మహిమ – డా. మజ్జి భారతి

పేపర్‌ చదువుతూ ఉంటే ఓ మూలనున్న వార్త ఆకర్షించింది సుమతిని. ‘నేను బాబాను కాదు. దేవుడిని కాదు. నాకేమీ మహిమలు లేవు. నేనూ మీలాంటి మనిషినే. మీ సమస్యలకు నేనేరకంగానూ పరిష్కారం చూపలేను.

నేను మామూలు మనిషిని. దయచేసి నా వద్దకు ఎవరూ రావొద్దు’ అని దైవాంశ సంభూతురాలిగా అందరిచే కొలవబడుతున్న విజయమ్మ గారు చెప్పిన మాటలివి. అయినా తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు ఆమె వద్దకు రావడం మానలేదు. ఇప్పటికీ ఆ పల్లెటూరిని దర్శిస్తూనే ఉన్నారు. కొంతమంది సమస్యలతో, మరికొంతమంది ఆమె ఎలా ఉంటారో చూద్దామన్న కుతూహలంతో… ఇదీ ఆ వార్త సారాంశం. అందులో ఉన్న వివరాలు చూస్తుంటే తన చిన్నప్పటి క్లాస్‌మేట్‌ విజయ, ఈ విజయమ్మ గారు ఒకరేనేమోనన్న అనుమానం వచ్చింది సుమతికి. ఫోన్‌బుక్‌లో నెంబర్‌ వెతికి వెంటనే ఫోన్‌ చేసింది. ‘‘ఏమిటి చాలా రోజులకి గుర్తొచ్చానా! ఎలా ఉన్నావు?’’అంటూ మాట్లాడిరది విజయ.
… … …
పేపరులో ఆ వార్త చదివాక ఒకసారి విజయను చూడాలనిపించి, ఆమె ఉండే ఊరు బయలుదేరాను. వైజాగ్‌లో ఎక్కిన బస్సులో పక్కవాళ్ళ మాటలు చెవిన పడుతున్నాయి.
‘‘ఆవిడ నాకేమీ మహిమలు లేవు అని చెప్పినా, ఆవిడ మాటకు చాలా మహిమ ఉంటుందంట. ఆమె అన్నమాటే జరుగుతుందట. మూడేళ్ళుగా సంబంధాలు వెతుకుతూ ఉన్న మా ఆడపడుచు కూతురికి ఆమె దగ్గరికి వెళ్ళాకే మంచి సంబంధం వచ్చింది’’ అని ఒకామె చెబుతోంటే, ‘‘అవునట, నేనూ విన్నాను. మాకు తెలిసిన వాళ్ళబ్బాయికి ఎంత మంది డాక్టర్లకు చూపించినా తగ్గని పిచ్చి ఆవిడ దగ్గరకు వెళ్ళి వచ్చాక కుదిరిపోయిందట’’ అని ఇంకొకామె. నా పక్క సీట్లలో కూర్చున్నవారు ఇలా ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఆ ముందు సీట్లో కూర్చున్నావిడ ‘‘ఏమండీ! ఆవిడ మీకు బాగా తెలుసా? నిజంగా ఆవిడ మాటకు అంత మహత్యం ఉందా?’’ అని అడిగింది.
‘‘ఏమోనండీ! వాళ్ళు వీళ్ళు అనుకున్న మాటలే. మేమెప్పుడూ కలవలేదు’ అన్నారు వాళ్ళు.
‘‘ఆవిడ ఫీజు ఎంత తీసుకుంటుందండి? మా అమ్మాయి విషయం గురించి ఆమెను కలుద్దామనుకుంటున్నాం’’ అడిగింది మరల ఆవిడే. వీళ్ళు ఏదో చెప్పేలోగా కండక్టరు ‘‘అమ్మా! ఆవిడ పైసా తీసుకోరు. అసలు తన వద్దకు రావొద్దని చెప్పారు కూడా. మన భ్రాంతి కొద్దీ మనమే ఆ ఊరు వెళ్తూ ఉంటాము. మేము ఆమె దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాము, ఆమె మాకు బాగా తెలుసు అని ఎవరన్నా అంటే నమ్మకండి. ఆవిడ నాకు తెలుసు. రామాలయం దగ్గర్లో, ఆవిడ ఇల్లు. తిన్నగా అక్కడికి వెళ్ళిపోండి’’ అని చెప్పాడు. వాళ్ళ మాటలు చెవిన పడుతోంటే నేను గతంలోకి జారుకున్నాను.
