అనువాదం: క్రిష్ణజ్యోతి
ఖుండే హలాల్‌లో భూమిలేని దళితుల పిల్లలు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ తమ సెలవులు గడుపుతున్నారు. వారు సంపా దించే డబ్బు ఇంటి ఖర్చులకు, తమ పరీక్షలకు అవసరమైన స్మార్ట్‌ఫోన్‌ల వంటి ఇతర వస్తువులు కొనుక్కోవడానికి సహాయపడుతుంది
జస్‌దీప్ కౌర్ బాగా చదువుకోవడానికి స్మార్ట్‌ఫోన్ కొనవలసి వచ్చినప్పుడు, ఆమె తల్లిదండ్రులు ఆమెకు రూ. 10,000 అప్పుగా సర్దారు. ఆ అప్పు చెల్లించడానికి, 18 ఏళ్ళ జస్‌దీప్ కౌర్, తన 2023 వేసవి సెలవులను వరి నాట్లు వేస్తూ గడిపింది. పంజాబ్‌లోని శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లాలో, తమ కుటుంబాలకు సహాయంగా ఉండడానికి పొలం పనులు చేసే దళిత యువతుల్లో ఆమె కూడా ఒకరు.
మేం ఈ పొలం పనిని మా ఆనందం కోసం చేయడంలేదు, మా కుటుంబాల నిస్సహాయత వల్ల చేస్తున్నాం, అని జస్‌దీప్ తెలిపింది. ఆమెది పంజాబ్‌లో షెడ్యూల్డ్ కులానికి చెందిన మజహబీ సిక్కు కుటుంబం. ఆమె సముదాయంలో చాలామందికి సొంత భూమి లేకపోవడంతో, అగ్రవర్ణాలకు చెందిన రైతుల పొలాల్లో పని చేస్తుంటారు.
ఒక ఆవును కొనుగోలు చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఒక మైక్రోఫైనాన్స్ కంపెనీ నుండి రూ.38,000 అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బు నుంచే వారు ఆమెకు అప్పు ఇచ్చారు. ఒక లీటరు ఆవు పాలను రూ.40కి అమ్మితే వచ్చే ఆదాయంతో తమ ఇంటి ఖర్చులను వెళ్ళదీసుకోవచ్చని వాళ్ళ ఆలోచన. శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లాలోని ఖుండే హలాల్ గ్రామంలో సంపాదన అవకాశాలు చాలా పరిమితం – ఇక్కడి జనాభాలో 33 శాతం మంది వ్యవసాయ కూలీలే.
జూన్ నెలలో కళాశాల పరీక్షకు హాజరుకావలసి వచ్చినప్పుడు, జస్‌దీప్‌కు ఆ స్మార్ట్‌ఫోన్ అమూల్యమైన సహాయం చేసింది – వరి పొలాల్లో పనిచేస్తూ, మధ్యలో దొరికిన రెండు గంటల విరామంలో ఆమె ఆన్‌లైన్‌లో ఆ పరీక్ష రాసింది. పని వదిలేసే పరిస్థితి కాదు నాది. పనికి బదులు కాలేజీకి వెళ్తే, ఆ రోజు నా కూలీ పోతుంది, అని ఆమె పేర్కొంది.
పంజాబ్‌లో, శ్రీ ముక్త్‌సర్ జిల్లాలోని ముక్త్‌సర్ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం కామర్స్ చదువుతోన్న జస్‌దీప్‌కు వ్యవసాయ కూలీగా పనిచేయటం కొత్తేమీ కాదు. తన 15వ ఏట నుండి ఆమె తన కుటుంబంతో కలిసి పొలం పనులు చేస్తోంది.
వేసవి సెలవుల్లో తమ నానీ పిండ్ (అమ్మమ్మ వాళ్ళ ఊరు)కి తీసుకువెళ్లమని మిగతా పిల్లలు అడుగుతారు. కానీ, మేం మాత్రం వీలైనంత ఎక్కువ వరి నాట్లు వేస్తూ ఉంటాం, ఆమె నవ్వుతూ తెలిపింది.
