మొగుడంపల్లి మండలంలోని జాడిమల్కాపూర్ గ్రామంలో జనవరి 14, 2024న 24వ పాత పంటల జాతర ప్రారంభమయింది. ఈ జాతరకు ప్రత్యేక అతిథులుగా ప్రొ.వినోద్ పావురాల, ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మొనిమయ్ సిన్హా, సి.డబ్ల్యూ.ఎస్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైదరాబాద్, ప్రొ.అపర్ణ రాయప్రోలు, ప్రొఫెసర్, సోషియాలజీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జి.వినోద్ కుమార్, మండల
వ్యవసాయ శాఖ అధికారి, మొగుడంపల్లి, డా.కంచన్ మలిక్, యునెస్కో, ఛైర్ కమ్యూనిటీ మీడియా, ప్రొ.వాసుకి బేలవాడి, డీన్, కమ్యూనికేషన్, యూనివర్సిటీ ఆప్ హైదరాబాద్, ఎస్.పెంటమ్మ, గ్రామ సర్పంచ్, ప్రియాంక గుండా రెడ్డి, మండల్ పరిషత్ అధ్యక్షురాలు, మొగుడంపల్లి, ఈ జాతర కో`ఆర్డినేటర్లు జనరల్ నర్సమ్మ, వినయ్ కుమార్, గ్రామ సూపర్వైజర్ చుక్కమ్మతో పాటు డిడియస్, కెవికె సిబ్బంది, వివిధ గ్రామాలకు చెందిన మహిళా సంఘం మెంబర్లు తదితరులు హాజరయ్యారు. అలిగెలు, కోలాటం, సంప్రదాయ నృత్యాల నడుమ మహిళా రైతులు విత్తన ప్రతిష్టాపన చేసి, ఎడ్ల బండ్లకు పూజలు చేసి జాతర ఆరంభించారు.
ముందుగా డిడియస్ డైరెక్టర్ డా.వి.రుక్మిణిరావు మాట్లాడుతూ ‘‘ఈ పాత పంటల జాతరను మనం గత 24 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాము. పి.వి.సతీష్ గత 40 సంవత్సరాల నుండి ఇక్కడే ఉండి డిడియస్ సంఘం మహిళలకు ఎనలేని సేవలు చేశారు. దురదృష్టవశాత్తు గత సంవత్సరం మార్చి నెలలో మరణించారు. మనం చేసే పనులను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తిస్తున్నారు. ఈ రోజు బిడకన్నె చంద్రమ్మతో మాట్లాడితే సంఘంలో చేరక ముందు ఒక ఎకరం భూమిలో వ్యవసాయం చేసేదాన్నని, ఇప్పుడు 20 ఎకరాల భూమి కొని వ్యవసాయం చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నానని చెప్పారు. ఇలా ఆదాయం పొంది బాగుపడినందుకు డిడియస్ సంస్థకు ఎంతో రుణపడి ఉన్నామని అన్నారు. వ్యవసాయ శాఖ మరియు ఇతర ప్రభుత్వ అధికారులు ఈ పాత పంటలు పండిరచే రైతులకు తోడ్పాటు అందించాలి. మనం పది మంది సభ్యులు ఉన్న దగ్గర 100 మందిని పెంచుకుంటూ మనం చేసే పనులను ముందుకు తీసుకువెళ్ళాలి. మన భూములను మనం అమ్ముకోవచ్చు, మనం వ్యవసాయంలో పంటలు పండిరచి మన ఆహార కొరతను తీర్చుకుంటూ, పట్టణవాసులకు కూడా తిండిన అందించేలా ఉండాలి. దీనివల్ల సమాజానికి కూడా మనం మేలు చేసినవాళ్ళమవుతాం. 30 సంవత్సరాల క్రితం డిడియస్ స్థాపించినపుడు ఈ ప్రాంతంలోని మనుషులకు సరైన తిండి ఉండేది కాదు. బట్టలు కూడా సరిగ్గా ఉండేవి కాదు. కానీ, మన సంఘాల ద్వారా పాత పంటలు పండిరచి ఎంతో మంచి స్థాయిలో, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నాం’’ అని చెప్పారు.
