాక్యాలలో చెప్తూ సమీక్ష మొదలు పెడతారు. తరువాత చిన్న పేరాలో సినిమా ఇతివృత్తాన్ని చెప్పి, సినిమా కథను క్లుప్తంగా వివరిస్తారు. ఈ సినిమాలు వీక్షించే క్రమంలో ప్రేక్షకుల్లో చెలరేగే భావోద్వేగాలు ఎలా ఉంటాయో ఊహిస్తారు. స్క్రీన్ ప్లే, రచయితలు, దర్శకులు, నటుల యొక్క కళా నైపుణ్యాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. దీనివలనే ‘రియలిస్టిక్ సినిమా’ను చదివిన పాఠకులకు ఈ సినిమాలను చూడాలనే కాంక్ష పెరిగిపోతుంది. ఈ సినిమాలను చూశాక ప్రేక్షకులు బాధితుల వైపు, న్యాయం వైపు నిలబడతారని రచయిత్రి విశ్వాసం. ఏ సినిమానైనా చూశామంటే చూశామని అనుకోకుండా ప్రతి విషయాన్ని, దృశ్యాన్ని సూక్ష్మంగా పరిశీలించి సమీక్ష చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమాల్లో ఏ పద్ధతిని అవలంబించారు, ఏ ప్రతీకలు వాడారు, ప్రేక్షకుల మీద ఈ సినిమాలు చేసే ప్రభావం ఎలా ఉంటుందో కూడా వివరిస్తారు. ఈ సినిమాలకు లభించిన అవార్డులను కూడా సమీక్ష చివర్లో పొందుపరిచారు శివలక్ష్మి. అవాస్తవ జీవిత చిత్రణ, హీరో కేంద్రంగా తీసే సినిమాలకు ప్రత్యామ్నాయంగా వాస్తవ, చారిత్రక సంఘటనల ఆధారంగా నిర్మించిన రాజకీయ సినిమాలను మనకు పరిచయం చేస్తారు. మంచి సినిమా లక్షణాలు అంటే ఏమిటో ప్రముఖ సినీ విమర్శకుల దృష్టికోణం నుండి చెప్తారు. సినిమాల్లోని కొన్ని దృశ్యాలను ప్రస్తావించినప్పుడు శివలక్ష్మి తన అనుభవాలను, పరిశీలనలను, వేదనను పాఠకులతో పంచుకుంటారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సినిమాలను సమీక్షించే క్రమంలో చాలా తీవ్రంగా స్పందిస్తూ కామెంట్ చేస్తారు.
ఈ ముప్ఫై వ్యాసాలలో మూడు భారతీయ సినిమాలకు, రెండు డాక్యుమెంటరీలకు చోటు దక్కింది. సహజంగానే సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’ సినిమాను సమీక్షకు ఎంచుకున్నారు. ఇక్కడే అందరి అంచనాలకు భిన్నంగా ప్రధాన పాత్రల గురించి కాకుండా, ఇందిర ఠాక్రున్ పాత్ర వేసిన ఎనభై సంవత్సరాల నటి చుని బాలాదేవిని సత్యజిత్ రే మలచిన చిరస్మరణీయ పాత్ర గురించి ‘ఇందిర ఠాక్రున్’ వ్యాసం ద్వారా ప్రేక్షకుల కళ్ళముందు నిలిపారు శివలక్ష్మి. రే పడిన శ్రమకు, కృషికి ఏ మాత్రం తీసిపోకుండా, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చుని బాలాదేవి నటించి భారతీయ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారని పాఠకులకు అర్థమవుతుంది. సత్యజిత్ రే వలనే భారతదేశానికి వాస్తవిక సినిమా, నవతరం సినిమా, సమాంతర సినిమా అనే పదాలు తెలిశాయని శివలక్ష్మి అభిప్రాయపడతారు. భారతదేశంలో వేళ్ళూనుకున్న కులవివక్ష విశ్వరూపాన్ని అంబేద్కర్ జీవితంలోని యధాతథ సంఘటనలను దృశ్యమానం చేసిన ‘అంబేద్కర్ డాక్యుమెంటరీ’లోని ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ ఈ డాక్యుమెంటరీ చూడవలసిన అవసరం ఎంత ఉందో స్పష్టంగా వివరించారు.