తన కుటుంబం ఒక మైక్రో ఫైనాన్స్ కంపెనీ నుండి రెండుసార్లుగా తీసుకున్న రూ. లక్ష అప్పును తీర్చడానికి, మొదటిసారి పొలం పని మొదలుపెట్టింది జస్‌దీప్. మోటర్‌బైక్ కొనడం కోసం 2019లో ఆమె తండ్రి జస్వీందర్ రెండుసార్లు అప్పు తీసుకున్నారు. ఒక అప్పుపై వడ్డీగా రూ.17,000ను, మరొక అప్పుపై వడ్డీగా రూ.12,000ను ఆ కుటుంబం చెల్లించింది.
జస్‌దీప్ తోబుట్టువులైన 17 ఏళ్ళ మంగళ్, జగదీప్‌లు కూడా తమ 15వ ఏట నుండే పొలం పని చేయడం మొదలుపెట్టారు. ఈ గ్రామంలోని వ్యవసాయ కూలీల కుటుంబాలు, తమ పిల్లలకు ఏడెనిమిదేళ్ళు వచ్చే సరికి పొలం పనులకు తీసుకెళ్తారని జస్‌దీప్ తల్లి 38 ఏళ్ళ రాజ్‌వీర్ కౌర్ మాతో అన్నారు. అలా పనిచేసే తల్లిదండ్రులను చూస్తూ పెరిగే మా పిల్లలకు, పెద్దయ్యాక మాతో కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడు, ఇదేమంత కష్టంగా అనిపించదు, అని ఆమె వివరించారు.
ఇదే దృశ్యం వారి పొరుగింటిలో కూడా కనబడుతుంది – నీరూ, ఆమె ముగ్గురు తోబుట్టువులు, భర్తను కోల్పోయిన వారి తల్లి. మా అమ్మకు కాలా పీలియా (హెపటైటిస్ సి) ఉండడంతో, వరి నాట్లు వేయడానికి చాలా కష్టమవుతుంది, అంటూ తాము పని కోసం వేరే ఊరికి వెళ్ళలేకపోవటానికి గల కారణాన్ని 22 ఏళ్ళ నీరూ చెప్పింది. అందుకే 2022లో సోకిన హెపటైటిస్ సి కారణంగా సులభంగా వేడిమికి ప్రభావితమయ్యే 40 ఏళ్ళ సురీందర్ కౌర్ తరచూ జ్వరం, టైఫాయిడ్ బారినపడుతుంటారు. ఆమెకు నెలనెలా వచ్చే రూ.1,500 వితంతు పింఛను ఇంటి ఖర్చులకు ఏ మాత్రం సరిపోదు.
దాంతో తమ 15వ ఏట నుండి నీరూ, ఆమె తోబుట్టువులు వరి నాట్లు వేయటం, కలుపు మొక్కలు తొలగించడం, పత్తి ఏరడం వంటి పనులు చేస్తున్నారు. భూమిలేని మజహబీ సిక్కుల కుటుంబాలకు ఇదే ఏకైక ఆదాయ వనరు. మా సెలవులన్నీ పొలాల్లో పని చేస్తూనే గడిపాం. వేసవి సెలవుల్లో ఇచ్చిన హోవ్‌ువర్క్‌ను పూర్తిచేయడానికి మాకు ఒక వారం మాత్రమే ఖాళీ దొరుకుతుంది, నీరూ చెప్పింది.
కానీ పని పరిస్థితులు, మరీ ముఖ్యంగా సుదీర్ఘమైన వేసవి వేడిలో పని చేయడం చాలా కష్టం. వరి పొలాల్లోని నీళ్ళు వేడెక్కిపోతుండటంతో అందులో పనిచేసే మహిళలు, బాలికలు మధ్యాహ్న సమయానికి కొంత నీడను వెతుక్కోవాలిÑ మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాతే పని మొదలుపెట్టాలి. ఇది శారీరకంగా ఎంతో శ్రమతో కూడుకున్న పని. కానీ చెల్లించాల్సిన అప్పులు, ఖర్చుల దృష్ట్యా జస్‌దీప్, నీరూల కుటుంబాలకు వేరే దారి లేదు.