అనంతరం కమ్యూనిటీ మీడియా ట్రస్టు వారు చేసిన ‘20 ఏండ్ల పాత పంటల పండుగ’ అనే సినిమా చూపించటం జరిగింది. ఇరవై ఏండ్లుగా ఈ జాతర ఎలా ముందుకు వచ్చింది అనే విషయంపై సినిమాలో వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీవవైవిధ్య రైతులైన సుమిత్రాబాయి (సిద్ధాపూర్తాండ), రాథోడ్ కమిలిబాయి (లచ్చునాయక్తాండ), బాయికట్ట నర్సమ్మ (ఎల్లోయి), మల్లె నర్సమ్మ (శంశల్లాపూర్), నత్తి సుకన్య (పొట్పల్లి), యం.డి.మైబుబ్ బీ (తంకుంట) రైతులకు అతిథుల చేత సన్మానం చేయటం జరిగింది.
‘మా వ్యవసాయం అన్నింటికి పరిష్కారం’ అనే విషయంపై జాడిమల్కాపూర్కు చెందిన జీవవైవిధ్య రైతు శ్రీమతి హరిత మాట్లాడుతూ, ‘‘మా ఊరికి సంఘం వచ్చి మూడు సంవత్సరాలయింది. 15 మందితో ప్రారంభమైన ఈ సంఘంలో ఈ రోజు 42 మంది సంఘం సభ్యులు ఉన్నారు. 50 ఎకరాల్లో కలిపి పంటలు పండిస్తూ మా విత్తనాలు మేమే దాచుకుంటున్నాము. అత్తల సంఘం నుండి కోడళ్ళ సంఘంలో మేము 35 మంది ఉన్నాము. మేము పాత పంటలు పండిరచి ఆరోగ్యమైన తిండి తింటూ ఆరోగ్యంగా ఉన్నాము. ఇతర రైతులకు కూడా విత్తనాలు ఇస్తున్నాము’’ అన్నారు.
బిడకన్నె విత్తన సంరక్షకురాలు మొలిగేరి చంద్రమ్మ మాట్లాడుతూ, ‘‘నేను 40 ఏండ్ల నుండి డిడియస్తో పని చేస్తున్నాను. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను సతీష్ సార్ సంఘంలో చేరదీసి విత్తనాల సంరక్షకురాలిగా నియమించారు. నేను 20 దేశాలు తిరిగి వేరే వారి పనులు నేర్చుకొని వారికి మా పనులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్ని రకాల పంటలు పండిరచుకొని పదిమందికి విత్తనాలు దాచుకునే విధానం గురించి నేర్పుతున్నాను’’ అని చెప్పారు.
సర్పంచ్ ఎస్.పెంటమ్మ మాట్లాడుతూ, ‘‘డిడియస్ వారు మా ఊరికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. పాత పంటల జాతర మా ఊరిలో ప్రారంభించడం చాలా సంతోషకరం. పాత పంటలు మా ఊరికి తీసుకురావడం వల్ల మా ఊరి వారికి, రైతులకు ఎంతో మేలు జరిగింది’’ అన్నారు.
మొగుడంపల్లి ఎం.పి.పి ప్రియాంక గుండారెడ్డి మాట్లాడుతూ, ‘‘మా మండలంలో పాత పంటల ప్రారంభ జాతర నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. చిరుధాన్యాల గురించి సతీష్ సార్ పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ రోజు సతీష్ సార్ మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. చిరుధాన్యాలు అంతర్ పంటగా వేసుకోవడం వల్ల భూమి, మనుషులు, పశువుల ఆరోగ్యం బాగుంటుంది. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడినవారమౌతాము’’ అన్నారు.
శాస్త్రవేత్త సలోమి మాట్లాడుతూ, ‘‘మొదటి జాతర నుండి ఈ రోజు వరకు అంతే ఉత్సాహంతో జరుపుతున్నారు. 1995లో మొదటిసారి పాత పంటల గురించి మాట్లాడినప్పుడు అందరూ నవ్వుకున్నారు. చిరుధాన్యాల మీద గత సంవత్సరం పలు ప్రాంతాల్లో విద్యార్థులకు అవగాహనా సదస్సులు నిర్వహించడం జరిగింది’’ అన్నారు.
