వీథి కొళాయిల దగ్గర మహిళలు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారని, గట్టిగా అరుచుకుంటారని చాలా కామెంట్లు వింటూ ఉంటాం. ఎన్నో జోకులు, కార్టూన్లు వీటి చుట్టూ కనబడుతూంటాయి. ఎన్నో వెకిలి కార్టూన్లు చూశాను.
ఇలా జోకులు వేసేవారికి, కార్టూన్లు వేసేవారికి మహిళల పని గురించి ఎలాంటి అవగాహన లేదని నాకు అనిపిస్తుంది. సహజంగా ఇంటికి కావలసిన నీటిని తీసుకొచ్చేది మహిళలే.
హైదరాబాద్ లాంటి నగరంలో నీటి ఎద్దడి, సమయానికి నీళ్ళు రాకపోవడం అనే సమస్య పెద్ద పెద్ద ఇళ్ళల్లో కనబడకపోవచ్చు, కానీ బస్తీలకు వెళ్ళినపుడు తప్పకుండా ఈ సమస్య కనిపిస్తుంది. బస్తీలో అక్కడక్కడా కనిపించే నల్లాల దగ్గర మహిళలు నీళ్ళ కోసం చేసే పోరాటంలో గొడవలు పడటం, అరుచుకోవడం మామూలుగా కనిపించే దృశ్యమే.
మంచినీళ్ళ కోసం చేసే ఈ పోరాటంలో తమ ఇంటికి కావలసిన నీళ్ళు దక్కకపోతే మర్నాటి వరకు వీరికి మంచినీళ్ళు దొరకవు అనేది వాస్తవం. వాటర్ బాటిల్స్ కొనుక్కోవచ్చుగా అనే క్రూరమైన జోక్ ఇక్కడ వెయ్యకండి. అందుకనే మహిళలు నీళ్ళ కోసం యుద్ధాలు చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. దీన్ని అర్థం చేసుకోగలిగిన ఒక సెన్సిటివిటీ మన సమాజంలో లేదు. వాళ్ళు నీళ్ళు తీసుకెళ్ళకపోతే ఆ ఇంట్లో తాగడానికి గుక్కెడు నీళ్ళుండవు. వంట చేసే బాధ్యత, కుటుంబంలో అందరికీ వడ్డించే బాధ్యత మహిళల మీదకే నెట్టేస్తున్నప్పుడు నీళ్ళు, వంటచెరకు, పొయ్యి మీదకు కావలసిన సరుకులు సమకూర్చుకోవాల్సిన అగత్యం మహిళలకే ఉండిపోవడం వల్ల ఆమె చేసే నిత్య యుద్ధాలలో నల్లాల దగ్గర జరిగే పోరాటం చాలా ముఖ్యమైనది.
ఈ అంశాన్ని గుర్తించగలిగిన విశాలమైన మనస్తత్వం గానీ, సెన్సిటివిటీ గానీ లేని వాళ్ళు నల్లాల దగ్గర జరిగే గొడవల్ని హేళన చేయడం, ఆడవాళ్ళు నల్లాల దగ్గర కొప్పులు పట్టుకుంటారని కామెంట్లు చేయడం చాలా అన్యాయం.
మరో ముఖ్యమైన విషయం, నల్లాల దగ్గర నీళ్ళు పట్టుకునే మగవాళ్ళు ఎందుకు కనబడరు? ఒకవేళ వాళ్ళు నీళ్ళ కోసం నల్లాల దగ్గర బిందెలతో నిలబడితే ఈ కొట్లాటలు, అరుచుకోవడాలు ఉండవా. ఇంటికి కావలసిన నీళ్ళు సంపాదించాల్సిన బాధ్యత మగవారి మీద ఉంటే ఇలాంటి హేళనలు, వెక్కిరింతలతో జోకులు, కార్టూన్లు వచ్చేవా? నల్లాల దగ్గర గొడవలకు అసలు కారణం ప్రజలకు సరిపడిన నీళ్ళను సరఫరా చేయని ప్రభుత్వాల అలసత్వం కాదా. అందరికీ సరిపడే నీళ్ళు లభ్యమైతే కొళాయిల దగ్గర గొడవలు ఎందుకవుతాయి. సరిపడిన నీళ్ళు, ఎక్కువ సమయం ఇస్తే గొడవలకు అస్కారం ఉండదుకదా! ఆ విషయం మీద ఫోకస్ చేయకుండా మహిళల్ని హేళన చేయడం దుర్మార్గం. ఇంటి చాకిరీలో తలమునకలుగా ఉండే మహిళలు తీరి కూర్చుని కొట్లాటలు పెట్టుకోవాలనుకోరు. నీళ్ళ పని అయిపోతే వేరే పని చేసుకోవాలనే తొందరలో ఉంటారు.
అక్కడ ముఖ్యమైన విషయం నీళ్ళ లభ్యత. సమయం, సందర్భం లేకుండా వచ్చే నీళ్ళు ఎంతసేపు వస్తాయి. తొందరగా బంద్ అయిపోతే ఆ రోజుకి మంచినీళ్ళు దొరకవని ఆతృత. ఆ ఆరాటం వాళ్ళ ఆరోగ్యం మీద కూడా ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది.
నీళ్ళ రాకపోకల అనిశ్చితి వల్ల నేను ముందు అంటే నేను ముందనే గొడవ జరగడం సర్వసాధారణం. దీన్ని మూడు కొప్పులు ఒకచోట ఇమడవు అంటూ నల్లాల దగ్గర ఆడవాళ్ళు ఎప్పుడూ అరుచుకుంటారని కామెంట్స్ చేయడం అంటే, అక్కడి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోలేని లేకితనం, ఇన్సెన్సిటివిటీ. ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా కుళ్ళు జోకులు వేయడం, వాటిని పదిమంది వెకిలి నవ్వులతో ఆమోదించడం చాలా అమానుషం.
నల్లాల దగ్గర ఆడవాళ్ళ గొడవ, రభస అంటూ మాట్లాడే వారంతా మహిళల పని భారం గురించి అర్థం చేసుకోగలిగితే ఇలాంటి కామెంట్స్ చేయడం మానేస్తారు. మంచినీళ్ళు కుటుంబంలో అందరికీ అవసరమైనవి. ఆ రోజు మంచినీళ్ళు దొరక్కపోతే చాలా ఇబ్బంది కలుగుతుందని మహిళలు అర్థం చేసుకున్నట్లు మగవాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే కుళ్ళు జోకులు, చెత్త కామెంట్లు పెడుతున్నారు. మహిళలు మాత్రం నల్లాల దగ్గర ఎలాగైనా సరే మంచినీళ్ళు సంపాదించాలని పోరాటాలు చేస్తూ ఉంటారు.
ఈ అంశం గురించి దయచేసి ఇన్సెన్సిటివిటీ కామెంట్లు మానేసి నీళ్ళ కోసం బిందెలు తీసుకుని కొళాయిల దగ్గరకు వెళ్ళవలసిందిగా మగవారిని కోరుతున్నాను. అప్పుడే కదా కొళాయిల దగ్గర యుద్ధాలు ఎందుకవుతాయో అర్థమయ్యేది.