విజయ, నేను ఒకటో క్లాస్‌ నుండి టెన్త్‌ వరకు కలిసి చదువుకున్నాము. ఆ తర్వాత ఇంటర్‌కి నేను వైజాగ్‌ వెళ్ళిపోయాను. వాళ్ళ ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా, పదవ తరగతి పరీక్షలవ్వగానే విజయకు పెళ్ళి చేసేశారు ఆమె తల్లిదండ్రులు. ఆ తర్వాత భర్త తాగుడుతో నానా పాట్లు పడి, పెళ్ళయిన పదేళ్ళకే భర్త చనిపోతే, చాలా కష్టాలు పడి, ఎలాగైతేనేం ఇప్పుడున్న పరిస్థితికి చేరుకుంది. మేము ఆఖరుసారి కలిసి దగ్గరదగ్గర ఓ పదేళ్ళు అయి ఉంటుంది. ఇప్పుడు విజయని చూడాలని వెళ్ళడానికి కారణం, మా పాత ఫ్రెండ్‌షిప్‌ ఎంత మాత్రం కారణం కాదు. ఆ పేరుతో నా సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని వెళ్తున్నాను.
నా ఒక్కగానొక్క కూతురుని అమెరికా పంపించి చదివించాను. తను అక్కడే ఎవర్నో ‘‘ప్రేమించాను, పెళ్ళి చేసుకుంటాను’’ అంటోంది. మాకు ఇష్టం లేదు. ‘‘ఎవరో తెలియని వాళ్ళకి పిల్ల భవిష్యత్తును ఎలా అందిస్తామ’’ని నా వాదన. ‘‘మేము రెండేళ్ళుగా కలిసి పని చేస్తున్నాం. అతని గురించి నాకన్నీ బాగా తెలుసు’’ అని మా అమ్మాయి శ్రీనిజ వాదన.
ఆ విషయమై ఇప్పుడు విజయ ఏమి చెబుతుందో వినాలన్న కోరికతో నేను బయలుదేరాను.
‘‘నువ్వు! ఇక్కడ!’’ నన్ను వాళ్ళింటి దగ్గర చూసిన విజయ చాలా ఆశ్చర్యంగా అడిగింది. ‘‘మొన్న నువ్వు ఫోన్‌ చేసినప్పుడు, నిన్ను ఇక్కడ చూస్తానని నేను కలలో కూడా ఊహించలేదు! విషయం ఏంటి? చెప్పు’’ అని అడిగింది విజయ. ‘‘నిన్ను చూడడానికి వచ్చాను’’ నవ్వుతూ అన్న నా మాటలకు ‘‘నువ్వు నన్ను చూడటానికి వచ్చావంటే నమ్మలేను కానీ, విషయం ఏమిటి?’’ తనూ నవ్వుతూ అడిగింది.
‘‘కొంపతీసి నాకేవో మహిమలున్నాయనుకొని రాలేదు కదా! అలా అయితే నువ్వు చాలా డిజప్పాయింట్‌ అవుతావు’’ క్లారిటీ ఇచ్చింది.
‘‘మహిమలని కాదు గానీ, పేపర్లో నిన్ను గురించి వార్త చదివాక ఒక విషయంలో నీ సలహా తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. అందుకే వచ్చాను’’ అని విషయం దాచుకోకుండా తన సమస్య ఏమిటో, తన అభిప్రాయం ఏమిటో, తన కూతురు ఏమనుకుంటోందో, నిర్ణయం ఏమి తీసుకోవాలో తెలియక, ఈ విషయాన్ని పంచుకునేంత దగ్గరివారు ఎవరూ లేక, ఇంకొక మనిషి ఆలోచనయితే బాగుంటుందనుకుని, తన దగ్గరకు వచ్చానని, ఇదీ విషయమని అంతా వివరంగా చెప్పింది సుమతి.
