ఆ గిరిజాల జుట్టులో
సూర్యకిరణాలు అల్లుకున్నాయి
కడలి అలలు ఆ కనురెప్పలలో
స్రవిస్తున్నాయి
ఆమె నీలాకాశంలో విరబూసిన
నల్ల కలువ
రాత్రికి నక్షత్రాలు ఆమె పాదాలకు
సేవ చేస్తున్నాయి.
ఆ అడవిలోని ఆకులు
ఆమె చరణాలకు
తివాచీలు పరుస్తున్నాయి
అది నిన్నటి కథ
ఇప్పుడు ఆమె మంటల్లో తగలబడుతోంది!?
ఆమె వంటిని తోడేళ్లు చీరేస్తున్నాయి
ఎవరు దేశాన్ని సృష్టించారో
ఆ దేహం చీల్చబడుతుంది
రాజ్యం వికట నృత్యం చేస్తుంది
మతోన్మాదం ఉక్కుగోళ్ళు పెంచుకుంది
నాయకుల గుండెల్లో జొరబడిరది
శాంతిని, క్రాంతిని ఉక్కు పాదంతో
నొక్కుతుంది
వారు ఉన్మాదులు
దేశాన్ని తరాలుగా రక్తసిక్తం చేశారు
నదుల్లో నెత్తురు పారింది
ఇప్పుడు కొండ కోనల్లో జీవిస్తున్న
దేశీయులను వేటాడుతున్నారు
ఈ మతోన్మాదులు
దేశీయులు కారు
ఇది చారిత్రక సత్యం
ఎందరో పడుచులను గర్భాలయాల్లో కుక్కి వారి
దేహాన్ని, మానాన్ని అపహరించిన దుండగులు
భరతభూమికి వీరు శత్రువులు
ఆది భారతీయుల విధ్వంసం
వీరి దినకృత్యం
వీరి దేవుళ్ళ చేతిలో
ఆయుధాలుంటాయి.
వీరు దేవుళ్ళ పేరుతో దేశ సంపదను
దోచుకుంటున్నారు
మరో ప్రక్క వీరు
తెల్ల భవనానికి బానిసలు
కార్పొరేట్లకు తొత్తులు
అన్ని బ్యాంకుల్నీ దోచి దోచి
ప్రవాసులయ్యారు
వీరు నివాసులు కారు
కన్నీరు వీరికి పన్నీరు
దుఃఖాన్ని సృష్టించటం వీరి వేదాంతం
తల్లి తల నరికిన వాడు
వీరికి విద్యా గురువు
వీరి అవతారాలన్నీ చంపడానికే
ఏర్పడినాయి
హత్య వీరి ప్రవృత్తి
వీరు విద్వేష ప్రవచకులు
తలలు నరకడాన్ని సౌందర్యంగా చెబుతారు
నరకబడ్డ తలలు వీరికి నల్ల కలువలు
వీరి ప్రవచనాల్లో హింస పల్లవి
వీరి చూపుల్లో ఆధిపత్యం ఉంది
వర్ణ తత్వం ఉంది
వీరు ప్రేమ శూన్యులు
మణిపూర్‌లో గిరిజన స్త్రీలపై చేసిన
అఘాయిత్యానికి ప్రపంచం
విస్తు పోయింది
వీళ్ళు ఎగరవేసే శాంతి పావురాలు
నెత్తుటి స్నానంలో మునిగి ఎగురుతున్నాయి
అంబేద్కర్ ఒక్కరే భారతావనికి
మనిషిని బ్రతికించే సూత్రం చెప్పారు
ఆ గిరిజ స్త్రీ ముంగిట
సేనాధిపతులందరూ
వొంగి నమస్కరిస్తున్నారు
వీరు అవకాశవాదులు
వీరు ఏ తలలు నరికారో
ఆ తలలను పూజిస్తారు
వీరిది వధ సంస్కృతి
అందుకే బౌద్ధం ఒక సాంస్కృతిక విప్లవం
అహింస మానవాభ్యుదయానికి మార్గం.
తెంచుకునేవన్నీ సంకెళ్ళే
చీకటిని ఛేదించి వెలుగు సంద్రంలో నావగా పయనిద్దాం
అంతిమ లక్ష్యం అంబేద్కర్ మార్గమే.