భారతదేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు : ఇటీవలి గణాంకాలు – డా.కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం, మహిళలపై హింసను, బెదిరింపులు, బలవంతం ద్వారా మహిళలకు శారీరక, లైంగిక లేదా మానసిక హాని లేదా బాధలు కలిగించే లింగ ఆధారిత హింస యొక్క ఏదైనా చర్యగా పేర్కొనవచ్చు.

అందులో ప్రధానంగా సన్నిహిత భాగస్వామి హింస అనేది శారీరక దూకుడు, లైంగిక బలవంతం, మానసిక దుర్వినియోగం, ప్రవర్తనలను నియంత్రించడం వంటి శారీరక, లైంగిక లేదా మానసిక హాని కలిగించేది, ఇది సన్నిహిత భాగస్వామి లేదా మాజీ భాగస్వామి ద్వారా నేడు బాధిత మహిళలకి జరుగుతోంది. లైంగిక హింస అనేది ఏదైనా లైంగిక చర్య, లైంగిక చర్యను పొందే ప్రయత్నం లేదా బలవంతంగా ఒక వ్యక్తి లైంగికతకు వ్యతిరేకంగా నిర్దేశించబడిన ఇతర చర్య, బాధితురాలితో సంబంధం లేకుండా ఏ వ్యక్తి అయినా, శారీరకంగా బలవంతంగా నిర్వచించబడిన అత్యాచారం, అత్యాచారానికి ప్రయత్నించడం, అవాంఛిత లైంగిక స్పర్శ ఇతర ప్రేరేపిత అంశాలుగా పేర్కొనవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రచురించిన అంచనాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా మూడో వంతు (30%) స్త్రీలు తమ జీవితకాలంలో శారీరక లేదా లైంగిక సన్నిహిత భాగస్వామి హింస లేదా భాగస్వామి కాని లైంగిక హింసకు గురయ్యారని సూచిస్తున్నాయి. ఈ హింసలో ఎక్కువ భాగం సన్నిహిత బాగస్వామి హింస జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా, 15`49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో దాదాపు మూడిరట ఒక వంతు (27%) వారు తమ సన్నిహిత భాగస్వామి ద్వారా ఏదో ఒక రకమైన శారీరక లేదా లైంగిక హింసకు గురయ్యారని నివేదించారు. హింస అనేది మహిళల శారీరక, మానసిక, లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కొన్ని సమయాల్లో ఇది హెచ్‌.ఐ.వి. సోకే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలు`గణాంకాలు:
ఇటీవల నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన ‘‘క్రైమ్‌ ఇన్‌ ఇండియా 2022’’ నివేదికలో అనేక మహిళా ప్రమాదకర పోకడలు ఉన్నాయి. స్త్రీలు, పిల్లలపై నేరాల పెరుగుదల, ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరగడం, పితృస్వామ్య సంస్కృతి విషపూరిత ప్రభావంతో పోరాడుతున్న సమాజానికి అరిష్ట సూచికలలో ఒకటిగా పేర్కొనవచ్చు. ఎన్‌సిఆర్‌బి 70వ వార్షిక నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాల కేసులు 4% పెరిగి, 2022లో మహిళలపై 4.45 లక్షలకు పైగా నేరాల కేసులు నమోదయ్యాయి. ఈ నివేదిక మహిళలపై నమోదైన నేరాలలో గణనీయమైన పెరుగుదలను వివరించింది. ఈ నివేదిక ప్రకారం, 2020లో 3,71,503 కేసుల నుండి 2022లో 4,45,256 కేసులకు పెరిగాయి. 2021 సంవత్సరం నాటి 4,28,278 కేసులతో పోలిస్తే, 2022 గణాంకాలు ఇబ్బందికరంగా మారాయి.
