మొన్నొక రచయిత్రి ఒక కథ రాసింది. ఆ కథ చిన్నతనం నుండి విన్నదే, తెలిసినదే, చాలాసార్లు చదివినదే. అయినా ఆ కథకు చాలా మూతి విరుపు నుండి ముక్కు చిట్లించుకోవడాలు… అక్కడితో ఆగక విపరీతమైన బెదిరింపులు, ట్రోలింగులు.
ఇంతకీ కథ ఏమిటయ్యా అంటే… రావణుడిపై గెలిచిన రాముడు సీతను తీసుకొని మళ్ళీ అయోధ్యకు వస్తాడు. ఆ తర్వాత వారి రాజ్యాభిషేకం జరుగుతుంది. కథగా చదివితే సరళంగా అర్థమయినా ఈ రచయిత్రి ఇంకాస్త ముందుకెళ్ళి తన సహానుభూతికి సృజనాత్మకతను జోడిరచి, అయోధ్యకు వెనక్కి వచ్చిన సీత, లంకలో చెట్టు కింద గడిపిన కాలంలో తాను పడిన మానసిక వేదన, తద్వారా వచ్చిన ట్రామా నుండి లంక నుండి అయోధ్యకు చేరుకున్నా ఏ విధంగా తన పిఎస్‌టిడి (పోస్ట్ ట్రామాటిక్ స్రెస్ డిసార్డర్)ను తట్టుకుంది అనే విషయాన్ని విశదీకరించింది.
పిఎస్‌టిడి అనే కండిషన్ ఒక విఘాతం తగిలాక తేరుకునే ముందు జరిగే ఒక వర్ణించలేని బాధాకరమైన ప్రక్రియ. పెద్ద పెద్ద యుద్ధాలు, ప్రాకృతిక వైపరీత్యాలు, ఎన్నో పెద్ద విషాదాలు తట్టుకున్నాక మళ్ళీ మామూలు స్థితికి రావడం అంత తేలికైన విషయం కాదు. కానీ ఆడవారు కదా, వారిని తమ భర్త వచ్చి రక్షించారని రాస్తే చాలు అనుకున్నారేమో.
పురాణాల గురించి వేర్వేరు కథనాలు ఎప్పడినుండో వస్తూనే ఉన్నాయి. ఎందరెందరో రకరకాల పార్శ్వాల నుండి ఈ కథలను వారి జ్ఞానంతో స్పృశించారు. ఏ కొత్త కథను తవ్వి తీసినా పురాణ కథలలోని పాత్రల పోలికలు ఎక్కడో తగలక మానవు. అది ఆ కథలలో ఉన్న విస్తృతికి చిహ్నం. తూర్పు రామాయణం అని నవ్వుకున్నా, రామచరిత మానస్ అని కళ్ళకద్దుకున్నా రాముడు మనవాడే అనుకున్నాము. అదే విధంగా సీత కూడా మన పిల్లే కదా. ఆమె పడిన బాధను గురించి బోల్డన్ని కావ్యాలు, పద్యాలు చక్కని యతి ప్రాసలతో వచ్చాయి మరి. ఇప్పుడు ఉన్నట్టుండి ఆమె పడిన పిఎస్‌టిడి గురించి రాస్తే ఇంత హడావిడి ఎందుకు?
కథ బాలేదా? చక్కగా వాకిలి ఊడ్చి, పేడ కళ్ళాపు చల్లి, ఓపిగ్గా పెద్ద చుక్కల ముగ్గు వేసి తీర్చిదిద్దినట్లుంది. సీత పడిన బాధ చిన్నదా? రాకుమారిగా పెరిగిన మనిషి వనవాసానికి వెళ్ళడమే పెద్ద కష్టం అనుకుంటే అసలు తన ఆత్మాభిమానానికి దెబ్బ తగలడం చిన్న బాధా? కానీ గుర్తించము. ఏం లేదు. మన ప్రజలకు బాధకు, ట్రామాకు, మానసిక ఆరోగ్యానికి లంకె కుదరడం లేదు. ఆడవారి శీలానికి ఇచ్చిన విలువ వారి ఆరోగ్యానికి ఇవ్వలేదు. వారి అందచందాలను వివరిం చేటప్పుడు ఉండే ఓపిక వారు పడిన హింసను వివరించడానికి ఉండదు. ఆడ వారు బిడ్డను కంటూ చనిపోయారంటారు, ఆ ప్రక్రియలో వారు పడే శారీరక, మానసిక హింస మాట్లాడకూడదు. చనిపోవడం అనే చివరి దశ మాత్రమే రాయాలి. అంతే కదా?
మానసిక ఆరోగ్యం మనకు ఇంకా పూర్తిగా అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం. దానిమీద, ఆడవారి ఆరోగ్యం మీద శ్రద్ధ లేని వ్యవస్థకి మానసిక ఆరోగ్యం మీద అక్కర ఎందుకుంటుంది? ఒక పెద్ద విషాదాన్ని దాటి వచ్చాక ఆ భయం గుప్పిళ్ళ నుండి బయటపడే పెనుగులాట మధ్యలో ప్రెగ్నెన్సీ హార్మోన్లు కలగలిసి ఆలోచనలపై చేసే స్వైరవిహారాన్ని తట్టుకొని నిలబడి పండంటి బిడ్డకు జన్మనిస్తే, ఆ పండంటి బిడ్డకు జన్మనివ్వడం గురించి మాత్రమే మన ధ్యాసంతా. దాని చిత్రిక పట్టిన బాధకు కనీస గుర్తింపు ఉండదు.
ఆ విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొని వద్దామనుకుంటే, ఆ అర్థం లేని ఆలోచనల స్వైర విహారంలో దొరికే కొన్ని అప్రాచ్యపు రెక్కలు మాత్రమే కావాలి. సీతమ్మ గారి కష్టాలపై కూడా రాచరికపు జాలి గుర్తులు మాత్రమే చెల్లుతాయి.
ఆడమనిషి మీద శ్రద్ధ ఉండదు. ఆమె అనుభవాలపై శ్రద్ధ ఉండదు. ఆమె విషాదాల వ్యక్తీకరణకు విలువనివ్వ కూడదు. ఎందుకంటే ఆమె మహాతల్లి. మన సీతమ్మ తల్లి. తన కష్టాలన్నింటినీ కలిపి భూస్థాపితం చేయగలిగే సహనమయి. ఆ సహనం వెనుక నలిగిన మనసు కష్టం అర్థం చేసుకునే ఉద్దేశ్యాలు లేనట్టే ఉంది.
సీతమ్మ తల్లులమే కదా అందరం. నొక్కిపడేసిన ఆ నొప్పిని బయటకు తీద్దాం. గాయాలపై చల్లని గాలినూపు కుందాం. ఈ విషయాన్ని విశదీకరించే సాహసం చేసిన రచయిత్రికి ఆలింగనా లిద్దాం. కథను ఆ పోర్టల్ నుండి తీసివేసినా, ఒకసారి మన మనసులో ప్రాణ ప్రతిష్ట చేసిన ఆ నొప్పిని ప్రతి సీతమ్మ తల్లిలో గుర్తించి ఓదార్పునిద్దాం.
మనం సహానుభూతిపరులమే కానీ మన బాధను నిర్లక్ష్యం చేసే అంతటి నిర్దాక్ష్యపు సహనపరులం కాదని తెలుపుదాం.