విషయం విని రెండు నిమిషాలు మౌనంగా ఉంది విజయ. ‘‘ఏ విషయంలోనైనా, ఏ నిర్ణయం తీసుకున్నా, తర్వాత ఏమి జరుగుతుందో, మనం అప్పుడే చెప్పలేం. అందుకని ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం మంచిదా, కాదా అనే విషయం భవిష్యత్తులో మాత్రమే మనకు తెలుస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా, దాని యొక్క ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉన్నా దాన్ని అంగీకరించటానికి మనం మానసికంగా ఇప్పటినుండే సిద్ధమై ఉండాలి. నన్ను అడిగావు కాబట్టి చెబుతున్నాను. మీ అమ్మాయి నిర్ణయాన్ని గౌరవించటం తల్లిగా నీ బాధ్యత అని నాకు అనిపిస్తోంది. పాతికేళ్ళు నిండిన పిల్లల ఆలోచనలను మనం గౌరవించటం అలవాటు చేసుకోవాలి. అలాగే, వారి నిర్ణయంలో ఉన్న తప్పొప్పులను మనము వారితో చర్చించి, వారి ఆలోచనకు మరింత పదును పెడితే వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోగలరు అనే నమ్మకం నాకుంది. ఇదీ నా అభిప్రాయం’’ అని చెప్పింది విజయ.
విజయ అభిప్రాయాలను జీర్ణించుకున్నట్లు కాసేపు ఏమీ మాట్లాడలేదు సుమతి. ఆ తర్వాత మనసులో ఏ ఆలోచన వచ్చిందో నవ్వుతూ ‘‘నేను వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు చెప్పు, అసలు నీ గురించి పేపర్లో రావడానికి ఉన్న నేపథ్యం ఏమిటి? సరదాగా వినాలని ఉంది, చెప్పు’’ కుతూహలంగా అడిగింది సుమతి. తనకి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పుడు మొదలైంది? ఆలోచనలో మునిగిపోయింది విజయ. సరిగ్గా అయిదేళ్ళ కిందట… ఏమి జరిగింది…
‘‘మేడం! మా పేరెంట్స్‌ ఈ సంవత్సరం నా పెళ్ళి చేయాలని అనుకుంటున్నారు. నాకేమో ఇంకా బాగా చదువుకోవాలని ఉంది. ఎలాగైనా హెల్ప్‌ చేయరా మేడం! మీ అంత బాగా చదువుకున్న వాళ్ళు చెపితే మా నాన్న వింటాడేమో’’ కన్నీళ్ళతో ప్రాధేయపడిరది. టెన్త్‌ క్లాస్‌లో స్కూల్‌ ఫస్ట్‌ తెచ్చుకొని, ఇప్పుడు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు రాసిన మాధవి.
‘‘భవిష్యత్తుపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాను? ఎన్ని కలలు కన్నాను? బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి నా వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలని ఎంత ఆరాటపడ్డాను? ఇప్పుడు వాటన్నింటికీ సమాధి కట్టేసి, పెళ్ళిపీటల మీద కూర్చోవలసిందేనా? విద్యాధిదేవత సరస్వతీ మాత అంటారు, కానీ ఆడపిల్లలను ఎందుకు చదివించరు మేడం? పురాణాలలో కూడా స్త్రీకి ఉన్న ప్రాముఖ్యతను చెప్పారు. ఆ విషయాన్ని ఇప్పటి వాళ్ళు ఎందుకు గ్రహించడం లేదు? మన పురాణాల్లోనే స్త్రీ విద్యకు ఎంతో ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. అది ఇప్పుడెవరూ ఎందుకు పాటించడంలేదు? నాలాంటి వాళ్ళ ఆశలు నేలరాలాల్సిందేనా? దీనికి వేరే మార్గం లేదా? మేడం! ఈ పెళ్ళి ఆగకపోతే ఆత్మహత్య ఒక్కటే నాకు శరణ్యం. ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపండి. ప్లీజ్‌!’’ అని విలపిస్తోన్న మాధవిని చూస్తుంటే నలభై ఏళ్ళ క్రిందట విజయే గుర్తుకువచ్చింది ఇప్పటి విజయమ్మకు.