విముక్తి కొరకు, స్వేచ్ఛ కొరకు పోరాటం చేసే ప్రజల ఆకాంక్షలను, పోరాటాలను చిత్రించిన డాక్యుమెంటరీలను ‘కొన్ని ప్రత్యామ్నాయ సినిమాలు’ అనే విభాగం కింద పరిచయం చేశారు. విముక్తి పోరాటలకు దిక్సూచి ‘కాశ్మీర్’ అనే వ్యాసంలో స్వేచ్ఛ కోసం దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న కాశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నాన్ని చిత్రించిన ‘‘Jashan E Azadi’’ డాక్యుమెంటరీని చాలా ఆవేదనతో పాఠకులతో పంచుకుంటారు శివలక్ష్మి. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ శరణార్ధి శిబిరం మీద 2002లో ఇజ్రాయిల్‌లో ఇజ్రాయిల్ సైన్యం చేసిన అమానుషమైన దాడిని మొహమ్మద్ బక్రీ చిత్రించిన ‘‘Janin Janin’’ డాక్యుమెంటరీకి సజీవ అక్షర రూపమే ‘పాలస్తీనా సత్యం’. మూస కథల్లా కాకుండా, వినూత్నమైన దృశ్యీకరణతో, నాన్ లీనియర్ పద్ధతిలో నిర్మించిన హిందీ భాషా చిత్రం ‘Love, Sex, Dhoka’’ గురించి సమకాలీన ప్రజా సమూహాలకు, మరీ ముఖ్యంగా యువతరానికి అచ్చమైన ప్రామాణికంగా నిలిచే సినిమా ఇది అని అభిప్రాయపడతారు. ‘తెలుగువారి సినిమా అక్షరాస్యత కోసం ఆరాటం’ అనే వ్యాసంలో అపారమైన సినీ విజ్ఞానఖని నందగోపాల్ గారిని స్మరించుకుంటారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన అందించిన అపురూప కానుక ‘‘సినిమాగా సినిమా’’ పుస్తకాన్ని పరామర్శిస్తారు. ఫిల్మ్ అంటే ఆర్ట్ ఫిల్మ్ అనీ, సినిమా అంటే నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన, ప్రేక్షకులు… ఈ నాలుగు కలసిన వ్యవస్థ అనీ, మూవీ అంటే కేవలం వ్యాపారాత్మకమైనదనీ, నిర్ధారించిన నందగోపాల్‌ను మనకు గుర్తు చేస్తారు.
ఒకే సంఘటన గురించి, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వాటిపై భిన్న వ్యక్తులు సాక్ష్యం చెప్తున్నప్పుడు, ఆ సంఘటనను తమ ప్రయోజనాలకు అనుకూలంగా ఎలా మలచుకుంటారో దృశ్యమానం చేసిన చిత్రం ‘రషోమోన్’. ప్రపంచం మొత్తం అకయా కురసోవా వైపు చూసేలా చేసిన సినిమాను ‘మానవ మనస్తత్వాలు’ వ్యాసం ద్వారా మనకు అందించారు. రషోమోన్ చిత్రంలో మేధావితనమంతా ‘ఒకటి నిజం`రెండు అబద్ధం’ లలో వ్యక్తమవుతుంది. ఆ నిజం`అబద్ధం ఏమిటో తెలియాలంటే శివలక్ష్మి వ్యాసం చదవాల్సిందే!
