సహజంగా ఈ సమాజంలో ఎక్కువగా హీరోల గురించే మాట్లాడుకుంటారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే షీరోల గురించి మాట్లాడుకుంటారు. తమ పనులతో, తమ బాధ్యతలతో, తమ వ్యక్తిత్వాలతో, తమ ధైర్య సాహసాలతో, తమ త్యాగాలతో, సమాజ గమనంలో ఒక మైలురాయిగా నిలిచినటువంటి, ఇతరులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి మహిళలను గుర్తు చేసుకోవడం చాలా తక్కువ సందర్భాల్లోనే
జరుగుతుంటుంది. వారి గురించి చెప్పడం కానీ, వారిని షీరోలుగా అభినందించడం కానీ, ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తెలియకుండా జరుగుతున్న నిర్లక్ష్యం అనుకుంటే పొరపాటే, ఇది మహిళల పట్ల వివక్షలో ఒక భాగం.
ఈ వివక్షను ప్రశ్నించే వాళ్ళు కొందరైతే, ఈ వివక్ష లేకుండా ఉండాలని అలుపెరుగని పోరాటం చేసేవాళ్ళు మరికొందరు. మహిళల స్ఫూర్తిదాయక కథనాలను గుర్తించని పరిస్థితుల్లో కూడా షీరోలను గుర్తించడం, వారిని చరిత్ర పుటల్లో ఎక్కించడం ఒక సాహసమనే చెప్పాలి. సహజంగా ఈ ప్రయత్నం స్త్రీ వాదులు, సామాజిక కార్యకర్తలు, చరిత్రకారులు చేశారు. కొన్ని రీసెర్చ్ సంస్థలు కూడా ఆ పనిలో భాగం పంచుకున్నాయి. ఈ సందర్భంగా ఇలాంటి వారి కృషిని గుర్తుచేసుకుని అభినందించాల్సిందే.
ఇప్పుడు ఆ బాధ్యతను పిల్లల ప్రేమికులు శివజాస్తి లాంటి వారు కూడా తీసుకున్నారు. భారతదేశంలో వివిధ రంగాలలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన, 256 మంది మహిళలను పరిచయం చేస్తూ, జూతీశీjవష్aపషస.షశీఎ వేదికగా, షీరోస్ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. జనవరి 9న గుంటూరు చేతన ప్రాంగణంలో, వైవిధ్యభరితంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది. దేశంలో వివిధ రంగాలలో ప్రతిభ చాటుకున్న అనేకమంది మహిళలను ఈ పుస్తకంలో పిల్లలకు అర్థమయ్యే రీతిలో పరిచయం చేయడం ప్రత్యేకమైన విశేషం. ఈ ప్రయత్నమంతా, ఒక రోజులో జరిగింది కాదు, దాదాపు ఎమిమిదేళ్ళ పాటు ఈ పుస్తకం కోసం కృషి కొనసాగింది. ఈ పుస్తకంలో ఒక్కో షీరో గురించి రాసే క్రమంలో, చాలా హోంవర్క్ చేశారు శివజాస్తి. తను ఉండేది అమెరికాలో అయినా ఇండియాలోని పిల్లల కోసం, ప్రభుత్వ స్కూల్లో లైబ్రరీల కోసం, పిల్లలకు అనేక విషయాల పట్ల జిజ్ఞాసను పెంచడం కోసం, చదువుతో పాటు అనేక విషయాల పట్ల వారికి ఆసక్తిని కలిగించడం కోసం, లెర్న్ అండ్ హెల్ప్ అంటూ, పుస్తక మిత్ర అంటూ, దశాబ్ద కాలంగా అనేక రూపాల్లో కృషి చేస్తూ వస్తున్నారు.
‘‘చిన్ననాటి ఆటలు, జ్ఞాపకాల మూటలు’’ పేరుతో పిల్లలు మరిచిపోయిన, మరిచిపోతున్న ఆనాటి ఆటలతో ఒక అమూల్యమైన పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది ఒక దశాబ్దం క్రితం వచ్చిన పిల్లల పుస్తకం. ఆ తర్వాత కూడా వారి కృషి అలాగే కొనసాగుతూ వస్తోంది. తింగరి బుచ్చి, బంగారు కొండ, గారాల కూచి లాంటి పిల్లల కథలు, బాబు దుండ్రపెల్లి బొమ్మలతో పుస్తకాల రూపంలో ప్రచురించారు. తానా నిర్వహించిన పిల్లల కథల పోటీలో ఈ పిల్లల కథలన్నీ గత మూడేళ్ళుగా ఎంపిక కావడం విశేషం.
షీరోస్ ఈ పుస్తకాన్ని ప్రచురించడం ఒక ప్రత్యేకత అయితే, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకున్న తీరు అంతకన్నా ప్రత్యేకంగా, వైవిధ్యభరితంగా జరిగిందనే చెప్పుకోవాలి. గుంటూరులోని చేతన ప్రాంగణంలో, జనవరి 9న ప్రకృతి ఒడిలో, పిల్లలు, టీచర్లు, పేరెంట్స్ మధ్య ఆవిష్కరించడం జరిగింది. అయితే ఆవిష్కరణ కంటే ముందు షీరోస్ పుస్తకంలో ఉన్న 256 మంది వ్యక్తుల వేషధారణతో, ముందుగానే కేటాయించిన ఎనిమిది గదుల్లో, 256 మంది ఆడపిల్లలు ఆ క్యారెక్టర్స్‌ని అభినయించి, న్యాయనిర్ణేతలను అబ్బురపరిచారు. ఈ ప్రదర్శన అద్భుతంగా సాగింది. సాయంత్రం వేదిక మీద పెద్దలతో, వేదిక ముందు షీరోల వేషధారణలో కూర్చున్న 265 మంది అమ్మాయిలతో ఏకకాలంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. పిల్లలందరూ ఈ కార్యక్రమంలో చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఆ క్యారెక్టర్స్‌ని చూసి, వారి గురించి చదివి, వారి కథనాలు విని స్ఫూర్తి పొందామని చాలామంది అమ్మాయిలు సంతోషంగా చెప్పారు. పిల్లలు ఈ షీరోల గురించి తెలుసుకోవాలనే ప్రచురణ కర్తల ఉద్దేశ్యం నెరవేరిందని ఆహుతుల గట్టి అభిప్రాయం.
ఈ ప్రయత్నం ఇంతటితోనే ఆగిపోదని మరింత మంది షీరోలను పరిచయం చేసే క్రమం కొనసాగుతూనే ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. చేతన సంస్థ చేతన వ్యవస్థాపకురాలు మంగాదేవి గారికి ఈ పుస్తకాన్ని అంకితమివ్వడం ఈ పుస్తకానికి మరింత వన్నె తెచ్చిందని చెప్పాలి. షీరోలను పరిచయం చేయాలనే పనికి పూనుకున్న శివజాస్తికి, ఈ పుస్తక రచనకు తోడుగా నిలిచిన అహలకు, అద్భుతమైన బొమ్మలతో పుస్తకానికి వన్నె తెచ్చిన బాబు దుండ్రపెల్లికి, పుస్తకాన్ని చక్కగా డిజైన్ చేసిన శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా అభినందనలు.