కన్నీళ్ళతో శోకసంద్రంలో ఉన్న మాధవిని చూస్తే తన చిన్నతనం ఎందుకు గుర్తుకొస్తోంది? ఎందుకంటే ఇప్పటి మాధవి పరిస్థితే ఒకప్పటి తనది కూడా. తను మాధవి అంత బాగా చదువుకోకపోయినా, ఆ కాలంలో ఆడపిల్లలకు చదువెందుకన్న కాలంలో తాను బాగానే చదువుకుంది. పెద్ద తెలివైంది కాకపోయినా కష్టపడి చదువుకునేది. ఎక్కువమంది మగవాళ్ళతో సమానంగా మార్కులు తెచ్చుకునేది. ఇంకా చదివిస్తే, అంతకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళకిచ్చి పెళ్ళి చేయాల్సి వస్తుందని, తన టెన్త్‌ పరీక్షలు అవ్వగానే, వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా వినకుండా, తనకన్నా పదేళ్ళు పెద్దవాడైన మేనబావతో తన పెళ్ళి చేశారు తల్లిదండ్రులు. తాగుడుకి అలవాటు పడిన మేనబావ పెళ్ళై పదేళ్ళు తిరగకుండానే కాలం చేశాడు. పాతికేళ్ళకే, పది సంవత్సరాల సంసార జీవితం, ఇద్దరు చంటి బిడ్డలు… జీవితపు నడిసంద్రాన్ని ఎలా ఈదిందో తనకే తెలియదు. ఎన్ని కష్టాలు… ఎన్ని అవమానాలు… ఎన్ని అడ్డంకులు… వాటన్నింటినీ దాటుకుని ఇద్దరు బిడ్డలను చేతిలో పెట్టుకొని ఇంటర్‌ పరీక్షలు రాసి, తర్వాత టీచర్‌ ట్రైనింగ్‌ అయ్యి, నెమ్మదిగా పంతులమ్మ ఉద్యోగం సంపాదించుకున్నాక జీవితం ఒక గాడిన పడ్డట్లయింది. ఆ తర్వాత ఉద్యోగం చేసుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ నెమ్మదిగా డిగ్రీ పరీక్షకు కట్టి, బిఈడీ ట్రైనింగ్‌ అయి, అంచెలంచెలుగా, రిటైర్‌ అయ్యేనాటికి ప్రధానోపాధ్యాయురాలిగా ఉంది. ఒక ఫ్లాష్‌లా గత జీవితం కళ్ళముందు కదిలింది విజయకు.
‘కాలం మారినా ఆడపిల్లల స్థితిగతులు మారడం లేదు. ఆడపిల్లల విషయం వచ్చేసరికి తల్లిదండ్రులు పేదవారైనా, డబ్బున్నవారైనా, వాళ్ళ ఆలోచన మాత్రం ఒక్కలాగే ఉంటోంది. తల్లిదండ్రుల ఆలోచనలలో మార్పు రానంతవరకు వాళ్ళ స్థితిగతులతో సంబంధం లేకుండా విజయలు, మాధవిలు ఉంటూనే ఉంటారు. కలలన్నీ సమాధి చేసుకుంటూ తమ ఉనికి కోల్పోతూ ఉంటారు. ఈ పరిస్థితి మారాలంటే తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలి’ నిట్టూర్చింది విజయ.
ఎంత ఆస్తి ఉన్నా పెళ్ళయ్యాక స్త్రీలందరి జీవితం ఒక్కలాగే ఉంటుంది. ఆశలు తుంచుకోవడం, ఆంక్షలలో మెలగడం… తను పడిన కష్టం లాంటి కష్టం ఇంకొకరు పడకూడదని, తన జీవితంలాగా ఇంకొక అమ్మాయి జీవితం చిన్నతనంలోనే నాశనమవ్వకుండా
ఉండాలంటే ఏమి చెయ్యాలి? రెండు రోజులు ఆలోచిస్తూనే ఉంది విజయ.