అడవి బిడ్డలుగా, ప్రకృతిలో భాగంగా ఉన్న ఆదివాసులపై నాగరిక మానవులు అని చెప్పుకుంటున్న సమూహం చేసే హింసను, పర్యావరణ విధ్వంసాన్ని ఐదు భాషల్లో, ఇద్దరు దర్శకులు కలిసి నిర్మించిన సినిమా ‘‘Altiplano’’. అట్టడుగు ప్రజల వైపు నిలబడి, హృదయాలను కలచివేసే వారి బాధలను దృశ్యీకరించి, మన కళ్ళను తెరిపించే ఈ ఇద్దరు దర్శకులకూ చేతులెత్తి నమస్కరించాలని అంటారు రచయిత్రి. ‘రియలిస్టిక్ సినిమా’ వ్యాస సంకలనంలో మొత్తం ముప్ఫై వ్యాసాల్లో ఒకటి, రెండు వ్యాసాలు మినహాయిస్తే, మిగిలిన అన్నింటిలోనూ మహిళలు ప్రధాన పాత్రలుగా ఉన్నవే ఎన్నుకున్నారు శివలక్ష్మి. అయితే, స్త్రీలు కేంద్రంగా, మహిళా సమాంతర సినిమా విభాగం కింద సమీక్షించిన సినిమాలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ప్రేమ పేరిట మోసపోయి, బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపబడి, లైంగిక బాసటగా మారిన జస్టిన్ ఉరఫ్ మారియోల దుర్భర జీవితాన్ని చిత్రంగా మలచిన ‘Your name is Justine’’ ని చాలా భావోద్వేగంతో వర్ణిస్తారు. ‘వదులుకోకూడని సమయాలు’ సమీక్షలో, ఓర్పు, త్యాగం, సేవ పదాలకు పర్యాయపదంగా ఉన్న స్త్రీని కాకుండా, తనకు ఏం కావాలో, తన అభిరుచులు ఏమిటో, ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే యువతి ప్రధాన పాత్రగా చిత్రీకరించిన సినిమా ‘My name is ki’ ని విశ్లేషిస్తారు. స్త్రీలు తమ జీవితాల్లో స్పేస్, ఎన్‌టైటిల్స్ కోసం ఎంతగా పరిశ్రమిస్తారో, పరితపిస్తారో ఈ సినిమా మనకు తెలియజేస్తుంది. ఈ వ్యాసానికి ఈ శీర్షిక పెట్టడంలోనే శివలక్ష్మి చైతన్యం ఏమిటో మనకు అర్ధమవుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఫ్రెంచ్ సిద్ధాంతాలకు ప్రతీకలుగా నీలం, తెలుపు, ఎరుపు అనే మూడు రంగులను ఎన్నుకొని నిర్మించిన ట్రయాలజీని మొదటి సినిమా ‘Three colours Blue’’ను ‘మనశ్శాంతిని ఇవ్వని స్వేచ్ఛ’ పేరిట పాఠకులకు అందించారు. సినీ పాఠాలను బోధించే స్థాయి ఉన్న ఈ సినిమాలోని నీలం రంగుని స్వేచ్ఛ, శాంతి అనే భావాలకు ప్రతీకలుగా చూడాలని అంటారు. అంతులేని దుఃఖంతో బాధపడుతున్న జూలీ యొక్క అంతరంగ ఘర్షణ, భావోద్వేగాల దృశ్య చిత్రీకరణ కోసం వాడిన ‘ఫేడ్`అవుట్ / ఫేడ్`ఇన్’ల ద్వారా ఆవిష్కృతమైన సాంకేతికతను ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు శివలక్ష్మి. ఈ వ్యాసంలో ‘‘Blue’’ సినిమా సమీక్ష చదివిన పాఠకులు తెలుపు, ఎరుపు సినిమాల కోసం అనివార్యంగా ఆరాటపడతారు. రచయిత్రి కోరుకునేది కూడా ఇదే.
యూరోపియన్ యూనియన్ నుండి ఇక్కడి మహిళలు ‘‘మా సమస్యలపైన దృష్టి పెట్టండి’’ అని విజ్ఞప్తి చేస్తూ ఇండియా మహిళలకు బహుమతిగా పంపిన కొన్నింటిని సమీక్ష చేసి ఈ పుస్తకంలో పొందుపరిచారు. తాము చేసిన అత్యాచారాల సంఖ్య చెప్పుకునే కొందరు నిస్సిగ్గు పురుషుల్ని, పరువు పేరిట తమ కుటుంబ స్త్రీలను చంపిన ప్రబుద్ధులను చూపించే ‘‘From fear to ending Violence Against Women’’ డాక్యుమెంటరీ ప్రముఖమైనది. అయితే మహిళల మీద జరిగే అమానవీయమైన హింసకు మూలకారణమైన పెట్టుబడి, వ్యాపార సంస్కృతి గురించి మాటమాత్రంగా కూడా ప్రస్తావించలేదు అంటూ ఈ డాక్యుమెంటరీకి ఉన్న పరిమితిని శివలక్ష్మి తేటతెల్లం చేశారు.
చైనా, రష్యా విప్లవ ఉద్యమంలో పాల్గొని, ప్రజా కంఠక సైన్యంతో తమ శక్తి మేరకు పోరాడిన మహిళా యుద్ధ యోధుల వాస్తవ గాథలను చిత్రించిన సినిమాలు ‘The Red Detachment of women ’’, ‘The dawns here are quiet’’. ఈ రెండు సినిమాలను సమీక్ష చేసిన వ్యాసాలలో (‘చైనా మహిళా సైన్యం’, ‘రష్యా రెడ్ ఆర్మీ మహిళా కామ్రేడ్స్’) మహిళలను యుద్ధవీరులుగా అభివర్ణించడమే కాకుండా, యూనివర్సిటీ విద్యార్థులకు ఈ సినిమాలను చూపించాలని శివలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు.