ప్రతి సంవత్సరం పాఠశాల ఫీజులు, కొత్త పుస్తకాలు, యూనిఫావ్‌ులకు అయ్యే ఖర్చుల గురించి వివరిస్తూ, మా సంపాదనంతా వాళ్ళ చదువుల ఖర్చులకే సరిపోతే, ఇక ఇల్లెలా నడుస్తుంది? అని రాజ్‌వీర్ వాపోయారు.
వారిలో ఇద్దరు బడికెళ్ళాలి, తమ పక్కా ఇంటి ప్రాంగణంలో ఉన్న మాంజీ (నులక మంచం) మీద కూర్చునివున్న ఆమె అన్నారు. జగదీప్, తమ గ్రామానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ఖేవాలిలోని ప్రభుత్వ బాలికల సీనియర్ సెకండరీ స్మార్ట్ స్కూల్లో చదువుతోంది.
అమ్మాయిని బడికి తీసుకువెళ్ళే వ్యాన్ సర్వీస్ కోసం మేం ప్రతి నెలా రూ.1,200 చెల్లించాలి. అలాగే వాళ్ళ అసైన్‌మెంట్ల కోసం మరికొంత డబ్బు ఖర్చు చేయాలి. ఎప్పుడూ ఏదో ఒక ఖర్చు ఉంటూనే ఉంటుంది, అంది జస్‌దీప్.
జూలైలో వేసవి సెలవుల ముగిశాక మంగళ్, జగదీప్‌లు తమ పాఠశాల పరీక్షలకు హాజరుకావాలి. అందుకే సెలవులు ముగిసే సమయానికి, వాళ్ళు చదువుకోవడానికి వీలుగా, పొలం పని నుండి రెండు రోజులు సెలవులు ఇవ్వాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది.
జస్‌దీప్‌కు తనకంటే చిన్నవాళ్ళయిన తోబుట్టువుల చదువుల సామర్థ్యంపై నమ్మకం ఉంది. అయితే, ఈ గ్రామంలోని పరిస్థితులు యువత మొత్తానికీ ఒకేలా ఉండకపోవచ్చు. వారు కష్టపడతారు, కానీ అది వారిని ఆందోళనకు గురిచేస్తుంది, మాంజీ పై తన తల్లికి దగ్గరగా కూర్చుంటూ చెప్పింది జస్‌దీప్. ఈ యువతి తన వంతు కృషి తాను చేస్తోంది. ఈ గ్రామంలో, సాయంకాలాలు తమ సముదాయానికి చెందిన చిన్న తరగతి పిల్లలకు ఉచితంగా ట్యూషన్ తరగతులు నిర్వహించే కళాశాలకు వెళ్ళే కొద్దిమంది దళితుల బృందంలో ఆమె కూడా ఒకరు. అయితే, ఈ తరగతులు జూన్ నెలలో అంత క్రమబద్ధంగా జరగవు. ఎందుకంటే, చాలా మంది ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పొలాల్లో పని చేస్తుంటారు.
భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు అందుబాటులో ఉండే కొన్ని కాలానుగుణ వృత్తులలో వరి నాట్లు ఒకటి. ఎకరం పొలంలో వరి నాట్లు వేసినందుకు, ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.3,500 వరకు చెల్లిస్తారు. ఒకవేళ నర్సరీలు పొలం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటే గనుక, అదనంగా రూ.300 చెల్లిస్తారు. ఈ పనిని రెండు లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలు కలిసి చేస్తే, కుటుంబంలోని ఒక్కొక్కరికి రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు లభిస్తుంది.
