చాకిరీ చేసుకుంటే తప్ప పొట్ట గడవని అమ్మాయి… పాపం
ఏమిటా రసపైత్యపు చూపులు?
దొంగ చాటుగా పట్టుకోడానికా ప్రయత్నాలు? నిలదీస్తాను
ప్చ్! ఏం చేయను? మగబుద్ధి అంటావు… పొగ వదులుతూ…
ఛీ! ఛీ! సహించలేను, భరించలేను
ఇది ఆడబుద్ధి అంటాను…
‘లైట్’ తీసుకోమంటావు…
పరువు, మర్యాద, సంస్కారం, కట్టుబాట్లు
నైతికత, వైవాహిక రాగబంధాలు?? ప్రశ్నిస్తాను
అర్థం కానట్టు చూస్తావు…
మాటా మాటా పెరిగి …
వెక్కి వెక్కి ఏడుస్తాను
అన్నీ పగలకొడతావు… అరుస్తావు…
అడ్డుపడతాను, ప్రాధేయపడతాను
కొడతావు… తిడతావు… వెళ్ళిపొమ్మంటావు
అంతటితో ఆడామగా సమస్య తీరదంటాను…
బలహీన క్షణాలు అర్థం చేసుకోమంటావు… అధికారంతో
బలాన్ని చూపిస్తా కాచుకొమ్మంటాను… దృఢంగా
అదిరిపడతావు
మరెలా అంటూ నన్నే ఆశ్రయిస్తావు
తప్పు తెలుసుకొని సరిదిద్దుకో మన్నిస్తాను అంటాను
వివేకం మానవబుద్ధి అంటాను
ఒదిగిపోతావు… చంటి బాబులా