‘ఆ పిల్లకు పిచ్చి అని సంబంధం వెనక్కి మరలిపోయిందట’ పక్కింటివాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి విజయమ్మకు. ‘సంబంధం వెనక్కి మరలిపోయింది’ మనసు ఆ ఒక్కమాటనే గట్టిగా పట్టుకుంది.
… … …
మరో వారం తర్వాత ‘ఒరేయ్‌! చదువుల తల్లిని, నన్నే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావురా? ఎంత ధైర్యంరా నీకు? నీ వంశాన్ని సర్వనాశనం చేస్తానురా!’ పెళ్ళి చూపులకు వచ్చిన అబ్బాయితో మాధవి అన్న మాటలు ఆ నోటా, ఈ నోటా పడి, చిలవలు పలవలుగా మారి, ఊరిలోనే కాదు బంధువర్గంలో కూడా పాకిపోయాయి. మాధవికి పిచ్చి అని ముద్ర పడిపోయింది.
అప్పటివరకు బాగానే ఉండే మాధవి పెళ్ళిచూపులనగానే తనే సరస్వతీదేవినని, బ్రహ్మదేవుడొక్కడే తన భర్త అని మాట్లాడసాగింది. ఆస్తి కోసం పెళ్ళి చేసుకుంటామన్న సంబంధాలు తప్పించి, వచ్చిన సంబంధాలన్నీ వెనక్కు తిరిగిపోతున్నాయి.
మాధవి తల్లిదండ్రులకు ఏమి చేయాలో పాలుపోలేదు. బంధువులందరూ తలా ఒక సలహా ఇస్తున్నారు. పిచ్చి డాక్టరుకు చూపించమని కొందరు, ఎవరికో ఒకరికిచ్చి కట్టబెట్టేసేయండి, లేకపోతే ఈ పిచ్చిదానికి మరి పెళ్ళికాదని మరొకరు, చదువుకుంటున్న పిల్లకు ఇప్పటినుండే పెళ్ళేమిటి, చదివించండని ఇంకొకరు… ఇలా రకరకాల సలహాలతో ఏమి చేయాలో పాలుపోని మాధవి తల్లిదండ్రులు విజయమ్మ సలహా కోసం వచ్చారు. ‘‘మీరంటే మాధవికి బాగా గురి. మాధవి మా ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఎలాగైనా మీరే మాధవితో మాట్లాడి, తన మనసులో ఏముందో తెలుసుకోవాలి’’ అని మాధవి తల్లిదండ్రులు ప్రాధేయపడితే మాధవితో మాట్లాడిన విజయమ్మ ‘‘మాధవికి చదువంటే ఇష్టం. చాలా బాగా చదువుకొని, మంచి ఉద్యోగం చేసే భర్తను పొందాలని ఆమె కోరిక. చదువొద్దు అనేసరికి, పెద్దగా చదువులేని అబ్బాయితో పెళ్ళి అనేసరికి ఆమె మానసిక ఆందోళనకు గురయ్యింది. తన భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయంతో, అది బయటికి చెప్పుకునే మార్గం లేక అలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది. మీరు మాధవిని దగ్గర కూర్చోబెట్టుకొని, ఆమె మనసులో ఏముందో తెలుసుకొని, ఆమెకు నచ్చినట్లు చేస్తే, పిచ్చి నుండి బయటపడుతుందని అనిపిస్తోంది నాకు’’ అని సలహా ఇచ్చింది విజయమ్మ. అలా మాధవి కాలేజీకి వెళ్ళటమే కాకుండా, ఎంతోమంది మంత్రగాళ్ళను తెప్పించినా కుదరని పిచ్చి విజయమ్మతో మాట్లాడాక కుదిరిపోయిందని ప్రచారమయింది.