మండల వ్యవసాయ అధికారి జి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ, ‘‘మన మండలంలో కంది పంట 18 వేల ఎకరాల్లో
ఉంది. ఇది కూడా తక్కువ వర్షాపాతంతో పండుతుంది. అలాగే చిరుధాన్యాలు కూడా పండిస్తున్నారు. మేము కూడా ఈ సంవత్సరం నుండి రైతులకు పాత పంటలు వేసి జీవవైవిధ్యాన్ని కాపాడాలని ప్రోత్సహిస్తాము’’ అన్నారు.
సిడబ్ల్యుఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనిమయ్ సిన్హా మాట్లాడుతూ, ‘‘24వ పాత పంటల జాతర జరుపుకుంటున్నారని తెలిసింది. మన దేశంలో ప్రధాన పండుగలుగా సంక్రాంతి, హోలీ పండుగలు జరుపుకుంటారు. సంక్రాంతికి పంటలన్నీ మన ఇంటికి వస్తాయి. ఈ సమయంలో పాత పంటల జాతర జరుపుకోడం చాలా సంతోషకరం. ఈ పాత పంటల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చాలా చోట్ల సూపర్ మార్కెట్లలో, మాల్స్‌లో చిరుధాన్యాలను ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మీరు ఎక్కువగా ఉత్పత్తి చేసి అందరికీ తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే విధంగా చెయ్యాలి. గర్భిణి మహిళలకు చిరుధాన్యాలు మంచి పోషకాలను అందిస్తాయి’’ అన్నారు.
యునెస్కో, ఛైర్ కమిటీ మీడియా, డా.కంచన్ మాలిక్ మాట్లాడుతూ, ‘‘ఈ జీవవైవిధ్య జాతర వల్ల పంటలు మరియు మహిళల వైవిధ్యం కనిపిస్తుంది. డిడియస్ వారి పంటల పుస్తకం ద్వారా చిరుధాన్యాల వంటకాలు చేసుకుంటున్నాము. డిడియస్ వారి కెఫే ఎథ్నిక్ను హైదరాబాద్‌లో కూడా ప్రారంభిస్తే బాగుంటుంది’’ అన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని సోషియాలజీ ప్రొఫెసర్ అపర్ణ రాయప్రోలు మాట్లాడుతూ ‘‘డిడియస్ సంఘాలు అత్త దగ్గరి నుంచి కోడళ్ళకు వెళ్తాయి. డిడియస్ వారి సలహాతో మేము గోధుమలు మానేసి యవ్వలు తింటున్నాము. చిరుధాన్యాలు అన్ని వంటకాల్లో భాగమయ్యాయి’’ అన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ డీన్ ప్రొ.వాసుకి బేలవాడి మాట్లాడుతూ ‘‘ఒకరికి సహాయం చేసి ఇంకా ముగ్గురికి సహాయం చేయాలి అంటారు. కానీ మనం వేయి మంది పాత పంటలు పండిరచే వారికి లక్ష మందికి పాత పంటలు పండిరచమని చెప్పాలి. ఈ రోజు సంఘంలో ఆరుగురికి మాత్రమే సన్మానం జరిగింది. కానీ వచ్చే సంవత్సరం జాతరలో ఊరి మొత్తానికి సన్మానం జరగాలి. పాత పంటలు పండిరచేది మరియు చెప్పేది మన హక్కు’’ అని అన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ వినోద్ పావురాల మాట్లాడుతూ, ‘‘డిడియస్ వారు గత 30`40 సంవత్సరాల నుండి పాత పంటల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ ప్రపంచం దీన్ని 2023 సంవత్సరంలో గుర్తించి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. డిడియస్ మహిళా సంఘాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. డిడియస్ కమ్యూనిటీ రేడియో దేశంలోనే మొట్టమొదటిది. డిడియస్ మహిళలు సియంటి ద్వారా పలు వీడియో డాక్యుమెంటేషన్ మరియు చిన్న సినిమాలు వ్యవసాయంపైనే చేస్తున్నారు’’ అని చెప్పారు.