అయితే, ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పని దొరకడం తగ్గిపోయిందని ఖుండే హలాల్‌లోని చాలా కుటుంబాలు తెలిపాయి. ఉదాహరణకు జస్‌దీప్, ఆమె తల్లిదండ్రులు ఈ సీజన్లో 25 ఎకరాల భూమిలో వరి నాట్లు వేశారు. గత ఏడాదితో పోలిస్తే, ఇది ఐదెకరాలు తక్కువ. వారు ముగ్గురూ ఒక్కొక్కరు రూ.15,000 చొప్పున సంపాదించారు. జస్‌దీప్ కంటే చిన్నవారయిన ఆమె తోబుట్టువులు ఒక్కొక్కరు రూ.10,000 చొప్పున ఈ సీజన్‌లో సంపాదించారు.
శీతాకాలంలో వాళ్ళకు దొరికే పని పత్తి ఏరటం. అయితే, జస్‌దీప్ చెప్పినదాని ప్రకారం, ఇదివరకటిలా ఇప్పుడు పత్తి ఏరటం బతుకుతెరువుకు సరిపడే ఆదాయాన్నిచ్చే పని కాదు. తెగుళ్ళ దాడి, భూగర్భజలాల స్థాయి తగ్గిపోవడం వల్ల గత 10 సంవత్సరాలలో పత్తి సాగు క్షీణించింది.
ఉపాధి అవకాశాలు లేకపోవడంతో, కొందరు వ్యవసాయ కూలీలు ఇతర పనులు కూడా చేస్తున్నారు. జస్‌దీప్ తండ్రి జస్వీందర్ (40) తాపీ పని చేసేవారు. కానీ, శరీర దిగువ భాగంలో నొప్పి ఎక్కువ కావడంతో ఆయన ఆ పనికి స్వస్తి పలికారు. జూలై 2023లో ఆయన ఒక మహీంద్రా బొలేరో కారును కొనడానికి, ఒక ప్రైవేట్ బ్యాంక్ నుండి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. ఇప్పుడతను గ్రామ ప్రజలను ఆ కారులో తమ గమ్యాలకు చేరుస్తున్నారు. అయితే, ఆయన ఇప్పటికీ వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు. కారు కోసం తీసుకున్న అప్పును ఈ కుటుంబం ఐదేళ్ళలో తీర్చెయ్యాలి.
రెండేళ్ళ క్రితం వరకూ నీరూ కుటుంబ సభ్యులు వేసవి సెలవుల్లో కనీసం 15 ఎకరాల్లో వరి నాట్లు వేసేవాళ్ళు. ఈ ఏడాది రెండెకరాల భూమిలో మాత్రమే వాళ్ళు పని చేశారు. ఆ పని చేసినందుకు కూలీకి బదులుగా వాళ్ళు తమ పశువుల కోసం దాణాను ప్రతిఫలంగా తీసుకున్నారు. నీరూ అక్క 25 ఏళ్ళ శిఖాశ్ 2022లో తన గ్రామానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోడాలో, మెడికల్ లేబొరేటరీ అసిస్టెంట్‌గా పని చేయడం ప్రారంభించింది. ఒక ఆవునీ, ఒక గేదెనీ కొనుగోలు చేసిన ఈ కుటుంబానికి, ఆమె నెల జీతం రూ.24,000 కొంత ఉపశమనాన్నిచ్చింది. ఈ అమ్మాయిలు దగ్గర దూరాలు ప్రయాణించడం కోసం ఒక సెకండ్ హ్యాండ్ మోటర్‌బైకును కూడా కొన్నారు. నీరూ కూడా తన అక్కలాగే ల్యాబ్ అసిస్టెంట్ శిక్షణ పొందుతోంది. అయితే, ఆమె చదువుకు అవసరమైన రుసుమును గ్రామంలోని సంక్షేమ సంఘం భరిస్తోంది.
వారి చిన్న చెల్లెలైన 14 ఏళ్ళ కమల్, తన కుటుంబంతో కలిసి పొలానికి వెళ్తోంది. జగదీప్ చదివే బడిలోనే 11వ తరగతి చదువుతోన్న కమల్ కూలీ పనులు, బడి చదువుల మధ్య సాము చేస్తోంది.