‘‘విజయా! ఏమిటి, ఆలోచనల్లో మునిగిపోయావు? నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు’’ అని అడుగుతున్న సుమతి మాటలకి ఈ లోకంలోకి వచ్చింది విజయ. ‘‘ఏమీ లేదే. పల్లెటూరి విషయం నీకు తెలిసిందే కదా! సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేక, ఇచ్చిన సలహాలు వాళ్ళ జీవితాలకు మంచిని చేయలేక ఎక్కువ మంది మానసిక ఆందోళనకు, అనారోగ్యానికి గురవుతుంటారు. వాళ్ళను పిచ్చివాళ్ళుగా ముద్రవేసి ఆ పిచ్చిని ముదరనిస్తారు. పెళ్ళయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళవదు అన్న విషయం నీకు తెలిసిందే కదా! సమస్య తీరకుండా, మానసిక ఆందోళన కుదురుకోదు. మామూలు జలుబు, జ్వరాలలాగా ఒకటి, రెండుసార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్తే మానసిక అనారోగ్యం తగ్గిపోదు. మానసిక వైద్యుల దగ్గరికి ఎక్కువసార్లు వెళ్ళవలసి ఉంటుంది. దానికి ఎంతో ఓపిక, సహనం ఉండాలి. పల్లెటూర్లలో పనులు వదులుకొని ప్రతిసారీ వీళ్ళను కౌన్సిలింగ్‌కు తిప్పేంత టైం కానీ, ఓపిక గానీ ఎవరికీ ఉండదు. అందుకని ఎక్కువమంది మంత్రగాళ్ళను, భూతవైద్యులను ఆశ్రయిస్తారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా! మానసిక ఆందోళనతో వచ్చిన పిచ్చి, ఆ ఆందోళన ఉన్నంతవరకూ తగ్గదు. అందుకని ఒకసారి పిచ్చివాళ్ళు అని ముద్ర పడితే జీవితాంతం ఆ ముద్ర అలాగే ఉండిపోతుంది.’’
‘‘మాధవికి నేను పిచ్చి తగ్గించేశానని అపోహపడి, అప్పటినుండి ఎవరికి ఇలాంటి సమస్య వచ్చినా నా దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకొంటారు. నాకు తోచినంతలో వాళ్ళకు సలహాలు ఇస్తుంటాను. ఆ మాత్రం సలహాలు ఇచ్చేవాళ్ళు లేక, చిన్న చిన్న కారణాలకే ఎక్కువమంది జీవితాలు నాశనం చేసుకుంటారు. అలాంటి వాళ్ళకు నా సలహాలు పనికొస్తాయి’’.
‘‘మాధవి ఉదంతం జరిగాక, ఆడపిల్లలు కూడా ధైర్యంగా నా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. నా సలహాలు పాటించి, బాగా చదువుకుంటున్నారు. అలా అందరికీ నేనంటే ఒక గౌరవభావం ఏర్పడి, ఆ ఊరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించేవారు. ఈ విషయం అలా, అలా ఈ ఊరు దాటి, బయటకు పొక్కి పేపరుకెక్కింది. పల్లెటూరి విషయం నీకు తెలిసిందే కదా! ఏమీ లేకపోయినా ఇంతకంత చేస్తారు. అది మహిమ అనేవరకు వచ్చింది. అంతే! ఇంకేమీ లేదు. సింపుల్‌గా చెప్పాలంటే నేను చేసేది కౌన్సిలింగ్‌ మాత్రమే. అదే సైకాలజిస్టు దగ్గరకో, సైక్రియాట్రిస్టు దగ్గరికో వెళ్తే వాళ్ళకి అప్రతిష్ట అని వెళ్ళరు. అదే బాబాలు, అమ్మల దగ్గరకైతే ఆనందంగా వెళ్తారు. అదీ విషయం’’ అని ముగించింది విజయ.
‘‘నేను కూడా అందుకే వచ్చాను కదా! నీ సలహా తప్పకుండా పాటిస్తాను’’ నవ్వుతూ చెప్పింది సుమతి.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.