(22 నవంబర్ 2007 నుండి మార్చి 2008 వరకు తస్లీమా ఢల్లీిలోని ఒక అజ్ఞాత ప్రదేశంలో నిర్బంధంలో ఉండవలసి వచ్చినపుడు ఈ కవిత వ్రాశారు. సమిక్ బందోపాధ్యాయ ఈ కవితను తస్లీమా యొక్క ‘ూతీఱంశీఅ జూశీవఎం’ పుస్తకం నుండి అనువదించారు.
అనువాదం: పి.శ్రీనివాస గౌడ
నేను ఇప్పుడు నివసించే గదిలో
కిటికీ మూసి ఉంది…
నేను నా ఇష్టానుసారం తెరవలేని కిటికీ
నేను నా ఇష్టానుసారం
కదల్చలేనంత భారీ తెరతో
ఆ కిటికీ మూసేసి ఉంది.
నేను నా ఇష్టానుసారం
తలుపు తెరవలేని చోట,
గుమ్మం దాటలేని చోట…
నేనిప్పుడు ఒక గదిలో నివసిస్తున్నాను
నేను ఒక గదిలో ఉంటున్నాను,
గోడపై రెండు జబ్బుపడిన బల్లులు మాత్రమే
ఇక్కడ నివసించే ఇతర జీవులు.
మనిషిని లేదా మనిషిని పోలిన ఏ జీవిని
ఇక్కడ అనుమతించరు.
నేను ఊపిరి పీల్చుకోవడానికి
చాలా కష్టంగా ఉన్న గదిలో నివసిస్తున్నాను.
మీ తలను గోడకు కొట్టుకునే శబ్దం తప్ప
చుట్టూ ఏ శబ్దం ఉండదు.
ఆ బల్లులు తప్ప
ప్రపంచంలో మిమ్మల్నెవరూ గమనించరు.
నేను ఏడుస్తుంటే వాళ్ళు కూడా ఏడుస్తారా?
నేను నివసించడానికి ఇష్టపడని గదిలో ఉంటున్నాను,
నేను ఉండడానికి బలవంతం చేసిన గది,
ఆ గది…
నన్ను రోజుల తరబడి
బలవంతంగా జీవించేలా చేసిన ప్రజాస్వామ్యపు గది…
గదిలో చీకటిలో…
సందేహంతో, ఉరితీత బెదిరింపుతో…
బాధగా, కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ…
బ్రతకమని ప్రజాస్వామ్యం నన్ను బలవంతం చేస్తుంది.
కొద్ది కొద్దిగా లౌకిక వాదం
నన్ను నా జీవితాన్నించి నెట్టి వేస్తుంది.
ఈ గదిలో నా ప్రియమైన భారతదేశం
నన్ను నిర్బంధిస్తుంది…
ఏదో ఒక రోజు
గది నుండి బయటకు వచ్చే
జీవం లేని, కుళ్ళిన, జిడ్డు, ఎముకల ముద్దకు
ఈ బిజీగా ఉండే మనుసులు
మగవాళ్ళలా కనిపించే ఈ జీవులు
కొన్ని నిమిషాల సమయం వెచ్చిస్తారో లేదో
నాకు తెలియదు.
ఇక మరణమే నాకు విడుదల అవుతుందా?
మరణమే బహుశా ఎవరినైనా విడిపిస్తుంది,
గడప దాటడానికి ఎట్టకేలకు స్వేచ్ఛ.
ప్రజాస్వామ్యపు జెండాలో చుట్టి
నా ప్రియమైన భారతదేశ మట్టిలో
ఎవరైనా నన్ను పాతిపెడతారు,
బహుశా ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు…
చివరికి అక్కడ ఒక ఇంటిని కనుగొంటాను.
దాటడానికి ఎటువంటి ద్వారాలు లేని,
తేలిగ్గా శ్వాస తీసుకోగలిగే ఇంటిని…!