మన దేశంలో సమర్ధవంతమైన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వాలు పేర్కొన్నప్పటికీ, మెట్రో నగరాల్లో నేరాల రేటు ఎక్కువగా ఉంది. 2022 లెక్కల ప్రకారం, 19 మెట్రో నగరాలలో మహిళలపై నేరాలు 12.3% పెరుగుదల అయినట్లు వెల్లడిస్తున్నాయి. ప్రతి మెట్రో నగరం దాదాపు 2 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగి ఉండి, మునుపటి సంవత్సరంతో పోలిస్తే, 239% పెరుగుదలతో, జైపూర్‌ అత్యధిక రేటును నమోదు చేసింది. తర్వాత ఢల్లీి, ఇండోర్‌, లక్నో నగరాలు ఉన్నాయి. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూర్‌ రెండు నగరాల్లో అత్యల్ప రేటు ఉందని నివేదిక పేర్కొంది. ఇందులో భర్తల, బంధువులచే జరిగే హింస, అపహరణలు, దాడులు, అత్యాచారాలు ఉన్నాయి. సంపూర్ణ సంఖ్యగా చూస్తే, ఉత్తరప్రదేశ్‌, 65,743 కేసులతో, మహిళలపై నేరాల కేసుల్లో అత్యధిక సంఖ్యలో ఎఫ్‌.ఐ.ఆర్‌.లు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్ర (45,331), రాజస్థాన్‌ (45,058) ఉన్నాయి. పిల్లలపై పెరుగుతున్న నేరాలు వారి భవిష్యత్తు శ్రేయస్సు, భద్రతపై తీవ్రమైన ఆందోళనలను కలిగస్తాయి. ఎందుకంటే 2022లో 64,469 మంది బాధితులుగా పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం ద్వారా నివేదించబడ్డారు.
భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) ప్రకారం మహిళలపై నేరాలలో గణనీయమైన నిష్పత్తిలో భర్త లేదా అతని బంధువుల ద్వారా జరిగే హింస (31.4%), మహిళలను కిడ్నాప్‌ చేయడం, అపహరించడం ద్వారా (19.2%), ‘మహిళలపై దాడి’ వంటివి ఉన్నాయని నివేదిక పేర్కొంది. మహిళా నిరాడంబరతను కించపరిచే ఉద్దేశ్యంతో మహిళలపై దాడి (18.7%), అత్యాచారం (7.1%) లాంటి అంశాల ద్వారా కూడా మహిళలపై హింస జరుగుతోందని నివేదిక తెలిపింది. ప్రతి లక్ష మంది మహిళలకు నేరాల రేటు 2021లో 64.5 నుండి 2022లో 66.4కి పెరిగింది. ముఖ్యంగా, దేశంలో వరకట్న నిషేధ చట్టం కింద 13,479 కేసులు నమోదయ్యాయి. 1,40,000 కేసులు ‘భర్త లేదా అతని బంధువుల ద్వారా హింస’ (సెక్షన్‌ 498 ఎ ఐపిసి) కింద వర్గీకరించబడ్డాయి. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ఏజెన్సీల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా, ఈ నివేదిక యొక్క ఫలితాలు మహిళలపై నేరాలకు మించి విస్తరించాయి. అందులో పిల్లలు (8.7%), వృద్ధులు (9.3%), షెడ్యూల్డ్‌ కులాలు (13.1%), షెడ్యూల్డ్‌ తెగలపై (14.3%) శాతం పెరిగాయి. అదనంగా 11.1% ఆర్థిక నేరాలు, 10.5% అవినీతి పెరిగాయి. అదే విధంగా 2022లో సైబర్‌ నేరాలు 24.4% పెరిగాయి. దేశ ప్రధాన నగరాలైన ఢల్లీిలో మహిళలపై 14,158 నేరాలు, ముంబైలో అత్యధికంగా 80.6% ఛార్జిషీట్‌ రేటుతో 6,176 కేసులు, బెంగుళూరులో 74.2% ఛార్జిషీట్‌ రేటుతో 3,924 కేసులు నమోదయ్యాయి. ఐపిసి మరియు ప్రత్యేక, స్థానిక చట్టాల కింద మహిళలపై నేరాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 65,743 కేసులు, మహారాష్ట్రలో 45,331 కేసులు, రాజస్థాన్‌లో 45,058 కేసులు నమోదయ్యాయి. ఒక్కొక్కటి ఒక్కో ఛార్జిషీట్‌ రేట్లతో ఉన్నాయి. దేశం అంతటా హాని కలిగించే జనాభాకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాల ప్రమాదకర పెరుగుదలను పరిష్కరించడానికి సమగ్ర వ్యూహాల యొక్క తక్షణ అవసరాన్ని ఈ నివేదిక నొక్కి చెప్పింది. 95% కంటే ఎక్కువ అత్యాచారం కేసులలో, దాడి చేసినవారు బాధితులకు తెలిసినవారే. అందులో వారి బంధువులు, స్నేహితులు, పొరుగువారు, సహోద్యోగులని నివేదికలోని సమాచారం స్థిరంగా చెప్తోంది. ఏడాది కాలంలో పిల్లలపై నేరాలకు సంబంధించి కనీసం 1.62 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలోనే మహిళలకు అత్యంత భద్రతలేని మెట్రోపాలిటన్‌ నగరంగా ‘‘దేశ రాజధాని ఢల్లీి’’ నేడు మారిందని నివేదిక చెప్తోంది.
ముగింపు: దేశంలో ప్రతి సంవత్సరం నేరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిర్భయ కేసు తర్వాత క్రిమినల్‌ చట్టంలో చేసిన మార్పులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు రుజువు చేస్తున్నాయి. ఎందుకంటే, చట్టాన్ని ప్రతిబంధకంగా మార్చడంలో సమస్య ఉంది. చట్టాలను సమర్ధవంతంగా అమలు చేస్తే తప్ప క్షేత్రస్థాయిలో పురోగతి సాధ్యం కాదు. చట్టాలు చేస్తే సరిపోదు, ప్రజల ఆలోచనలను మార్చడంపై దృష్టి పెట్టాలి. మనలాంటి పితృస్వామ్య సంస్కృతిలో లింగ సున్నితత్వం, స్త్రీల పట్ల గౌరవం మరియు సమానత్వం అనేవి చిన్నతనం నుండే అలవర్చుకోవాల్సిన విలువలుగ ా ప్రతి కుటుంబంలో నేర్పించాలి. ఆ విషయంలో సమాజంలో ప్రతి కుటుంబం కూడా పాలుపంచుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో అనేక అనర్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విద్యార్థి లింగ సమానత్వం గురించి పాఠశాల స్థాయి నుండే చదివేలా విద్యా సంస్థల్లో బోధించాలి. అప్పుడే మహిళా సమానత్వం, చట్టాలు లాంటి అంశాలపై విద్యార్థులకి అవగాహన ఏర్పడుతుంది.
భారతదేశంలో మహిళలపై గృహహింస, అత్యాచారం కంటే నాలుగు రెట్లు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దోషులను శిక్షించడంలో విపరీతమైన జాప్యం చేయడం వల్ల మొత్తం వ్యవస్థను అసమర్ధంగా మారుస్తుంది, అలాగే మహిళలపై నేరాలు నిరోధించే ఉద్దేశ్యం నెరవేరదు. ఒక శాశ్వతమైన మార్పును సాధించడానికి చట్టాన్ని రూపొందించడం, అమలు చేయడం, అలాగే లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే విధానాలను అభివృద్ధి చేయడం, అమలు చేయడం ముఖ్యం. మహిళలపై రోజురోజుకీ పెరుగుతున్న నేరాలు ‘‘సామాజిక అవ్యవస్థ’’కి దారితీస్తాయి. కాబట్టి వాటిని నియంత్రించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై కూడా ఉంది.
(అకడమిక్‌ కౌన్సిలర్‌, ఇగ్నో, వరంగల్‌)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.