అంతర్జాతీయ సినిమాలను సమీక్షించే క్రమంలో శివలక్ష్మి అనివార్యంగా భారతదేశ సమాజంతో ముడిపెడతారు. ఒకసారి ప్రజాదరణ పొందిన సాహిత్యంతో పోలిస్తే, ఇంకొకసారి రామాయణ, మహాభారతం వాటితో పోలుస్తారు. కావ్యం, ఇతిహాసం, పురాణాలను కాకరాలగారు ఎలా నిర్వహించారో ‘‘Euthanasia’’ సినిమాను సమీక్షించిన ‘ప్రపంచీకరణ దుష్పరిణామాలు’ వ్యాసంలో చెప్తారు. ‘ఎథనేసియా’ను గ్రీకు పురాణంలో కనిపించే అందాలరాశి హెలెన్‌తో పోలుస్తారు. ఎందరో తత్వవేత్తలను అందించి ఒకానొక కాలంలో ఉజ్వలంగా వెలిగిన గ్రీకు దేశం నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఉజ్వలంగా వెలిగిన కాలంనాటి హెలెన్ నేడు దిక్కుతోచక ఇంటి నుండి గెంటివేయబడిన ఎథనేసియాగా అవతరించింది అంటారు. సోషలిస్ట్ వ్యవస్థ కొరకు చేసే పోరాటాలను మూకీ చిత్రాల ద్వారా ప్రపంచానికి అందించిన ఐసెన్ స్టీన్ సినిమాలను సమీక్ష చేస్తూ, ఐసెన్ స్టీన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, శ్రమజీవుల పట్ల ఆయనకున్న ప్రేమానురాగాలను, కార్మిక రాజ్యం రావాలనే ఆకాంక్షను పాఠకులతో పంచుకుంటారు రచయిత్రి. రెండు విరుద్ధ సంఘటనల మధ్య ఘర్షణ సృష్టించి తాను ప్రతిపాదించదలచుకున్న మూడో విషయాన్ని స్ఫురింపచేయడమే మాంటేజ్ అని అంటారు. ‘Strike, “Battleship Potem kim’’ సినిమాలలో ఐసెన్ స్టీన్ అవలంబించిన మాంటేజ్ ప్రయోగాన్ని, కొన్ని దృశ్యాలను సోదాహరణగా తీసుకొని వర్ణిస్తారు. ‘‘దీa్‌్‌శ్రీవంష్ట్రఱజూ ూశ్‌ీవఎ సఱఎ’’ సినిమా ఒక సృజనాత్మక విద్యుద్ఘాతం! ఒక సాంకేతిక కళాఖండం అని అభివర్ణిస్తారు. ఈ సినిమాలోని ప్రఖ్యాతి గాంచిన ఒడెస్సా మెట్ల సన్నివేశాన్ని రాయడం సాధ్యం కాదు, చూసి తీరవలసిందేనంటారు రచయిత్రి. ఐసెన్ స్టీన్ సినిమాలలో హీరోలు ఉండరు, ప్రజా సమూహాలే హీరోలు, ప్రధాన పాత్రలు అని శివలక్ష్మి తను పరిశీలించిన విషయాన్ని మనకు తెలియజేస్తారు.