ఈ సీజన్లో, గ్రామంలోని ఎక్కువమంది రైతులు DSR (direct seeding of rice – విత్తనాలను నేరుగా విత్తే పద్ధతి)ని ఎంచుకోవడంతో, వ్యవసాయ కూలీలకు ఇప్పుడు 15 రోజుల పని మాత్రమే అందుబాటులో ఉంటోంది, అని పంజాబ్ ఖేత్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న తర్సేవ్‌ు సింగ్ వివరించారు. వరి నాట్ల ద్వారా, ఒక్కొక్కరూ రూ. 25,000 వరకు సంపాదించేవారమని జస్‌దీప్ అంగీకరించింది..
కానీ,‘‘సీధీ బిజాయీ (వరి నేరుగా విత్తడం) కోసం, చాలామంది రైతులు ఇప్పుడు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ యంత్రాలు మాకు మజ్దూరీ (కూలిపని) లేకుండా చేశాయి,’’ అని జస్‌దీప్ తల్లి రాజ్‌వీర్ బాధపడ్డారు.
అందుకే చాలామంది గ్రామస్తులు పని కోసం వెతుక్కుంటూ దూరగ్రామాలకు వెళ్తున్నారు, నీరూ చెప్పింది. ణూR పద్ధతిని అనుసరించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.1,500 ఆర్థిక సాయం ప్రకటించడంతో, యంత్రాల వినియోగం పెరిగిందని కొందరు కూలీలు నమ్ముతున్నారు.
ఖుండే హలాల్‌లో 43 ఎకరాల భూమి ఉన్న రైతు గుర్పిందర్ సింగ్, గత రెండు సీజన్లుగా డిఎస్‌ఆర్ పద్ధతిని అనుసరిస్తున్నారు. వరి నాట్లు కూలీలు వేసినా, యంత్రం ద్వారా వేసినా తేడా ఏమీ ఉండదు. నేరుగా ధాన్యాన్ని విత్తడం ద్వారా రైతు ఆదా చేసేది నీరు మాత్రమే, డబ్బు కాదు, అని ఆయన వివరించారు.
డిఎస్‌ఆర్ పద్ధతి ద్వారా రెట్టింపు మొత్తంలో విత్తనాలను నాటవచ్చని 53 ఏళ్ళ గుర్పిందర్ సింగ్ తెలిపారు.
కానీ ఈ పద్ధతి వల్ల పొలాలు ఎండిపోవటంతో, ఎలుకలు సులభంగా ప్రవేశించి పంటను నాశనం చేస్తాయని ఆయన అంగీకరించారు. డిఎస్‌ఆర్ పద్ధతిని అనుసరించినప్పుడు, అధికంగా వచ్చే కలుపును నివారించడానికి ఎక్కువ మోతాదులో గుల్మనాశనిలను పిచికారీ చేయాల్సి వస్తుంది. అదే కూలీలు వరి నాట్లు వేసినప్పుడు, కలుపు ఉధృతి తక్కువగా ఉంటుంది.
అందుకే, కలుపు మొక్కలను వదిలించుకోవడానికి గుర్పిందర్ సింగ్ వంటి రైతులు మళ్లీ కూలీలను నియమించుకుంటున్నారు.
‘‘కొత్త సాంకేతికతను అవలంబించడం వల్ల రైతులకు లాభం లేనప్పుడు, వ్యవసాయ కూలీలను ఎందుకు పనిలో పెట్టుకోరు? మజహబీ సిక్కు అయిన తర్సేమ్ ప్రశ్నించారు. రైతులు, పురుగు మందుల కంపెనీల జేబులు నింపుతున్నారు, కానీ ‘‘మజ్దూరా దేతా కల్లె హత్తీ హై ఓవీ ఖాలీ కరణ్‌చ్ లగ్గే హై (కూలీలకు పని లేకుండా చేస్తున్నారు)’’, అని ఆయన వాపోయారు.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/en/articles/in-punjab-holidays-spent-labouring-in-the-fields-te/)) డిసెంబర్ 26, 2023 లో మొదట ప్రచురితమైనది.)