యుద్ధం, ఫాసిజాల యొక్క క్రూరత్వాన్ని, అవి సృష్టించే విషాదాలను, ప్రజల జీవితాల్లో రేపిన అల్లకల్లోలాలను తెరకు ఎక్కించిన ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు విట్టోరియా డి సికా చిత్రించిన మూడు సినిమా సమీక్షలను ఈ పుస్తకంలో చేర్చటంతో ఈ సంపుటికి మరింత ప్రాధాన్యత సమకూరింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భర్తను కోల్పోయి, పదమూడు సంవత్సరాల అమాయక కూతురుతో మిగిలిపోయిన ఒంటరి తల్లి సెసిరా (ఇద్దరు మహిళలు). ఫ్రెంచ్ సైనికుల చేతుల్లో అత్యాచారానికి గురై, చిత్రహింసలు అనుభవించే దృశ్యాలలో తల్లీ కూతుళ్ళుగా నటించిన సోఫియా లారెన్స్, ఎలియోనోరా బ్రౌన్‌ల నటన అనితరసాధ్యం అంటారు. రెండేళ్ళ చిన్నారి కొడుకుతో ఇల్లు విడిచి బయటకు వచ్చి, బతకడానికి పెనుగులాడిన ఒంటరి తల్లి కీ, (My name is ki) అలాంటి ఒంటరి తల్లి సెసిరాలు చూపించిన పోరాట పఠిమ, స్థైర్యం మహిళలకు స్ఫూర్తిదాయకం అంటారు. ఇటాలియన్ నియో రియలిస్ట్ ఉద్యమ శక్తిని వ్యక్తీకరించిన అత్యుత్తమ చిత్రం ‘Bicycle Thieves’ సినిమాలో, దొంగతనం అంటే ఏమిటో తెలియని, కాయకష్టం చేసుకొని బ్రతికే ప్రజలను అనివార్యంగా దొంగలుగా మార్చే ఫాసిజాన్ని, దాని స్వరూపాన్ని తండ్రీ కొడుకుల పాత్రల ద్వారా తెరకు ఎక్కించిన సినిమాను అత్యంత హృద్యంగా వర్ణిస్తారు. ఈ రెండు సినిమాల ద్వారా తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్ళ మధ్య బంధాలు, ప్రేమలు, మారుతూ పోయే సంబంధాలను ప్రస్తావించటం, చర్చించటం శివలక్ష్మి యొక్క సునిశిత దృష్టికి తార్కాణం. రోమ్ నగరంలో, ఒక విప్లవ నాయకునికి ఆశ్రయమిచ్చి, అతడ్ని కాపాడడానికి, జర్మన్ నాజీ ఫాసిస్టు సైనికులకు బలయిన యువతి జీవితాన్ని చిత్రించిన ‘‘Rome open city’’ సినిమాను, ‘ఇటలీ ప్రతిఘటన పోరాటాలు’ వ్యాసంలో పరిచయం చేస్తారు. నోరు తిరగని కొన్ని ఇటలీ సినిమా పాత్రల పేర్లను పలకడానికి వీలుగా రాశారు. జర్మనీ, ఇటలీ దేశాల్లో విలయతాండవం చేసిన ఫాసిజం, ఇండియాలో కూడా విస్తరిస్తోందని శివలక్ష్మి పాఠకులను హెచ్చరిస్తున్నారు.
విట్టోరియా డి సికా అంటే ఏమిటో, ఆయన సినిమాలు ఎందుకు తీస్తాడో, ఏమి చెప్పాలనుకుంటాడో శివలక్ష్మికి స్పష్టంగా తెలుసు. దృశ్యమే బలంగా మాట్లాడుతున్నప్పుడు పొడవైన డైలాగ్‌తో పనేముంది అనే విట్టోరియా డి సికాలోని లోతైన గాఢత, అత్యున్నత మానవీయ కోణం, భావోద్వేగాలను నిజాయితీగా చిత్రించే ఈయన సినిమాలను చూసైనా మన తెలుగు సినీ దర్శకులు, నిర్మాతలు బుద్ధి తెచ్చుకోవచ్చు కదా అని శివలక్ష్మి విసుక్కుంటారు. లాభాపేక్ష తప్ప ప్రజాశ్రేయస్సు ఏ మాత్రం పట్టని మన సినీ వ్యాపారులు ప్రజలు చూస్తున్నారు, మేము తీస్తున్నాము అని చెప్పడంలోనే తెలుగు ప్రజల అభిరుచి గురించి వారికి ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్తోంది. వాళ్ళు నెపాన్ని ప్రజల మీదకే తోసేసి చేతులు దులుపుకుంటున్నారు. తెలుగు సినిమా ప్రేక్షకులు వికాసవంతులుగా, సమాజ శ్రేయస్సు కోరుకునే ఉన్నతమైన అభిరుచిని కలిగి ఉండే పౌరులుగా రూపు దిద్దుకుంటారనే ఆశతోనే ఈ పుస్తకాన్ని మనకు అందించారు. ఈ క్లాసిక్ సినిమాలను ఎంతో ప్రయాసతో, మరింత ఏకాగ్రతతో మనకు అందించిన శివలక్ష్మికి మనం సదా ఋణపడి ఉంటాము.